ఆ మధ్య నీ లెటర్ చదివి రెండు రోజులు అస్సలు నిద్రపోలేదు. పిచ్చినాన్నా ! నాకోసం ఎంత అలమటించి పోతున్నావో కదా.
మనిద్దరం మాట్లాడుకుంటూ వుండడం అక్కయ్య చూసింది. ఆ అబ్బాయి ఎవరు అని గుచ్చిగుచ్చి అడిగింది. నేనేమీ చెప్పలేదనుకో. నామీద కాపలాలు పెట్టింది. నాకేమన్నా ఫోన్ వస్తే ప్రక్కనే నిల్చుంటుంది. ఈ నిబంధనలతో నాకు ఊపిరాడడం లేదు ఏడుపొచ్చేస్తోంది.
కృష్ణా ! ఇహనుంచి నీతో మాట్లాడడం కుదరదనుకుంటాను. కాని నీతో మాట్లాడకుండా వుండలేను. ఒకవైపు నుంచి పరీక్షలు దగ్గిరికొచ్చేస్తున్నాయి. చదవలేకుండా వున్నాను. అసలు కాన్ సంట్రేషన్ కుదరడం లేదు. ఎగ్జామ్స్ అయ్యే వరకు _ నువ్వు నన్ను కలుసుకోవద్దు కాని ఎలాగైనా సరే కనిపిస్తూ వుండు. ఎందుకంటే రోజూ నిన్ను నేను చూడాలి. ఎందుకంటే నువ్వు కనిపించకపోతే నేను భరించలేను.
కృష్ణా తెలిసిందా ? నువ్వు నాకు కనిపిస్తూ వుండాలి. __రోజూ లేకపోతే నేను చచ్చిపోతాను.
విత్ స్వీట్ కిసెస్
నీ
__అస్మిత
ఉత్తరం చదువుకొని గోపీకృష్ణ చాలాసేపు ఆలోచించాడు.
ఈ పేదరికం, ఒక రూపాయి కావాలంటే ఎప్పుడూ వెతుక్కోవడం అతనికి భరించడం చాలా కష్టంగా వుంది. తనలో చాలా అతీతమైన శక్తులున్నాయి. చాలా గొప్పవాడు కావలసిన లక్షణాలున్నాయి. అర్ధంలేని ఈ చదువులూ, బ్రతకడానికి చాలీచాలని ఈ ఉద్యోగాలు అతని కసహ్యం. తనలో చాలా ఆకర్షణలున్నాయి. అంత తేలిగ్గా అర్ధంకాని గొప్పతనం వుంది. జీవితంలో పైపైకి ఉన్నంత శిఖరాల్లోకి _ ఓ బాణంలా దూసుకుపోవాలి కాని, మందమతిగా, అంచెలంచెలుగా, అయినా భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేని అయోమయస్థితిలో ప్రయాణం చెయ్యడం తనలాంటి వాడికి దుస్సాధ్యం.
చాలాసేపటివరకూ మెలకువగా వుండి చివరకు ఓ ఉత్తరం రాశాడు.
"డియర్ అస్మితా !
నీ ఉత్తరం చదివి చాలా చాలా బాధపడ్డాను. నువ్వు నా గురించి ఎంత ఆలోచిస్తున్నావో అంతకు వెయ్యిరెట్లు నేనూ ఆలోచిస్తున్నాను.
నీతో మాట్లాడకుండా, కేవలం దూరం నుంచి చూస్తూ నెలల తరబడి గడవడమా? అమ్మో అది నాకు సాధ్యంకాదు.
నీ అన్నయ్య కాదుకదా నీ తల్లీ, తండ్రీ ఎవరూ నిన్ను నా నుంచి వేరు చెయ్యలేరు. ఎవరు కాదన్నా _ ఎవరు అడ్డం వచ్చినా నిన్ను బలవంతంగా ఎత్తికెళ్ళిపోతాను.
నువ్వు నాదానివి. తెలిసిందా అస్మితా! నువ్వు నా దానివి.
కానీ నీ కోసం నీ పరీక్షలయ్యేదాకా నువ్వు కోరినట్లు ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాను తర్వాత...?
నీ
__కృష్ణ"
ఉత్తరం ముగించి ప్రక్కనే ఏదో అలికిడయేసరికి తల ఎత్తి చూశాడు.
ప్రజ్ఞ !
చాలీచాలని ఆ దీపకాంతితో _ ఒక్కసారి ఆమె కళ్ళలోకి చూసి తల దించుకున్నాడు.
"గోపీ!"
వినీ విననట్టు వూరుకున్నాడు.
"అస్మితకు ఉత్తరం రాస్తున్నావు కదూ?"
అతనేం మాట్లాడలేదు
"ఎందుకురా ఆ అమ్మాయి జీవితంలో చెల్గాటాలాడుతున్నావు? ఒరేయ్ వాళ్ళు చాలా పెద్ద అంతస్తుకు చెందిన వాళ్ళురా. మనం లేని వాళ్ళం. ఆ అమ్మాయిలో లేనిపోని ప్రలోభం కలిగించినట్టయితే _ ఆమె జీవితాన్ని నాశనం చేసినట్టవుతుందిగాని, ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదురా."
"నేను అస్మితను సాధించి తీరతాను" అన్నాడు గోపీకృష్ణ.
ప్రజ్ఞ ఆశ్చర్యంగా చూసింది.
"నీకు చాలాసార్లు చెప్పాను. ఈ పేదరికం, అర్ధంలేకుండా ఫలితము లేకుండా సంవత్సరాలకు సంవత్సరాలు కష్టపడతాం. జీవితంలో పైకి వచ్చిన వాడెవడూ ఒళ్ళు హూనం చేసుకుని పైకిరాడు. అడ్డదారి త్రొక్కి తీరాలి. నేనలా అడ్డదారి త్రొక్కుతాను. నేను నా అస్మితకు వేరే ప్రపంచం లేకుండా చేస్తాను. ఆమెతోబాటు ఆమె డబ్బూ, ఆస్తి సర్వస్వం అనుభవిస్తాను."
ప్రజ్ఞ అతని వంక నిరసనగా చూసింది. అతని మనస్తత్వం, దారుణమైన భావాలు భరించలేకపోయింది. అక్కడ ఒక్క క్షణమైనా నిల్చోలేక లోపలకు వెళ్ళిపోయింది.
9
ఉదయం పదిగంటల వేళ ఆచార్య జగదీష్ తన ఏకాంత మందిరంలో వజ్ర సింహాసనం లాంటి కుర్చీలో ఆసీనుడైవున్నాడు.
అతని కళ్ళు విచిత్రమైన కాంతితో మెరుస్తున్నాయి. తాను చాలా సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు. పుట్టినప్పుడు తనలో గొప్పతనమేమీ కన్పించలేదు. పైగా తన తల్లిదండ్రులకు అంతకు ముందు కలిగిన సంతానం నలుగురూ అయిదారు నెలలైనా తిరక్కముందే ఏదోక జబ్బుచేసి మరణిస్తూ వుండేవారు. పుట్టినప్పుడు తానూ చాలా అర్భాకంగా వుండేవాడు. తల్లిదండ్రులు రకరకాల మొక్కులు మొక్కారు. రకరకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాగైతేనేం బ్రతికాడు.