"బుద్ది మీకు తెలీటం లేదేమో కానీ బుద్ది వున్నావాదివాడికయినా తెలుస్తుంది. మా అమ్మాయి సరిత స్కూల్ కేళ్తుంటే మార్తాండ్ కొడుకు మరికొందరు ఫ్రెండ్స్ నేసుకుని రోడ్ మీద అసహ్యకరంగా , అసభ్యకరంగా మాట్లాడారు. మా అమ్మాయి నోరెత్తలేదు. ఆమె మౌనంగా సహించటం చూసి వాడు మరింత రెచ్చిపోయాడు. స్కూల్ యానివర్శిరీ నాడు వాడి గ్యాంగ్ కాంటీన్ దగ్గిరున్న సరితను చేయి పట్టుకుని కాంటిన్ వెనక్కు లాక్కెళ్ళి జాకెట్ చింపేసి చాలా దారుణంగా ప్రవర్తించారు. అప్పటి వరకూ మార్తాండ్ కి కంప్లయింట్ చేస్తూ వచ్చాను గానీ ఆ దారుణం సహించలేక మొదటిసారి మీ పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లయింట్ యిచ్చాను. మీరు మార్తాండ్ కొడుకును అరెస్ట్ చేసి గంట లోపలే మళ్ళీ వదిలేశారు. ఎందుకంటే మార్తాండ్ మీకు డబ్బిచ్చాడు కాబట్టి. పోలీస్ కంప్లయింట్ యిచ్చినందుకు మార్తాండ్ మా ఇంటి మీదకు రాత్రి గుండాల్ని పంపించాడు. ఈ మాత్రం లాజిక్ కూడా మీకు అర్ధం కాకపొతే ఆ యూనిఫాం వేసుకోవటం అనవసరం."
ఇన్స్ పెక్టర్ ముఖం అవమానంతో ఎర్రబడింది.
"డోంటక్ నాన్సెన్స్! అతిగా వాగావంటే అరెస్ట్ చేయాల్సి వస్తుంది.....జాగ్రత్త."
'అంతకంటే ఇంకేం జేస్తావ్! ఆ మార్తాండ్ లాంటి వారి జోలి కెళ్ళాడానికి మీ డిపార్ట్ మెంట్ కి దమ్ము లేదు. మీకు దొరికేది మాలాంటి మాములు మనుషులు.
"బెడ్ మీదున్నావ్ కాబట్టి బ్రతికిపోయావ్. జమేదార్! స్టేట్మెంట్ తీసుకుని స్టేషన్ కిరా!" అనేసి అతను వెళ్ళిపోయాడు.
సీత, సరిత భయపడిపోయారు.
"అనవసరంగా వాడితో పేచీ పెట్టుకుంటారెండుకండీ! పోలీసులతో ఎప్పటికయినా ప్రమాదమే మనకు" అంది సీత.
"అవును డాడీ! అయిందేదో అయిపొయింది. ఇంక పోలీస్ కంప్లయింట్ యివ్వకంది." దీనంగా అంది సరిత. ఆమె కళ్ళ వెంబడి నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి. బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగు పెడుతుండగానే ప్రపంచం ఆమెకి చాలా నేర్పింది.
స్కూలు యానవర్సిరీ రోజున ఆ అవమానం జరిగిన దగ్గర్నుంచి సరిత ముఖంలో వెలుగు హరించుకుపోయింది. అంతవరకూ ఎవరితో నయినా గలగలా మాట్లాడుతూ, ఎప్పుడూ నవ్వుతూ సందడిగా మెలిగే ఆమెలో ఒక్కసారిగా నిశబ్ధత! ఇంట్లో, స్కూల్లో స్నేహితురాండ్ర దగ్గరా........అన్నిచోట్లా మౌనమే! ఆమె తిరిగి మాములు మనిషవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుందో అన్న ఆందోళన తనను కదిలించి వేస్తోంది. ఆమెకు తను ధైర్యం చెప్పాడు.
"నీకేం భయం లేదమ్మా! మనం ఏదొకటి చేయకపోతే అది మన చేతకానితనంగానూ, పిరికితనంగానూ తీసుకుని ఆ గుండాలు మరింత రెచ్చిపోతారు."
జమేదార్ తన స్టేట్ మెంట్ తీసుకున్నాడు.
"ఇదిగో చూడు! ఈ స్టేట్ మెంట్ మీద ఇరవై నాలుగ్గంటల్లో యాక్షన్ తీసుకోవాలి. మా ఇంటిమీద కొచ్చిన గుండాలను , వాళ్ళను పంపించిన వాడినీ కూడా అరెస్ట్ చేయాలి. లేకపోతే మీ సంగతంతా న్యూస్ పేపర్స్ లో పబ్లిష్ చేయిస్తాను! గుర్తుంచుకోండి." హెచ్చరించాడతను.
అయినా ఏమీ జరగలేదు.
వారం రోజుల తరువాత తను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ తీసుకుని ఇంటికి వెళ్తోంటే ఆ గుండాలు మళ్ళీ నడి రోడ్ మీద ఆటోని నిలబెట్టారు.
"నువ్వు మా మీద పోలీస్ కంప్లయింట్ ఇస్తే ఎమౌతాదిరా? మమ్మలని అరెస్ట్ చేయడానికి ఎవరికి గుండెలున్నాయ్ బే - ఇగో - ఇయాల్టి కెళ్ళి నోరు మూసుకొని వుండాలే! సమజయిందా? ఇంకా నకరాల్జేసినావంటే యిక పైకే పోతావ్, ఏమంటున్న?"
తన పక్కనే కూర్చున్న సీత తన చేయి పట్టుకుంది.
తనేమీ మాట్లాడలేదు.
వాళ్ళు అటో వదిలేశారు. తను మళ్ళీ పోలీస్ దగ్గరకు వెళ్ళలేదు. సీత కోరిక కాదనలేకపోయాడు.
ఆ మర్నాడు మళ్ళీ సరిత ఏడుస్తూ ఇంటికొచ్చింది. ఆమె బట్టల నిండా దుమ్ము.
"డాడీ! ఇంక నేను స్కూలుకి వెళ్ళను డాడీ" కుర్చీలో కూలాబడి ఎడ్చేస్తోంది.
"ఏం జరిగిందమ్మా?"
"వాడు మళ్ళీ స్కూలు బయట నన్ను పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. నేను చెంప మీద కొట్టానని జుట్టు పట్టుకుని రోడ్డు మీద పడేసి ఈడ్చాడు."
తనకు ఇంక ఉద్రేకం ఆగలేదు.
తిన్నగా పోలీస్ స్టేషన్ కెళ్ళాడు.
ఇన్స్ పెక్టర్ తనను చూస్తూనే మండిపడ్డాడు.
"మళ్ళీ ఎందుకొచ్చావు?"
"ఆ మార్తాండ్ కొడుకు మళ్ళీ మా సరితను నడిరోడ్డు మీద ముద్దు పెట్టుకుని, చెంప దెబ్బ కొట్టిందని జుట్టు పట్టుకుని కిందపడేసి యిడ్చాడు.
"కంప్లయింట్ ఇచ్చి వెళ్ళు."
"హాస్పిటల్లో ఇచ్చిన కంప్లయింట్ మీద ఏం యాక్షన్ తీసుకున్నావ్?"
"ఆ సంగతి అడగడానికి నువ్వెవడివి?"
"నేను నీతి, న్యాయం ఉన్న మనిషిని! యూనిఫారాన్ని అపవిత్రం చేయని ఓ మాములు పౌరుడిని! నీ కూతుర్ని గానీ, నీ పెళ్ళాన్ని గాని రేపెవడయినా గుండా నడివీధిలో అవమానపరిస్తే.....మిగతా అందరిలా నాకెందుకని పారిపోకుండా ఏమిటి అని వాళ్ళను నిలదీసెంత ధైర్యం ఉన్న వాడిని!"
"ఏయ్..ఇక్కడ న్యూసెన్స్ చేయకుండా ఫోరా! ఫో ముందు ఏయ్ వీడిని బయటకు నేట్టండ్రా."
"ఏయ్......ఇన్స్ పెక్టర్ తో కిరికిరి పెట్టుకుంటావేమయ్యా? నీకేమైనా తెలివుందా? అయన తలచుకున్నాడంటే నిన్ను లోపల తోస్తాడు. పో వెళ్ళి! నీకేమయినా తక్ లీ వుంటే ఆ మార్తాండ్ తోనే చెప్పుకో ఫో! ఆ పోరడిని మందలిస్తాడు."
"ఛీ! సిగ్గులేని కుక్కల్లారా! గుండాలకూ , రాజకీయ నాయకులకూ భయపడే మీలాంటి వాళ్ళ కన్నా కొజ్జాలు నయంరా! ఈ పోలీస్ స్తేషన్లెందుకు దండగా! ఆ పేరు తీసేసి 'రాజకీయ నాయకుల బానిసల కేంద్రం' పెట్టండ్రా"
వాళ్ళకు ఆ మాటలతో పౌరుషం వచ్చింది.
తనను బలంగా కాంపౌండ్ బయటకు తోశారు.