Previous Page Next Page 
లీడర్ పేజి 24

    చివరికి ఓరోజు రంగా గూడూరువరకూ అజ్ఞాతంగా వారివెంట వెళ్ళి, అక్కడినుండి కాకినాడ టిక్కెట్లు కొని, బస్సెక్కించి పంపేసాడు.    
    1947 వ సంవత్సరంలో, రమణమ్మకి విపరీతమైన కడుపునొప్పి రాసాగింది. స్థానికంగా సరైన వైద్య సదుపాయంలేక, మద్రాసు తీసుకెళ్ళి చూపించాలనుకుంటున్నారు శ్రీహరిరావు శ్రీదేవినీ సావిత్రినీ, అత్తగారినీ వదిలి, ఆఖరిపిల్ల సత్యవతిని వెంటబెట్టుకుని, భార్యని ఆస్పత్రిలో చూపించడానికి తీసుకెళ్ళారు.    
    మద్రాసులోని ఎగ్ మోర్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడి డాక్టర్ కంపన్, మలయాళీ అతను ఆపరేషన్ చెయ్యాలని చెప్పాడు. "సరే" అని ఎడ్మిట్ చేసి, పిల్లతో సహా గవర్నమెంట్ హోస్ కి చేరుకున్నారాయన.    
    అప్పటికే అక్కడ ప్రకాశం పంతులుగారు విడిదిచేసి వున్నారు. మిత్రులిద్దరూ కలుసుకుని పరమానందభరితులయ్యారు. పాపాయి (అంటే ఆఖరిపిల్ల) ప్రకాశం పంతులుగారు చెప్పే కథలూ, కబుర్లూ వింటూ ఎక్కువగా ఆయన దగ్గరే వుండేది.    
    ఇంతలో, కర్నూల్లో హరిజనుల గుడిసెలు ఖాళీ చేయిస్తున్నారనీ, ఆపడానికి వెంటనే రావసిందిగా ఒక మిత్రుడి దగ్గరనుండి శ్రీహరిరావుకి ఉత్తరమొచ్చింది. అధి అందగానే, పిల్లని ప్రకాశం పంతులుగారికి అప్పజెప్పి హుటాహుటీ బయల్దేరి కర్నూలు వెళ్ళిపోయారు.
     భార్య సంగతి తాత్కాలికంగా మరిచిపోయారు. రమణమ్మగారికి మూడు రోజులపాటు వరుసగా భర్త రాకపోతే అనుమానం వచ్చింది. కానీ ఎవర్ని ఏమి అడగాలో అర్ధంకాలేదు. వాళ్ళకెవరికీ తెలుగురాదు. వేళకి అన్నం పెట్టేవారు, టీ యిచ్చేవారు, అలా నెలా పదిహేను రోజులుంది.    
    ఓనాడు డాక్టర్ గారొచ్చి 'ఆపరేషన్ టుమారో' అని రాసి వెళ్ళిపోయారు. దాంతో ఆమె కష్టాలు ప్రారంభమయ్యాయి.    
    మర్నాడు ఆపరేషన్ ధియేటర్లోకి తీసుకెళ్ళి చీర విప్పేసి, లంగా జాకెట్టుమీదుంచారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆమె కళ్ళువిప్పి, స్పృహలో కొచ్చి చూసేసరికి వేరే గదిలో మేడమీద వున్నట్లు తెలిసింది. ఒంటిమీద లంగా, జాకెట్టూ, చిన్న తువ్వాలూ వుంది. ఆమె బలహీనమైన స్వరంతో సిస్టర్ని పిలిచి, "నా పెట్టె ఎక్కడ పెట్టారూ? నా వాళ్ళు ఎవరూరాలేదా?" అని ప్రశ్నించింది.    
    ఆమెకి అర్దమయిందో లేదో కానీ, పెదవి విరిచి వెళ్ళిపోయింది.    
    ఆపరేషన్ అయిన వాళ్ళకి ఆస్పత్రి భోజనం నిలిపివేస్తారు. అందువల్ల ఆమె ఆహారం లేకుండా మూడురోజులు గడిపింది. మూడోనాడు సాయంత్రం ఒక నర్సు అనుమానమొచ్చి, "నీకెవరూ లేరా? ఏమైనా తిన్నావా?" అని అరవం, తెలుగూ కలిపి అడిగింది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేక రమణమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది.    
    ఆ రోజు ఆ నర్సు ఇడ్లీ తెప్పించి పెట్టింది.    
    మర్నాడు సాయంత్రం, దాహంతో నాలుక పిడచకట్టుకునిపోయి, నెమ్మదిగా లేచి, మంచినీళ్ళ కోసం మూలగా నున్న నల్లాలకీ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది, నీళ్ళు తాగుతుండగా, కిటికీలోంచి, క్రింద ఆస్పత్రిలో గుంజి సుబ్రహ్మణ్యం, తమతో లక్నో వచ్చిన స్నేహితుడు వెళుతూ కనిపించాడు. ఆమె వెంటనే "సుబ్రహ్మణ్యం , సుబ్రహ్మణ్యం" అంటూ చప్పట్లు చరిచి పిలిచింది. అతనికి వినిపించలేదు. కానీ క్రిందనున్నవారు చౌకీదారు ఈ సంగతి గమనించి, అతని వెనుకే పరుగెత్తి పట్టుకుని, "పైనించి ఒక స్త్రీ పిలుస్తోందని" చెప్పాడు.    
    "ఇక్కడ నన్నెవరు పిలుస్తారబ్బా!" అనుకుంటూ ఆయన పైకి వచ్చాడు. రమణమ్మని ఆ స్థితిలో చూసి అవాక్కయ్యాడు.    
    సుబ్రహ్మణ్యాన్ని చూడగానే, ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది. ఏడ్చి తన బాధ వెళ్ళగక్కుకోవడానికి ఒక ఆప్తుడు దొరికాడన్న ఆనందం, బాధా ముప్పిరిగొనగా వెక్కి వెక్కి ఏడ్చేసింది.    
    ఆమె ద్వారా సంగతంతా తెలుసుకున్న అతను "ఈ పంతులెప్పుడూ ఇంతే! దేశానికే తప్ప ఇంటికి పనికిరాడు! ఇంతకీ ఏమన్నా తిన్నారా లేదా?" అని అడిగాడు.    
    "లేదు! ఆపరేషనయ్యాకా అన్నం తినమన్నారు. వచ్చే ఆధారం లేదు. నన్నిలా వదిలిపెట్టి ఏ జైల్లో కూర్చున్నారో! పిల్లని గవర్నమెంటు హౌసులో ఎవరి దగ్గరుంచారో, తలుచుకుంటే గుండెలవిసిపోతున్నాయి" అంటూ మళ్ళీ ఏడ్చింది.    
    అతను అన్నీ తను చూసుకుంటాననీ, నిశ్చింతగా వుండమనీ ఓదార్చి, ముందు కిందకెళ్ళి క్యారేజ్ మీద అరిటాకు చుట్టిపెట్టుకొని తీసుకొచ్చి, ఆమెకి బలవంతంగా భోజనం పెట్టాడు.    
    మర్నాడు ప్రొద్దుటే పాపాయిని తీసుకొని ఆప్సత్రికొచ్చాడు. ఆమె పిల్లని చూసి ఊరడిల్లింది.    
    సుబ్రహ్మణ్యం అరవంలో మాట్లాడి ఆమె పెట్టె ఎక్కడుందో తెలుసుకొని తీసుకొచ్చాడు. అప్పుడామె లేచి చీర కట్టుకుంది.    
    ఆమె సుబ్రహ్మణ్యం ఇంటికెళ్ళిన మూడోనాడు, శ్రీహరిరావు కర్నూలునుండి వచ్చి-    
    "ఆపరేషనయిందా?" అని భార్యని ప్రశ్నించారు.    
    ఆమె నిర్లిప్తంగా చూసింది. సుబ్రహ్మణ్యం కోపమాపుకోలేక పోయాడు. "ఏం మనిషివి పంతులూ! ఎటుపోతే అటేనా? ఆమె గతి ఏమౌతుందోనని ఆలోచించనక్కరలేదా? కనీసం పిల్లమీదైనా జాలిలేదా?" అని దులిపేశాడు.    
    "రామనామం సదా చేస్తాను. అతడే కాపాడ్తాడు. చూశావా? నిన్ను అక్కడికి ఎలా పంపించి నా కుటుంబానికి సహాయమందించాడో!" అన్నారు.    
    మొండివాడు అందరికంటే బలవంతుడు.    
    అతనికి ఎవరేం చెప్పగలరు?    
    ఈ జన్మ కింతే అని సరిపెట్టుకుంది రమణమ్మ.   
                                          *    *    *    *

 Previous Page Next Page