ఆ వ్యక్తి ముందుకు కదిలాక తన చేతిలోని విజిటింగ్ కార్డు వైపు చూశాడు హరిహరన్.
కృష్ణస్వామి, బిల్డర్స్ అండ్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మద్రాస్ ఆ వ్యక్తి వెనక మఫ్టీలో వున్న పోలీస్ ఆఫీసర్ వెళ్ళడం గమనించిన హరిహరన్ సంతృప్తిగా తల పంకించాడు.
కృష్ణస్వామి నేరుగా మీటింగు హాల్ వైపు నడిచాడు. ఖాళీగా వున్న కుర్చీలో కూర్చుని అభినవ్ ప్రసంగాన్ని వినసాగాడు.
"ప్రాచీన చైనా ఆర్టిస్టులు తమ చిత్రాల్లో రంగుల్ని వాడకుండా నల్ల సిరాను మాత్రమే వాడేవారు. ప్రాచీన చైనా దేశంలో సంగ్ కాలంలో సిరాతో చిత్రించిన ప్రకృతి చిత్రాలెంత అందంగా వుంటాయో అజంతాలోని కుడ్య చిత్రాలు కూడా అంత రమ్యంగా వుంటాయి.
పాశ్చత్య ప్రకృతి చిత్రాల విషయానికొస్తే కాన్ స్టేబుల్, టర్నర్స్ ఇద్దరూ అద్భుతమైన ప్రకృతి చిత్రకారులు. కాన్ స్టేబుల్, టర్నర్స్ ఇద్దరూ అద్భుతమైన ప్రకృతి చిత్రకారులు. కాన్ స్టేబుల్ ఎక్కువ ప్రదేశాలను, చెట్లను చిత్రిస్తే, టర్నర్ ఆకాశాన్ని, వాతావరణ కాంతుల్నీ, సముద్రాని, నీటిపై వెలుగుల్ని చిత్రించేవాడు. కాన్ స్టేబుల్ చిత్రాల్లో రూపాలు, రంగులు కన్పిస్తే, టర్నర్ చిత్రాల్లో కాంతి కనిపిస్తుంది. టర్నర్ తన జీవిత కాలంలో మొత్తం ఇరవై వేల చిత్రాల్ని చిత్రించాడు. ఆయన రంగుల్లోంచి, వెలుగు సష్టికి ప్రాణదానం చేసిన వ్యక్తి. అదే సమయంలో జపాన్ లో హోకుసాయి, హిరోషిగే అనే చిత్రకారులు తమ కలర్ ప్రింట్స్ రూపంలో అద్భుతమైన ప్రకృతి చిత్రాల్ని రూపొందించారు.
మన భారతీయ చిత్రకళ గురించి మాట్లాడుకుంటే జహంగీరు కాలం చాలా విశిష్టమైంది. జహంగీరు దర్బార్లోని ఉస్తాద్ మాన్సూర్ అనే ఆర్టిస్టు సజీవమైన పక్షులను ఎదుట ఉంచుకుని వాటి రూపలావణ్యాన్ని చిత్రించేవాడు. అలాగే ఆమెరికాలోని గత శతాబ్దానికి చెందిన జాన్ జేమ్స్ ఓడ్బాన్ పక్షి చిత్రం, చిత్రీకరణలో అద్భుత ప్రతిభాశాలి.
రాన్రానూ చిత్రకళలో విషయ వస్తువుకు ప్రాధాన్యం నశిస్తూ, శుద్ధ రూపాలకు ఆవిష్కరణ జరిగింది. ఇదే నేడు మోడ్రన్ ఆర్ట్ పేరుతో పిలవబడుతున్న అబ్ స్ట్రాక్ట్ పెయింటింగుకు దారి తీసింది. ప్రస్తుతం చిత్రకళ, పరిచిత రూపాలకు ఆకృతి కల్పించడంలోనే మునిగి తేలుతుంది కానీ రస సృష్టిలో రసం మాయమైపోతూ వ్యాపార విలువలతో నేటి చిత్రం కళ అలనాటి చిత్రకళకు సుదూర తీరంలో వుంది" చెప్పడం ఆపాడు అభినవ్
మధ్యలోంచి ఒక శ్రోత నిలబడి ఒక ప్రశ్న వేశాడు-
"భారతీయ చిత్రకళలో రాజా రవివర్మ తనదైన ప్రతిభతో పాశ్చాత్య చిత్రకారులందరికన్నా ముందుగా నిలిచాడు. ఆయన్ని మీరెందుకు మరిచి పోయారు?"
"ఆయన్ని నేను మరిచిపోలేదు. రవివర్మ చిత్ర కల్పనే నేటి రూపాకృతులకు మూలం. రూప నేర్పరి ఆయన. రంగుల మేళవింపులో పాశ్చాత్యము ఆయన వైఖరి. నేను, నాలాంటి యువ చిత్రకారులు నేడు అనుసరిస్తున్నది ఆ వైఖరినే. ఆయన గురించి చెప్పుకోడానికి ఇది సమయం కాదు. ఎందుకంటే ఆయనొక సముద్రం కాబట్టి."
తర్వాత నలభై నిమిషాలసేపు ప్రశ్నలు, జవాబులు కార్యక్రమం కొనసాగింది.
అప్పటికే సగం పైగా లేచిపోయి ఆడిటోరియంలోని ఎగ్జిబిషన్ ని చూడడం ప్రారంభించారు.
తమకు అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తినీ పోలీసు కళ్ళు వేటాడుతున్నాయని వాళ్ళకు తెలీదు.
వాళ్ళందరికి దూరంగా కారిడార్లో ఆ చివర పెయింటింగ్స్ ను చూస్తూ ఏదో నోట్స్ రాసుకుంటున్నాడు కృష్ణస్వామి.
అన్ని పెయింటింగ్స్ నూ వరసగా చూస్తూ ఒక పెయింటింగు దగ్గర ఏదో నోట్స్ రాసుకుంటున్నాడు కృష్ణస్వామి.
ఆ పెయింటింగు పేరు 'ది ఫైర్' అది పీలేరులో స్మగ్లర్ పుష్పరాజ్ జీవితానికి సంబంధించి అభినవ్ చిత్రీకరించిన పెయింటింగ్.
ఆ పెయింటింగ్ ని ఒకే ఒక క్షణం సూటిగా చూసి ముందుకెళ్ళి పోయాడు కృష్ణస్వామి. అతని కళ్ళలో రియాక్షన్ కోసం కొంచెం దూరములో నుంచున్న మఫ్టీ పోలీసు, వీడియో కెమెరాను ఆపరేట్ చేస్తున్న పోలీస్ వీడియోగ్రాఫర్ పరిశీలనగా చూశారు.
ఆ పెయింటింగ్ దగ్గర ఆగిన ప్రతివాళ్ళను నిశితంగా పరిశీలించాలని హరిహరన్ ఆర్డర్.
మామూలుగా ముందు కెళ్ళిపోయిన కృష్ణస్వామి ఆఫీస్ రూంలోకెళ్ళి ఆ పెయింటింగ్ వేసిన ఆర్టిస్టు గురించి వివరాలు తెలిసే బ్రోచర్ ను అందరిలాగే అడిగి తీసుకున్నాడు.
"ఆర్టిస్టు అభినవ్ పెయింటింగ్స్ గురించి, ఆయన గురించి వినడం యిదే ప్రథమం" ఆఫీస్ రూంలో ఉన్న క్లర్కుతో అన్నాడు కృష్ణస్వామి.
"మీరాయన్ని ప్రత్యేకంగా కల్సుకోవాలనుకుంటే మీటింగ్ అయిపోయే వరకూ వెయిట్ చేయాలి" అన్నాడా క్లర్కు మెకానికల్ గా.
సూటు సర్దుకుంటూ సూటిగా ఆ క్లర్కు వైపు చూశాడు కృష్ణస్వామి.
"ఐ హేవ్ నో టైమ్. ఈవెనింగ్ ఫ్లైట్లో నేను ఢిల్లీ వెళ్ళాలి. ఆయనకి నా విజిటింగ్ కార్డ్ పాసాన్ చేయగలరా." రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు కృష్ణస్వామి.
"వై నాట్. విత్ ప్లజర్" అ క్లర్క్ విజిటింగ్ కార్డ్ ని తీసుకుని తన జేబులో పెట్టుకున్నాక అక్కడ నుంచి నెమ్మదిగా కదిలి బయటికెళ్ళి పోయాడు కృష్ణస్వామి.
ఆ సమయంలో కృష్ణస్వామి డ్రెయిన్ కార్చిచ్చు అంటుకున్న అడవిలా వుంది.
అయిదారు సందులు తిరిగాక అతనొక పోష్ బిల్డింగ్ లోకి అడుగు పెట్టాడు.
ఆ బిల్డింగ్ నిర్జనంగా, ఏకాంతంగా వుంది.
తన బెడ్ రూమ్ లో కెళ్ళాక సూటు బూటు విప్పేసి లుంగీ కట్టుకుని బాత్రూమ్ లోకి అడుగు పెట్టాడతను.
పావుగంట తర్వాత బాత్రూమ్ లోంచి బయటికొచ్చాడు.
ఇప్పుడతని వయసు అరవై ఏళ్లు కాదు.
తెల్లగా పండిపోయిన జుత్తు లేదు.
ఇప్పుడతను బలిష్టమైన కండరాలతో, మిల మిల మెరుస్తున్న నలభై ఏళ్ళ యువకుడు.