క్రమేపీ మరో సంవత్సరం గడిచింది. నాకూ పదో ఏడు ప్రవేశించింది. నాకు జీవితంలో జరిగిన అన్యాయ మేమిటో అర్ధమైంది. అప్పట్నుంచీ ఏమిటో తెలియని దిగులు నన్ను ఆవేసించింది. నా కట్టు, బొట్టు, జుట్టులో ఏ మార్పూ లేక పోయినా అంతా నన్ను చాటుగా చూపిస్తూ "అమ్మాయి వెధవ పిల్ల. మొగుడుబోయాడు పాపం" అనేవారు. ఈ పాపం అనే మాట నేను చేసినదా, మా నాన్న చేసినదా, పోయిన ముసిలాయిన చేసినదా? నన్ను దూర దూరంగా ఉంచుతున్న సంఘం చేసినదా? ఏమిటో, నా కేమీ అర్ధమవలేదు. అంతా వెధవ పిల్ల అంటే నేనూ కామాలనుకునే దాన్ని. ఈ తేడాతో వాళ్ళు నన్ను వేలెత్తి చూపిస్తున్నప్పుడు నా మనస్సుకు బాధగా ఉండేది.
తరువాత రెండు మూడేళ్ళకు నేను వ్యక్తురాలి నయ్యాను. అప్పుడు మళ్ళీ మా అత్తయ్య రాగాలు పెట్టింది. నాన్న కళ్ళు తుడ్చుకున్నారు. వాళ్ళంతా అట్లా దిగులుపడి ఉన్నా నా మనస్సులో ఏమిటో నాకు తెలియని మనో ధైర్యం ఏర్పడింది. నా జీవితం నేను గడుపుకోగలను. నా పొట్ట నే పోసుకో గలను. నా కాళ్ళమీద నేను నిలబడాలి. అందుకు చదువు అవుసరం. నా చదువుకు ప్రోత్సాహం నాన్న కూడా ఇచ్చారు.
నేను స్కూలు ఫైనలు చదువుతుండగానే మా మేనత్త పోయింది. నాన్నకు వంట చేసి పెడుతూ సమయం ఉన్నప్పుడల్లా చదువుకుంటూ, స్కూలు ఫైనలు పరీక్షకు వెళ్ళాను.
రిజల్ట్సు వచ్చినయ్యి. ప్యాసయాను. నా సంతోషానికి అవధులులేవు. కాలేజీలో చేరాలి. కాలేజీ చదువు కూడా పూర్తి చెయ్యాలి. మా ఊళ్ళో కాలేజీ లేదు.
ఈ పరిస్థితుల్లో వేసవికాలంలో వడ దెబ్బ కొట్టి నా స్కూలు ఫైనలు రిజల్స్టు వచ్చిన రెండో రోజునే మా నాన్న పోయారు. నా దుః;ఖం ఆకాశాన్నంటింది. ఇంక నాకు తోడు నీడ ఎవరున్నారు. ఎవ్వరూ లేరు. తల్లి లేదు. తండ్రి లేదు, మేనత్త లేదు, భర్త లేడు. అంతా పోయారు. ఇంక నాకు మిగిలింది వైధవ్యం. అదె నాకు శ్రీ రామ రక్ష అయింది. మా పెద్ద నాన్నగారు గోపాల శాస్త్రిగార్ని అడిగాను కాలేజీలో చేరి చదువు కుంటానని. ఈ చదివింది చాలు. ఇంక తమ ఇంట్లోనే ఉండి పొమ్మన్నారు. తమ కుమార్తె శ్రీ లక్ష్మి కి జతగా ఉండమన్నారు. నాకు ఇష్టం లేదు. నా అభిమతం ఆనర్సు చదవాలని. ఆయన ససేమిరా కాదన్నారు. నా పట్టుదల వదల్లేదు, "కడుపున పుట్టిన నా పెద్ద కొడుకునే వదులుకున్నాను, వాడు చేసుకున్న పెళ్ళి నాకు గిట్టక. అట్లాగే నువ్వూ ఎవర్నో ఒకర్ని కట్టుకుని వూరేగు. నాకేం చెప్పక్కర్లేదు" అన్నారు. అంతే ఇంక వారి సాయం ఏమీ నేను అర్ధించలేదు. మా వూరు వెళ్ళిపోయాను. మా నాన్న ఆస్థి నాకు ఎకరం దక్కింది. నా భర్త ఆస్థిగాని, డబ్బుగాని ఏభై వేలు పై చిలుకు ఉంది. పెళ్ళివారు నా పేర పెట్టిన మూడెకరాలు ఉంది.
నేను ఆ మాత్రపు ఆస్తి పరురాల్ని కనక నన్ను వల్లో వేసుకుని నన్ను చేపట్టాలని మా వూళ్ళోనే ఇద్దరు ముగ్గురు నాకు హితోక్తులు చెప్పారు.
ఎవరెన్ని చెప్పినా న్యాయం ఒక్కటే. చదువు పూర్తి కావాలి. ఒక్క మా వూరి కరణం గారే నా పరిస్థితి గమనించి తండ్రిలా ఆదుకొంటూ న్నారు. ఆయనలో నా యందు ఏ దురుద్దేశ్యమూ లేదు. మా నాన్న ఈడువాడు. నాకు తండ్రివంటి వాడు. పెద్ద దండ్రి కాదన్నా, ఆయన నా బరువు బాధ్యతలు వహిస్తా నన్నారు. ఆస్తి పాస్తులు లెక్క తేల్చారు. దస్తావేజులు, బ్యాంకు పుస్తకాలూ చూశారు. నాన్న తాలూకు ఎకరం పొలం, బ్యాంకులో ఉన్న వెయ్యి రూపాయలూ నాకు దక్కాయి. నా భర్త పేరనున్నది అయి దెకరాలు. నా పేరనున్నది మూడెకరాలు. నా భర్త తాలూకు బ్యాంకులో ఉన్నది వేలు మాత్రం. ఇదీ నేను కాలేజీలో చేరి పోయేటప్పుడు నాకు దక్కిన ఆస్థిపాస్తులు. పి. యు. సి. లో చేరినప్పట్నుంచీ ఈ కాలేజీ, హాష్టలే నాకు శరణ్యం. ఇంక కాలేజీ జీవితం నీకు తెల్సిందే కద. ఇదీ క్లుప్తంగా నా జీవిత కథ" అన్నది జయలక్ష్మి.
అంతావిని ఒక్క నిట్టూర్పు విడిచాడు మురహరి. "నీ జీవితంలో ఇన్ని ఒడు దుడుకులను అనుభవించావా జయా. ఒకందుకు మాత్రం ఈ కథంతా విన్నాక సంతోషపడుతున్నాను. నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని నీ కాళ్ళమీద నువ్వు నిలబడ గలిగినందుకు మనస్పూర్తిగా నీకు జోహారు లర్పిస్తున్నాను జయా. నీ మనస్సులో హృదయాంత రాళంలో ఇన్ని ఒడు దుడుకులను ఎదుర్కొంటున్నా, ఎప్పుడూ నవ్వుతూ కులాసాగా కబుర్లు చెపుతూ పూసిన తంగేడులాగా ఉంటావు. నువ్వు వితంతువు వంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నువ్వే చెప్పావు కనుక నేను ఆశ్చర్యపడ్డా, నమ్మక తప్పింది కాదు. ఇదే ఇంకొకళ్ళు చెప్పి ఉంటే వాడి చెంపల వాయగొట్టేవాడ్ని, హాలాహలాన్ని మింగిన అమృత మూర్తివి నువ్వు" అన్నాడు.
"పోనీలే మురహరీ. నువ్వయినా నన్ను, నా వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకున్నావు. అంతే చాలు. నన్ను అర్ధం చేసుకుని నమ్మలేనివాళ్ళు అనేక పుకార్లు పుట్టిస్తారు. ఎప్పుడూ ఒక్క ప్రశ్న నన్ను వేధిస్తూ ఉంటుంది. స్త్రీ జీవితానికి స్థిరత్వమైన గీటు రాయి వివాహం. అలాంటి స్థిరత్వమైన వివాహాన్నే పెద్దలంతాచేరి నాకూ చేశారు. ఏ విధంగానూ నన్నెరుగని ఆ వ్యక్తి చనిపోగానే ఆ స్థిరత్వ మనుకున్న వైవాహిక సోపానాలు ఏమైనట్టు? ఈ ప్రాచీన పవిత్ర సంస్కృతి యందుకి నమ్మకమున్న పెద్దల దృష్టిలో నేను మాత్రం నమ్మకంలేని దాననయినా నన్నమాట. నా ఆత్మ విశ్వాసానికి దరి దాపుగా స్థిత ప్రజ్ఞతతో నేను జీవించ గలుగుతుంటే, చూసే వాళ్ళకు నామీద ఎందుకు అపనమ్మకం కలుగుతుందో నాకు అర్ధం కాదు. ఈ రకంగా నన్ను అర్ధం చేసుకోలేని వాళ్ళు మా వూరి లోనివాళ్ళూ, మా పెద్ద నాన్నగారూ. మా ఊరి కరణం గాఉర్ మాత్రం నన్ను మా నాన్న పోయిన రోజునే అర్ధం చేసుకున్నారు. వారికి నేనెంతో ఋణపడి ఉన్నాను. నా జీవితంలో నన్ను హృదయ పూర్వకంగా అభిమానించి ప్రేమించేవాళ్ళు ఎవ్వరూ లేరు. కొంత మంది నా బాహ్య సౌందర్యం చూసి ప్రేమించవచ్చు. నేను బాల వితంతువునని తెలియక కొంతమంది ప్రేమించవచ్చు. నాటకాల్లో నటించేది, ఈ జయ లక్ష్మి విషయ మేమిటో మనమూ చూద్దాం. అని ప్రేమిస్తున్నట్లు నటించేవాళ్ళూ కొంత మంది ఉండవచ్చు. ఇవన్నీ తల్చుకుంటే గుండె బరువై పోతుంది. ఈ హృదయ దౌర్భల్యం నాలో జీవితాంతం ప్రవేశించకుండా ఉండాలనే నాకోరిక" అన్నది జయలక్ష్మి.
అర్ధం కానట్లు ఆశ్చర్యంగా చూశాడు మురహరి. "ఈ ప్రేమ అనేదీ, వివాహ మనేదీ మిధ్య అనా నీ ఉద్దేశ్యం జయా, ఈ రెండూ మిధ్య అనుకున్న ప్పుడు ఇంక జీవితానికి సాఫల్యత ఏమిటి? అలాంటప్పుడు ఈ చదువులూ, డిగ్రీలూ ఎందుకు? ఈ నాటకాల్లో పాల్గొనటం ఎందుకు? ఇవన్నీ కూడా మిధ్య అని ఎందుకు అనుకోకూడదు" అన్నాడు మురహరి.
"పురుషులు సృష్టి దోషాన్నే తెల్సుకుని ఏకరువు పెడతారుగాని, సృష్టి సారస్యాన్ని తెల్సుకోలేరు. స్త్రీ సృష్టిలోని సారస్యాన్ని తెల్సుకున్నప్పుడు స్త్రీ జీవితంలోని సత్యా సత్యాలను గురించి కూడా తెలుసుకో గలుగుతారు. ఒకవేళ అట్లా తెల్సుకున్నప్పటికీ, సత్యా సత్యాలు నిర్ణయించే భారాన్ని న్యాయ సమ్మతంగా తేల్చలేక అసత్య వాదానికే తావిచ్చి సత్యాన్ని మరుగు పరుస్తారు. కాని ఒక్క స్త్రీ మాత్రమే సత్యా సత్యాలు రెంటినీ నిర్ణయించే భారం వహించ గలుగుతుంది. నా స్థితిలోనే మగవాడు ఉంటే తన జీవితాన్ని పునః ప్రతిష్ట చేసుకుని తీర్చి దిద్దుకోవటమో, లేక, అధః పతితుడకావడమో ఏదో ఒకటి చేసేవాడు. కాని బాధ్యత ఎరిగిన ఏ స్త్రీ అట్లా చెయ్యలేదు" అన్నది జయ లక్ష్మి.
"అంటే నువ్వు పునర్వివాహం చేసుకునే ఉద్ధేశ్యంతో లేవా జయా!" అన్నాడు, ఆమె ఏం చెబుతుందోనని ఆత్రంగా ఆమె వైపు చూస్తూ.
"నా కథంతా విని ఇలాంటి ప్రశ్న వేస్తావనుకో లేదు మురహరీ. నీ మనస్తత్వం నాకు తెల్సు. తాటాకు మంట లాంటిది. చొరవ తీసుకుని ఇంత మాటన్నందుకు మన్నించు" అన్నది జయలక్ష్మి.
నిర్విన్నుడైపోయాడు మురహరి. జయలక్ష్మి మాటల్లోని భావం అతనికి అర్ధం కాలేదు. ఆమె మనస్సు వెన్నలాంటి దనుకున్నాడు. ఆమె గత చరిత్రంతా విన్నాక పైకి సహృదయురాలుగా, వయస్సుకు తగ్గ అనుభూతులతో దగ్గరగా ఉన్నట్లుగా కనిపించినా, ఆ సహృదయత వెనక, ఆ అనుభూతుల వెనక సత్యాన్వేషణకోసం, చరితార్దురాలైన జీవితం గడపటంకోసం, ఆమె సాగించే అన్వేషణను అతడు తెల్సుకోలేకపోయాడు. పెళ్ళి చేసుకోటమంటే పెద్దల సమక్షంలో ఒక యువతికి తాళి కట్టి, తన దాన్నిగా చేసుకుని, ఆమెను అక్కున చేర్చుకుని జీవించటమేనని అతని భావన. ఆమెకు వివాహమైంది. సంసార సుఖాలను అనుభవించుటకయినా సాంఘిక కట్టుబాట్లకు లొంగి వైధవ్యం గడిపింది. ఆ వైధవ్యమనేది మానసికమైనది. సుఖలాలసత్యాన్ని సుదూరంగా నెట్టివేసి ఆ వైధవ్యపు రూపును మరుగు పర్చటానికి ఆమె అలంకరించుకుని తన బాహ్య సౌందర్యాన్ని తోటి సమవయస్కుల మాదిరి పైకి ప్రదర్శించ గలుగుతున్నది. ఇది లోకాన్ని మోసగించటానికి కాదు. లోకం తనను వెలి వేసినట్లుగా చూడకుండా ఉంటం కోసమే. తన సంతృప్తి కోసం సాటివారిలో తలెత్తుకు తిరగటంకోసం. ఎవ్వరూ తన మనస్సును గాయ పర్చకుండా ఉంటంకోసం.
కాని మురహరి మాటలవల్ల, అతడు తన వివాహేచ్చను బయట పెట్టటంవల్ల తీగె లాగితే డొంక కదిలినట్లయింది.
"ఇంక వెళదామా" అంటూ బయల్దేరింది జయలక్ష్మి. వాళ్ళిద్దరూ పార్కులో చివరగా కూర్చున్నారు. పార్కునుంచి బయటకు వారిద్దరూ వస్తుంటే దారిలోనే ప్రతాప్, నిర్మల కనిపించారు. తీక్షణ దృక్కులతో జయలక్ష్మి వైపు చూస్తూ,
"మేం వస్తున్నామని చూసి మీరు వెళ్ళిపోతున్నారా" అన్నాడు ప్రతాప్.
"దొంగచాటుగా తిరగవలసినే అవువసరం లేదు ప్రతాప్! ఆ అవుసరం మీకు ఉండొచ్చు నేమో. ఏం నిర్మలా అంతేనా" అన్నది జయలక్ష్మి.
నిర్మల చిన్న బుచ్చుకుంది. ప్రతాప్ ఆకారం దెబ్బ తిన్నది. మాట్లాడకుండా దూసుకు పోయాడు ప్రతాప్. అత న్ననుసరించింది నిర్మల.
17
ఆ రాత్రి తెల్లవార్లూ మురహరికి నిద్రపట్ట లేదు. కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా బొట్టు లేని, తైల సంస్కారంలేని జయలక్ష్మి అతనికి కనిపిస్తున్నది. అమాయికమైన, ఏ భావమూ లేని ఆమె చూపుల్నుంచి తప్పించుకోలేక పోతున్నాడు. ఎదురుగా జయలక్ష్మి లేకపోయినా, అతని మానసిక పరిధిలో ఆమె తిరుగుతూనే ఉన్నది. ఆమె మనస్సును అర్ధం చేసుకోటానికి తనలో తను అనేక ప్రశ్నలు వేసుకున్నాడు. ఎక్కడా దారీ, తెన్నూ దొరకలేదు. ఆమె మనస్సు అర్ధంకాక పోయిన, తన మనస్సు కూడా తనకు ఈ పరిస్థితుల్లో అర్ధమవటంలేదు. ఒక వితంతువును వివాహం చేసుకోగల ధైర్య స్థైర్యాలు కలవాడా తను!
తల్లి దండ్రులు లేకపోయినా, తన సంరక్షణ భారం పూర్తిగా వహించకపోయినా. నా అని చెప్పుకోగలిగిన వ్యక్తి తన మేనమామ ఉన్నాడు కదా? ఆయన వప్పుకుంటాడా? ఎట్లా వప్పు కుంటాడు? జ్యోతి సంగతేమిటి? మేనమామ కూతుర్ని కాదని ఒక విధవరాలుని చేసుకున్నాడు- మురహరి అని అంతా అవహేళన చెయ్యరూ?
అవహేళన చేసినా అందర్నీ ఎదిరించి ధైర్యంగా నిలబడగలిగిన స్తోమత కూడా తనలో లేదే? జయ లక్ష్మి వితంతువని ఇక్కడ విశాఖపట్నంలో తనొక్కడికే తెల్సు. ఈ విషయం పైకి పొక్కితే ఇంక జయలక్ష్మి నలుగురిలోనూ తలెత్తుకు తిరగ్గలదా? సంఘానికి ఆమె చేసిన ద్రోహం ఏమీ లేకపోయినా తమను ఆమె మోసగించిందనే అసందర్భపు ప్రచారంతో ఆమె మనస్సును విరిగేటట్లుగా చెయ్యరూ? ఈ పరిస్థితే కనక బయట పడితే నువ్వే నాకు ద్రోహం చేశావని జయలక్ష్మి అనదూ? అప్పుడు తా నామెముఖము చూడగలడా? ఆమెతో చనువుగా మాట్లాడగలడా? ఆమె స్నేహాన్ని పటిష్టం చేసుకోగలడా?
ఈ తర్క వితర్కాలతో తెల్లవారు జాము నాలుగయింది. ఏ విషయంలోనూ ఒక నిర్ణయానికి రావటానికి అతనికిశక్తి లేకపోయింది. ఈ అసంబద్ధ ప్రశ్నోత్తర పరంపరలతో అతని మెదడు వేడెక్కి తెల్లవారేసరికి కక్కులూ, వాంతులతో జ్వరం తగిలింది.
మెల్లిగా ముఖం కడుక్కుని హోటలుకు వెళ్ళి కాఫీ తాగి రెండు రోజులు శలవు కాయితం రాసి, దార్లో కన బడిన స్నేహితుడి కిచ్చి, చలితో వణుకుతూ వచ్చి గదిలో పడుకున్నాడు.
ఏదో ధ్యాసలో, పని పాటలతో, చదువు సంధ్య లతో నిమగ్న మయ్యేటట్లుగా చేస్తేనే మనస్సు, మేధస్సూ మన కట్టడిలో ఉంటుందిగాని, ఏమీ లేకుండా మంచంమీద పడుకుని ఆలోచిస్తుంటే గగన వీధుల్లో కొన్ని లక్షల మైళ్ళ స్పీడులో మనస్సు విహరిస్తుంది. అందులోనూ తీవ్ర అఘాత ప్రతిఘాతాలతో, సతమతమై పోతున్న మనస్సు, ఏ ఆలోచననూ స్థిరపడేటట్లుగా చెయ్య లేక ఉడికి పోతుంది.
ఆ రోజంతా అట్లాగే పడుకున్నాడు మురహరి. జ్వర తీవ్రత ఎక్కువైందేగాని తగ్గలేదు. వళ్ళు పొగలూ, సెగలూ తేలుతున్నది. ఆ గదంతా కూడా వేడెక్కినట్లయింది. ఆగదంతా తపనతో, ఆవేదనతో, ఆరాటంతో ఏమీ తోచక కాళ్ళు మంచానికేసి బాదుకుంటూ, తీవ్రమైన తలనొప్పితో బాధ పడుతున్నాడు మురహరి.
సాయంత్రమైంది. దారకంలేదు. స్త్రాణ లేదు. లేచి లైటు స్విచ్చి వేసే వోపిక కూడా పోయింది. వారం రోజుల్లో పరీక్షలు. జీవితానికి ప్రతిరోజూ పరీక్షగానే ఉంది.
రాత్రి తెల్ల వార్లూ నిద్రలేదు. మందుతెచ్చి పెట్టేవాళ్ళు కూడా లేరు.
మర్నాడు ఉదయం ఎనిమిదయింది. రాత్రి తెల్లవార్లూ తలుపు దగ్గరగానే వేసి ఉన్నది. గడియ పెట్టలేదు.
* * *