Previous Page Next Page 
పెంకుటిల్లు పేజి 25


    ప్రకాశరావు బయటకు వచ్చేశాడు. తరువాత అటూఇటూ తిరిగి ఇంటికి చేరేసరికి ఒంటిగంట అయింది. రాధ ఏదో పుస్తకం చదువుకుంటూ లోపల యెక్కడో వుంది. అలవాటు ప్రకారం చిదంబరం స్నేహితులతో పేకాట ఆడుకుంటూ కూర్చున్నాడు. పెద్దవాళ్ళయిన యిద్దరు ఆడవాళ్ళు నిద్రలో వున్నారు. అతను లోపలి అడుగు పెడుతుండేసరికి వాసు పడుకునే తీక్షణంగా పైకప్పుకేసి చూస్తూ కనిపించాడు.

    "నిద్రపోలేదురా?"

    వాసు చిన్న అన్నయ్యకేసి దృష్టిమార్చి "ఇప్పుడే మెలకువ వచ్చింది అన్నయ్యా" అన్నాడు.

    వాడితో కొంచెంసేపు మాట్లాడుదామని బుద్ధిపుట్టి ప్రకాశరావు దగ్గరకుపోయి కూర్చున్నాడు. అతనేదో మాట్లాడబోయేసరికి తమ్ముడే "చిన్నన్నయ్యా!" అన్నాడు.

    "ఏమిటిరా?"

    వాడు అన్నగారి ముఖంలోకి బిడియంగా చూస్తూ "నేనో విషయంచెబుతాను, ఏమీ అనుకోవు గదా?' అన్నాడు సిగ్గుపడుతూ.

    "ఏమీ అనుకోను, చెప్పు."

    "ఏడాడి క్రితం ఒకడు కారు క్రింద పడిపోతుంటే చూశాను. కారు వాడిమీద నుంచి పోతున్న క్షణంలో యెంత యిదయివుంటాడో ఆ రాత్రంతా ఆలోచించాను. ఎంతకూ ఆలోచన తెగలేదు. అదే నా వరకూ వచ్చేసరి ....."

    "చెప్పు."

    వాసు చాలా అవస్థపడుతూ "ఏమిటో చాలా చెప్పాలనుకుంటున్నాను. అదికాదు చిన్నన్నయ్యా,  ఇన్నాళ్ళనుంచీ సిగ్గుతో చెప్పలేకపోయాను. ఇప్పుడు నీకు చెబుదామని కూడా చెప్పలేకపోతున్నాను. అదికాదు. నామీద నుంచి కారు పోతున్నప్పుడు ఏమనుకున్నానో తెలుసా?"

    "ఏమనుకున్నావు?" ఆతృతగా అడిగాడు ప్రకాశరావు.

    "ఏమీ అనుకోలేదు. అదే ఆశ్చర్యం" వాసు ముసిముసిగా నవ్వి అన్నాడు.

    ప్రకశరావు మొదట్లో తేలిగ్గా ఊహించి తమ్ముడిలాగానే నవ్వబోయాడు. కాని అది పెదాలదాకానే వచ్చి ఆగిపోయింది. తమ్ముడు చెప్పదలచుకున్నది ఏమిటో అతనికి కొంచెంగా అర్థం కాసాగింది. పెద్దవాళ్ళకి సహితం అర్థంగాని వేదాంతం పరిస్థితుల ప్రభావం అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఆ చిన్నవాడికి మాటల రూపంలో చెప్పేందుకు శక్తిచాలదని అతను గ్రహించాడు. ఓపికతో, అతను అందినంత మట్టుకు ఊహించాడు.

    నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ "యెవరితోనైనా చెప్పుకుందామన్నా నా కన్నా వాళ్ళు ఏడ్చుకొంటారని చెప్పటంలేదు. ఒక కాలుతో యెలా బ్రతికేదో కాస్తచెప్పు ప్రకాశం అన్నయ్యా?" అన్నాడు బలహీనంగా. చెబుతూంటే వాడి రెండు కళ్ళనుంచి నీళ్ళు జలజలమని రాలాయి.

    ప్రకాశరావు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతని కడుపులో ఏదో సుదర్శనం గిరగిరా తిరిగినట్టయింది. చూసుకోకుండా యేదో మెత్తని పదార్ధాన్ని తొక్కి అది పామని తెలిసినప్పుడు మనిషి యెలా బెడురుతాడో అలా బెదిరాడు.

    "అలా మాట్లాడతా వేమిటిరా?" అన్నాడు యేమీ చేతకాక.

    వాసు అన్నగారి ముఖంలోకి చూస్తూ, చిన్నగా నవ్వి "నేను అడగకూడని ప్రశ్న వేశానా?" అన్నాడు.

    త్వరత్వరగా తన శక్తులన్నీ కూడదీసుకుంటూ ప్రకాశరావు అన్నాడు. "నీకేమీ తెలియదా వాసూ? రెండు కాళ్ళూ కలిగివున్నవాళ్ళూ ప్రపంచంలో ఏదో సాధిస్తున్నట్టు నువ్వనుకుంటున్నావు. కానీ అవయవాలన్నీ సరిగా వుండి ఈ ప్రజానీకమంతా ఏం ఒరగబెడుతున్నట్లు? నువ్వు వాళ్ళకన్నా ఏమీ తీసిపోవు."

    "నువ్వు అలా అంటావుగాని నా ముఖంచూసి చెప్పు కుంటివాడినై నేనేమి చేయగలను? లేచి ఒక అడుగుకూడా వేయలేను. తిరగలేను. ఇంట్లో కూచుని......" దుఃఖంతో వాడి కంఠం పూడిపోయింది.

    ప్రకాశరావు తమ్ముడి యీ దుఃఖం ఎలా అయినా పోగొట్టేటట్లు చేయాలని ప్రపంచంలో గొప్పవాళ్ళును గురించి చెప్పాడు. "అనేక పరిశోధనలు చేసి లోకంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నవారిలో చాలా మంది అంగవైకల్యం వున్నవాళ్ళే. ఒకడికి చెముడు ఒకడికి మూగ, ఇంకొకడికి అంధత్వం, అంగవైకల్యం వున్నంత మాత్రంచేత పురోభివృద్ధికి ఎటువంటి అభ్యంతరమూ కాబోదు." అవన్నీ చెప్పి అతను వాసుని సంతోషపరచాలని, ఏదో ఒక లోపంవున్నవాడే త్వరగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి వీలు అవుతుందని విశదీకరించాడు.

    ఈసారి వాసు మాట్లాడలేదు. వాడు అన్నగారి మాటల్ని అంతగా నమ్మినట్లు లేదు. ఏదో స్ఫురించి ఊహాలోకంలో తేలిపోతూ పడుకున్నాడు. బహుశా టక్కు టక్కు మనుకుంటూ కాళ్ళులేని వారందరూ గుంపులు గుంపులుగా నడుస్తున్న దృశ్యాన్ని వాడు ఊహించుకుని ఉంటాడు.

    ఆ రాత్రి భోజనాలయ్యాక తీరిగ్గా అరుగులమీద కూర్చునప్పుడు నారాయణ అన్నాడు పెద్ద తమ్ముడితో "ఎన్నాళ్ళు సెలవు పెట్టావు?"

    "ప్రకాశరావు సూటిగా "ఎల్లుండి వెళ్ళిపోతాను" అన్నాడు.

    "డబ్బేమయినా అవసరమా?"

    ప్రకాశరావు తలవంచుకుని మెల్లగా "ప్రస్తుతం ఏమీ అవసరం లేదు" అన్నాడు.

    తరువాతయినా పెద్దగా సంభాషణ ఏమీ జరగలేదు. మాట్లాడుకోవలసిన కొద్ది విషయాలూ అయిపోయేసరికి యిద్దరూపోయి పడుకొన్నారు.

    ప్రకాశరావుకు వెంటనే నిద్రపట్టలేదు. ఏవేవో ఆలోచనలు అతన్ని అలుముకుంటున్నాయి.

    ఈ యింటికి వచ్చిన మొదటి క్షణంలో అతన్ని ఆవరించిన బాధ, చిరాకు ఇప్పుడులేవు. బహుశా అప్పుడే ఆ వాతావరణానికి అలవాటుపడిపోయాడేమో. ఈ యింట్లో యెలా వుండటమా అన్న ఆందోళనకన్నా ఈ యిల్లు బాగుండేటట్లు ఎలా చేసుకోవటం అన్నది మైళ్ళదూరంలో వుండి చదువుకుంటున్నాడంటే వీళ్ళలో కొంతమందికి అయిష్టంగావుంది. కొంతమందికి ఇష్టంగానూ వుంది. ఈ కుటుంబం కోసం తన చదువుకోసం కూడా అన్నయ్య చదువు మానుకున్నాడు. ఉద్యోగంలో ప్రవేశించాడు. తను అతనిలా ఉద్యోగం చేయకుండా వృత్తి  స్వీకరించి పైకి రావాలనే అతని అభిలాష తను గ్రహించాలి. ఆచరించాలి.

    ఆ క్షణంలో అతనికి మనోపధంలో శకుంతలా, వాళ్ళయిల్లూ, రాధా, యీ యిల్లూ గబగబ నిలిచి చెరిగిపోయాయి. ఆ నిలబడిన కొద్ది సమయంలోనే అతను "ఎంత భేధం?" అనుకుని నిట్టూర్చాడు.

    మరునాడు సరీగ్గా తెల్లవారకముందే వీధి తలుపులు దబదబా చప్పుడయింది. చప్పుడువిని లేచి వెళ్ళి తలుపులు తీసింది ఎదురుగా పెద్దకూతురు.

    తల్లికి ఒక్కసారిగా శరీరం జలదరించి, బావురుమంటూ అంత పెద్దకూతుర్ని కౌగిలిలోకి ఇముడ్చుకుంది. మెల్లమెల్లగా యిద్దరూ లోపలికి వచ్చారు. తల్లీ కూతుళ్ళ యీ యేడుపుకి ఇంట్లో అందరికీ మెలకువ వచ్చింది.

    ఇంటి పెద్దకూతురు రావటంతో కథంతా మళ్ళీ ప్రారంభమైంది. రాత్రి భావించుకున్నదంతా ప్రకాశం క్షణంసేపటిలో మరిచిపోయాడు. ఆ వాతావరణం యేడుపులలో, పెడబొబ్బలలో యెంతోసేపు వుండలేక ఎవరికీ కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు.

   
                             14

    ప్రకాశం మద్రాసు వచ్చేశాడు. ఇంటినుండి తిరిగి వచ్చాక అతని మనసేమీ బాగుండలేదు. దుర్భర దారిద్ర్యం, మితిలేని భాగ్యం. ఈ రెండింటి మధ్యా అతని మనసులో సంకుల సమరం చెలరేగుతోంది. ధనికుడి కడుపున ధనికుడే పుడతాడు. బీదవాడు ధనికుడు కావచ్చు. ఇంటర్మీడియట్ లో చదువుకొన్న ఎబ్రిడ్ జేషన్ గుర్తు వచ్చింది ప్రకాశరావుకు.

    ఆదివారంనాడు మధ్యాహ్నం రెండుగంటలకు తనగదిలో కూర్చుని దీర్ఘంగా ఆలోచించసాగాడు. ప్రకాశరావు అతని ఆలోచనలకు అంతర్యం సాంకేతికంగా అతనిపై పనిచేసి ముఖంలో ఆయా భావాల్ని వ్యక్తం చేస్తున్నాయి.

    అంతలో శకుంతల లోపలకువచ్చి అతని కెదురుగా గోడకు అనుకొని నిలబడి అతనివంక అర్థ నిమీలిత నేత్రాలతో చూసింది. అతనా చూపులకు చకితుడై, విషాదంగా "మీ చూపులు మరీ గుచ్చుకుంటున్నాయి" అన్నాడు.

    శకుంతల విచారంగా నవ్వి "బాధపడేవారికి ఎవరు యేం చేసినా బాధగానే కనిపిస్తుంది. చూడండి, మీరీమధ్య నాతో సరిగా మాట్లాడటం కూడా మానేశారు" అంది.

    ప్రకాశరావు ఇంకా కష్టపెట్టుకుంటూ "నిజంగా నేను సరిగా మాట్లాడటం లేదా?" అని అడిగాడు.

    "ఉహుఁ. లేదు."

    ప్రకాశరావు దీర్ఘంగా నిట్టూర్చాడు.

    "అంతేకాదు. పూర్వం పదకొండు గంటలదాకా చదువుకునేవారు, యిప్పుడు పన్నెండింటిదాకా లైటు వెలుగుతూందన్న మాటేగాని మీ ముందు పుస్తకమే వుండదు."

    "ఉండదు" అని గొణుక్కున్నాడు ప్రకాశరావు.

    "ఏమిటి మీ బాధ?"

    కొంచెం ఆగి ప్రకాశరావన్నాడు ; "నా విషయాలన్నీ మీకు చెప్పానా?"

    "అంటే?"

    "మా స్వవిషయాలు."

    "అవును. నే నిన్నాళ్ళూ అభిమానంతో బాధపడ్డాను. హృదయపూర్వకంగా ఏ ఒక్క వ్యక్తికి అయినా నా మనస్తాపాన్ని, నా అంతరంగాన్నీ విపులంగా చెప్పలేదు. ఈ నిమిషంలో నా మనస్సులో చెలరేగుతున్న సంక్షోభం అంతా మీ ముందు చెప్పాలని వుంది, కూర్చోండి."

    శకుంతల చాపమీద కూర్చుని వింటోంది.

    నిజంగా ఆ క్షణంలో శకుంతల అంటే ఒక అవ్యాజమైన అనురాగం, ప్రేమ గలిగాయి ప్రకాశరావుకి. ఆమె దగ్గర ఒక్క రహస్యంగాని, ఒక్క విషయంగాని దాచుకోవాలని అనిపించలేదు అతనికి. ఆమెకు చెబుతున్నప్పుడు ఎంతో నిశ్చింతనూ, సంతాపాన్నీ గూడా పొందగలిగాడతను. పూసగ్రుచ్చినట్లు తమ పరిస్థితి అంతా విశదీకరించాడు.

    ".....మా అన్నయ్య- - - నాన్న...... అమ్మ- - - వయస్సులోవున్న పిల్ల రాధ - - - కుంటి తమ్ముడు - - ఆ బీరాల ముసలమ్మ - - - వీళ్ళంతా యెలా గడుస్తుంది సంసారం? వీళ్ళంతా జీవితం ఎలా గడుపుకు వస్తారు? జీవితంలో వీళ్ళు ఎలా సుఖాన్ని చవిచూడ గలుగుతారు?"

    వింటోన్న శకుంతల కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి. ఆమె యింతకు ముందు యీ కధంతా ఓ వ్యక్తిద్వారా వినివుంది. అదే మళ్ళీ ప్రకాశరావు దగ్గర్నుంచి వినేసరికి నిజంగా అదంతా చూస్తున్నట్లే అనుభూతి పొందింది.

    "పాపం రాధ?"

    "ఏమిటి?" ప్రకాశరావు వింతగా ప్రశ్నించాడు.

    "నాకు రాధని చూడాలని వుంది."

    "మీకు అలా ఎందుకు అనిపించిందో తెలియటం లేదు."

    "మీ రాధ చాలా సౌందర్యవతి. సుకుమారి. తెలివితేటలు గలది. ప్రపంచంలో అటువంటి స్త్రీలను అరుదుగా చూస్తాము. ఆమె పేరు వింటూనే నాకు మనసంతా అదో విధంగా అయిపోతుంది. మీకు తెలీదు, ఆమెతో స్నేహం చేసుకోవాలని నా మనస్సెంత ఉప్పొంగి పోతోందో మీకు తెలీదు."

    ప్రకాశరావు ఆమె ధోరణికి విస్తుపోయి "సౌందర్యవతి! సుకుమారి ఈ మాటలు నేను మీకు చెప్పలేదే" అన్నాడు.

    "కాని నాకు తెలుసు."

    అతను మరీ ఆశ్చర్యంతో "ఎలా" అని ప్రశ్నించాడు.

    "ఆమెను గురించి యిదివరకే నేను విన్నాను."

    "ఎవరు చెప్పారు మీకు?"

    "మీ బాబాయి కూతురు. ఆమె నా స్నేహితురాలు. కనిపించి చాలా రోజులయింది. ఓ రోజున హఠాత్తుగా బస్సులో కనిపిస్తే ఇంటికి పిలిచాను. ఆమె వచ్చింది. మీరప్పుడు ఊళ్ళోలేరు. ఏదో ప్రసంగంలో ఆమె మీకు చెల్లెలు అవుతుందని తెలిసింది. అల్లా అల్లా మీ చరిత్ర అంతా చెప్పుకు వచ్చింది."

 Previous Page Next Page