మళ్ళీ ఎవరూ మాట్లాడక మునుపే ఆయన 'అదేమిటి? కదలకుండా మెదలకుండా అలా విగ్రహాల్లా చూస్తారేం? పదండి. మనం హాస్పటల్ కి పోదాం" అని ఇంకా వాళ్ళు కదలకపోయేసరికి "సరి, మీతో పెట్టుకుంటే అయినట్లే. మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు రండి, నేను వెళ్ళుతున్నాను" అని యెలా వచ్చాడో అలానే హడావుడిగా బయటకు వెళ్ళిపోయారు.
ఆర్థ్ర నేత్రాలతో రాధ ఆయన వెళ్ళిపోయిన దిశచూస్తూ "ఈ ఇంట్లో చాలా వింతలు జరుగుతూ వుంటాయి." అని గొణిగింది.
తరువాత నారాయణకూడా లేచి నిలబడ్డాడు. అతని మనస్సుకు ఏ మాత్రం శాంతిలేదు. తండ్రి విషయం అలా వదిలిపెట్టి ఇకముందు ఏం జరుగుతుందా అని యోచిస్తున్నాడు. ప్రకాశానికి యింకా ఉత్తరం రాయలేదు. వాడు ఎంత దుర్భల హృదయుడో అతనికి తెలుసు. ప్రతి చిన్న విషయానికి బాధపడి రోజుల తరబడి కుమిలిపోతాడని తెలుసు. ఇలా వాసుకు అపాయమ్గా వున్న సంగతి వ్రాస్తే చదువూ, గిదువూ వదులుకొని ఇక్కడకు రెక్కలు కట్టుకువచ్చి వాల్తాడన్న విషయంలో నమ్మదగని సంగతి ఏమీలేదు. వాడు వచ్చినందుకు యేమీలేదు. కాని రెండువందలు ఖర్చు అవుతుంది. అవన్నీ ఆలోచించిన మీదట యింత ఆకస్మికంగా యీ విషయాన్ని తెలియబరచటం అతనికేమాత్రం సమ్మతంగా కనబడలేదు. అన్నపూర్ణ విషయం కూడా అలానే కనబడింది. వీళ్ళిద్దరికీ ఏకంగా ఇప్పుడు ఉత్తరాలు రాసి హడలగొట్టడం ఏ మాత్రం ఉచితమైన పనిగా తోచలేదు నారాయణకు. కాని యీ వేళ ఉదయమే తల్లి అంది, "ప్రకాశానికి, పెద్దదానికి చెరో టెలిగ్రాం ఇవ్వరా నాయనా" అని. అప్పటిమట్టుకు సరేనన్నాడు.
"ఏమిటి ఆలోచన చేస్తున్నావు?"
రాధ మాటలు వినిపించి, నారాయణ చకితుడై "ఆహఁ, యేమీ లేదు. ఇక్కడ మనమిద్దరంకూడా యెందుకు? హాస్పిటల్ కు పోదాం" అన్నాడు.
రాధ తల ఊపింది.
ఇద్దరూ బయల్దేరాక ఆమె అంది, "ఈ డబ్బు విషయం.......?"
"తిరిగి ప్రమీల కిచ్చేసెయ్యి."
* * *
అసలు చిదంబరానికి డాక్టరు తనతో జబ్బు విషయం చెప్పినప్పటినుంచి మనసులో భయం పీడిస్తూనే వుంది. నారాయణా, ఆయనా యేదో మాట్లాడుకోవటం చూసి, కొడుకు వెళ్ళిపోయాక ఆయన దగ్గరకు వెళ్ళి చిన్నకొడుకు విషయం అడిగాడు. నారాయణ చెప్పిందే డాక్టర్ గారు గూడా చెప్పాడు.
ఇహ చిదంబరం హృదయంలో సంకుల సమరం చెలరేగింది. నారాయణ ఏదో ఉద్యోగం చేసి నాలుగు రాళ్ళు సంపాదించుకుంటున్నాడేగాని, వాడికి యిటువంటి విషయాలు చేతకావని ఆయన నమ్మకం. తను యీ యింటికి పెద్దవాడు ఇంటి యజమాని. తనకు ఒక్కపనా? ఒక్క బాధ్యతా? ఇంటికి సంబంధించిన ప్రతి విషయం తనే చూచుకోవాలి. వెయ్యి కళ్ళతో ప్రతి సంగతి కనిపెడుతూ వుండాలి. పాపం వాళ్ళంతా చిన్నపిల్లలు. అమాయకులు. తననే నమ్ముకొని వున్నారు. ఎదుర్కొంటున్న ప్రతి అపాయంలోంచీ వాళ్ళని ఆదుకుంటూ వుండాలి. లేకపోతే వాళ్ళను వేరే ఎవరు చూస్తారు? ఒకటి రెండు రోజులు పేకాట లేకపోయినా సరే! తీవ్రంగా కృషి చేసి ఈ సమస్య పరిష్కారం చెయ్యాలి తనకు చాతకానిదీ, వాళ్ళకు చాతనయిందీ ఏమిటో తనకు అర్థంకాదు. చొరవ తీసుకొని తన సమర్ధత వాళ్ళ ముందు బుజువు చెయ్యాలి.
కాని ఉన్నపాళాన మూడువందల రూపాయలు తీసుకురావాలంటే ఏమి చేయాలో ఆయనకి తోచలేదు. ఆయనకు ఎక్కువ మంది స్నేహితులు లేరు. ఉన్న కొద్దిమందితో నయినా చనువుగా మెలిగి, స్నేహలతనీ సంబంధ బంధవ్యాలను ఎక్కువ చేసుకుని ఒక స్థాయిలోకి తెచ్చుకునే అలవాటు అతనికి లేదు. అవధానిగారిని గురించీ, రామ్మూర్తిగారిని గురించీ ముందు ఆలోచించాడు. తనకు తెలిసినంతవరకూ వాళ్ళేమీ స్థితిపరులు కారు. పొద్దున్నే పదింటికి వచ్చి పేకాట వేసుక్కూర్చుని చాలాసేపు గడిపి మూడింటికో, నాలుగింటికో వెళ్ళిపోవటం మినహా వాళ్ళ ఆర్ధిక పరిస్థితులూ, కుటుంబ వ్యవహారాలు ఎక్కువగా తెలియదు. తనలాగే యిబ్బందుల్తో, సాధకబాధకాలతో వాళ్ళూ పడవ లాగేస్తున్నారని వినికిడి. వాళ్ళిద్దరి మీదా ఎటువంటి ఆశా పెట్టుకోనక్కరలేదు. పోతే గంగాధరంగారు! ఆయన్ని గురించి యీయనకు చాలా మంచి అభిప్రాయం వుంది. ఓ విశిష్టమైన గౌరవం వుంది. తమ ఇద్దరిమధ్య వున్న స్నేహంకూడా ఏ మాత్రం తక్కువదికాదు. తనకు తెలిసినంతవరకూ ఒకరి నొకరు ఎటువంటి సహాయం కోరలేదు. చిదంబరం గంగాధరంగారిని విశ్వసించాడు.
గంగాధరంగారి యింటివైపు పోయేసరికి ఆయన సావిట్లో ఈజీచైర్ లో పడుకొని చుట్ట కాల్చుకుంటూ ఏదో ఆలోచిస్తున్నారు. స్నేహితుడ్ని చూడగానే "రండి" అని ఆహ్వానించాడు. చిదంబరం ఉసూరుమని అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ వుండగా "పాపం? చాలా కష్టం వచ్చిపడింది. గాఢమైన ఎదురు దెబ్బే" అని పరామర్శించాడు.
చిదంబరం గాద్గదికంగా "ఎప్పటికేం జరుగుతుందో చెప్పలేం గంగాధరంగారూ?" అన్నాడు.
ఆయన శృతికలుపుతూ "నేననవలసిన మాట మీరే అన్నారు. ఈ దెబ్బ నాకే తగిలితే.... ఆహాఁ! ఉదాహరణకి చెబుతున్నాను. నాకే తగిలితే నా గుండె ఆగిపోయేటంత పనయ్యేదనుకోండి" అన్నాడు.
చిదంబరం తల పంకించి వూరుకున్నాడు.
"నేనే వద్దామనుకుంటున్నాను - - ఇంతలో మీరే బయల్దేరివచ్చారు."
పెద్దమనుష్యులైన ఈ నడివయస్సు వ్యక్తులిద్దరూ భావయుక్తంగా ఒకరూ, భావశూన్యంగా ఒకరూ రెండు క్షణాలు నిశ్శబ్దంగా గడిపారు.
"మీతో ఓ విషయం మాట్లాదామని వచ్చాను" అడిగీ అడగనట్లుగా అడిగాడు చిదంబరం.
"రహస్యమా?'
"అలాంటిదే"
"అయితే యిక్కడెందుకు? లోపలకు పోదాం."
గంగాధరంగారు ముందు నడువగా చిదంబరం అనుసరించాడు. ఇద్దరూ వెచ్చగావున్న లోపలి ఓ గదిలోకి పోయాక తలుపులు మూశాడు గంగాధరంగారు. తూర్పువైపువున్న ఓ కిటికీ నుంచి బయట నడుస్తున్న బళ్ళూ, మనుషులూ కనిపిస్తున్నారు. గంగాధరంగారు స్ర్కీన్ కిటికీమీదకు లాగి, తన కుర్చీని చిదంబరానికి దగ్గరగా జరుపుకుంటూ "ఏమిటి?" అన్నాడు.
నాకో మూడొందల రూపాయలు కావాలి."
"ఎందుకు?" గంగాధరంగారి గొంతు ఆశ్చర్యంగా మారింది.
పూసగ్రుచ్చినట్లుగా చిదంబరం ఎందుకో చెప్పాడు. అంతా విని గంగాధరంగారు "బలే, దీనికేనా రహస్యం, రహస్యం" అని అంటూ నవ్వాడు.
"ఇదేమిటి?' ఈ వేళకాని వేళప్పుడు కాఫీ" అని చిదంబరం కంగారు పడ్డాడు.
"ఫర్వాలేదు, కాఫీయేగా."
బయటికి ఈ మాట తేలికగా అనేసినా, కాఫీ అనే పదార్థం మనిషిని లోబర్చుకునే ఒక ఔషధంగా ఉపయోగించవచ్చునని ఆయన అంతరార్థం కావచ్చు.
కాఫీ వచ్చేవరకూ మళ్ళీ విశేషాలు ఏమీ మాట్లాడుకోలేదు, తర్వాత తలుపులు మూసివచ్చి గంగాధరంగా రన్నారు; "చూడండి, మనం రోజూ కలుసుకుంటూనే వున్నాం, సరదాగా కాలం గడుపుతూనే వున్నాం. కాని ఓ విషయం సరిగ్గా చెప్పాలంటే కుదరటంలేదు. అంటే యిప్పుడు మీరు కష్టసమయంలో వున్నప్పుడు చెప్పాలనుకుంటే కష్టంగా వుందనుకోండి. కాని చెప్పకపోతే మరీ కష్టంగా వుంటుంది." అన్నాడు.
"చెప్పండి" అనక తప్పలేదు చిదంబరానికి.
ఒకసారి బరువుగా ఊపిరి పీల్చుకొని ఆయన అన్నాడు, "చూడండి, న్నెఉ మనస్సులో ఒకటి అనుకొని బయటికి ఒకటి చెప్పే స్వభావం గలవాడిని కాను. మనుషులన్న తరువాత ఒకరితో ఒకరికి అవసరాలు వస్తూంటాయి. ఒకరి సహాయం ఒకరికి అవసరం వుంటూనే వుంటుంది. అటువంటప్పుడు సంబంధబంధవ్యాలు పెంపొందించుకొంటే బావుంటుంది కదా. మనిద్దరం వియ్యంకులం అయితే యెట్లా వుంటుంది?"
"కాని...... డబ్బు విషయం......"
గంగాధరంగారు పూర్తిగా చెప్పనియ్యకుండానే "ఉండండి. ముందు నాప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎలా వుంటుంది" అని మరికొంచెం గట్టిగా అడిగారు.
"బాగానే వుంటుంది."
"బాగానే వుంటుంది. బాగున్నప్పుడు మనిద్దరం ఎందుకని వియ్యమ్కులం కాకూడదు?"
"మనం ఇదివరకు యీ విషయాలు మాట్లాడుకున్నాంగా. దానికింకా టైం రాలేదే. ఇప్పుడావిషయాలన్నీ యెందుకు?"
"అవన్నీ మాట్లాడుకోవటానికి యిదే మంచి సమయం. చెప్పండి"
చిదంబరం మరీ ఇరుకులో పడినట్లు బాధపడ్డాడు. ఎదుటనున్న మనిషిని త్రోసి రాజందామంటే- - ఎదుటనున్న మనిషి ఎవరూ కాకుండా గంగాధరంగారు అయ్యారాయె.
"అలాగే అవొచ్చు" అన్నాడు ఏమీ అనలేక.
గంగాధరంగారు కల్పించుకుని అన్నాడు; "చూడండి చిదంబరశాస్త్రి గారూ! మీకూ యించుమించు నా అంతటి అనుభవమూ వుంది. వయస్సు కొంత ఎక్కువే వుంది. ఎందుకని మీరు ఇంట్లో స్వాతంత్ర్యం సంపాదించలేదు? మా అమ్మాయిని మీ నారాయణకు చేసుకోవటం మీ కెంతో ఇష్టమని నాకు తెలుసు. ఇంటిలో పరిస్థితులకు దడుస్తున్నారు. అలానే మీ నారాయణకోసం కొన్నాళ్ళు ఆగుదాం. కాని ఎప్పటికైనా మనమే వియ్యంకులం అవుదామని చేతిలో చేయివేయండి."
చిరునవ్వు చిందులాడుతున్న ముఖంతో ఈ మాటల్ని అని ఆయన తన కుడిచేతిని ముందుకు జాపాడు. చిదంబరం క్రమక్రమంగా ఆయన జాచివున్న చేయివరకూ బిక్కమొహంతో చూశాడు, ఆయనకు ఇదంతా ఇంద్రజాలంలా తోచింది.
"వెయ్యలేను."
గంగాధరంగారు వణికారు "సంవత్సరాల తరబడి స్నేహంచేశాము. ఒకటినొకరు అర్థం చేసుకున్నాం. రోజు గంటల తరబడి కాలక్షేపం చేశాం."
"వెయ్యలేను."
"ఎందుకని?"
"మనస్ఫూర్తిగా చెబుతున్నాను ఈ సంబంధం నాకిష్టమే. కాని నా యిష్టమే ఇక్కడ సర్వజ్ఞత సంపాదించలేదు. ఇంట్లో చాలామంది ఇష్టాఇష్టాలమీద ఇది ఆధారపడింది. కాదంటే నా శక్తికొద్దీ ఈ పెండ్లి అయేందుకు ప్రయత్నిస్తాను. నాకు చాతనయినంతవరకూ, నా నోరు నెప్పి పుట్టేటంతవరకూ చెబుతాను."
"అయితే మీ సమాధానం ఇదేనా చిదంబరం?"
ఈ సంబోధన విని చకితుడైన చిదంబరం, స్నేహితుడి ముఖంలోకి చూశాడు.
"ఇదేనా నీ ప్రయోజకత్వం?"
"కావచ్చు."
"నీకు మీ యింట్లో ఏమీ లేదన్నమాట."
"కావచ్చు" చిదంబరం చాలా నెమ్మదిగా, శాంతంగా మామూలు విషయం చెప్పినట్లు చెప్పాడు.
కాటికి కాళ్ళు జాచుకున్న త్రాచుకూడా అవసరంవస్తే బుస్సుమంటుంది. గంగాధరంకూడా అలాగే బుస్సుమని "నీకు సిగ్గువేయడం లేదూ - నా ముందింకా నిలబడి వుండటానికి? పోపో" అని ద్వారం వైపు చేయి చూపించాడు.
చిదంబరం మెల్లగా లేచి నిలబడ్డాడు అంతే వేదనతో ఆయన పెదాలు కదిలాయి. "కాని డబ్బు...."
గంగాధరంగారు వికృతంగా నవ్వాడు. "డబ్బు! నీకు డబ్బుకావాలా? ఇక్కడేం రాసులుపడి వున్నాయనుకున్నావా?"