ప్రకాశరావు దీర్ఘంగా నిట్టూర్చి "అయితే మా గురించి నేననుకున్న దానికంటే మీరు ఎక్కువే అర్ధం చేసుకున్నారా?" అన్నాడు.
శకుంతల జవాబు చెప్పలేదు. బహుశా ఇద్దరికీగూడా ఏమీ మాట్లాడాలోగూడా తోచనట్లుగా వుంది, హృదయ వేదనలను బయటపెట్టుకున్న తర్వాత వచ్చేచిక్కే అది. మానవుడు పొరబడితే అక్కడే. తన మనసులోని వ్యధను బయటపెట్టుకుంటే శాంతి బలభిస్తుందనుకుంటారు. కాని అది తాత్కాలికం మాత్రమే. తన చింతనంతా మరో వ్యక్తికి కూడా యెక్కించి బహిరంగ పర్చుకున్నానని విచారించేటప్పుడు అతని అవస్థ చాలా విపరీతంగా ఉంటుంది.
ప్రకాశరావు ఇదంతా భావించుకుంటూనే ఉన్నాడు. శకుంతలకూడా ఇదే మాదిరి ఆలోచనల తాకిడి ఎదుర్కొని వుండవచ్చు. ఈ విషయంమీద తర్కించటం ఇష్టంలేక శకుంతల లేచి లోపలకు వెళ్ళిపోయింది.
ఇప్పుడు ప్రకాశరావు ఒంటరిగా కూర్చున్నాడు. అతని మనసు పరిపరి విధాలపోతోంది. అప్పుడప్పుడు శకుంతల చెప్పిన మాటలు వీనుల్లో ధ్వనిస్తున్నాయి. ఈ మధ్య సరిగ్గా కాలేజీకి వెళ్ళటంలేదు. బాగా చదవటం లేదు. ఇది ప్రకాశరావుకు నిజంగా క్రొత్త అనుభూతి. ఇదివరకెప్పుడూ ఇలా పుస్తకం పట్టుకుంటే ఆలోచనలు యెక్కడో ఉండటం లేదు. అది అలా వుంచి చేతిలో పుస్తకం ఉండటం లేదని శకుంతల చెప్పింది. ఉన్నట్లుండి ఇలా ఎందుకు మారిపోతున్నాడు తను?
ఇంటికి వెళ్ళక ముందు ఈ మార్పు తనలో లేదని తెలుసు. అక్కడి పరిస్థితులకే ఇలా చిరాకు కలిగివుంటుంది. ఇదివరకు ఆ యింటిలో వుండటానికి, ఇప్పుడు ఉండటానికి యెంతో భేదంవుంది. ఇదివరకు అదే ప్రపంచంగా భావించి బ్రతికాడు. ఇప్పుడు బయటి ప్రపంచంచూసి అక్కడకు పోయేసరికి అంతా బీభత్సంగా కనిపించింది.
ఈ కుటుంబం పరిస్థితులను గురించి ఆలోచించసాగాడు. అలోతున పోతున్నకొద్దీ విషాదమే కనిపిస్తోంది అతనికి కాస్త స్వస్తత కలిగించటానికి ఏ ఆస్కారమూ కనబడటంలేదు. తను ఇక్కడికి వచ్చి అయిదు నెలలయినా కాలేదు. ఇంకో ఏడాదిన్నర గడపాలి. ఇంతకాలం యిక్కడ ఎలా గడపటం? అతనికి అన్నీ సమస్యల్లా కనిపించసాగాయి.
"కాఫీ!"
ప్రకాశరావు తలయెత్తి చూశాడు. కాఫీగ్లాసుతో వున్న శకుంతల గోచరించింది.
"రోజూ ఇదొకటా?"
"ఫరవాలేదు, తీసుకోండి."
ఆమె చేతిలోంచి అందుకుని ఆమెవంక చూడకుండా త్రాగసాగాడు.
ఒకరి రెండు నిమిషాలు అక్కడ నిలబడ్డ శకుంతల ఏదో గుర్తుకువచ్చి లోపలకు వెళ్ళిపోయింది. ఆమె ద్వారం దాకా వెళ్ళేసరికి ప్రకాశరావుకు ఏదో గుర్తువచ్చి పిలిచాడు.
"చూడండి!"
ఆమె ఆగి చూసింది.
"మిమ్మల్ని ఇవాళ ఒక కోరిక కోరతాను."
"చెప్పండి"
"నాతో బీచీకి రావాలి."
ఆమె తెల్లబోయి అతనివంక చూసింది. అతని ముఖంలో ఏ మాత్రం మార్పు కనబడలేదు. ఏమాత్రం చలించకుండా దృఢంగా అలానే చూస్తూ అన్నాడు.
"నిజంగా మీరు ఇవాళ వచ్చి తీరాలి."
అతని చూపుల్లోని దృఢత్వం, నిర్మలత్వం ఆమెను కారణం కూడా అడగకుండా చేశాయి. మౌనంగా ఒకక్షణం నిలబడి వెళ్ళిపోబోయింది.
"వస్తారా?"
ఆమె హఠాత్తుగా ఆగి, వెనుదిరిగి చూసి అంగీకారంగా తలవూపి వెళ్ళిపోయింది.
ప్రకాశరావు మిగిలిన కాఫీ చాలా తేలికగా తాగేశాడు. శకుంతలనిలా అడిగినందుకు అతనేం బాధపడటంలేదు. పైగా ఏదో హాయిగా ఉన్నట్లు ఇప్పుడు భావించాడు.
సాయంత్రం అయిదు అవుతూండగా ప్రకాశరావు తల దువ్వుకొని సిద్ధం అయ్యాడు. ఈనాడు తన అందమైన దుస్తుల్ని కూడా అతను ధరించలేదు. ఒకరిని లక్ష్యపెట్టే స్థితిలో అతను లేడు.
అతను గదిదాటి బయటకు వచ్చేసరికి ఎదురుగా వస్తూ చిరునవ్వుతో తనని పలకరించిన రామారావుగారిని "మీరేం అనుకోకూడదు. ఇవాళ మీ అమ్మాయిని నాతో బీచీకి పంపించాలి" అన్నాడు సూటిగా.
ఆయన ఏ మాత్రం వింత చెందకుండా "అలాగే! అమ్మాయి యిష్టపడితే మధ్య నాదేముంది?" అన్నారు.
"ఆమె ఒప్పుకున్నారు."
"అయితే, సరే."
లోపల తండ్రితో ఏమిటి చెప్పిందో శకుంతల ప్రకాశరావుకు తెలియనివ్వలేదు. ఒక పావుగంట గడిచేసరికి బయటకు వచ్చింది. అప్పటికే ప్రకాశరావు ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. ఇద్దరూ బయల్దేరారు.
శకుంతల ప్రక్కన నడుస్తూ పోతూంటే తెలిసినివారు యెవరైనా చూస్తే ఏమనుకుంటారో గమనించే స్థితిలో ఇవాళ ప్రకాశరావు లేడు. అతను ఐహిక విషయాలలో దేన్ని గురించీ ఆలోచించటంలేదు. పైపెచ్చు చాలా అతీతంగా ప్రవర్తిస్తున్నాడు.
మరీ విచిత్రమైన విషయం ఏమిటంటే- శకుంతల తనని గురించి ఏమి అనుకుంటుందీకూడా అతను యోచించలేదు. అటువంటప్పుడు తన కోరిక తిరస్కరించకుండా యెందుకు తనతో వస్తున్నదో గ్రహించటానికి యెందుకు ప్రయత్నిస్తాడు?
నడుస్తూ కొంతసేపటికి బీచీకి చేరుకున్నారు. ఈ మధ్యదారిలో పెద్దగా ఏమీ మాట్లాడుకోలేదు. ప్రక్కన ఒక యువతితో నడుస్తున్నానని తప్ప ఎవరెట్లాపోతోందీ గమనించే స్థితిలోలేని ప్రకాశరావు ఏకాంతంగా వుండే ప్రదేశాన్ని వెతుక్కోవటంలో చాలా తెలివి కనబరిచాడు. ఇద్దరూ కూర్చున్నాక అయిదు నిమిషాలు మౌనంగా గడిచాయి.
"నాకు జీవితంమీద విరక్తి పుడుతోంది" అతను హఠాత్తుగా అన్నాడు.
సముద్రపు ఘోషను శ్రద్ధగా వింటూన్న శకుంతల ఈ మాటలు ఎక్కడి నుంచో వినిపించినట్లు తోచగా "ఏమిటి అన్నారు?" అంది.
ప్రకాశరావు తిరిగి అదే వాక్యాన్ని "నాకు జీవితం మీద విరక్తి పుడుతోంది" అని పలికాడు.
"జీవితంమీద విరక్తి పుట్టినందుకు కారణం?"
"ఆశ."
"అయితే మీ ప్రశ్నకు సమాధానం నిరాశ."
"మీరు చాలా వింతగా మాట్లాడుతున్నారు ప్రకాశ్ బాబూ! మీకెందులో నిరాశ కనిపించింది? అంతగా నిరాశ కలగటానికి కారణం ఏమిటి చెప్పండి వింటాను."
అతను వెర్రిగా నవ్వి అన్నాడు. "మీ ప్రశ్నకు సూటిగా చెప్పలేకపోవచ్చు. కాని ఏ విషయం గురించి ఆలోచించినా నాకు భవిష్యత్ కనబడటంలేదు. మిగిలిన జీవితమంతా ఎడారిలా కనిపిస్తోంది. ఆ ఎడారిలో నడవటానికి నాకు భయంగా వుంది."
ఈ ధోరణికి వింతపడుతూ శకుంతల అతని కళ్ళల్లోకి చూస్తూంది. ఆమె అనుకున్న భావాలేవీ కనబడకపోగా భంగపడి "చూడండి, మీ నిరాశను నేను మాయం చేస్తాను. వారం రోజులు నేను చెప్పినట్లు నడవండి."
"ప్రకాశరావు ఆమె మాటలు వినటానికి ప్రయత్నిస్తున్నట్లుగాలేదు. దూరంగా కదులూతున్న కెరటాలవైపు చూస్తూ "అంతా విచిత్రంగా కనపడుతోంది" అని గొణిగాడు అస్పష్టంగా.
"ఏం?"
అతను తాపీగా అన్నాడు, నేనసలు మద్రాసులో చదవటానికి రావటం : మీ ఇంట్లో చేరటం, ఈ వింత బ్రతుకు బ్రతకటం."
శకుంతల అతనివంక అనుమానంగా చూసింది. అతని ఈ విచిత్రవాలకం ఆమెకు అగమ్యగోచరంగా వుంది. ఇతనితో ఇక్కడికి రాకపోయినా బాగుండేదని ఆమె ఇప్పుడిప్పుడు అనుకోసాగింది.
ఇంతలో అతను హఠాత్తుగా అన్నాడు, "ఈ రోజు మిమ్మల్ని యే ప్రశ్న అయినాసరే అడిగే అధికారం నాకిస్తారా?"
తెల్లబోయి "అంటే?" అనడిగింది ఆమె.
"మిమ్మల్ని మీకు ఎటువంటి ఇష్టంలేని ప్రశ్నవేసినా కోపగించుకోకూడదు."
"కోపం అనేది, వద్దంటే రాకుండా మానుతుందా ఏమిటి?"
ప్రకాశరావు ఒకసారి నిశితంగా ఆమె వదనంలోకి చూశాడు. ఆ వదనంలో దోబూచులాడుతున్న భావాలని గ్రహించటానికి అతను ప్రయత్నించలేదు. అలాగే చూస్తూ అడిగాడు. "పెళ్ళెప్పుడు చేసుకుంటారు?2'
ఆమె అసహ్యంతో చూపులు ప్రక్కకి త్రిప్పుకుంది. అతని చూపుల్ని భరించటం యెంత కష్టంగావుందో, మాటల్నికూడా భరించటం అంటే కష్టంగావుంది.
జవాబు చెప్పటం ఇష్టం లేదా?"
"కాదు" ఆమె విసురుగా జవాబిచ్చింది.
"నా యిష్టం వచ్చినప్పుడు చేసుకుంటాను."
"ఎటువంటి వ్యక్తిని చేసుకుంటారు?"
"మనసుకి నచ్చినవాడ్ని."
ఆమె సూటి జవాబు విని అతను మౌనంగా వూరుకొన్నాడు. తరువాత ఏదో తోచి అన్నాడు: "అవును, మీకు అన్ని విషయాలలోనూ స్వతంత్రం వుంది. మీకు నచ్చినవాడిని చేసుకుంటారు. కాని రాధ అలా కాదు. ఆమె మనసుకు నచ్చినవాడు ఆమెకు లభించడు. ఎంతకాలానికి పెళ్ళి కాకపోతే పెద్దవాళ్ళు చివరికి యెవరికో ముడిపెట్టేస్తారు. ఎంతతేడా?" అన్నాడు.
"మీరో?" కోపంతో మండిపోతూ గుచ్చిగుచ్చి అతనివైపు చూస్తూ ప్రశ్నించింది శకుంతల.
"నేనా?" అని ప్రకాశరావు "నేనసలు పెళ్ళిచేసుకోను" అన్నాడు.
"ఎందుకో!"
"నాకేముంది? నేను బీదవాడ్ని. తెలివితక్కువవాడిని. చూసిచూసి నన్ను ఎవరు పెళ్ళి చేసుకుంటారు? నన్నెవరూ ప్రేమించరుకూడా."
"ప్రేమ" శకుంతల శరీరం గజగజమని వణకసాగింది. నిశ్చేష్టురాలై అతనివంక చూడసాగింది.
"అవును. మీరు ఎందుకలా చూస్తారు? నేను చెప్పేది నిజం - - - అమ్మగా నా తల్లి, నాన్నగా నా తండ్రి, సోదరుడుగా నా అన్నాతమ్ముళ్ళు అక్కచెల్లెళ్ళు వీళ్ళుతప్ప నన్ను వేరే దృక్పథంతో ఈ లోకంలో ఎవరూ, ప్రేమించరు. నేను చెప్పినదాంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు."
శకుంతల నోటమాట రాకా ఆచేతనంగా కూలబడిపోయి యింకా అలాగే చూస్తూండేసరికి అతను గట్టిగా నవ్వుతూ లేచి "ఇందులో మీరింత నిర్ఘాంతపోవాల్సిన అవసరం నాకేమీ కనబడటం లేదు" అన్నాడు.
శకుంతల ఇప్పటికి తేరుకుంది విభ్రాంతిలోంచి. ఇహ ఆ వాతావరణంలో ఒక్క క్షణంకూడా వుండటం దుస్సహంగా అనిపించింది ఆమెకు. చాలా విచిత్రమైన అవస్థలో లేచి నిల్చుంది. అతనితో చెప్పక పెట్టకనే గబగబా నడవసాగింది. ఇదంతా ప్రకాశరావు మ్రాన్పడిపోయి చూస్తున్నాడు. ఈ విపరీతం ఏమిటా అని అతను ఎక్కువ తెల్లబోతూకూడా లేడు. ఒక వినోదం చూస్తున్నట్లుగా ఆమె కనిపించేటంతవరకూ చూసి, తరువాత ఏదో తోచి "శకుంతలా!" అని బలహీనంగా పిలిచాడు.