Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 25

 

     "ఏమిటి డియర్ మాట్లాడవేం?"
   
    "ఊ"
   
    "డాక్టర్స్ మీద నెగటివ్ గా వుండే సబ్జక్టు తీసుకున్నావేమిటి అనా? నాకు తెలుసు డియర్! డాక్టర్ వృత్తి చాలా ఉన్నతమైనది. చాలా బాధ్యతతో కూడినట్టిది. వృత్తినే తపస్సుగా ఎంచే నీలాంటి డాక్టర్లువున్న యీ పరమోత్కృష్ట మైన వృత్తిలో ఒకరిద్దరి తొందరపాటువల్ల మచ్చ ఏర్పడటానికి అవకాశం వుంది. అమెరికాలో వున్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు నాకు తెలుసు కూడా. అందుకే రాయటానికి సంకల్పించాను. ఏం డియర్? రాయొద్డా?"
   
    "రాయి" అన్నాడు డాక్టర్ అశోక్.
   
    "ఇప్పుడే యితివృత్తానికి అంకురార్పణ జరిగింది. దానిమీదనే కాన్ సెన్ ట్రేట్ చేసి థీమ్ కు పరిపూర్ణత తీసుకువస్తాను" అంది జూలీ.
   
                                       12
   
    అంకుశం ఎడిటర్ పరాంకుశం ప్రదీప్ ని ఇంటర్వ్యూ చెయ్యటానికి వచ్చాడు. ప్రక్కన రామంలింగంకూడా వున్నాడు.
   
    "శ్రీలక్ష్మి హాస్పిటల్ మీద, ఈ ఆపరేషన్ లో ఇన్వాల్వ్ అయిన కొందరు ముఖ్యులమీద మీరు కేసుపెట్టిస్తున్నారట నిజమేనా?" అనడిగాడు.
   
    "పాప తండ్రి హనుమంతరావుగారు లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నారు. నేనాయన తరపున లాయరుగా పనిచేస్తున్నాను" అన్నాడు ప్రదీప్.
   
    "సహజంగా యీ ఆలోచన ఆయనకు కలిగింది కాదనీ, కేవలం మీ ప్రేరేపణవల్లే ముందుకు వచ్చాడనీ తెలిసింది. నిజమేనా?"
   
    మాటలో ఏదో అపశ్రుతి, ఈ జర్నలిస్టులు ఒక సంఘటనకుగాని, వాస్తవానికిగాని ఎన్ని కలర్స్ యిస్తారో గ్రహించేసరికి అతనికి కొంచెం చిరాకు కలిగింది.
   
    "ఒక వ్యక్తి లీగల్ గా ప్రొసీడయేముందు అందులో బాగోగుల్ని చర్చించటానికి సలహా సంప్రదింపులకు లాయరు దగ్గరకు వస్తాడు. అలాగే, వాళ్ళు నా సలహా తీసుకోవటం జరిగింది."
   
    "మీరు క్రిమినల్ కేసు పెట్టడానికి కారణం ఏమిటి?"
   
    "సివిల్ కేసు అయితే నష్టపరిహారం చెల్లించమని కోరాలి. రిజిస్టర్ నోటీస్ యివ్వగానే మనం అడిగిన డబ్బు యిచ్చేశారనుకోండి. అసలు కేసుపెట్టే అవకాశమే వుండదు."
   
    "క్రిమినల్ కేసు అయితే?"
   
    "శిక్షించమని కోర్టువారిని అభ్యర్ధించటానికి అవకాశముంది."
   
    "అది ఎలాంటి శిక్ష?"
   
    "కోర్టు నిర్ణయిస్తుంది."
   
    "సపోజ్! ఓ ఆరునెలలో, ఏడాదో జైలుశిక్ష విధిస్తుందనుకోండి కోర్టు. పాపకు పోయిన కన్ను వచ్చేస్తుందా?"
   
    "రాదు. నేరం చేసినవారిని దోషులుగా చట్టం నిర్ణయించినప్పుడు ప్రజలకు ఓ సత్యం చాటినట్టవుతుంది."
   
    "దానివల్ల మీకేం లాభం?"
   
    "లాభంకోసం కాదు. న్యాయంకోసం పోరాటం."
   
    "మీకు శ్రీమతి వున్నారా?"
   
    "లేదు."
   
    "ఎందుకని?"
   
    "చనిపోయింది."
   
    "ఎప్పుడు?"
   
    "కొద్దిరోజుల క్రితం."
   
    "ఏ సందర్భంలో?"
   
    "డెలివరీకని హాస్పిటల్లో చేరి బహుశా ట్రీట్ మెంట్ లో కొంత పొరపాటు వుండటంచేత."
   
    "ఏ హాస్పిటల్లో? శ్రీలక్ష్మి హాస్పిటల్లోనా?"
   
    "అవును."
   
    "అయితే ఈ హాస్పిటల్ మీద మీకు కొంత గ్రడ్జి వుండటానికి అవకాశం వుందన్నమాట."
   
    ప్రదీప్ జవాబు చెప్పలేదు.
   
    "మీకు హనుమంతరావుగారు ఫ్యామిలీ ఫ్రెండా?"
   
    "అవును."
   
    "వాళ్ళింట్లో అందరితో సోషల్ గా ఉంటారా?"
   
    "ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి వుంటాను."
   
    "వాళ్ళ పిల్లలతో కూడానా?"
   
    "అంటే?"
   
    "రాధతోబాటు అరుణా, సునీతలతో కూడానా?"
   
    అతని ప్రశ్నలో విశేషం ప్రదీప్ కు అర్ధమయింది.
   
    "వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్సు కాబట్టి అందరూ నాతో క్లోజ్ గా వుంటారు" అన్నాడు కోపాన్ని దిగమ్రింగుకుంటూ.
   
    "సరే" అంటూ పరాంకుశం లేచాడు.
   
                             * * *
   
    డాక్టర్ల అజాగ్రత్త వల్ల కన్ను కోల్పోయిన పాపకు రెండోకంటికి కూడా ఆపరేషనా?
       
    శ్రీలక్ష్మి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉపేంద్ర మీద, డాక్టర్ అశోక్ మీద పాప తండ్రి హనుమంతరావు క్రిమినల్ కేసు.
   
    ఈ రెండు శీర్షికలూ రకరకాల హెడ్డింగ్ లతో అన్ని పత్రికల్లో ప్రచురించబడ్డాయి.
   
    దేశంలో సామాన్యుల్లో, మేధావి వర్గంలోకూడా యీ వార్తలు ఉత్సుకతనూ, సంచలనాన్నీ కలిగించసాగాయి.
   
    ప్రదీప్ గదిలో టేబుల్ మీద వార్తాపత్రికలన్నీ పడివున్నాయి. వాటిలో 'అంకుశం' కూడా వుంది.
   
    అంకుశం ముఖచిత్రంమీద కంటికి బ్యాండేజితో వున్న రాధ ఫోటో, హనుమంతరావుగారి ఫోటో, ప్రదీప్ ఫోటో వేసి వున్నాయి. ప్రదీప్ కు ఇరుప్రక్కలా అరుణా, సునీతల ఫోటోలుకూడా వున్నాయి.
   
    తనకు అటూ ఇటూ అనుకున్నట్టు ప్రచురించబడిన ఆ ఫోటోలు చూస్తే ప్రదీప్ కు ఏదోలా అనిపించింది. లోపల మేటర్ లో ఉపయోగించిన భాషకూడా వికారంగా వుంది.
   
    ఈ మాదిరి పత్రికలు ఒక విషయానికి ఎలాంటి రంగులు పులుముతారో అర్ధమాఎసరికి జుగుప్స కలిగింది.
   
    కొంచెం దూరంలో వున్న ఫోన్ మ్రోగేసరికి చెయ్యిజాపి రిసీవర్ అందుకున్నాడు.
   
    "ప్రదీప్ హియర్."
   
    "ప్రదీప్! నేను, ప్రతాపరావును."
   
    "నమస్కారం సార్! కులాసాగా వున్నారా?"
   
    "ప్రదీప్! శ్రీలక్ష్మి హాస్పిటల్ మీద, అశోక్ మీద కేసు విత్ డ్రా చేసుకో కూడదా?"
   
    ఒక్క నిముషం మెదలకుండా వుండిపోయాడు.
   
    "ఏం ప్రదీప్?"
   
    "సారీ సర్! నాలో ప్రజ్వరిల్లే అగ్నిపర్వతాలు మీకు తెలీదు."
   
    "తెలుసు. డాక్టర్ అశోక్ ఎంతటి మేధాసంపన్నుడో నీకు తెలుసు. పొరపాటనేది మానవ సహజం. దానికింత గొడవ చేయటం మంచిది కాదు."

 Previous Page Next Page