"ఇక వెళ్దాం" అన్నాడు శశికాంత్ హటాత్తుగా లేచి నిలబడుతూ.
ఇద్దరూ బయటికి వచ్చారు.
"ఇతను చాలా డేంజరస్ మనిషిలా కనబడుతున్నాడే?" అన్నాడు శశికాంత్ అసహనంగా.
"నువ్వు కొన్న కంపెనీతో పాటు నీ దగ్గరకి చేరుతున్నాడు ఇప్పుడు అంది ఉజ్వల నవ్వుతూ.
"నేను ఉహించిన దానికంటే గట్టి పిండంలా కనబడుతున్నాడు. ఎలా వీణ్ణి వదిలించుకోవడం!"
"ఆ సంగతి నాకొదిలెయ్!" అంది ఉజ్వల చాలా ఆత్మవిశ్వాసంతో.
ఆమె మనసులో ఒక మౌన రాగం మెదిలింది.
"కొమ్ములు తిరిగిన మగవారు, కొంగు తగిలితే పోలేరూ'
తేజస్వి ఒక మగాడే. మగాళ్ళని ఎలా టాకిల్ చెయ్యాలో తనకి బాగా తెలుసు.
"శశీ! ఇప్పుడు వీళ్ళు చెబుతున్నారే, డ్రగ్ ఇండస్ట్రిలోని నెగిటివ్ పాయింట్స్! నిజానికి అవే మనకి ప్లస్ పాయింట్స్! ఇక ఎలా దూసుకు పోతామో చూడు మనం!" అంది అతన్ని ఉత్సాహపరుస్తూ.
"అప్పుడే మనిద్దరం కలిసి బిజినెస్ చేస్తున్నట్లు మాట్లాడేస్తున్నవే!" అన్నాడు శశికాంత్ నవ్వుతూ.
"వైనాట్! ఇప్పుడే కలిసిపోదాం" అంది ఉజ్వల కవ్వింపుగా పెదాలు అదోలా పెట్టి పదాలను ఒత్తోత్తి పలుకుతూ.
గుండె దగ్గర గిలిగింతలు పెట్టినట్లయింది శశికాంత్ కి.
"అవును శశికాంత్! నేను ఫార్మసి చదివాను. డాక్టరేట్ తీసుకున్నాను. నువ్వు ఎం.బి.ఏ చదివావు. ఇద్దరం కలిస్తే ఇక మనకు ఎదురేముంది? అవునా?"
చిన్నగా నవ్వాడు శశికాంత్.
"నువ్వు అడగకపోయినా నేనే నిన్ను అడిగి ఉండేవాడిని- వచ్చి మా కంపెనీలో చేరిపోమ్మని. సబ్జెక్టు బాగా తెలిసిన ఎక్స్ పర్ట్ పక్కన లేకుండా ఇండస్ట్రి ఎలా రన్ చెయ్యగలను నేను? ఐ నీడ్ సమ్ వన్ లైక్ యూ!"
"యా యూ నీడ్ సమ్ వన్ హు లైక్స్ యూ. ఒకే? దట్ సేటిల్స్ ఇట్! ఈ హాపీ అకేషన్ లో కాక్ టెయిల్స్ తీసుకుంటే బాగుంటుంది కదా! ఎక్స్ లెంట్ కాక్ టెయిల్స్ తయారు చెయ్యగలను నేను. మన రూం నెంబర్ ఎంత?"
ఆశ్చర్యాన్ని అణుచుకున్నాడు శశికాంత్.
"సిక్స్ టీ నైన్!"
ఆరూ తొమ్మిది, గుడ్! ఒకదాన్ని ఒకటి పెనవేసుకున్నట్టు ఉంటాయి ఆ అంకెలు. సిక్స్ టీ నైన్ అనే ఫిగరు నాకెంతో ఇష్టం!
"ఒన్ మినిట్! రూం కీస్ తీసుకువస్తాను రిసెప్షన్ లో!" అన్నాడు శాశికాంట్.
నవ్వింది ఉజ్వల.
"నాట్ నేసేసరి. అవి నీ జేబులోనే ఉన్నాయి. ఇందాక వస్తూ వస్తూ జేబులో వేసుకున్నావ్!"
తడిమి చూసుకున్నాడు శశికాంత్. తాళాలు తన జేబులోనే వున్నాయి.
ఉజ్వలతో మాట్లాడుతూ అవి జేబులో వేసుకొచ్చేశాడన్నామాట!
అంత చిన్న విషయం కూడా గమనించిందా ఉజ్వల? చాలా షార్ప్ ఐ అమెది. ఆమె తనతో బాటు ఉండటం తనకు లాభదాయకమే.
రూంలో కెళ్ళగానే తలుపు దగ్గరికి వేశాడు శశికాంత్.
"ఏం కాక్ టెయిల్ చేస్తావ్? బ్లడీ మెరీనా? విస్కీ టొమాటో జ్యూసు తెప్పించనా?"
కళ్ళు అరమోడ్పుగా పెట్టి చూసింది ఉజ్వల.
"కాక్ టెయిల్ చెయ్యడానికి లిక్కరూ, టొమాటో జ్యుసు , ఐస్ క్యూబ్స్ తప్పనిసరా ఏమిటి! ఒక మగ ఒక అడ , రెండు శరీరాలు, రెండు మనసులూ , రెండు బ్రెయిన్స్ - ఇవన్ని కలిపితే మంచి కాక్ టెయిల్ కాదా?" అంది మత్తుగా గొంతుపెట్టి.
కొద్ది క్షణాలు ఆమె వైపు తదేకంగా చూసి తర్వాత ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు శశికాంత్.
11
డయాస్ మీద నుంచి కిందికి దిగగానే వాచ్ చూసుకున్నాడు తేజస్వి.
ఎనిమిదన్నర అవుతోంది.
మూడు రోజులు నుంచి తను టూర్ లో ఉన్నాడు. తిరిగి రాగానే ఈ కాన్ఫరెన్స్. అంతా బిజీ......బిజీ...
తన కొత్త బాస్ శశికాంత్ గారి మామగారు పోయారని చెప్పారు ఎవరో. ఒకసారి వెళ్ళి పలకరించి రావడం మర్యాద.
శశికాంత్ ఆఫీసుకి వెళ్ళాడు తేజస్వి.
ఆఫీసు మూసేసి ఉంది.
అక్కడినుంచి శశికాంత్ ఇంటికి వెళ్ళాడు.
శశికాంత్ ఇంట్లో లేడని చెప్పారు.
కొద్దిసేపు అలోచించి శశికాంత్ భార్య సౌమ్య ఇంటివైపు సాగిపోయాడు తేజస్వి.
సౌమ్య ఇల్లు ఉన్న సందు మలుపు తిరిగాడు తేజస్వి. ఆ సందు మలుపులోనే వుంది ఒక మెడికల్ షాపు.
ఆ షాపుని చూడగానే, కొద్ది రోజులుగా పెండింగ్ లో పడిపోయిన ఒక పని గుర్తు వచ్చింది తేజస్వికి. అఫిషియల్ బిజినెస్.
ఎలాగూ ఇంతదూరం రావడం జరిగింది గనుక , ఈ పని కూడా పూర్తి చేసేసుకుంటే బాగుంటుందనిపించి, షాపులోకి నడిచాడు తేజస్వి. షాపు ఒనర్ని చూస్తూనే, మెడికల్ రిప్రేజెంటేటివ్స్ కి ఉండే సహజమైన వాక్చాతుర్వంతో స్నేహంగా పలకరించాడు.
"మీరు ఎలా ఉన్నారూ! అని నేను అడగబోవడం లేదు. దాల్మియాసాబ్! చాలా ప్రాస్పరస్ గా కనబడుతున్నారు మీరు. రోరింగ్ బిజినెస్ అవునా?" అన్నాడు చిరునవ్వుతో.
నవ్వాడు దాల్మియా.
"నాట్ వెరి బాడ్ -నాట్ వెరి బాడ్ . నా బిజినెస్ సంగతి అలా ఉంచండి. మీ బిజినెస్ ఎలా ఉంది? కంపెని చేతులు మారిందటగా? ఇక మీరు కూడా కంపెని మార్చాల్సిందే తేజస్విగారూ"
"ఎందుకు?" అన్నాడు తేజస్వి.
"ముక్కుకి సూటిగా పోయేరకం మీరు. నీ ముక్కేక్కడుంది అంటే తలచుట్టు చెయ్యి తిప్పి చూపించే వక్రస్వభావం మీ కొత్త బాస్ శశికాంత్ ది. మీ ఇద్దరూ కలిస్తే ఇంకేముంది? ఫైర్ వర్క్ తప్పదు." అన్నాడు దాల్మియా.
నవ్వి "లెటజ్ సీ!" అన్నాడు తేజస్వి.
చిన్న షాపయినా కస్టమర్స్ తాకిడి ఉదృతంగా ఉంది అక్కడ. కాస్త పక్కకి తొలగి నిలబడి పరిశీలించడం మొదలెట్టాడు తేజస్వి. జూదంలో పేకముక్కల్లాగా డాక్టరు ప్రిస్కిప్షను కౌంటరు మీద పడుతున్నాయి. దాల్మియా, అతని ఇద్దరూ అసిస్టెంట్లు ప్రిస్కిప్షన్లు చదివి మందులు ఇవ్వడంలో అరక్షణం తీరిక లేకుండా ఉన్నారు.