Previous Page Next Page 
భారతి పేజి 23

    "పద చూద్దాం"

    స్నేహితురాళ్ళిద్దరూ  గౌరీపతిగారు  పడుకుని వున్న గదిలోకి వెళ్ళారు. రాధమ్మ అంతకుముందే గోడకు  తగిలించి వెళ్ళిన దీపం  గాలికి రెపరెపలాడుతూ  వెలుగుతూంది. ఆ వెలుగులో  గౌరీపతిగారు  నిద్రపోతూ కనిపించారు.

    మల్లిక  మాట్లాడవద్దన్నట్లు  సంజ్ఞచేసి చెయ్యి పట్టుకుని  బయటకు తీసుకువచ్చింది. "బాబాయిగారు  నిద్రపోతున్నారు, ఇప్పుడు నిద్రాభంగం  చెయ్యటం  మంచిదికాదు" అంది చాలా నెమ్మదిగా.

    ఇద్దరూ హాల్లో ఆ చీకటిలోనే  చాపమీద చతికిలబడ్డారు. రాధమ్మ లోపల వంటింట్లో పని చేసుకుంటూంది.

    "అన్నట్లు, మీ యింట్లో  ఇంకెవరున్నారు? నువ్వొక్కదానివేనా? ఈ రాత్రి వేళ చీకట్లో  అక్కడికి వెళ్ళి ఏం అవస్థ పడతావు మల్లికా! ఇక్కడే వుండిపో" అంది భారతి  బలవంతం చేస్తూ.

    "కాదు భారతీ! ఈ మధ్య  అమ్మకు సుస్తీగా  వున్నదని తోడుకు అత్తయ్యను తీసుకువచ్చుకున్నా కదూ. మేమంతా బెజవాడ వెళ్ళినా ఆవిడా, ఆవిడ ఎనిమిదేళ్ళ కొడుకూ  యింటికి  ఆసరాగా  యిక్కడ వుంటున్నారు. ఇప్పుడు నేను వెళ్ళకపోతేనే పాపం, అత్తయ్య  కంగారుపడుతుంది. కాసేపు  కూర్చుని వెళ్ళిపోతాను. మళ్ళీ  రేపు ఉదయమే వెళ్ళిపోవాలి భారతీ. అక్కడ ఒకటి రెండు రోజులుండి  అమ్మకు కాస్త నెమ్మదించాక గుంటూరు వెళ్ళిపోతాను. ఇప్పటికే  చదువు చాలా రోజులు పోయింది" అంది బాధగా మల్లిక.

    స్నేహితురాళ్ళిద్దరూ అలా కబుర్లు  చెప్పుకుంటూ  మరికొంతసేపు  గడిపారు, తరువాత మరునాడు వెళ్ళేముందు  కనిపిస్తానని  చెప్పి మల్లిక వెళ్ళిపోయింది. భారతి ఆమెను కొంతదూరం  వరకూ దిగబెట్టి వచ్చింది .రాత్రిళ్ళు కూడా  నిర్భయంగా  తిరగటం చిన్నతనం నుంచీ వారి కలవాటే!


                                   *    *    *


    మరో రెండు రోజులు గడిచిపోయాయి. యీలోగా  మల్లిక బెజవాడ వెళ్ళిపోయింది. గౌరీపతిగారికి వున్నట్లుండి గుండెనొప్పి  వస్తూనే ఉంది. భారతి తండ్రిని బెజవాడగాని, గుంటూరుగాని తీసుకువెడదామనుకుంది. కాని ఆయన హార్టు పేషెంటు, కదల్చటానికి  వీల్లేదు. అదీగాక  ఆయన చందరాల నుండి కదలటానికి  ఇష్టపడటం లేదు. అనార్యులుగారే  వచ్చి చూసి  మందిస్తున్నారు.

    ఒక సాయంత్రం  కనుచీకటిపడే  సమయానికి  రాధమ్మ ఆయనున్న గదిలోకి వచ్చి గోడకు దీపాన్ని తగిలిస్తూంటే  గౌరీపతిగారు  "రాదమ్మా!" అని పిలిచారు. ఆయన ఎప్పుడోగాని ఆమెను పేరుపెట్టి పిలవడు. ఏ సంబోధనా లేకుండానే మాట్లాడటం జరిగేది.

    రాధమ్మ దీపాన్ని సరిచేసి  ఆయనవైపు తిరిగింది.

    "ఇలా దగ్గరకు రా, రాదమ్మా!"

    ఆమె మెల్లగా నడిచి వచ్చి ఆయన మంచం దగ్గర నిలబడింది.

    "భారతి ఏం చేస్తోంది?"

    వంటింట్లో ఉన్నట్లు సంజ్ఞలు  చేసి  చూపించింది రాధమ్మ.

    "చూడు రాదమ్మా" అన్నాడాయన  చలించే కంఠంతో. "భారతి చిన్న పిల్లగా ఉన్నప్పుడు నువ్వీ ఇంట్లో అడుగు పెట్టావు. సంవత్సరాలుగా యీ ఇంట్లో  ఒకరికొకరు సన్నిహితంగా మెలుగుతున్నా  నీలోనూ, నాలోనూ స్వార్ధం లేదు. నువ్వో అభాగిని అయిన దేవతలాంటిదానివి....రాదమ్మా! ఇప్పుడు నా పరిస్థితి చూస్తున్నావు, దుర్భరమైన యీ శరీరం కూడా  నా ప్రాణానికి బరువుగా  వుంది. అందుకనే  మొయ్యటానికి  నిరాకరిస్తోంది. ఆ తరువాత....నువ్వే దానికి సర్వస్వం ,రాదమ్మా! భారతిని నీ చేతుల్లో  అప్పగించి  పోతున్నాను!"

    రాధమ్మకు  భోరుమని  ఏడవాలనిపించింది. ఎంతో ప్రయత్నం మీద దుఃఖం ఆపుకుంది. ప్రపంచానికి, భారతికి, ఆఖరికి గౌరీపతిగారికి కూడా  అర్ధంకాని రహస్యం  ఒకటుంది. గౌరీపతిగారంటే  పూజ్యభావం ఆమె మనసులో గాఢంగా  హత్తుకు పోయి వుంది. అది కేవలం పూజ్య భావమే అయితే ఫర్వాలేదు అందులో ఆరాధన కూడ అణిగి వుంది. ఒక్క ఆరాధనేనా? మమతలూ, మాధుర్యాలూ, ప్రేమలూ అన్నీ పెనవేసుకుని  వున్నాయి దానిలో. ఆమె మూగది కాకపోయినా యీ విషయం  ఒక్కనాటికీ గౌరీపతిగారికి  తెలియనిచ్చేది కాదు.

    ఎక్కడలేని  మనస్థయిర్యం  తెచ్చుకుని, 'అలాగే' అన్నట్లు తల వూపింది, గుండె నిబ్బరంతో.
    "రాధమ్మా! దేవుడు నీకు చాలా అన్యాయం చేశాడు. నేను కూడా నీకన్యాయం చేసి పోతున్నాను. ఇహ నీకు నీవే న్యాయం చేసుకోవాలి"

    'కడపటి న్యాయం  నాకు మిగిలిందా?' అనుకుంది రాధమ్మ.

    ఆమె ఆయనవంక  తేరిపార చూసింది. అసలే బలహీనంగా వుండే మనిషి మరింత బక్కచిక్కిపోయి  శల్యావాశిష్టంగా వున్నాడు. చెంపలు లోపలకు పోయి, కళ్ళు గుంటలు పడి వున్నాయి. ఆ కళ్ళు చెమర్చి వున్నట్టు  లీలగా కనిపించిందామెకు.

    ఆమెలోని  ప్రేమ  పెల్లుబుకుని  వచ్చింది. ఆ శుష్క శరీరాన్ని ఏం చూసి ప్రేమించిందో  ఆమెకు తెలియదుగాని, దాన్నంతా కలిపి ముద్దచేసి  తనలో కలుపుకోవాలనిపించింది. 'సమయం చాలదు, వ్యవధి లేదు. ఇప్పుడే పొందు ఒకసారి ఆనందం' అంటూ మనసు ఆవేశపడి వురకలు వేసింది.

    అప్రయత్నంగా ఆమె మంచంమీదకు వంగిపోతూంది. చేతులు ఆయన శరీరాన్ని నిమరాలన్న  ఉత్కంఠతతో  తహతహ లాడిపోతున్నాయి. వర్ణించనలవిగాని స్పందన పొందుతూన్నది  శరీరం. చెంపల మీద కన్నీళ్ళు  దారాలు కట్టాయి.

    గౌరీపతి జీవంలేని  కళ్ళను  పెద్దవి చేసుకుని  ఆశ్చర్యంగా ఆమెవైపు  చూస్తున్నాడు. తన ఊహకు మించిందేదో  జరుగుతూందని  ఆయనకు  పొడగట్టింది కాని  అదేమిటో  ఆయనకు అంతుపట్టలేదు.

    ఆయనమీదికి క్రమంగా  ఒరుగుతూన్న  రాధమ్మకు హఠాత్తుగా  విద్యుద్ఘాతం తగిలినట్లుగా  అయి, ఉలిక్కిపడింది కలలోంచి  మేలుకున్నట్లయింది. తెలివి వచ్చింది. 'ఛీ' అనుకుని తనలో తను సిగ్గుపడిపోతూ గభాలున వెనుదిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

    గౌరీపతిగారికి  అర్ధం కాలేదు. అర్ధమయేటంతటి  వ్యవధి కూడా లేదు.


                                                                   *    *    *


    అర్ధరాత్రివేళ భారతికి కలతనిద్ర నుంచి  మెలకువ వచ్చింది. ఆ నిద్రలో స్వాభావికం ఏమీ కనబడక పోయేసరికి  ప్రక్కనే పడుకుని వున్న  పిన్ని వైపు  చూసింది. రాధమ్మ కూడా అప్పుడే కళ్ళు విప్పుకున్నట్లు, ఆ దీపం వెలుతుర్లో  భారతివైపు  ప్రశ్నార్ధకంగా  చూస్తూంది. "పిలిచావా!" అన్నట్లు  చూసింది.

    లేదన్నట్లు  భారతి  తల ఊపింది.

    అయితే ఇద్దరూ  ఒకేసారి  నిద్ర లేచారు! ఈ ప్రశ్న ఇరువురిలోనూ  ఉదయించీ ఉదయించకముందే  ఒక దయ్యపు  అనుమానం  ఆవహించి గభాలున లేచి కూర్చున్నారు.

    గౌరీపతిగారు  పడుకుని  వున్న మంచం దగ్గరకు  పరుగెత్తే సరికి  వెంటనే అర్ధమైపోయింది. ఆయన చిట్టచివరి ఆర్తనాదమే  వాళ్ళను నిద్ర లేపింది. అయితే  అప్పటికే  ఆలస్యమైపోయింది. అది ఎవరు ఆపినా  ఆగేది కాదు.

    "నాన్నా!" అని భారతి అరిచి తండ్రిమీద వాలిపోయింది.

    రాధమ్మ  భూమిమీద వాలిపోయి  నిశ్శబ్దంగా  ఏడుస్తూంది.

    ఆ పల్లెటూళ్లో, ఆ చీకటి రాత్రిలో....తెల్లవారే వరకూ  ఆ విషయం ప్రక్కింటివాళ్ళకు కూడా తెలిపే ధ్యాసలేక, ఒంటిమీద స్పృహ లేకుండా  గడిపారు ఆడవాళ్ళిద్దరూ.


                                                                  *    *    *


    పదిహేనురోజులు గడిచిపోయాయి. గౌరీపతిగారు  పోయారని నూజివీడుకు  కబురు వెళ్ళిందిగాని, అక్కడి నుంచి ఎవరూ రాలేదు. ఒక ఉత్తరం ముక్క కూడా లేదు. భారతి వాటి గురించి ఆశించనూ లేదు.

    కర్మకాండంతా యథావిధిగా జరిగిపోయింది. మల్లిక వచ్చి మూడు రోజులపాటు  భారతి ఇంట్లోనే ఉండిపోయింది. ఆమె తల్లికి కులాసాగానే  ఉంది. చందరాల  తీసుకువచ్చేశారు. దూరపు బందువులు ఏడెనమండుగురిదాకా వచ్చారు. గౌరీపతిగారు  నలుగురికీ తలలో  నాలుకగా, సాత్వికంగా జీవించిన మనిషి. ఊళ్ళో అందరికీ ఆయనంటే  ప్రేమానురాగాలు వున్నాయి .పెద్దలు నలుగురూ  చేరి కార్యభారం వహించి వ్యవహారం నడిపించేశారు.

 Previous Page Next Page