తనని తాను అద్దంలో చూసుకుని విరగబడి నవ్వుకున్నాడతను. అతనే డి గ్రేట్ క్ర్మినల్ పుష్పరాజ్.
కేంద్ర ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న పుష్పరాజ్.
ఎల్ టి.టి.ఇ.కి ఆయుధాల్ని సప్లై చేస్తున్న అతి ప్రముఖ ఆయుధాల వ్యాపారి- స్మగ్లర్.
అద్దంలో తనని తాను చూసుకుని విరగబడి నవ్వుకున్న పుష్పరాజ్ ఒక్కసారిగా టేబుల్ మీదున్న యాష్ ట్రేని తీసి బలంగా విసిరి అద్దానికేసి కొట్టాడు.
అద్దం భళ్ళున పలిగిపోయింది.
పంగొని ఒక గాజు ముక్కని తీసుకుని అతని అరచేతి మీద బలంగా గీసుకున్నాడు.
రక్తం చివ్వున పొంగింది. సరిగ్గా అదే సమయంలో అంత వరకూ తన మనసులో అదిమి పెట్టుకున్న కసి ఒక్కసారిగా బయటకు వెల్లువలా వచ్చింది.
ఎందుకో పిచ్చి పిచ్చిగా అరిచాడు పుష్పరాజ్.
ఆ అరుపు విహ్వలంగా, భయంభయంగా వుంది. అతనప్పుడున్నది ఏ.సి. రూమ్ కాబట్టి సరిపోయింది. లేదంటే అతని అరుపులకి ఆ ప్రాంతం కకావికలమైపోయేది.
* * *
ఈ సంఘటనకు అరగంట ముందు......
అభినవ్ ఉపన్యాసం పూర్తయింది. కరతాళధ్వనులతో ఆడిటోరియం హోరెత్తిపోయింది.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఎడ్వర్ట్యిజ్ మెంట్ చూసి కలకత్తా నుంచి, బొంబాయి నుంచి, గోవా నుంచి, ఢిల్లీ నుంచి వచ్చిన ఆర్టిస్టులు అభినవ్ కు తమను తాము పరిచయం చేసుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వాళ్ళందర్నీ తప్పించుకుంటూ ముందుకు అడుగేస్తున్న అభినవ్ దూరంగా నుంచుని తన వైపే చూస్తున్న కావ్యని చూసి నిర్ఘాంతపోయాడు.
కావ్యా!
అకస్మాత్తుగా కొవ్వొత్తితో ఎవరో వేలుహురు నింపినట్టుగా అభినవ్ కళ్ళు మెరిశాయి.
గబగబా ముందుకడుగేశాడు చిన్న పిల్లాడిలా.
"ఎప్పుడొచ్చారు? అక్కడే అలా నిలబడిపోయారేంటి?"
ప్రశ్నిస్తున్న అభినవ్ వైపు మౌనంగా చూసింది కావ్య.
కళాభిమానులంతా ఆడిటోరియం వైపు నడుస్తున్నారు.
"ఎదురుగా కనిపిస్తేనే మనుషులు జ్ఞాపకం వస్తారన్న మాట. అయినా చెప్పా చెయ్యకుండా హైద్రాబాద్ నుంచి ఎందుకొచ్చేశారు?" అభిమానంగా అడుగుతున్న కావ్య కళ్ళల్లోకి అలవోకగా చూశాడు అభినవ్. ఆమె గురించి హరిహరన్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అతనికి. గబుక్కున అతని చెయ్యి పట్టుకుంది కావ్య.
"అభినవ్! మిమ్మల్నిప్పుడు నేను వదలను. మీతో చాలా విషయాలు మాట్లాడాలి. చాలా చాలా సీరియస్ గా" కళ్ళను కోలగా తిప్పుతూ అందంగా అంది కావ్య.
"అంత సీరియస్ మేటరా?" తను నమ్మిన ఆర్ట్ గురించి మొట్టమొదటి సారి చాలా ఉత్తేజంగా మాట్లాడాడు. దాని ప్రభావం వల్ల అతను చాలా సంతోషంగా వున్నాడు.
""అవును. రెండు జీవితాలంత సీరియస్" కన్ను కొడుతూ అల్లరిగా అంది ఆమె.
"అయితే మాట్లాడుకుందాం- పదండి" అలాంటి మాట అతని నోట్లోంచి వస్తుందని వూహించని కావ్య క్షణకాలం విస్తుపోయింది.
సరిగ్గా అదే సమయంలో ఎగ్జిబిషన్ క్లర్క్ వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి "మేడమ్ మిమ్మల్ని హరిహరన్ సాబ్ పిలుస్తున్నారు" చెప్పాడు.
"వన్ మినిట్ బాస్" అని కారిడార్లో నుంచున్న హరిహరన్ వైపు పరుగెత్తింది కావ్య.
ఎగ్జిబిషన్ క్లర్క్ వెనక్కి వెళ్ళబోతూ ఏదో జ్ఞాపకం రాగా "సార్ ఎవరో మీ అభిమాని అనుకుంటా. ఓల్డ్ మాన్ - మీకు తన విజిటింగ్ కార్డ్ ఇవ్వమన్నాడు." అని చెప్పి జేబులోంచి ఓ విజిటింగ్ కార్డ్ ని తీసి అతనికిచ్చి వెళ్ళిపోయాడు.
అభినవ్ కళ్ళు అప్రయత్నంగా ఆ విజిటింగ్ కార్డ్ ని చూశాయి.
కృష్ణస్వామి, బిల్డర్స్ అండ్ బిల్డర్స్ ప్రయివేట్ లిమిటెడ్, మద్రాస్. ఒక్క క్షణం ఆ పేరు వైపు చూసి కార్డు వెనక్కి తిప్పాడు. వెనక బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్నుతో గీసిన గీతలు. ఆ గీతలు పిచ్చి పిచ్చి గీతల్లా వున్నాయి.
తనని అభిమానించే ఆ వ్యక్తికి ఆర్ట్ అంటే తగని ఇష్టమని అందుకే ఏదో పిచ్చి గీతలు గీశాడని అనుకుని ఆ కార్డుని జేబులో పెట్టుకుని మెయిన్ గేటు కేసి నడవడం ప్రారంభించాడు అభినవ్.
అవి పిచ్చి గీతలు కావని అతనికి తెలీదు.
ఒక భయంకరమైన స్మగ్తర్ ని పట్టుకోడానికి ఆ కార్డు వెనక గీతల్లో క్లూ వుందని అతనికి తెలీదు.
పోక చెట్టుకింద నిలబడి లోపలికి చూశాడు అభినవ్.
హరిహరన్ తో నవ్వుతూ మాట్లాడుతోంది కావ్య.
రెండు నిముషాలు...... మూడు నిమిషాలు....... అయిదు నిమిషాలు........
విసుగ్గా వుంది అతనికి.
సరిగ్గా అదే సమయంలో-
బ్రౌన్ కలర్ కారు ఒకటి సరిగ్గా మెయిన్ గేటు ముందుకొచ్చి ఆగింది.
ఆ కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తిని చూడగానే-
చీకట్లో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన ఇంద్రధనుస్సును చూసినట్లుగా అభినవ్ కళ్ళు మెరిశాయి.
చీనాంబర!
ఒక్కసారి ఆగ్రాలో తాజ్ మహల్ ముందు, అభిమానంగా తన పెయింటింగ్ ను తీసుకుని వెళ్తున్న చీనాంబర ఠీవి, వయసు, సోగసు - ఆ సన్నివేషం గుర్తుకొచ్చిందతనికి.
పేరు మాత్రం జ్ఞాపకం రావడంలేదు.
అతని వైపు చూసి మెల్లగా, అందంగా నవ్వింది చీనాంబర.
"హలో ఎక్కడికెళ్తున్నారు? ప్లీజ్ గేతిన్" డోరు తెరుస్తూ అంది చీనంబర!
ఏమీ పాలుపోని సందిగ్ధస్థితి.
ఏదో అయాస్కాంతం పట్టిలాగేస్తున్న బలం - అతని మనసు ఒక్కసారిగా దూదిపింజలా అయిపోయింది.
"నేనేం మీ శతృవుని కాను గదా. కమాన్" ముగ్ధంగా, మనోహారంగా విన్పిస్తున్న ఆమె మాటలకు అతని అడుగులు అప్రయత్నంగా ముందుకు కదిలాయి.