"మీరు అనుభవంతో లోకాన్ని చూసి ఉంటారనుకొన్నాను! బిడ్డ మీద మమకారంతో సంప్రదాయపు సంకెళ్ళు త్రెంచుకొంటారనుకొన్నాను! సమాజాన్ని ఎదిరించగలరనుకొన్నాను! ఇరవయ్యేళ్ళ తరువాత కూడా గీతాభావాన్ని ఏం మారలేదు! పేపరులో ప్రకటన ఇచ్చి చాలా పిచ్చిపని చేశానని ఇప్పుడనుకొంటున్నాను! పాప రాకముందే మీరు వెళ్ళిపోతే బాగుంటుంది! పాపకి ఆవేశం ఎక్కువ! కోపంవస్తే నోరు అదుపుతప్పి మాట్లాడుతుంది. అనవసరంగా మిమ్మల్ని అవమానించినట్టు అవుతుంది. నా పాప అనాధ కాకూడదనుకొన్నాను! తీసికెళ్ళినా మీ బిడ్డగా పరిచయం చేసుకోకపోతే ఆమె అనాధ అన్నమాటేగా?" కొంచెం తీక్షణంగానే మాట్లాడాడు సుందరయ్య.
ఆమె ఉద్విగ్నతతో అంది: "నే నుండగా పాప అనాధకాదండీ! మా జ్యోతి, స్వాతికంటే ఎక్కువ చూచుకొంటాను! ఇన్నాళ్ళు ఆమెకు నా నుండి ఏం కరువైందో అది రెట్టింపుగా ముట్టజెప్పుతాను!"
తల్లిగా ఇవ్వని దేదైనా అది పాపకి ధర్మం చేయడ మౌతుంది! ఏం చేసినా దయ చూపడమౌతుంది నేను చనిపోయినాసరే ఒకరి దయకూ, దానానికీ పాపని వదిలివెళ్ళను. పాపకి తన కాళ్ళమీద తను నిలబడే శక్తిని సమకూర్చాను. బ్రతుకుతుంది, ఎవరి దయాదాక్షిణ్యాలతో పనిలేకుండా."
నిష్కర్షగా మాట్లాడుతున్న సుందరయ్యకేసి గాయపడ్డట్టుగా చూసింది గీతాభావాన్ని. "పెద్దవారు! ఈ సమాజం ఎలాంటిదో తెలియదా? ఈ సమాజంలో తప్పటడుగు వేసిన ఆడదాని బ్రతుకేమిటో తెలియదా? కాలుజారి కన్నబిడ్డను నిర్భయంగా ప్రపంచానికి పరిచయం చేసుకోగల తల్లులు ఎంతమంది? ఆ నిర్భీతికి ఈ సమాజం ఎలా కక్షకడుతుందో, ఎలాంటి దారుణమైన అవమానం రుచిచూపుతుందో, మరణపర్యంతం ఎలా హింసిస్తుందో మీరు ఊహించలేరా?" దయనీయంగా అడిగింది. "సమాజ భయంతో నేను గుప్తంగా ఉంటాను. తల్లిగా నా మమకారం నాబిడ్డమీద వర్షిస్తూనే ఉంటుంది నేను ఏం చేసినా తల్లిగానే చేస్తాను. ఇది దయచూపడం, ధర్మంచేయడం అంటే ఎలా?"
"కన్నకూతుర్ని టీచరుగా పరిచయం చేసి, కూతురులా చూచుకొంటానంటే దాన్ని ప్రపంచం దయక్రిందే పరిగణిస్తుంది. మీరేం చేసినా ధర్మంగానే భావిస్తుంది."
"అయితే నాతో అమ్మాయిని పంపరా?" ముఖంలో రక్తంచుక్క లేనట్టుగా అడిగింది.
"కొద్దిరోజుల్లో ఈ ప్రపంచంనుండి సెలవు పుచ్చుకోబోతున్నాను. నేను పాపజీవితాన్ని నిర్ణయించలేను! ఆమె నిర్ణయించుకొంటుంది ఏదైనా! ఆ స్వతంత్రం ఆమెకు నేనిచ్చాను. పాప మీతో వస్తానంటే తీసికెళ్ళండి. నేను అభ్యంతరం చెప్పను."
"ఇందుకే నా గతాన్ని తిరగేసి నా కళ్ళముందు నిలబెట్టింది? ఎక్కడో నా కూతురు అపురూపంగా పెరుగుతూందని నిశ్చింతగా ఉండేదాన్ని. ఇప్పుడు అనిశ్చింత నానుండి దూరంచేశారు కదా?" ఆక్రోసిస్తున్నట్టుగా అంది.
కొద్దిగా మెత్తబడ్డట్టుగా అయ్యాడు సుందరయ్య. "బాధ పడకం! డమ్మా పాపకి మీతోబయల్దేరమనే చెబుతాను! తను రాకపోతే మాత్రం నేనేం చేయలేను!" అంటూండగానే ప్రేమీ పరిగెత్తుకువచ్చింది.
"రత్నం పిన్నికి కొడుకు పుట్టాడు, నాన్నా! ఆంటీ ఇంటినుండి వస్తూంటే సీతారాంబాబాయ్ నన్ను పట్టుకొన్నాడు. 'మీ పిన్నికి నొప్పులు వస్తున్నాయే! దగ్గర ఎవరూ లేరు. కొంచెం సాయంరావూ?' అని. గబగబా కాస్త చారు అన్నంచేసి తినిపించి హాస్పిటల్ కి తీసికెళ్ళాను! అబ్బా! రత్నం పిన్ని ఎట్లా కేకలు పెట్టింది! ఎంత బాధపడింది! వెధవ పన్నెండు పౌన్లున్నాడట! నల్లగా అంతా రత్నంపిన్నిలాగే ఉన్నాడు. వాడు పెట్టిన అంత బాధనూ మరిచి వాడి ముఖంలోకి ఎలా చూస్తుందనుకొన్నావు రత్నం పిన్ని! నాకైతే వాడిని రెండుమొట్టికాయలు పెడదామనిపించింది..." హఠాట్టుగా ప్రేమీ వాక్ ప్రవాహానికి అడ్డు కట్టపడింది. ప్రక్కనే కుర్చీలో కూర్చొని తనకేసి విభ్రమంగా కళ్ళు ఇంతింత చేసుకొని చూస్తున్న అపరిచితురాలిని చూస్తూనే, తలత్రిప్పి తండ్రికేసి ప్రశ్నార్ధకంగా చూసింది.
"ఆమె చాలా దూరంనుండి ప్రయాణం చేసివచ్చిందమ్మా నీ కోసం! ఎప్పుడు తిన్నదో ఏమిటో! ముందు ఓ కప్పు టీనో, కాఫీనో ఇచ్చి తరువాత భోజనం ఏర్పాటు చూడు!"
"ఇప్పుడు నాకు భోజనం వద్దు! రైల్లో పళ్ళుతిన్నాను. ఆకలి లేదు!" అంది గీతాభవాని.
ఇంటిముందు టాక్సీ ఉన్నా పక్కింటికీ, తమింటికీ మధ్య అది ఉండడంవల్ల టాక్సీ పక్కింటికి వచ్చిందేమో అనుకొంది. తండ్రిమాట లతో అంతా బోధపడినట్టుగా అయింది. అయితే నాన్న పిచ్చిప్రయత్నం ఫలించిందన్నమాట! తనని తీసుకుపోవడానికి వచ్చిన ఈమె....ఈమేనా పసిగుడ్డును రాక్షసంగా ముళ్ళ చెట్లలోకి విసిరేసింది! బంగారు, మట్టి గాజులతో నిండుగా, తెల్లగా, కోమలంగా ఉన్న ఆ చేతులేనా తనని నిర్ధాక్షిణ్యం గా పై అంతస్థునుండి విసిరేసింది.
కళ్ళు వెడల్పుగా చేసుకొని ఆమెనీ చూడసాగింది ప్రేమీ.
తరచూ తన కళ్ళముందు మెదిలే స్త్రీ మూర్తికీ, ఈమెకూ అసలు పోలికేలేదు! ఈమె ముఖంలో ఇంత మార్దవత ఉందేమిటి? ఈమె కళ్ళలో ఇంత ఆర్తి ఉందేమిటి? ఆ ముఖం చూస్తే ఏదో పవిత్రభావం కలుగుతూంది. చూచేకొద్దీ చూడాలనిపించేంత అందంగా ఉందా ముఖం? నలభయ్యోపడి వచ్చినా ఆమెలో ఆకర్షణ అద్వితీయంగా ఉంది! సరిగ్గా ఆమె ఇరవయ్యేళ్ళ వయసులో తనలాగే, అచ్చం తనలాగే ఉండేదనడానికి సందేహం లేదు!
ఆమె చేతులు చాచింది. "రా, తల్లీ!" అంటూంటే ఆమె కళ్ళలో కన్నీటి తెర తళుక్కుమంది!
'ముళ్ళకంపలోకి విసిరివేసినబిడ్డ కోసం చెమ్మగిల్లే శక్తి ఆ కళ్ళకి ఉందా?' హఠాట్టుగా బిగుసుకుపోయినట్టుగా అయింది ప్రేమీ. రెండడుగులు...ముందుకు కాదు వెనక్కి వేసింది చాచిన ఆమె చేతులు పడగెత్తిన పన్నాగాల్లా కనిపించాయి.
"ఈ చేతులు....ఈ చేతులేనా నేను పుడుతూనే ముళ్ళ చెట్లలోకి విసిరేసింది?" భయవిహ్వల స్వరంతో ప్రశ్నించింది. గీతాభావాన్ని చేతులు నెమ్మదిగా క్రిందికి వాలిపోయాయి! దోషిలా తల వంగిపోయింది.