Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 24

  

     "వద్దులెండి. మీ మాటమీద నమ్మకముంది. కన్నతండ్రిని కదా ఏదో ఆశ పడ్డాను" అన్నాడు విస్కీ సీసావంక క్రీగంట చూస్తూ.
   
    ప్రదీప్ అతనిచూపుల్లోని అర్ధం గ్రహించాడు.
   
    "కొంచెం డ్రింక్ తీసుకుంటారా?" అన్నాడు మెత్తబడి.
   
    "ఊ"
   
    ప్రదీప్ రాముని పిలిచి ఓ గ్లాసు తెప్పించాడు. గ్లాసు టీపాయ్ మీద పెట్టి అందులో విస్కీ పోద్దామనుకునేటంతలో హనుమంతరావు అతని చేతిలోంచి లాక్కుని గబగబ తనే పోసుకున్నాడు. అందులో సోడా కలుపుకుని నోటిదగ్గర పెట్టుకున్నాడు ఆబగా.
       
    "హనుమంతరావుగారూ!" అన్నాడు ప్రదీప్. "దయయుంచి నా ఆవేదనను అర్ధం చేసుకోండి. వృత్తిలో, మహోన్నతమైన వృత్తిలో వుండి, అవలంబించిన నిర్లక్ష్యవైఖరి ఫలితంగా ఒక నిండు ప్రాణం అంతరించిపోయింది. మరో చిన్నారి జీవితం అంధకార బంధురమైపోయింది. లేక అంతరించిపోయే స్థితికి వచ్చింది. తప్పు ఎవరుచేసినా తప్పే. ఈ భూమ్మీద యితరులకు హాని కలిగించే తప్పు చేయటానికి ఎవరికీ హక్కులేదు. తప్పుచేసిన వ్యక్తికి శిక్ష పడాల్సిందే. ఆ లక్ష్యంతోనే, ఆ ఆవేదనతోనే శ్రీలక్ష్మి హాస్పిటల్ మీద, యీ ఆపరేషన్ కు సంబంధించిన మనుషుల మీద కేసుపెట్టటానికి నిశ్చయించుకున్నాను. పాపతండ్రిగా ఈ కేసు మీరు పెట్టబోతున్నారు. క్రిమినల్ కేసు. ఈ కేసు నేను ముగించి నిర్వహించబోతున్నాను."
   
    హనుమంతరావు మొదటి పెగ్గు.... రెండో పెగ్గులోకొచ్చాడు.
   
    వళ్ళంతా తిమ్మిరిగా వుంది. మస్తిష్కం ఆనందపుటంచుల్ని అనుభవీస్తుంది.
   
    "ఊ" అన్నాడు మళ్ళీ.
   
                                    11

    స్టీరియోలో చాలాచిన్నగా శ్రావ్యమైన పాశ్చాత్య సంగీతం వినవస్తుంది. ఎయిర్ కండిషన్దు గది కావటంవల్ల చల్లగా, ఆహ్లాదంగా వుంది.
   
    డాక్టర్ అశోక్ సోఫాలో కూర్చుని వున్నాడు. టీపాయ్మీద రాయల్ సెల్యూట్ బాటిల్ వుంది. ప్రక్కనే వున్న గ్లాసులో కేవలం ఐస్ క్యూబ్స్ వేసిన విస్కీ వుంది. పరధ్యానంగా వుండి, ఆలోచిస్తూ మధ్య మధ్య గ్లాసు చేతిలోకి తీసుకుని కొంచెం కొంచెం సేవిస్తున్నాడు.
       
    స్ప్రింగ్ డోర్ తీసుకుని గదిలోకి జూలీ వచ్చింది.
   
    జూలీకి ముఫ్ఫయి ఏళ్ళుంటాయి. కాని వయసుకంటే ఒకటి రెండేళ్లు తక్కువగా కనిపిస్తుంది. అంత పొడుగూ, పొట్టికాని సన్నని లేతశరీరం చాలా అందమైన గుండ్రని ముఖం గులాబీరంగు పెదిమలు, కొంచెం నొక్కులతో వున్న గ్రే కలర్ బాబ్డ్ హెయిర్.
   
    అన్నిటికీ మించి నీలంరంగుతో మెరిసే విశాల నయనాలు, కాని కొంచెం నిదానించి చూస్తే ఆ కళ్ళలో ఏదో కనతి లోపిస్తుంది.
   
    జూలీ తడుముకుంటూ తడుముకుంటూ, ఒక్కొక్క అడుగూ పట్టిపట్టి వేస్తూ, అక్కడున్న సోఫా, కుర్చీల ఆధారంగా నడుస్తూ వస్తుంది.
   
    జూలీకి కళ్ళు కనిపించవు.
   
    జూలీ అంధురాలు.
   
    స్టేట్స్ లో డాక్టర్ అశోక్ పనిచేస్తున్నప్పుడు అతని దగ్గరకు పేషెంటుగా తీసుకురాబడింది. ఆమె కారు డ్రైవ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో చూపు కోల్పోయి అతనివద్దకు తీసుకురాబడింది. డాక్టర్ అశోక్ కు గొప్ప నేత్రవైద్యం నిపుణుడుగా మంచిపేరుండేది. ఆమెకు చూపు తెప్పించడానికి అతను శతవిధాలా ప్రయత్నించాడు. ఇతరులు డొనేట్ చేసిన కళ్ళద్వారా కార్నియల్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసినా చూపు తిరిగి రానంత స్థితిలో ఆమెకళ్ళలో సున్నితమైన భాగాలు డామేజ్ అయిపోయాయి.
   
    తనకి చూపు తిరిగిరాదని తెలుసుకుని జూలీ చాలా దిగులుగా వుందేదిల్. అప్పటికే ఆమె మంచి పేరు ప్రఖ్యాతులున్న రచయిత్రికూడా ఆమె కథలూ, నవలలూ చాలా ప్రాచుర్యం వున్న అమెరికన్ పత్రికలలో ప్రచురితమవుతూ వుండేవి.
   
    హాస్పిటల్ లో వుండగానే జూలీ చూపులేని చీకటి ప్రపంచాన్ని ఊహించలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. డాక్టర్ అశోక్ ఆమెను చూసిన మొదటి క్షణంనుంచీ ఆమె సౌందర్యానికీ, ముగ్ధ మోహనత్వానికీ, స్వభావంలోని సరళత్వానికి ఆకర్షితుడై ఆమెను కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఎప్పటికైనా జూలీ ఆత్మహత్య ప్రయత్నం చెయ్యవచ్చుననే ఆలోచనతో మెలకువగా వుండి, ఆమె ప్రయత్నాలను పటాపంచలు చేశాడు.
   
    "శాశ్వతంగా వెలుగుని పోగొట్టుకున్న యీ జీవితం ఎవరికోసం గడపాలి? ఎలా గడపాలి?" అన్నది జూలీ కళ్ళనుండి నీటిబిందువులు ప్రవహిస్తూ వుండగా.
   
    డాక్టర్ అశోక్ ఆమెదగ్గరకు వచ్చి మెత్తని కురులను ప్రేమగా నిమిరాడు.
   
    "జూలీ! చూపులేనంత మాత్రాన జీవితం నిరర్దకం కాదు. మనం చూడలేని వెలుగుని మనప్రతిభతో యితరులకు ప్రసాదించవచ్చు. నీకు ప్రపంచం చీకటి మయంగా కనిపించవచ్చు. కాని నువ్వు నా వెలుగువి" అన్నాడు.
   
    "అశోక్!"
   
    "జూలీ! ఐ లవ్ యూ!"
   
    వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు.
   
    అతను హాస్పిటల్ పనిలో ఎంత అలసిపోయి వచ్చినా సరే, రాత్రివేళలో ఆమె చెప్పే కబుర్లూ, తాను చెయ్యబోయే రచనలగురించిన యితివృత్తాలూ, ఆమె భావాలూ, ఊహలూ అన్నీ శ్రద్దగా వినేవాడు. అవసరమొచ్చినప్పుడు కథలోని లోతుపాతుల గురించి ఆమెతో చర్చించేవాడు. ఆమె రచనకు ఉపక్రమించి చెప్పుకుపోతున్నప్పుడు అతను గబగబ టైపు చేస్తుండేవాడు.
   
    అలా ఆమె ఎన్నో రచనలు చేసింది. నిజానికి చూపుపోయాక ఆమె ఊహాశక్తి, రచనాశక్తి యినుమడించినట్టయింది. పాఠకులు ఆమె రచనలకోసం ఉర్రూతలూగుతూ ఎదురుచూసేవారు.
   
    డాక్టర్ అశోక్ శ్రీలక్ష్మి హాస్పిటల్ ఆహ్వానంపై యిక్కడకు వస్తున్నప్పుడు ఆమె తనవారందర్నీ విడిచిపెట్టి అతన్తోపాటు ఇండియా వచ్చేసింది.
   
    ఆమె యిక్కడ్నుంచే అమెరికాలోని పత్రికలకు తన రచనలు పంపిస్తూ వుండేది.
   
    "అశోక్ డియర్!" అంది జూలీ అతని దగ్గరకొచ్చి ఇంగ్లీషులో "ఏం చేస్తున్నావు?"
   
    "జూలీ!"
   
    "ఈ మధ్య ఎక్కువగా డ్రింక్ చేస్తున్నావు కదూ?"
   
    అతనేమీ జవాబు చెప్పలేదు.
   
    "ఏమైనా వర్రీస్ లో వున్నావా?"
   
    "లేదు జూలీ! వర్క్ ఎక్కువగా వుండి రిలాక్సేషన్ కోసం."
   
    ఆమె మరికొంచెం ముందుకు వచ్చి తడుముకుని అతని భుజంమీద చెయ్యివేసి నిమురుతూ అంది. "మరీ ఎక్కువగా త్రాగకు డియర్! ఆరోగ్యం పాడుచేసుకోకు."
   
    అతను సంభాషణ మారుద్దామని "జూలీ! కొత్త నవలకు థీమ్ ఏమైనా ఆలోచించావా?" అన్నాడు.
   
    "ఆలోచించాను అశోక్ డియర్! మీ డాక్టర్స్ సబ్జక్టే."
   
    "డాక్టర్స్ సబ్జక్టా?"
   
    "అవును డియర్! డాక్టర్స్ నెగ్లిజెన్స్ కథావస్తువుగా తీసుకున్నాను."
   
    "జూలీ!"
   
    "అవును. రోగి ప్రాణం ఎంతో అమూల్యమైనది. రోగి ఒక డాక్టరుదగ్గరకు వెళ్ళేటప్పుడు ఎంతో నమ్మకంతో అతనే దేవుడని నమ్మి వెళ్ళి తన ప్రాణాలన్నీ అతనిచేతుల్లో పెడతాడు. ఆ డాక్టరు ఏ కారణాలచేతనైనా కానీ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే అది ఆ రోగిజీవితాన్ని అంధకార బంధురంగా చేసివేస్తే ఆ రోగి భవిష్యత్తు, అతని కుటుంబం పరిస్థితి ఏమయిపోతుంది?"
   
    డాక్టర్ అశోక్ ఉలికిపడి ఆమెముఖంలోకి చూశాడు. నిర్మలంగా, అమాయకంగా వుంది. శ్రీలక్ష్మి హాస్పిటల్ లో జరిగిన గొడవగురించి ఆమెకు తెలియదు. తను చెప్పలేదు. చెప్పి సున్నితమైన ఆమె మనస్సును కలవరపర్చదలుచుకోలేదు. సహజంగానే యీ ఆలోచన ఆమెలో పుట్టి వుంటుంది.

 Previous Page Next Page