Previous Page Next Page 
పెంకుటిల్లు పేజి 24


    చిదంబరం బిక్కమొహంతో వెనక్కి తిరిగాడు. గంగాధరంగారి తరహా ఆయన ధోరణి అంతా వింతగా కనిపించాయి. భయాన్ని కలిగింపజేశాయి. బయటకు నడిచాడు. తమాషాగా జరిగిపోయిన ఈ సంఘటనలని గురించి ఆయన బాధపడుతున్నా, అదే సమయంలో ఒక కార్యాన్ని సాఫీగా నెవేర్చగలినప్పుడు కలిగే నిశ్చింత ఆయన్ని ఆవహించింది. "అవును. కష్టమైన పనులు సాధించబోయేటప్పుడు అనేక ఇక్కట్లను ఎదుర్కోవలసి వుంటుంది. ఇటువంటి విషయాలని లెక్కబెడితే యెలా?" అనుకున్నాడు. ఆ సమయంలో తానొక కార్యశూరుడు అయినట్లు భావించాడు.

    కాని డబ్బు ఎలా వస్తుందా అన్న సంశయం ఇంకా నివృత్తికాలేదు. ఆ సమయంలో అతని తలలో ఒక ఆలోచన మెరిసింది. ఆలస్యం చేయకుండా గబగబా అడుగులు  వేసుకుంటూ పరంధామయ్యగారుంటివైపు నడవసాగాడు. ఆయన వెళ్ళేసరికి పరంధామయ్యంగారు యింటిలోనే ఉన్నారు. చిదంబరానికి ఆయన్ని ఇటువంటి సహయాలడిగే అలవాటు లేదు. వాళ్ళకూ, వీళ్ళకూ డబ్బు అప్పుగా ఇస్తుంటాడని తెలుసు. కాని ఇంతవరకూ అప్పుతీసుకునే అవసరం ఆయనకు కలగలేదు. నోరువిడిచి యీ రోజు అడిగాడు. ఆయన పనికూడా సానుకూలంగా నెరవేరింది. ఒక గంటలో పని ముంగించుకొని విజయగర్వంతో యింటివైపు నడిచాడు.

    హాస్పిటల్ పోయేసరికి అక్కస కొడుక్కి ఆపరేషన్ చేస్తారని తెలిసి శారదాంబ ఏడుస్లూ కూర్చుంది. ఈ విషయం ఇంకా వాసుకు తెలిసినట్లులేదు. కళ్ళనుంచి నీళ్ళు కారుతుండగా పైకిచూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. వాడికి చచ్చిపోతానేమోనని భయంగా వుంది. ఎలాగు చనిపోవటం ఖాయం. పోతూ కూడా అసలు విషయం చెప్పలేకుండా వున్నాడేం? ఈ గొడవలోపడి అన్నయ్యకూడా ఆ డబ్బులగొడవ మరిచిపోయినట్లున్నాడు. తను చెప్పటమా? వద్దా?

    ఈ విధంగా వాడి ఆలోచనలు రకరకాలుగా మారసాగాయి. వాడికి మాట్లాడేందుకుగాని, ఎక్కువగా యోచించేందుకుగాని తగిన ఓపిక ప్రస్తుతంలో లేదు. అందుచేత చివరకి ఏమీ చెప్పకుండానే కళ్ళు మూసుకొని పడుకున్నాడు.

    అమాయకంగా పడుకున్న చిన్నకొడుకు ముఖంలోకి చూస్తుండగా కడుపులో ఏవో దేవినట్లయింది శారదాంబకు.

   
                                                    13

    ఆపరేషన్ సక్రమంగా జరిగింది. వాసుకు ఏ అపాయమూ లేకుండానే అన్నీ నిర్వర్తించబడినాయి. ఇరవై రోజులు హాస్పిటల్ లోనే వున్న తరువాత కట్లు విప్పేసి యిహ ఇంటికి వెళ్ళవచ్చునని డాక్టరుగారు. ఇంటికిపోయినా ఇంకా కొన్నిరోజులవరకూ పడకమీదే వుండాలని చెప్పారాయన.

    వాసుని ఆ స్థితిలో చూస్తుంటే ఒక్క తల్లికేకాదు; ఆ యింట్లో ప్రతివారికీ గుండెలు పీచుపీచుమంటూనే వున్నాయి. కుడికాలుకు బదులు కర్రకాలు వేసుకుని టక్కుటక్కుమని చప్పుడు చేసుకుంటూ తిరగబోయే వాడి స్వరూపాన్ని ముందుగానే ఊహించుకొని ప్రతివారుకూడా చాటుగానో, మాటుగానో కన్నీళ్ళు కారుస్తూనే వున్నారు. కొన్నాళ్ళవరకూ జబ్బుతో వున్నవాడిని చూసిరావటానికి, ఇంటిలోవాళ్ళని ఓదార్చటానికీ ఇరుగూ పొరుగూ వస్తూండేవారు. అడిమట్టుకు ఎన్నాళ్ళని సాగుతుంది? క్రమ క్రమంగా ఆ యిల్లు మామూలుగానే తయారయింది.

    నారాయణ అటు ప్రకాశానికీ ఇటు అన్నపూర్ణకుకూడా ఉత్తరాలు రాశాడు. జరిగిన సంగతంతా విశదీకరిస్తూ. "రానవసరంలేదు" అని మరీ మరీ రాశాడు. కాని అతనలా రాయటం నిష్ర్పయోజనమే అయింది. ప్రకాశరావు, అన్నపూర్ణ యిద్దరిలో యెవరూ రాకుండా మానలేదు. ఒకరోజు ముందూ వెనకా యిద్దరూ రైలు దిగారు.

    ఇంట్లోంచి వస్తూంటే ప్రకాశం శరీరమంతా వేడిగా అయినట్లు, అదో రకంగా సానుభూతి పొందాడు. చుట్టూ చూశాడు. చూసి చాలాకాలమయింది. ఇదివరకటికంటే కళాకాంతులు లేనట్లుగా తయారయింది. ఇల్లంతా బావురుమంటూ కనిపించింది.

    అతను వచ్చేసరికి శారదాంబ బత్తాయిరసం తీసి కొడుక్కి పెడుతోంది. ఎందుకో వీధిలోకి చూసేసరికి సన్నగా, పొడుగ్గావున్న ఓ వ్యక్తి లోపలకు వస్తూ కనిపించాడు. ఎవరు? శారదాంబ దూరంనుంచే గుర్తుపట్టింది. కడుపులో ఏదో కెలికినట్లు అవగా, చేస్తున్న పనిని ఆపి "ప్రకాశం" అంటూ గుమ్మంలోకి పరిగెత్తింది.

    తమ్ముడి మంచంమీద ఒకప్రక్క కూర్చుని వాడిని చూస్తూ చంటిపిల్లవాడిలా ఏడిచాడు ప్రకాశం. అతనిని ఓదార్చడం కూడా చాలాకష్టమైంది.

    కొంతసేపు గడిచాక మెల్లగాలేచి ఓసారి ఇల్లంతా కలయచూశాడు. చూసి చాలారోజులు అవటంవల్లనో, ఎందుచేతనో కొత్తగా కనిపించింది. నిరాశ, నిస్పృహ ఇల్లంతా తాండవిస్తున్నట్లుగా వుంది. ఎవరితోనూ మాట్లాడటానికి కూడా అతనికి సరిగ్గా బుద్ధిపుట్టలేదు. అతను వచ్చేసరికి నారాయణకూడా ఇంట్లోలేడు. నారాయణ గదిలోకి వెళ్ళి కిటికీలోంచి బయటకు చూస్తూ నిలబడ్డాడు.

    "అన్నాయ్ "అ నిఅమదురమైన పిలుపు విని తలత్రిప్పి చూశాడు. రాధ కాఫీ అందిస్తూ "ఏమిటి ఆలోచిస్తున్నావు చిన్నన్నాయ్" అంది.

    ప్రకాశరావు చెల్లెలి ముఖంలోకి ముగ్ధుడై చూస్తూ "ఇలా మీతో మాట్లాడి ఎన్నాళ్ళయిందో గదా" అన్నాడు.

    రాధ దీనికి ఏం మాట్లాడుతుంది? కొంచెం ఆగి నీకు మద్రాసులో కంటే ఇక్కడ బాగుంటుందా? అంది.

    "ఎవరి ఊరు వారికి తీపికదా రాధా" అన్నాడు ప్రకాశం. "ఎవరి ఊరు వారికి బాగుంటుంది. కాని బాగుండికూడా చేసే పరిస్థితులు కొన్ని వున్నాయి. వాటికి లోనైనప్పుడు---"అని సందేహంతో ఆగిపోయాడు.

    "చెప్పు"

    "భయం భయంగా వుంటుంది. ఏదో నరకంలో వున్నట్లు, ప్రపంచంలో వున్న కష్టాలన్నీ, అపాయలన్నీ మనమే అనుభవిస్తున్నట్లు వ్యధ చెందుతాం."

    "కాని కష్టాలకి భయపడి దూరంగా పారిపోవటం నీచం కదా?"

    "ఆఁ, పారిపోవటంలో అదే ఉద్దేశమైతే నీచమే."

    అతని కెందుకో రాధ ముఖంలోకి పదే పడే చూడాలనిపిస్తుంది. ఆమె చాలా మారిందని అతననుకున్నాడు. ఆమె వదనంలో వెల్లివిరిసిపోతూన్న అమాయకత్వం, ముగ్ధత్వం, సౌందర్యం, అతనికి ఆమె అంటే వాత్సల్యాన్ని అమితంగా కలుగజేస్తున్నాయి. అతనికి చిన్నప్పటి విషయాలు జ్ఞప్తికి వచ్చాయి. అప్పుడు - - - ఎప్పుడూ రాధకూ, తనకూ పడేది కాదు. చీటికి మాటికీ ఇద్దరూ దెబ్బలాడుకుంటూ ఒక్కొక్కసారి వారం రోజులదాకా కూడా మాట్లాడకుండా వుండేవారు.

    అవన్నీ మనసులో మెదిలి చిన్ననవ్వును తెప్పించాయి. నిజానికి ఆమెను చూసి కొన్ని నెలలు మాత్రమే గడిచినా కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నట్లు వుంది అతనికి. తర్వాత అనేక విషయాల మీద వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ సంభాషణ అనుకోకుండా చాలా విధాల సాగింది. మధ్యలో తన సందేహంకూడా బయటపెట్టింది రాధ. ఇక్కడ నుంచి పంపించే కాస్త డబ్బుతో అక్కడ యెలా గడపగలుగుతున్నావని అడిగింది. దీనికి ప్రకాశరావు జవాబు చెప్పటానికి చాలా కష్టాలపాలు కావలసి వచ్చింది. కుటుంబంలో ప్రతి వ్యక్తినీ రాధ సమంగా ప్రేమిస్తుందని అతనికి తెలుసు. అందులో ఏ వొక్కరు శ్రమకు లోనైనా ఆమె హృదయం ద్రవించి కన్నీరు మున్నీరుగా స్రవించజేస్తుందని అతనికి తెలుసు. అందుచేత. నానా అవస్థపడి ఎలాగో సర్ధిచెప్పాడు. మాటల్లో ఒక్కసారయిన అతను శకుంతల ప్రసక్తి తీసుకురాలేదు. "నువ్వు ఉండేది ఎక్కడ" అని రాధ అడిగితే, ఏదో గదిలో వుంటున్నానని చెప్పాడు. ఇక్కడ సంగతులన్నీ చూశాక ఇన్ని రోజులబట్టి వీళ్ళు ఎలా వుంటున్నారో తెలుసుకోవాలనే ఉత్కంఠ అతనిలో ప్రబలం కాసాగింది. ఈ విశేషాలు రాధ నోటివెంట తప్పిస్తే మరో మార్గాన వచ్చే ఆస్కారం ఏమీ లేదు. అంచేత మాటల సందర్భంలో ఆమెనే అడిగేశాడు. కాని రాధ అతననుకున్నంత అమాయకురాలు కాదు. కాకపోయినా, బోళామనిషి ఎప్పటికీ కాదు. రాధ ఎంతవరకు చెబితే అవతలివాడి మనస్సు  జాలితో మాత్రం నిండిపోతుందో, అంతవరకు మాత్రమే చెప్పింది.

    కాని చాలామందికన్నా ఎక్కువగా ప్రకాశరావుకు ఊహించుకొనే అలవాటు ఒకటి వుందికదా. ఆమె చెప్పినదాన్ని విస్తరించుకొని, దృశ్యాలుగా హృదయఫలకంమీద చిత్రంచుకొని, లోలోపలే పరితాపం పొందాడు తల్లి భోజనానికి పిలిచినా కేకతో ఇద్దరూ లోపలికి వెళ్ళారు.

    కొంతసేపటికి నారాయణకూడా వచ్చాడు. ప్రకాశాన్ని చూడగానే అతనికి కొంత విస్మయం కలిగింది. మనసులో అనుకున్నది అనుకున్నట్లే పూర్తిగా అతను ఎప్పటికీ చెప్పడు. మామూలుగా పలకరించి ఊరుకున్నాడు.

    భోజనాలు అవుతున్నంతసేపూ తండ్రీకొడుకులు ఇద్దరూ ఎక్కువగా మాట్లాడుకోలేదు. భార్యముందయినా సరే యోగక్షేమాలు అడగటానికి చిదంబరం సిగ్గుపడతాడు. భోజనాలు అయాక ప్రకాశం గదిలోకి పోతూంటే వెనుకనే పిల్లిలా తనూ వెళ్ళాడు.

    "ప్రకాశం!"

    ప్రకాశరావు తలయెత్తి చూసి "ఏమిటి నాన్నా?" అన్నాడు.

    కొంచెం తటపటాయించి "అక్కడ నీకు తిండి అదీ సరిపోతుందా?" అన్నాడు తండ్రి.

    "ఆఁ."

    "చదువూ, అదీ బాగా సాగుతోంది?"

    "ఆఁ."

    "ఆరోగ్యం, అదీ బాగుంటోందా?"

    "ఆఁ."

    డబ్బూ, అదీ సరిపోతుందా?"

    "ఆఁ."

    "గుబులూ, దిగులూ లేకుండా వుంటున్నావా?

    "ఆఁ."

     యోగక్షేమాలు ఇంకా ఏమని కనుక్కోవాలో చిదంబరానికి తెలియలేదు. అక్కడికి తన బాధ్యత తీరిపోయినట్లుగాగూడా ఆయన భావించాడు. కొంచెంసేపు ఆ గదిలో అటూ ఇటూ తచ్చాడి నెమ్మదిగా బయటకు జారుకొన్నాడు. ప్రకాశరావు లోలోపలే నవ్వుకొని, ఎవరైనా కలుసుకోదలచిన వాళ్ళని కలుసుకుందామని చెప్పులు వేసుకొని బయటకు వచ్చాడు. వీధిలో నలువైపులా చూసుకొంటూ మెల్లగా నడవసాగాడు.

    "బావా?" ఈ పిలుపు విని తలత్రిప్పి చూశాడు. కృష్ణుడు తన యింటి గుమ్మములో నిలబడి పిలుస్తున్నాడు. ఇక్కడ వున్నప్పుడుకూడాఈ సంబోధన అలవాటుగనక ప్రకాశరావు ఎక్కువగా ఆశ్చర్యపడక "ఏమిటిరా?" అన్నాడు.

    "ఎప్పుడొచ్చావు?"

    వీడి మాటలకి ప్రకాశరావు ఆశ్చర్యపడి "ఆ పొద్దున్న వచ్చానులే" అన్నాడు.

    "కాస్త మా ఇంట్లోకి వచ్చి వెళ్ళు"

    "సరే" అని ప్రకాశరావు ఆశ్చర్యపడి "ఆ పొద్దున్న వచ్చానులే" అన్నాడు.

    "కాస్త మా ఇంట్లోకి వచ్చి వెళ్ళు"

    "సరే" అని ప్రకాశరావు గుమ్మం తగలకుండా కొంచెం వొంగి లోపలికి నడిచాడు. లక్ష్మమ్మగారు యింతలో లోపల్నుంచి వస్తూ "ప్రకాశమా? ఎప్పుడు రావటం? కులాసాయేనా?" అని పలుకరించింది.

    ప్రకాశరావు ముక్తసరిగా సమాధానం చెప్పాడు.

    అతన్ని అక్కడున్న కుర్చీలో కూర్చో  పెట్టాక "అదేమిటి? ఎవరైనా మద్రాసుపోతే లావయి  వస్తారు. అసలే పోడగరివి. రాను రానూ సన్నపడుతున్నావేమిటోయ్" అంది.

    ప్రకాశరావు సిగ్గుపడుతూ ఆ విషయాన్ని వదిలేసి "ఇంట్లో ఎవరూ లేరా?" అనడిగాడు.

    ఆవిడ చేతులు త్రిప్పుకొంటూ "ఉహుఁ. వారేమో యెక్కడికో బయటకు వెళ్ళారు. ఆనందుడు కాలేజీకి వెళ్ళాడు" అంది.

    ప్రకాశరావు ఏమీ మాట్లాడకపోయేసరికి మళ్ళీ ఆవిడే "రాత్రి మా యింటికి భోజనానికి రాకూడదూ?" అంది.

    "ఎందుకు రాకూడదూ? కాని రాకరకా వచ్చిన నన్ను మా ఇంట్లో వదుల్తారా?"

    ప్రకాశరావు చాలా తెలివిగా తప్పించుకొని "వెళ్తానండి?" అని లేచాడు.

    "ఎన్నాళ్ళుంటావు?" అనడిగిందావిడ యధాలాపంగా.

    "ఎన్నాళ్ళోనా? ఎల్లుండికి వెళ్ళిపోతాను. అనవసరంగా కాలేజీ పోతుంది కూడా."

 Previous Page Next Page