"యువర్ అనర్! రేపు నా క్లయింట్ కి బిడ్డ పుడితే ఆ బిడ్డ భవిష్యత్తు ఏమిటి? అక్రమ సంతానంగా ఆ బిడ్డకి సంఘంలో స్థానం వుంటుందా? తండ్రి లేకుండా పుట్టిన బిడ్డని సమాజం ఎందుకాదరించదు? తల్లి, తండ్రి బతికి ఆ బిడ్డ దిక్కు మొక్కులేని అనాధగా ఎందుకు బతకాలి? అందుకే నా క్లయింట్ రూప తను చేసిన తప్పుకి బిడ్డని శిక్షించదలచలేదు. తన బిడ్డకి తండ్రి ఫలానా అని లోకానికి తెలియచేప్పడానికే ఆమె కోర్టు కెక్కింది.
"యువర్ అనర్! నా క్లయింట్ ఈ తరం ప్రతినిధి, యుగాలనాటి స్రీల మాదిరి పిరికిది కాదు. తను చేసిన పని నలుగురిలో తెలిస్తే సిగ్గుతో ఆత్మహత్య చేసుకోడమో, చేసిన పాపాన్ని చాటుగా కడుక్కుని చేతులు దులుపుకుపోవాలనే పిరికిది కాదు. ధైర్యంగా అన్యాయాన్ని ఎదుర్కోవడానికి నిలబడింది. తను చేసిన సురేష్ కూడా శిక్షార్హుడేనని న్యాయస్థానంలో న్యాయం కోరుతుంది. యువర్ అనర్! ఎట్టి పరిస్థితుల్లోను నా క్లయింట్ బిడ్డని దూరం చేసుకోడానికి ఇష్టపడడం లేదు. సంఘాన్ని ఎదిరించి ఎలా కన్నా ఏ తల్లి నించి బిడ్డని వేరు చేసే హక్కు ఎవరికి లేదని ఆ బిడ్డని పెంచుకుని నిరూపించదల్చింది. విత్తనం ఎవరు నాటినా ఏ భూమిలో పండితే ఆ భూమి ఎవరిదైతే ఆ పంట ఫలం వారనుభవించడం ఆచారం. అలాగే విత్తనం ఎవరిదైనా స్రీ గర్భంలో బిడ్డ పెరిగి, ఆ స్రీ ద్వారా ఆ బిడ్డ యీ లోకంలోకి వచ్చినప్పుడు, ఆ బిడ్డ ఆ స్రీకే చెందాలి కాని ఆ బిడ్డ మీద హక్కు పురుషునికి చెందడంలో ఎంత న్యాయం వుంది. తోటమాలి విత్తునాటి నంత మాత్రాన ఆ పంట అతనిది కాదు. ఆతోట ఎవరిదైతే ఆ పంట వారికే చెందడం రివాజు, ఆ సూత్రం బిడ్డల విషయంలో ఎందుకు అమలు జరగడంలేదు?
"యువర్ అనర్! మన సమాజం, మన దేశమే కాదు ఏ దేశంలోనైనా బిడ్డ మిద హక్కు పురుషునికిచ్చింది చట్టం, న్యాయం ఆలోచిస్తే యిది చాలా అన్యాయం. నవమాసాలు మోసి, నరకయాతన పడి కాని, అష్టకష్టాలు ఓర్చి పెంచిన తల్లికి హక్కు ఈయకుండా తండ్రికి బిడ్డ మీద హక్కు ఈయడంలో ఉద్దేశం. ఆ విధంగా స్రీలని తమ గుప్పిటలో వుంచుకుని ఆమె బలహినతని తమ చేతికి వుంచుకుని ఆమెని తమ చెప్పుచేతల్లో వుంచుకోడానికి పురుష ప్రపంచం ఏర్పడిన ఈ చట్టం ఎంతవరకు సమంజసం? ఆలోచించి సవరించాల్సిన అవసరం మన రాజ్యాంగానికి లేదా? "స్రీలో ఈ బలహినతని ఆధారం చేసుకుని యుగయుగాలుగా పురుషుడు స్రీని బానిసగా చేసుకుని తన ఆధిక్యత నిరూపించుకుంటున్నాడు.
భర్తతో ఎంత నరకం అనుభవిస్తున్నా బిడ్డల కోసం ఆ నరకం సహిస్తూ, ఎందరు స్రీలు కాపురం చేయడం మనం చూడడంలేదు? అటు భర్త నిరాదరణని, దుర్మార్గాన్ని సహించలేక యిటు బిడ్డలని వదలలేక తరుణోపాయం లేక వారి ఓర్మి ఆఖరి మెట్టుకు వచ్చాక, ఎందరు స్రీలు ఆత్మహత్యలు చేసుకోడం లేదు. పిల్లల కోసమే సగంమంది స్రీలు భర్తల దౌర్జన్యాన్ని సహిస్తున్నారు. పిల్లలని వదలలేక, పిల్లలని ఈయరన్న భయంతోనే స్రీ పురుషుని ఆధిక్యానికి తల ఒగ్గి బతుకుతోంది! పురుషుని కంటే ఏ విషయంలోనూ తీసిపోని స్రీకి మాతృత్వం ఒక వరం కాదు. శాపమై పురుషునికి లొంగి వుండాల్సి వస్తుంది. బిడ్డని కానీ పెంచిన తల్లికే బిడ్డపై హక్కు యిస్తే పురుషుని అట ఎప్పుడో కట్టేది.
"భర్త క్రూరుడు, దుర్మార్గుడు అయి హింసిస్తే అతనికి తల ఒగ్గి బతకనవసరం లేకుండా బిడ్డలని తీసుకెళ్ళి ఏ కూలి నాలి అయినా చేసి ఆమె బిడ్డలని పోషించుకోగలదు. తను హింసిస్తే స్రీ ఇక సహించదని పురుషుల కర్ధమైతే అపుడు స్రీని, భార్యని, తమ కష్టసుఖాలలో పాలు పంచుకునే అర్దాంగిని గౌరవంగా చూడగలుగుతారు. తను హింసిస్తే భార్య బిడ్డలతో యిల్లు వదులుతుంద న్న భయం వున్నవాడు తన ఆధిక్యత అడుగడుగునా చూపకుండా సమానస్థాయి ఇస్తాడు స్రీకి" యువర్ అనర్! ఈ సమాజంలో బిడ్డపై తల్లికి హక్కు యిచ్చినరోజు ప్రతి స్రీ యిల్లు వదిలితే కుటుంబవ్యవస్థ దెబ్బ తింటుందని కొందరనవచ్చు.
కానీ ఏ స్రీ కూడా కావాలని భర్తకి, సంసారానికి దురమవడానికి కోరుకోదు. ఆ ఇల్లు ఎంతో నరకమైతే తప్ప ఆ యిల్లు నడిరోడ్డున పడదు. ఆ భర్త ఎంతో క్రురుడయితే తప్ప ఆ సెక్యురిటి వదులుకోదు. అంచేత యువర్ అనర్! స్రీకి బిడ్డమీద హక్కు ఇచ్చి తండ్రి ప్రసక్తి లేకుండా బిడ్డ తల్లికి చెందినపుడు యిన్ని భ్రుణహత్యలు , ఇంతమంది అనాధలు, యింతమంది స్రీల ఆత్మహత్యలు, ఇంతమంది పతితులు మన సమాజంలో వుండరు...."
మరోసారి చప్పట్లు మోగాయి కోర్టులో. ఆవేశంగా ఏకధాటిగా పదిహేను నిమిషాలు వాదించిన సుమతి వూపిరి తీసుకుంది. జడ్జిగారు కూడా ఆమె వాదాన్ని మెచ్చుకున్నట్టు చూశారు.
యువర్ అనర్! ఇప్పుడు మన కేసుతో డైరెక్టుగా సంబంధం లేకపోయినా ఒక పురుషుని చేత మోసగించబడి, యీ సమాజం కట్టుబాట్లకి లోబడి అసహాయురాలై ఒక తల్లి తన బిడ్డని శరణాలయంపాలు చేసిన అమ్మాయిని కోర్టులో ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను." అంది అభ్యర్ధిస్తూ.
జడ్జిగారు సాలోచనగా చూసి "ఎగ్జాక్టిలీ, వాట్ డూ యూ వాంట్ టూ టెల్?" అనడిగారు.
"చెప్తాను యువర్ అనర్! తల్లి తండ్రి ఎవరి బతుకులు వారు హాయిగా బతుకుతుండగా వారి పాపఫలం అయిన అమ్మాయి అనాధగా ఎంత నికృష్ట జీవితం గడిపిందో మీ అందరూ ఒక్కసారి వింటే, మానవత్వం వున్న మనుషులు కరిగిపోతారు. సరోజా ఇలా రావమ్మా...." కోర్టులో బెంచిలో కూర్చున్న సరోజినీ బోనులో నిలబెట్టింది.
అందరూ సుమతి ఏం చెప్పదలచిందా అని ఆరాటంగా చూశారు. సరోజినీ బోనెక్కించగానే రామనాధంగార్కి ఏదో అర్ధమయినట్లు అయన మొహం నల్లబడింది. "ఐ అబ్జక్ట్ యువర్ అనర్. కేసుకు సంబంధించిన విషయాలతో కేసుని పక్క దారులకి పట్టించాలని చూస్తున్నందుకు అబ్జక్షన్ చెప్తున్నాను" అన్నారు రామనాధం ఆవేశంగా లేచి. జడ్జిగారు ప్రశ్నార్దకంగా సుమతి వంక చూశారు.
"యువర్ అనర్! కేసుతో సంబంధించని మాట నిజమే, కాని మానవతతో సంభంధం వుంది సార్. ఒక స్రీ ఒక పురుషుడు చేసిన తప్పుకి కారణంగా ఆ తండ్రి మోసానికి, ఆ తల్లి పిరికితనానికి సాక్ష్యంగా అన్నెం పున్నెం ఎరుగని ఆ పసిబిడ్డ పదిహేనేళ్ళపాటు అనాధగా అనాధశ్రమంలో అడుగడుగునా ఈసడింపుల మధ్య, తిరస్కారాల, చివాట్ల , చెప్పుదెబ్బలు, హేళనల మధ్య ఆకలితో ఎలా అలమటించిందో, బతుకు పట్ల ఆ పసిబిడ్డకి ఏర్పడిన విరక్తి, భయంతో అనుక్షణం ప్రతిదానికి బెదిరిపోతూ జివచ్చవంలా బతకడం కోసం ఈ అమ్మాయిని బోనెక్కించాను యువర్ అనర్."
"యువర్ అనర్! మూడేళ్ళ క్రితం అనాధశరణాలయం నించి ఈ పాపని తీసుకొచ్చినరోజు- కంచంలో కూర, చారు, పచ్చడితో వున్న మాములు భోజనం ముందు కుర్చోపెట్టగానే ఈ అమ్మాయి కళ్ళలో మెరిసిన మెరుపు, అనందం, ఆశగా, ఆరాటంగా, అంతా ఒక్కసారిగా తినేయలన్నంత ఆరాటం యువర్ అనర్ ఆ క్షణంలో ఆ పిల్ల మొహం చుసిన ఎవరికన్నా అన్నాళ్ళు ఆమె గడిపిన అనాధ జీవితం ఎంత నికృష్టమైనదో ఎవరూ చెప్పనక్కరలేకుండానే గుర్తించేవారు. అడుగు వేసి తీయడానికి భయం, ఎక్కడ కూర్చుంటే ఏం తప్పో అనే బెదురు చూపులు, ఆఖరికి మంచినీళ్ళు ముంచుకు తాగడానికి కూడా భేడురుతూ ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఆ పదిహేనేళ్ళ బాలిక ఏ నేరానికి ఈ శిక్ష అనుభవించాలి!!
మంచి బట్టలు కొనిచ్చిన మొదటిరోజు అవి చూసిన ఆమె కళ్ళలో అనందం, కృతజ్ఞత, మెత్తటి పక్కమీద పడుకుని ఆ అనుభూతిని ఆనందించే ఆమె పారవశ్యం, యింతటి సుఖం ఈ తృప్తి అనందం అంతా నిజమేనా అన్న అపనమ్మకం, ఈ సుఖం శాశ్వతం కాదేమో అన్న దిగులు, జరిగింది కలా నిజమా అన్న అనుమానం, ఈ కల చెదిరి, ఈ సుఖానికి దూరమై మళ్ళి ఆ నరకంలో పడిపోతానేమోనన్న యీ భావాలన్నీ కదలాడుతుంటే చుసిన మానవత్వం వున్న మనుషులేవారు చలించకుండా వుండలేరు.
ఆ నరకం నించి తప్పించి తీసుకొచ్చిన నన్ను కౌగలించుకుని హృదయ విదారకంగా.....ఏడ్చిన ఏడ్పు ఏ కసాయి గుండెనన్నా కరిగిస్తుంది. అక్రమ సంతానంగా జన్మించి అనాధ శరణాలయంపాలైనా వందలు వేలు అనాధలలో యీ పాప ఒక్కర్తి-! ఈనాడు నా క్లయింట్ కి వున్న ధైర్యసాహసాలు ఈమె తల్లికి ఆనాడు వుండివుంటే యీ బిడ్డ అనాధగా నరకంలో మగ్గేది కాదు. ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా బిడ్డని పెంచుకుంటాను అనే నా క్లయింట్ ఆత్మవిశ్వాసం ఆనాడు ఆ తల్లికి వుంటే యీ పాప అనాధగా పెరగవల్సిన అవసరం వుండేది కాదు. ఈనాడు నా క్లయింట్ కి అండగా నేను నిల్చినట్లు ఆ తల్లికి సాటి స్రీ ఒకరన్నా అండగా నిల్చువుంటే యీనాడు ఆ తల్లి బిడ్డని అనాధగా వదిలినందుకు కుమిలిపోయే అవసరం వుండేది కాదు.