మరి కాసేపు అందరూ సీత చుట్టూ నటరాజ్ చుట్టూ మూగి ఏవేవో ప్రశ్నలు వేస్తూ, శ్రీనాద్ గురించి వివరాలడుగుతూ గడిపి వెళ్ళిపోయారు.
ఆ రాత్రి నిద్ర కుపక్రమిస్తుండగా ఇంటిమీద హటాత్తుగా రాళ్ళు పడటం వినిపించి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు రామచంద్రమూర్తి.
బయట నుంచి తాగిన వాళ్ళ అరుపులు వినబడుతున్నాయి.
"అరె! నీకు ఎలక్షన్స్ కావాలిబే! నీయవ్వ..........తంతే పైసా లేదు, ఎలక్షన్ ల టకరాయిస్తావేరా? సమజయి నాదిరే?" అతని మాట పూర్తి కాకుండానే మరో రెండు రాళ్ళు వచ్చి ఇంటిమీద పడినాయ్.
రామచంద్రమూర్తి బయటకు నడుస్తుంటే సీత చటుక్కున అతని చేయి పట్టుకుంది.
"వద్దు.......ఇంత రాత్రిలో వెళ్ళకండి."
రామచంద్రమూర్తికి ఎన్నో సంవత్సరాల కిందట తమ కూతురు సరిత విషయంలో తను పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ యిచ్చి వచ్చిన రోజు రాత్రి జరిగిన సంఘటన హటాత్తుగా గుర్తుకొచ్చింది.
అప్పుడూ యిలాగే.
ఇంటిమీద రాళ్లు పడినాయి.
తాగి తలుపులు బాదుతూ తిట్టారు.
అప్పుడూ సీత తనను తలుపు తీయవద్దంది.
సరిత భయపడుతూ తన చేయి పట్టుకుంది. "వద్దు డాడీ! మీరు బయటి కెళ్ళకండి!" కలవరపాటుతో, కానీ తను అప్పుడు ఉడుకు రక్తం తో వున్నాడు. శరీరధారుడ్యంతో వున్నాడు. ఆవేశం పట్టలేక తలుపు తెరిచాడు.
ఎదురుగ్గా నిలబడి వున్నారు నలుగురు.
అందరూ సర్దార్ పటేల్ రోడ్ లో వుండే గుండాలే!
వాళ్ళందరినీ తను గుర్తు పట్టాడు.
అంతకు ముందోసారి వినాయక చవితి పండగకు ప్రతి యింటికి వందరూపాయలివ్వాలని బెదిరించినప్పుడు తను యివ్వను పొమ్మన్నాడు. తనను ఏమీ చెయ్యలేక వారం పదిరోజులు యింటిమీద రాళ్ళు వేశారు.
"ఏం కావాలి?" అడిగాడు తను వీళ్ళ వంక చూస్తూ.
"మా పోరడికి సైకిల్ టకయించినావ్ బే నువ్వు......."ఒకడు ముందుకొచ్చి తన చొక్కా పట్టుకుని రోడ్ మీదికి లాగాడు.
"నేనెవరికీ సైకిల్ టకయించలేదు ........." అతని చేయి విదిలించి కొడుతూ అన్నాడు.
టకయించినావ్ బే! ఇగో ..ఈడు చూసిండు! ఎరా పాండు?
"అప్పన్నా! నేనాడ పాన్ డబ్బా పక్కకి నిలబడి వుంటినా! ఈడు సైకిల్ మీద రస్తుమ్ లెక్క స్పీడ్ గా వచ్చి మీ తమ్ముడు నడిచి వస్తుంటే టకయించిండు. మీ తమ్ముడి తలకు దెబ్బ తగిలి కిందపడినా గానీ అగలే! అట్లనే ఉరికిపోయుండు."
"అంతా అబద్దమ౧ దమ్ముంటే మిమ్మల్నేవడు పంపించాడో చెప్పండి!"
మాట పూర్తి కాకుండానే వెనుకనుంచి ఒకడు మేడమీద కర్రతో కొట్టాడు. తను పిడికిలితో ఎదురుగ్గా వున్నవాడు మొఖం మీదకు పంచ్ విసిరాడు. వాడు వెళ్ళి నాలుగడుగుల దూరంలో పడ్డాడు. కానీ మీగతా ముగ్గురూ తనను ఎటాక్ చేశారు. ఒకడు తన రెండు కాళ్ళు కదలకుండా పట్టుకున్నాడు. మిగతా ఇద్దరూ కర్రలతో తనను అన్నివేపుల నుంచి కొట్టడం మొదలు పెట్టారు.
సీత , సరిత బయిటికొచ్చి చుట్టూ పక్కలవారి సహాయం కోసం కేకలు వేస్తున్నారు. కానీ ఎవరూ తలుపు తీయటం లేదు. అందరూ కిటికీ నుంచి చూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత మస్తాన్రావ్, ఉమాదేవి బయటి కొచ్చారు. మస్తాన్రావ్ కలుగజేసుకోడానికి భయపడ్డాడు.
ఉమాదేవి మాత్రం వాళ్ళను తిట్టడం ప్రారంభించింది.
"మీకు సిగ్గు లేదా? ఇంతమంది కలిసి ఒక్కడిమీద పడ్డారు. దమ్ముంటే ఒకడోకడూ రావాలి."
"నేనిప్పుడే పోలీసులని పిలుచుకొస్తాను.'
ఆమె కేకలకు మిగతా ఇళ్ళల్లో వాళ్ళకు ధైర్యం వచ్చింది,
మరి కొంతమంది బయటికొచ్చారు.
అప్పుడు వెళ్ళిపోయారు గుండాలు.
తన వళ్ళంతా కర్ర దెబ్బలతో వాచిపోయింది.
అప్పటికప్పుడే హాస్పిటల్ కెళ్ళి జాయిన్ అయ్యాడు. మళ్ళీ పోలీస్ ఇన్స్ పెక్టర్ వచ్చాడు ఉదయం.
"ఏం జరిగింది ?" అడిగాడతను.
"రాత్రి ఆ మార్తాండ్ గుండాలను మా ఇంటి మీదకు పంపి కొట్టించాడు."
ఇన్స్పెక్టర్ ముఖంలో చిరాకు కనిపించింది.
"అలా అర్ధం లేని స్టేట్ మెంట్ ఇవ్వకు! ఆ గుండాలను మార్తాండ్ పంపించాడని మీకెలా తెలుసు?"
కోపంగా అడిగాడు తనకూ కోపం ఆగలేదు.