ఆమెకి పెదవులమీద వెటకారంతో కూడిన ఓ చిరునవ్వు అవతరించింది. తల ఊపి ఊరుకుంది. సత్యమూర్తి మెల్లిగా అక్కడ్నుంచి బయట పడి, తనగదికి చేరుకునేసరికి తండ్రి తనకోసం ఎదురుతెన్నులు చూస్తూ కూర్చున్నాడు.
* * *
మరునాడు అతని రిజల్ట్సు తెలిశాయి. ఫస్ట్ క్లాసులో ప్యాయు అయాడు. పనివాడు చంద్రయ్య వచ్చి "ఫస్టున ప్యాసయ్యారుటగా బాబూ" అని సంతోషంతో పలకరించి వెళ్ళాడు.
తండ్రిగనుక బ్రతికివుంటే తన ఆలోచనలు ఎలావుండేవా అని తలపోస్తూ కూర్చున్నాడు సత్యమూర్తి. ఈ బాధ్యత, సంఘర్షణ, తనని అణగద్రొక్కాలని చూస్తున్న కొత్తస్వభావం ఇవేమీ వుండేవి కావు. ఆ పోగొట్టుకున్న నిశ్చింత తిరిగిరాదు.
అతనికి ఇంట్లో కూర్చోక, అలా ఎక్కడకన్నా తిరిగిరావాలనిపించింది. ఎక్కడకు పోతాడు? క్రమంగా సుధా అతని హృదయంలో మెదిలింది. బట్టలు వేసుకుని, బయల్దేరాడు.
సత్యానందంగారి యిల్లు తమ ఇంటికి మైలుదూరం పైగా వుంటుంది. వాళ్ళు జగన్నాధపురంలో వుంటున్నారు. రిక్షా ఎక్కి కూచున్నాడు.
మెయిన్ రోడ్డువరకూ వెళ్ళాక అతనికి ఓ కారు ఎదురయింది. ఓ యువకుడు డ్రైవుచేస్తున్నాడు అతన్ని చూసి "నారాయణరావు కదూ!" అని సత్యమూర్తి అనుకునేటంతలో ఆ యువకుడు కూడా ఇతన్ని చూసి కారాపి "హలో" అని పలకరించాడు. రిక్షా ఆగింది. సత్యమూర్తి క్రిందికిదిగి "కులాసాగా వున్నారా? ఈ మధ్య బొత్తిగా కనిపించడం లేదు" అని పలకరించాడు.
ఆ యువకుడు కూడా డోర్ తెరచుకుని బయటకువచ్చి నిలబడ్డాడు. అతన్ని చూస్తే సత్యమూర్తికి చాలా ఆశ్చర్యంగా వుంది. ఒకప్పుడు అతను చిరిగినా గుడ్డలు కట్టుకుని తిరుగుతూ వుండేవాడు. తింటానికి కూడా సరిగా వుండేదికాదు. ఇప్పుడు మనిషి స్ట్రెచ్ లాన్ ప్యాంటూ, టెరిలిన్ షర్టూ వేసుకుని, చేతిలో ఓ గోల్డుప్లేక్ టిన్ తో దర్జాగా, హుందాగా వున్నాడు. మునుపటి కన్నా మనిషికి రంగు, కాంతి, మిసమిస, అందం వచ్చాయి.
"ఏమిటంత విడ్డూరంగా చూస్తున్నారు?" అనిఅడిగాడతను నవ్వుతూ.
తను సభ్యత లేకుండా అట్లా తదేకంగా చూసినందుకు నొచ్చుకుని "అబ్బే ఏంలేదు" అని తప్పించుకోచూశాడు.
"ఫర్వాలేదులెండి ఇదివరకు బికారిలా తిరిగే నారాయణరావు ఇప్పుడు హఠాత్తుగా ఇంత పైలాపచ్చీసుగా ఎలా తయారయ్యాడనా? కారణముంది మహాశయా" అని పకపకమని నవ్వి "తీసుకోండి" అని సిగరెట్ టిన్ ఆఫర్ చేశాడు.
"వొద్దండీ. కాల్చాను. అలవాటులేదు" అన్నాడు సత్యమూర్తి మొహమాటపడుతూ.
"వండర్. లక్షాధికారి బలరామయ్యగారిపుత్రుడు కనీసం సిగరెట్టయినా అలవాటు లేకుండా జీవించడం...రియల్లీ ఎ వండర్....నాకు ఈ దశ ఎలా పట్టిందని కదూ మీ ఆశ్చర్యం. ఎక్కడో ఓ ముసలాడు చచ్చాడు! బ్రతికున్న రోజుల్లో ఎప్పుడూపిల్చి ఓ రాగిపైసా అయినా రాల్చనివాడు, పోతూ పోతూ నిజమైన వారసుడ్ని నేనే అని గుర్తించి రెండు లక్షలు అప్పజెప్పి పోయాడు. తంతే బూరెలబుట్టలో పడ్డట్లయింది మనపని. ఇంకా దారిద్ర్యానికి స్వస్తిచెప్పి 'ఎన్ జాయ్ ఎండ్ ఎన్ జాయ్' అన్న ప్రిన్సిపల్ తో బతుకుతున్నాం."
"కంగ్రాచ్యులేషన్స్" అన్నాడు సత్యమూర్తి.
"మీకు నా కంగ్రాచ్యులేషన్స్, మీ నాన్నగారు పోయారుటగా."
ఒక్కసారిగా నోటమాట లేకుండా నిశ్చేష్టుడైపోయాడు సత్యమూర్తి. అతి కఠినంగా, సూటిగా వచ్చిన ఈ ఘాతానికి అతను తట్టుకోలేకపోయాడు క్రమంగా ముఖం ఎర్రబడిపోసాగింది.
నారాయణరావు హఠాత్తుగా గట్టిగా నవ్వుతూ, అంతకంటే గట్టిగా అతని భుజం చరిచి "అరె! ఆఫెండ్ అయారేమిటి కొంపతీసి? జోక్ గా అన్నానండి. స్వేచ్ఛ లభించి, మరో ప్రపంచంలోకి అడుగుపెట్టారు కదా అన్న ఉద్దేశంతో అన్నానంతేగాని_రూడ్ గా అర్ధం చేసుకోకండి. ఎంత పెంపుడు తండ్రయినా, చనిపోయినప్పుడు కలిగే దుఃఖం సామాన్యమైనదా? నేను అర్ధంచేసుకోగలను" అని హాస, అట్టహాసాల బలంతో మొదట కలిగించిన అసహ్యాన్ని ఎగురగొట్టివెయ ప్రయత్నించాడు.
సత్యమూర్తి కష్టంమీద మామూలుస్థితిలోకి రాగలిగి "ఏమీ లేదు లెండి" అన్నాడు బలవంతంగా.
అతను యిహ ఆ ప్రసక్తి మరచిపోయినట్లు "అవునుగాని మీరింకా రిక్షాలలో తిరగటమేమిటి నాన్ సెన్సు? ఫియట్ అయినా కొని జల్సాగా తిరగాలి. నాకు ఎంబాసిడర్ మీద అప్పుడే మొహం మొత్తింది. మార్చాలని చూస్తున్నా...మీరు బిజినెస్ లైనులో ఏమయినా ఏంటరవుతున్నారా?" అని అడిగేసి కాలుస్తూన్న సిగరెట్ గిరాటేసి టిన్ లోంచి మరొకటి తీసి వెలిగించాడు.
"లేదండీ అలాంటిఅభిప్రాయమేమీ లేదు. మీరేమైనా దిగుతున్నారా?" అని అడిగాడు బాగుండదని.
"చూస్తున్నానండీ. ఒక్కటిమట్టుకు నిజం. అనుకోకుండా చుట్టుకున్న ఈ ఆస్తితో ఎడ్వెంచర్ చేసి ఇంకా పైకి పోవాలని ప్రయత్నిస్తానుగాని ఏం చేస్తే ఏమయి యిదంతా హరించిపోతుందోనని భయముతో కాళ్ళూ చేతులూ పట్టుకుని మట్టుకు కూర్చోను. మరి మీరేమైనా వాటా కలుస్తానంటే చెప్పండి, రంగములోకి దూకుదాం."