"కాలేజీకి బయలుదేరుతున్నావు కదూ?"
"మీకు- మీకెలా తెలుసు?"
"నిన్ను... ఎప్పుడూ వెన్నంటే ఉంటానని చెప్పానుగా?"
"మీరెవరు?"
"నీ ప్రాణాన్ని"
"అదిసరే మీ పేరు?"
"తొందరెందుకు?"
"మనం కలుసుకోబోతున్నాము"
"మనం కలుసుకోబోతున్నామా?"
"అవును"
"ఎలా?"
"ఒకటి రెండు రోజుల్లో నేను నిన్ను ఒకచోటికి పిలవబోతున్నాను. అక్కడికి నువ్వు రాబోతున్నావు."
"ఒద్దు..." అంది ఆమె గుండె దడదడమని కొట్టుకుంటున్నది.
"ఏం?"
"నాకు భయం!"
"దేనికి?"
"అలాంటిదంటే..."
"ఎలాంటిది?"
"ఈ కలుసుకోవడాలూ... అవీ"
"... ... ..."
"మాట్లాడరేం?"
".. ... ..."
"మిమ్మల్నే? మాట్లాడరేం?"
"ఏమీ లేదు"
"కోపమొచ్చిందా?"
"వస్తే నీకేమిటి నష్టం?"
"ఒద్దు అలా అనకండి నాకు బాధగా ఉంటుంది.
"రానన్నావుగా?"
"మిమ్మల్ని కలుసుకోవడం నాకిష్టమే. మానాన్న నరరూప రాక్షసుడు. తెలిస్తే చంపేస్తాడు."
"నిన్నేమన్నా చేస్తే మీ నాన్నని నేను చంపేస్తాను."
"... ... ..."
"ఎందుకో తెలుసా? నువ్వు నా ఆరాధ్య దేవతవు కాబట్టి."
ఆమె ఒళ్ళు పులకరిస్తుంది. తనని ఒక మనిషి ఇంతగా ఆరాధిస్తున్నందుకు గర్వంగా ఉంది.
"రేపు... ఇదే సమయానికి మళ్ళీ ఫోన్ చేస్తాను."
ఫోన్ పెట్టేశాడు.
* * *
ప్రొద్దుట లేచాక విశారద భర్తకి కాఫీ అందించి మౌనంగా వెళ్ళిపోయింది. అతనికి చాలా వెలితిగా అనిపించింది. అతనికి కాఫీ అంటే ప్రాణం ఆమె కలిపితే మరీ అద్భుతంగా ఉంటుంది. ఆమె ఇచ్చిన కాఫీ అందుకుని పక్కన కూచోపెట్టుకుని కబుర్లు చెబుతుంటే అత్యద్భుతంగా ఉంటుంది.
రాత్రి జరిగిందంతా అతనికి గుర్తుకు వస్తుంది. ఎప్పుడోగాని అలా జరగదు. ఆమె తనంతట తానుగా తనని కోరింది. నిరాకరించాడు.
ఎందుకలా జరిగింది?
ఈ ఇరవై రెండేళ్ళ జీవితంలో ఎన్నోసార్లు తామిద్దరూ ఒకరిమీద ఒకరు అలిగారు. ఆ అలక కూడా చాలా సున్నితమైన విషయాలమీద ఉండేది. దాని స్వరూపం ఇదీ అని చెప్పడానికి వీలుగా ఉండేది కాదు. ఎక్కువగా తనకే చాలా తేలిగ్గా మూడ్స్ డిస్టర్బ్ అయేవి. కారణమంతగా లేకుండా అలా ఎందుకు జరుగుతుందో కూడా తెలిసేది కాదు. కాని ఎంత ప్రయత్నించినా ఒకటి రెండురోజుల దాకా సెటిల్ అవలేకపోయేవాడు. ఈలోగా ఆమె అతన్ని ఎన్నోసార్లు పలకరించేది. నవ్వించడానికీ, కవ్వించడానికీ ప్రయత్నించేది. బ్రతిమలాడుకునేది. క్షమాపణలూ చెప్పుకునేది. అతను మనసారా మాట్లాడలేకపోతున్నందుకు, విముఖంగా ఉన్నందుకు లోలోపలబాధపడే వాడు ఇంత సెన్సిటివ్ గా ఎందుకుండాలి? అసలామె ఏం తప్పు చేసిందని?
అందుకే...
"మీకన్నా అయిదేళ్ళ పసిపాప నయం!" అనేది.
"మిమ్మల్ని ఏమ్దుకిమ్త ప్రేమిస్తానో తెలుసా? ఈ పసి మనస్తత్వమే ఇది నన్ను పదేపదే మీ వైపు లాగేస్తుంది."
నిజంగా తనను పసిపిల్లాన్ని చూసినట్టే చూసుకుంటుంది. ఆమె ఆలనాపాలనలో తనను తాను చక్కదిద్దుకుంటూ ఎదిగాడు.
ఇద్దరి మధ్యా అలక సాగినప్పుడల్లా చాలా రెస్ట్ లెస్ గా ఫీలయేవాడు. ఆమె వచ్చి తనను పలకరించాలనీ, ప్రాధేయపడాలనీ ఎదురు చూసేవాడు అలా జరక్కపోతే విలవిల్లాడిపోయేవాడు.
ఆమె కాఫీ ఇచ్చి అలా మౌనంగా వెళ్ళిపోతే అతని గుండెలో ముల్లు గుచ్చుకున్నట్టుగా అయింది. దీనికంతటికీ కారణం తనే. తన మనస్సులోని పిచ్చి ఆలోచనలే తనని అలా మొరటుగా ప్రవర్తించేటట్టు చేశాయి.
ఆమె ఏం తప్పు చేసింది? విజ్ఞత ముమ్మూర్తులా ఆమెలా ఉండడం విశారద తప్పా? మనుషుల్ని పోలిన మనుషులు ఉండకూడదా? అలాంటి అమృతమూర్తి మీద అపవిత్రమైన ఆలోచనలు తనకెందుకు రావాలి?
ఈ వయస్సులో మానసిక పరిపక్వత లేకుండా తానాలోచిస్తున్నాడా?
అతనికి తనమీద తఃనకి అసహ్యం కలిగింది. పశ్చాత్తాపంతో అతని హృదయం కుమిలిపోయింది. ఆమె ఒక అమాయక, నిష్కళంక జీవి. ఆమెనా తాను అనుమానిస్తున్నాడు! తానెంతమందో స్త్రీలను, వాళ్ళ జీవిత విధానాలనూ, ప్రవర్తనలనూ పరిశీలించాడు. ఇలాంటి మనిషి ఎంత గాలించినా దొరకదే!