మలి సం ధ్య చీకటితో చేతులు కలిపి, సృష్టి మీది ఆధిపత్యాన్ని కటికి కట్టబెట్టబోతున్నది!
వీధిలో పిల్లల కేరింతలు సద్దుమణుగుతున్నాయి.
ఇంటింటికీ సాంధ్య దీపం వెలిగిస్తున్నారు గృహిణులు.
దగ్గరలో ఉన్న గుడిలో భక్తులు గంట మ్రోగిస్తున్నారు.
అలాంటి సమయంలో సుందరయ్య ఇంటి ముందు టాక్సీ ఒకటి వచ్చి ఆగింది.
టాక్సీలో వెనుకవైపు కూర్చొన్న మహిళా డ్రైవరుకి ఏదో చెప్పింది. డ్రైవరు టాక్సీ తలుపు తెరుచుకొని దిగి ఇంటిగేటు తెరుచుకొని లోపలికి వెళ్ళాడు.
లైట్ స్విచ్ వేయడానికి గుమ్మం దగ్గరికి వచ్చాడు అప్పుడే సుందరయ్య.
"నందిరాజు సుందరయ్య మీరేనా?"
"ఆఁ నేనే." బయటికి తొంగిచూశాడు సుందరయ్య. ఇంటిముందు ఆగిన టాక్సీ కనిపించింది.
డ్రైవరు ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి ఆమెతో చెప్పాడు. "ఇదే ఇల్లు. మీరు దిగండి అమ్మగారూ!"
ఆమె దిగింది. "ఎంత లేటయినా సరే. నువ్వు ఇక్కడే ఉండు! వెయిటింగ్ చార్జీ ఇస్తాను!" అని లోపలికి నడిచింది. గుమ్మంముందు సంకోచంతో ఆగిపోయింది. "మీరేనా సుందరయ్య?" మెల్లిగా గొంతు పెగల్చుకొంటున్నట్టుగా అడిగింది.
విస్మయంతో ఆమెను చూస్తున్నాడు సుందరయ్య. గుమ్మంలోంచి ప్రక్కకు తప్పుకొని "నేనే. లోపలికి రండి" అన్నాడు. ఆమెను పోల్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. దోషిలా తలవంచుకొన్న ఒక స్త్రీమూర్తి తరుచూ తనకళ్ళలో మెదులుతూ ఉంటుంది! ఈమేకదూ? గీతాభవాని!అప్పుడు సన్నగా, రివటలా ఉండేది! ఇప్పుడు కొంచెం ఒళ్ళుచేసి నిండుగా ఉంది. ఆమె అందం ద్విగుణీకృతమైనట్టుగా ఉంది. ఆమె కట్టుకొన్న చీర ధరించిన నగలూ, ముఖంలో కనిపించే గాంభీర్యం, ఆమె గొప్పింటి పడుచుఅని చెప్పక చెబుతున్నాయి!
హఠాత్తుగా ఆమెను చూస్తే ప్రేమీ ఇరవై ఏళ్ళనుండి నలభయ్యోఏట అడుగు పెట్టి వచినట్టుగా అనిపిస్తుంది! అంత దగ్గరపోలికలున్నాయి ప్రేమీకి, ఆమెకూ!
"ఆఁ. మీరు గీతాభవాని కదూ?" ఆమెను పోల్చుకొన్నట్టుగా అన్నాడు.
"మీతో పంపాలనే ఆ ప్రకటన ఇచ్చాను! కాని, ఒక చిన్న అడ్డుంది! ఇరవై ఏళ్ళనాడు మీరు పాపని ముళ్ళచెట్లలోకి విసిరివేసినా, నేను పెంచుకొంటానని తీసుకు వచ్చినా, 'ఎందుకు' 'ఏమిటి? అని ప్రశ్నించలేదు పాప! అప్పుడామెకు నోరులేదు! ఇప్పుడు ఆ పాపకి నోరు వచ్చింది! ఆమె ప్రశ్నలకు జవాబు ఇవ్వగలిగితేనే మీరు ఆమెను తీసికెళ్ళగలుగుతారు!"
"ఏం ప్రశ్నలు?" ఆమె అయోమయంగా చూసింది.
"అవి పాపకే తెలుసు! ఆఁ. మీకు పెళ్ళయింధా, అమ్మా? పిల్లలా?"
"పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు!"
"పాపని తీసుకుపోయి ఏం చేస్తారు? ఎలా పరిచయం చేస్తారు?"
"అవివాహితగా ఉన్నప్పుడు మర్యాదస్తుడికూతుర్ని. ఇప్పుడు వివాహితగా ఒక మర్యాదస్తుడి భార్యని! ఆమెని ఎలా పరిచయం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి!"
"మా పెద్దమ్మాయి అంటే మావారి తొలికళత్రం కూతురన్నమాట! ఆమె భర్తతో ఫారిన్ లో ఉంది! ఆమె ఇద్దరు పిల్లల్ని నా దగ్గరే వదిలేసి వెళ్ళింది! వాళ్ళకు టీచరును తీసుకువచ్చానని చెప్పాలనుకొంటున్నాను. ఆమెను ఎలాగో నాతో తీసికెళ్ళగలిగితే తరువాత ఏమైనా చేయగలను! మంచి సంబంధం చూసి పెళ్ళి చేస్తాను."
"మంచి సంబంధం చూసి పెళ్ళి చేస్తారు! ఇంకా ఏమైనా చేస్తారు! కాని, పాపకి అమ్మనని చెప్పుకోరుగా?"
"అలా చెప్పుకోగలిగితే పుట్టగానే బిడ్డను ముళ్ళకంపలోకి విసిరేసేదాన్నా? అప్పటికీ ఇప్పటికీ నేను అస్వతంత్రురాలిని! నా కిప్పుడు ఇద్దరు ఆడపిల్లలు! వంశప్రతిష్టకు ప్రాణంపెట్టే భర్త! మాది జమీందారీ కుటుంబం! నన్ను ఎంతో అభిమానంగా చూసే బంధువులు! వాళ్ళకి నేను పెళ్ళికాకుండానే బిడ్డ తల్లినైనాని తెలియడంకంటే చావడం నయం కదూ? ఆ గౌరవ ప్రతిష్టలు ఒకెత్తు. నా కడుపునా పుట్టిన ఈ బిడ్డ ఒకెత్తు! నేను ఏదీ తేలిగ్గా వదిలేయకుండా ఉన్నాను!" గీతాభావాన్ని గొంతులో నిస్సహాయత ధ్వనించింది "మీరు ఆ ప్రకటన ఎందుకిచ్చారు? నన్ను ఎందుకింత సంఘర్షణలోకి దింపారు? నాకు పుట్టినబిడ్డ అనాధ అవుతుందంటే సహించలేను! ప్రపంచానికి ఆమెను నా బిడ్డగా పరిచయం చేసుకోలేను. ఏ ఆడదానికైనా ఎలాంటి సంకట పరిస్థితి ఇది?"