విశ్వాన్ని ఆవరించుకున్న అంధకారాన్ని ఒక్క కాంతికిరణం పటాపంచలు చెయ్యగలిగినట్లు పవిత్రాంతఃకారణాలు కొన్నే అయినా జాతిని మేల్కొలిపి ముందుకు నడిపించగలవు"
పకపక నవ్వారు చక్రపాణిగారు.
"నీ కర్మ నీకే తెలిసివస్తుంది"
వెళ్ళిపోయిన చక్రపాణిగారిని తలుచుకుని లోలోపల చీదరించుకున్నాడు రాజారావు.
20
కేసు విచారణ జరుగుతోంది.
ఆనాడు జానకిని ఎత్తుకుపోయిన వ్యక్తి కొండయ్య బోనులో నిలబడ్డాడు. రాజారావు క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించాడు.
"కొండయ్యగారూ! జానకిని మీకు ఎన్నాళ్లుగా తెలుసు?"
"చాలా రోజులుగా తెలుసు."
"సరిగ్గా చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచీ తెలుసు"
అయిదారేళ్ళనుంచీ తెలుసు"
"మీరెత్తుకుపోవడానికి ఆరేళ్ళ ముందునుంచీ తెలుసన్న మాట!"
"నేనెత్తుకుపోలేదు. ఆవిడే నా కారులో వచ్చింది. తరచు నా కారులోనే వస్తూ ఉండేది."
"ఆరేళ్ళపాటు మీతో జానకి కారులో తిరిగేదన్న మాట!"
"ఆ తిరిగేది"
"మీరు కలిసి తిరగటం ఎవరైనా చూశారా?"
"భలేవారు. ఇలాంటి షికార్లు అందరూ చూసేలా చేస్తారా"
"మీకు మొదట పరిచయమయ్యే నాటికి జానకి వయసెంత ఉంటుంది?"
"సుమారు పదహారు పదిహేడేళ్ళు. ఆడవాళ్ళ వయసు ఎవరు చెప్పగలరండీ! నలభై దాటాకకూడా పద్దెనిమిదేళ్ళ పిల్లలాగ సింగారించుకుంటున్నారు."
"యువరానర్ చిత్తగించండి జానకిమీద ఈ కేసు వచ్చిన నాటికి జానకి పరిచయ మంటున్నారు వీరు? అంటే పదకొండేళ్ళ పసి పిల్లలతో షికార్లు సాగించే రకమనుకోవాలా? ఇవిగో జానకి బర్త్ సర్టిఫికేట్లు..."
కోర్టులో కలకలం బయలుదేరి సద్దుమణిగింది.
"ఆ రోజు. అంటే జానకి పోలీసులను పిలిచినరోజు మీరు జానకిని ఎక్కడ కలుసుకున్నారు?"
"పార్కులో"
"ఎప్పుడూ అక్కడే కలుసుకునేవారా?"
"ఆ!"
"యువరానర్! ఇదిచూడండి ఇదివరలో జానకి ఇంట్లోనే కలుసుకునే వాడిననీ, ఈ విషయంలో తల్లి ప్రోత్సాహం కూడా ఉందనీ సాక్ష్యం చెప్పారు కొండయ్యగారు!"
"కొండయ్యాగారు! జానకి మిమ్మల్ని తరచుగా డబ్బు అడిగేదా?"
"అడిగేది!"
"ఇచ్చేవారా"
"సాధ్యమయినంతవరకూ ఇచ్చేవాడిని. ఒక్కసారిగా పదివేలు గుమ్మరించమంటే ఎక్కడ తేను?"
"మిమ్మల్ని జానకి పదివేలు అడిగిందా?"
"అడిగింది, ఇవ్వలేనంటే అల్లరి పెట్టటానికి పోలీసుల్ని పిలిచింది."
"మీ తప్పులేనప్పుడు ఎందుకు పారిపోయారు? నిలబడి పోలీసులతో నిజం ఎందుకు చెప్పలేదు?"
"మొగాడు మొగాడి మాట నమ్ముతాడుటండీ. ఆడదాన్ని నమ్ముతాడు కానీ__అందుకే భయపడి పారిపోయాను"
"ఎక్కడికి పారిపోయారు?"
"మేడలోకి"
"మేడా! అదెక్కడుంది?"
కొండయ్య కంగారుపడ్డాడు.
"మేడంటే మా ఊళ్ళో మేడ! మాఊరు ఇక్కడికి పదిమైళ్ళు"
"జానకికూడా మీతోనే ఉందా?"
"ఉంది...మధ్యలో దింపేస్తే పాపం, ఆడపిల్ల ఏమయిపోతుందీ?"
"అందుకని మధ్యలో దింపకుండా పూర్తిగా గంగలో దింపారు"
"రామ! రామ! ఇంటి కెళ్ళగానే మా అమ్మను తోడిచ్చి వాళ్ళింటి దగ్గిర దింపాను."
"ఇదివరలో జానకి 'పోలీస్' అని పిలవగానే భయపడి జానకిని వెంటనే వాళ్ళింట్లో దింపినట్లు చెప్పారు ఎందుకలా చెప్పారు?"
"ఆ లాయరు అలా చెప్పమన్నాడు. ఈ లాయరు ఇలా చెప్పమన్నాడు. చావనా? ఇవన్నీ గుర్తు పెట్టుకుందుకు నాకు ఇదే పనా?"
కోర్టులో కలకలం దేరింది.
"దట్సాల్ యువర్ ఆనర్! అని కూర్చున్నాడు రాజారావు.
జడ్జీ కొండయ్యను దోషిగా నిరూపించి కిడ్ నేపింగ్ నేరం మీద శిక్ష విధించబోతుంటే" ఓ యమ్మో! నాకేం తెలియదు. ఆయన తెమ్మంటే తెచ్చాను" అన్నాడు కొండయ్య.
రాజారావు దిగ్గున లేచి నించున్నాడు.
"ఎవరాయన!"
"పేరు ఊరు నాకేం తెలియదు, మనిషిని చూపిస్తే గుర్తుపడతాను"
కోర్టులో కలకలం బయలుదేరింది. జడ్జి తీర్పు మరునాటికి వాయిదా వేసి లేచారు.
ఆలోచనలతో ఉడికిపోతున్నాడు రాజారావు.
"నిజం బయటపడుతోంది చూశావా?" అంది అనిత.
"ఉండు. ఏం జరుగుతుందో చూడు!" అంది జానకి.
కటకటాలు మూసినవి మూసినట్లుండగా కొండయ్య మరునాటికి చచ్చిపడి ఉన్నాడు.
జైలు డాక్టర్ కొండయ్యకు గుండెజబ్బు ఉందనీ గుండె ఆగి మరణించాడనీ సర్టిఫికెట్ ఇచ్చాడు.
రాజారావు తల గిర్రున తిరిగింది.
జానకి కేసులో ఒకే ఒక సాక్షి మరణించాడు. అసలు రహస్యం బయటపడే మార్గమేది?
ఆందోళన పడుతున్న రాజారావుతో "అధైర్యపడకు బావా ఈ రహస్యం నేనుబట్టబయలు చేస్తాను. జానకి బ్రతుకు నాశనం చేసిన దోషిని జానకి కాళ్ళమీద పడవేసి తీరుతాను." అంది.
రాజారావు ఆందోళనతో "వద్దు వద్దు! అనితా? ఈ విషయంలో నువ్వు కలిగించుకోకు!" అన్నాడు.
"ఏం?"