Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 25

    "నిజంగా నువ్వొక రాక్షసివి! కాని అందమైనరూపం ఎత్తావు, మనుష్యుల్ని మోసం చేయడానికి!" కఠినంగా అంది. "కుక్క చూచుకొంటుంది తన పిల్లల్ని ప్రాణప్రదంగా. పక్షి చూచుకొంటుంది తన పిల్లల్ని కంటికి రెప్పల్లా! నువ్వు జంతువుకన్నా, పక్షికన్నా హీనంగా ప్రవర్తించావు!"

    "జంతువులకూ, పక్షులకూ సమాజం, కట్టుబాట్లూ లేవమ్మా?" క్షీణస్వరంతో అంది గీతాభవాని.

    "తల్లి మమకారాన్ని ఏ సమాజం త్రెంచుతుంది?"

    "సమాజాన్ని లక్ష్యపెట్టకపోతే నువ్వు చెప్పిన జంతువుల్లా బ్రతకాల్సి వస్తుంది. తనను దిక్కరించిన వాళ్ళను మనుషులుగా బ్రతకనివ్వదు ఈ సమాజం!"

    "సమాజం అంటే అంత భయం ఉన్నదానివి! ఒక జీవికోసం ఈ ప్రపంచపు తలుపు లెందుకు తెరిచావు? ఒళ్ళు కావరమేనా? అలాగే అయితే నువ్వు మనిషిగా బ్రతకతగవు!"

    రక్తహీనంగా పాలిపోయింది గీతాభవాని ముఖం! "ఎన్ని రోజులుగా ఈ మాటల ఈటెలు తయారు చేసుకొని పదును పెడుతున్నావమ్మా?" అస్పష్టంగా కదిలాయి పెదవులు.

    "చెప్పు! నన్నెందుకు కన్నావు?" సూటిగా, నిలదీసినట్టుగా అడిగింది.

    "ఈ ప్రశ్నకు జవాబు ఒక బలహీన క్షణమని! అంతకంటే వివరించి చెప్పలేను!"

    సుందరయ్య కల్పించుకొన్నాడు. "నే నాశించినట్టుగానే ఆమె నిన్ను తీసికెళ్ళడానికి వచ్చింది. కాని, మీ తల్లీ బిడ్డల బాంధవ్యం బయట పెట్టలేదట! తనింట్లో ఉన్న కూతురు పిల్లలకు టీచరుగా పరిచయం చేస్తుందట! ఇన్నాళ్ళు నీకు ఏ తల్లి ప్రేమ కరువైందో దాన్ని పదింతలుచేసి నీకు ముట్టజెప్పుతానంటూంది! ఆమె ఒకనాడు చేసిన పొరపాటును ఇవాళ సమయం చిక్కిందికదాని తవ్వి వెక్కిరించడం, భావ్యంకాదు. మానవ జీవితంలో పొరపాటు ఎంత సహజమో పశ్చాత్తాపం, పరివర్తనా అంత సహజం! ఆమెలో కలిగిన పరివర్తనకు విలువ ఇవ్వాలమ్మా! ఇవ్వకపోతే మానవసమాజవ్యవస్థ ద్వేషంతో, అపనమ్మకంతో బీటలు వారుతుంది! ఆమే సంఘంలో ఒక మనిషి! మనమూ సంఘంలో మనుషులమే? ఆమె తప్పువిస్మరించి హృదయ పరివర్తనాన్ని మన్నించు!"

    "నేను ఏ తప్పునైనా మన్నిస్తానేమోగాని కని బిడ్డను పారేసే కాఠిన్యాన్ని మాత్రం మన్నిన్చాలేను, నాన్నా! ఇక నాకు తల్లి ప్రేమ కరువైందని ఎలా అనగలుగుతున్నారు? పదహారేళ్ళు అమ్మ ఒడిలో ఏ బిడ్డ పెరగనంత నిశ్చింతగా, అపురూపంగా పెరిగాను. ఈమె పదింతలు కాదు. వెయ్యింతలు చేసి చూపినా ఆ తల్లి ప్రేమకు సరితూగదు!"

    "పాపా! జీవితం చివరి అధ్యాయంలో ఉన్నాను. నేను నిశ్చింతగా వెళ్ళిపోయేందుకు సహకరించమ్మా!" వేదికోలుగా అన్నాడు.

    ప్రేమీ మాట్లాడటానికి ఇష్టం లేనట్టుగా లోపలికి వెళ్ళిపోయింది.

    గీతాభవాని కొంచెంసేపు నిశ్శబ్దం తరువాత అంది: "పెళ్ళయ్యాక మా వారికి తెలియకుండా నేను చేసిన మొట్టమొదటి రహస్య ప్రయాణమిది. ఇదే ఆఖరుకావాలని నా కోరిక! అమ్మాయిని ఎలాగైనా ఒప్పించి నాతో పంపండి! లేదూ, మీ అంత్యదశవరకు మీదగ్గరే ఉంచుకొంటానంటే అలాగే కానీ, తరువాతైనా అమ్మాయి నా దగ్గరికి వస్తుందనుకొంటె నాకు నిశ్చింత! ఇదివరకు ఎలా గడిచిపోయాయో రోజులు! ఇప్పుడు మాత్రం జ్యోతి, స్వాతికంటే నేను ఎక్కువ ఆందోళన పడుతున్నది ఈ బిడ్డగురించే! నా మనసునూ, నన్నూ అర్ధం చేసుకోండి!" డగ్గుత్తికతో అంది గీతాభవాని.

    "పాపా! ఒకమాట మాట్లాడి పో!" సుందరయ్య కేకేశాడు.

    ప్రేమీ చేతిలో బియ్యం చాటతో ఇవతలికి వచ్చింది.

    "పాపా! నాఆరోగ్యం ఏం బాగాలేదు. నేను పోయాక నువ్వు ఒంటరి దానివి అవుతావనేనమ్మా నా ఆరాటం! ఆ ఆరాటంవల్లే నేనా ప్రకటన ఇచ్చాను! ఆమె వచ్చింది. ఇప్పుడు కాకపోయినా నేను ఈ ప్రపంచంలో లేనిరోజైనా నువ్వు ఆమె దగ్గరికి వెడతానంటే నాకు నిశ్చింతగా ఉంటుంది!"

    "ఈ ప్రపంచంలో ఒంటరివాళ్ళు ఎందరు లేరు? వాళ్ళలో నేనూ ఒక దాన్ని అనుకోలేవా, నాన్నా?"

    "వాళ్ళలో నిన్నూ ఒకదాన్ని చేసిపోలేకేనమ్మా ఈ తాపత్రయమంతా!"

    ప్రేమీ ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా గంభీరంగా మారిపోయింది. "నేను ఆమె దగ్గరికి వెళ్ళటం నీకు మనశ్శాంతి నిస్తుందంటే నీ మాట ఒక ఆజ్ఞగా వెడతాను! కంపలోపడిన బిడ్డను ప్రపంచంలోకితెచ్చి ఒక వ్యక్తిత్వం దిద్దిన మహనీయుడివి! నా కోరిక తిరస్కరిస్తే నువ్వు దిద్దిన ఈ వ్యక్తిత్వానికి అర్ధముండదు! నేను అక్కడికి వెళ్ళినా నా వ్యక్తిత్వం నాకుండాలి! నా జీవితంపట్ల ఏ నిర్ణయానికైనా నాకు స్వేచ్ఛ ఉండాలి!"

    ప్రేమీ ఇంత తొందరగా, తేలిగ్గా ఒప్పుకొంటుందని గీతాభవానేకాదు, సుందరయ్యకూడా అనుకోలేదు!

    "కాని, ఒక షరతు. నన్ను ఆమె కూతురిగా పరిచయం చేసేటట్టయితేనే ఆమె దగ్గరికి వెడతాను."

    ఊహించని పిడుగుపాటులా వెలవెలబోయింది గీతాభవాని. ఆమె ముఖంలో అందాకా కలిగిన ఆనందం ఊదేసినట్టుగా ఆరిపోయింది.

    "పాపనిర్ణయం విన్నారుగా?" సుందరయ్య ఒక నిట్టూర్పు విడిచాడు.

    ఆ రాత్రి ట్రెయిన్ కి వెళ్ళిపోయింది గీతాభవాని. సుందరయ్య స్టేషన్ కి వెళ్ళి ఆమెను ట్రెయిన్ ఎక్కించి వచ్చాడు.
    ట్రెయిన్ రెండుగంటలు ఆలస్యం కావడంతో ఇద్దరి మధ్య ఎన్నో సంగతులు దొర్లాయి. ప్రేమీ సంగతులెన్నో అడిగి తెలుసుకొంది. తన సంగతులూ ఎన్నో చెప్పింది!

    ట్రెయిన్ కదులుతూంటే కన్నీళ్ళతో అంది గీతాభవాని: "ఎలాగైనా ప్రేమికకు నా మీద కోపం పోగొట్టండి! ఎలాగైనా నా దగ్గరికి వచ్చేలా చేయండి? ఇన్నాళ్ళు ఈ బిడ్డ గురించి నేనెంతో నిశ్చింతగా ఉన్నాను! పిల్లల్లేని దంపతుల చేతుల్లో నా బిడ్డ ఎంతో అపురూపంగా పెరుగుతూంది కదాని! ఇప్పుడు నా మనస్సంతా ఈ బిడ్డమీదే ఉంటుంది!"
   

 Previous Page Next Page