Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 23

  

     మాలతి నవ్వింది. "పెళ్ళి చేసుకోవాలనే వుంది ప్రదీప్! కాని ఎవర్ని చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను."
   
    "నీలాంటి మంచి డాక్టరుకు, అందమైన యువతికి భర్తే దొరకడా?"
   
    "నాకో మంచి హజ్బెండ్ ని చూసిపెట్టవా ప్రదీప్?"
   
    "నిజంగా చేసుకోవాలని వుందా?"
   
    "ఉండదా మరి?"
   
    ప్రదీప్ ఏమీ మాట్లాడలేదు.
   
    "ప్రదీప్! ఎలా వున్నావు?"
   
    "ఊ!"
   
    "ఎలా వున్నావు?"
   
    "బాగానే వున్నాను."
   
    "కోర్టుకు రెగ్యులర్ గా ఎటెండవుతున్నావా?"
   
    "వెళుతున్నాను. అన్నట్లు మాలతీ! శ్రీలక్ష్మి హాస్పిటల్ మీద, డాక్టర్ అశోక్ మీద లీగల్ గా ప్రొసీడవుతున్నాను."

    "రాధ కంటి ఆపరేషన్ గురించా? పాపం ఎలావుందా పాప?" అంది మాలతి జాలిగా.
   
    "చాలా మిజరబుల్ గా వుంది. రెటీనోబ్లాస్టోమా వున్న రెండోకన్ను అలాగే వదిలేశారుగా ఆ కన్నుకు వెంటనే ఆపరేషన్ చేసి ఐబాల్ తీసెయ్యకపోతే లైఫ్ కే డేంజర్ అంటున్నారు."
   
    "హారిబుల్" అంది మాలతి. ఆమె గొంతులో వినలేని బాధ ధ్వనించింది.
   
    "ఒకసారి వెళ్ళి పాపని చూడాలి."
   
    ఓ నిముషం నిశ్శబ్దంగా గడిచింది.
   
    "లీగల్ గా ప్రోసీడై ఏం లాభం ప్రదీప్! ప్రిస్టేజ్ కోసం ఎంతటి డేమేజస్ అయినా విరజిమ్మేస్తారు.'
   
    "నాకు తెలుసు. అందుకనే క్రిమినల్ కేసు పెడుతున్నాను. ఐ వాంట్ దెమ్ టు బి పనిష్డ్."
   
    "రిస్క్ వుందేమో చూడు ప్రదీప్!"
   
    "ఫర్వాలేదు. నా ధ్యేయంకోసం ఎలాంటి రిస్కయినా భరిస్తాను. కాని నీ కోపరేషన్ కావాలి. కోర్టు వ్యవహారాల్లో సాక్ష్యానికి, ఇతరత్రా ఎలాంటి సపోర్ట్ కావల్సివచ్చినా?"
   
    "తప్పకుండా ప్రదీప్! నా సహకారం నీకెప్పుడూ వుంటుంది."
   
    "ఉంటాను మాలతీ!"
   
    ఫోన్ పెట్టేశాడు.
   
                                * *  *
   
    హనుమంతరావు ఉపేంద్ర గదిలోకి అడుగుపెట్టాడు.
   
    మామూలు పరిస్థితిలో అయితే అలాంటి మనుషుల్తో ఇంటర్వ్యూ యివ్వటానికి అయిదారుసార్లన్నా త్రిప్పించటమో, ఆ తర్వాతనైనా అరనిముషం, నిముషంకంటే మాట్లాడటానికి అవకాశం యివ్వకపోవటమో చేసేవాడు ఉపేంద్ర. కాని యిప్పుడు చాలా ఆప్యాయంగా 'రండి' అని ఆహ్వానించాడు. బజర్ నొక్కి బాయ్ ని రెండు కూల్ డ్రింక్స్ తెమ్మని పురమాయించాడు.
   
    "మా అమ్మాయి రాధ సంగతి మాట్లాడాలని వచ్చాను" అన్నాడు హనుమంతరావు కటువుగా వుండటానికి ప్రయత్నిస్తూ.
   
    "తెలుసు" అన్నాడు ఉపేంద్ర తాపీగా.
   
    కూల్ డ్రింక్స్ వచ్చాయి.
   
    "తీసుకోండి" అన్నాడు ఉపేంద్ర.
   
    హనుమంతరావు గ్లాస్ చేతిలోకి తీసుకున్నాడు. ఐస్ క్యూబ్స్ వేసిన గ్రేప్ జ్యూస్.
   
    "వి.ఐ.పీస్ కి ఇవ్వటానికి స్పెషల్ గా చేయించాను" అన్నాడు ఉపేంద్ర.
   
    హనుమంతరావు కొంచెం త్రాగి చూశాడు. నిజంగా చాలా బావుంది. ప్రాణం లేచి వచ్చినట్లనిపించింది.

    "మా అమ్మాయి విషయం...." అన్నాడు కరిగిపోకుండా వుండటానికి ప్రయత్నిస్తూ.
   
    "మీకంటే ఎక్కువ సీరియస్ గా నేనూ ఆలోచిస్తున్నాను. రెండోకన్ను అంటే అసలు డిసీజ్ వున్న కన్ను అలా వుండిపోయింది. ఎట్లా అని మీ బాధ. రాధను అమెరికా పంపించాలని చెప్పి నేనాలోచిస్తున్నాను. ఇక్కడికంటే, అక్కడ ఎన్నో ఫెసిలిటీస్ వుంటాయి. ఆ కన్ను తీసివేయకుండా, చూపు తిరిగి రావటానికి విశ్వప్రయత్నం జరిగే ఏర్పాటు నేనుచేస్తాను. మీ అదృష్టం బావుంటే రాధకు చూపు తిరిగిరావచ్చు."
   
    "అమెరికానా?" అన్నాడు హనుమంతరావు నోరు వెళ్ళబెట్టి.
   
    "అవును రాధతోబాటు మీరుకూడా వెడతారు. టెస్ట్ లూ, ట్రీట్ మెంట్ అదంతా అయేసరికి రెండుమూడునెలలు పడుతుంది. అమెరికాలోని ఆధునాతనమైన హాస్పిటల్ లో రాధకు ట్రీట్ మెంట్ ఏర్పాటు చేయిస్తాను. మీరు వుండటానికి ఖరీదైన, విలాసవంతమైన హోటల్ లో వసతి ఏర్పాటు చేయిస్తాను. ఖాళీటైంలో బోర్ కొట్టకుండా దేశంలోని ముఖ్యమైన ప్రదేశాలన్నీ సందర్శించే ఏర్పాటు చేస్తాను" అన్నాడు ఉపేంద్ర అతను మెత్తబడుతూ వుండటం గమనించి.
   
    "కాని అక్కడ...."
   
    "నయం కావటానికి సర్వశక్తులూ ధారపోస్తాను. ఎక్కువ వ్యవధిలేదు. మీరు తొందరగా నిర్ణయం చెబితే నేను వెంటనే పాస్ పోర్టు ఏర్పాటులన్నీ చేస్తాను."
   
    "హనుమంతరావు లేచి నిలబడ్డాడు. అతనిముఖంలో కొంత ఉత్సాహం కనబడుతుంది.

                              * * *
   
    మాలతితో మాట్లాడటం పూర్తిచేసి ఫోన్ పెట్టేశాక ప్రదీప్ రెండో పెగ్గు పోసుకున్నాడు.
   
    హనుమంతరావు లోపలకు దూసుకువచ్చాడు.   
   
    అతనంత అసభ్యంగా లోపలకు త్రోసుకు వస్తాడనుకోలేదు. తానా పరిస్థితిలో అతని కంటపడటం ప్రదీప్ కు యిష్టంలేదు.
   
    హనుమంతరావు కళ్ళు అక్కడి వ్యవహారాన్ని పసిగట్టాయి. అతను విస్కీ బ్రాందీల రుచి తెలియనివాడేంకాదు. అయిదారు నెలలకోసారి అవకాశమొచ్చినప్పుడు నాలిక తడుపుకుంటూనే వుంటాడు. ఆర్ధిక పరిస్థితి బాగుండకగానీ, తరుచు పుచ్చుకునేందుకతని మనస్సు ఉవ్విళ్ళూరుతూనే వుంటుంది.
   
    ప్రదీప్ కు ఎదురుగా వున్న సీట్లో కూర్చుని పెదాలను నాలికతో చప్పరిస్తున్నాడు.
   
    "ఏం జరిగింది?" అన్నాడు ప్రదీప్.
   
    "రాధను ట్రీట్ మెంట్ కోసం అమెరికా పంపిస్తానన్నాడు. దానికి సాయంగా నన్నుకూడా పంపిస్తానన్నాడు."
   
    ప్రదీప్ ముఖం ఎర్రబడింది. "మోసం అది కేవలం మిమ్మల్ని సంతోషపెట్టటానికి, మిమ్మల్ని కేసుపెట్టకుండా చెయ్యటానికి పన్నిన పన్నాగం. మీరు అమెరికా వెళతారు. అక్కడకూడా ఏమీ లాభంలేదని చెప్పి చివరకు కన్ను తీసివేస్తారు. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చివరికంతా నిర్వహించిన పేరు వాళ్ళకి దక్కుతుంది. పత్రికలు వాళ్ళని ప్రశంసిస్తూ రాస్తాయి. వాళ్ళమీద పడ్డ మచ్చ తొలగిపోతుంది. చివరకు మనం నిస్సహాయంగా మిగిలిపోతాం."
   
    "కాని అమెరికా..." అన్నాడు హనుమంతరావు గొప్ప అవకాశం జారిపోతుందన్న బాధతో గుటకలు వేస్తూ.
   
    "అమెరికా అమెరికా.... అక్కడకు వెళ్ళాలని మీకంత కోరిగ్గా వుందా? నా ఆస్తంతా అమ్మి అయినాసరే అక్కడకు పంపిస్తాను ఏం?" అన్నాడు ప్రదీప్ ఆవేశంగా అరుస్తూ.
   
    "నేనంత చౌకబారువాడ్నేమీ కాదు. అక్కడికి వెళితే తగ్గుతుందని అతనంటే...." అన్నాడు హనుమంతరావు నీళ్ళు నముల్తూ.
   
    "తగ్గదు. దేశంలోని పెద్దపెద్ద డాక్టర్లందర్నీ సంప్రదించాను. కావాలంటే అమెరికాలో నా స్నేహితుడున్నాడు, అతనికిప్పుడే కేబుల్ బుక్ చేసి మాట్లాడతాను."

 Previous Page Next Page