Previous Page Next Page 
అసావేరి పేజి 24

    "అప్పారావ్ గెటప్" అరిచాడు ఆవేశంగా.
   
    "సర్" అప్పారావు నీళ్ళు నమిలేస్తున్నాడు. "అసలు అది నేను...."
   
    "రాయలేదని బుకాయించినా నేనూరుకొను నడువ్! నిన్ను తక్షణమే సస్పెండు చేయించనినాడు నా ఉనిక్కే అర్ధంలేదు. రా...." ఇంచుమించు చేయి పట్టుకుని అప్పారావుని లాక్కుపోతుంటే "సర్" అంటూ ఓ కేక వినిపించింది.
   
    ద్వారం దాటబోయిన లెక్చరర్ తొట్రుపాటుగా ఆగిపోయారు.
   
    అక్కడ తన సీటుదగ్గర నిలబడ్డ సావేరి "అది రాసింది అప్పారావు కాదు" అంది.
   
    ఇప్పుడు శంకూ గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది.
   
    క్లాస్ రూంలో ప్రతి విద్యార్దీ ఊపిరిబిగబట్టి చూస్తున్నాడు.
   
    "నో...." అప్పుడు నోరు తెరిచింది లావణ్య. "అది రాసింది అప్పారావ్."
   
    ఇప్పుడు అవాక్కవడం సావేరి వంతైంది.
   
    "ప్రేమలేఖలు నాకూ వస్తాయి." లావుంటే మాత్రం నేనేం ప్రేమకి అనర్హురాలినా" అన్నట్టు చూసింది లావణ్య.
   
    ప్రపంచంలో ప్రేమకు 'స్థూలకాయం' అన్నది అనర్ధంకాదన్న థియరీని అందరికీ నిరూపించే ఇలాంటి అవకాశం చేజార్చుకోకూడదన్నంత ధీమా ప్రదర్శించగానే సంగతేమిటో తోచని తెలుగు లెక్చరర్ గొంతు తడారిపోతుంటే నెమ్మదిగా అన్నాడు. "అది సరే అమ్మాయ్! ఇప్పుడు సమస్యేమిటట?"
   
    "ఆ ప్రేమలేఖ...." టక్కున అంది లావణ్య.
   
    "అది రాయడం నేరమనేగా నేను సస్పెండ్ చేయిస్తానన్నది" గందరగోళంగా మొహంపెట్టాడు.
   
    "అది రాయడం నేరంకాదు" తేల్చేసింది లావణ్య
   
    "మరి?"
   
    "అలా బేవార్సుగా రాయడం."
   
    తత్తరపడ్డాడు తెలుగు  లెక్చరర్.
   
    లావణ్య కళ్ళొత్తుకుంది. "ఇది నాకు వచ్చిన తొలి ప్రేమలేఖ....
   
    కానీ ఇంత టేస్ట్ లెస్ గా వుంటుందని నేననుకోలేదు. అందుకే నేను ఇందాక బావురుమన్నది.
   
    తెల్లమొహం వేసుకుని చూస్తున్నాడు లెక్చరర్.
   
    "ఎన్నో తెలుగు నవలలు చదివాను.....పరమనికృష్టమైన తెలుగు సినిమాలూ చూశాను. కానీ ఏ కథలోనూ, ఏ మగాడూ ప్రేమించిన అమ్మాయికి ఇంత హీనంగా ఉత్తరం రాయడం నేను చదవలేదు....చూడలేదూ."
   
    "అంటే ఇప్పుడు నేనేం చేయాలట" నెరసిన జుట్టున్న బుర్రని గోక్కుంటూ చూశారాయన.
   
    "తెలుగు లెక్చరర్ అయ్యుండీ ఒక మంచి తెలుగు వాక్యం రాసే భాషని మీ విద్యార్ధులకి నేర్పని మీ నిస్సహాయతకి వెంటనే...."
   
    "సిగ్గుపడాలంటావ్...." నిస్త్రాణగా టేబుల్ కి జారగిలబడి పోయారాయన. "అవునూ....ఇప్పుడీ ఉత్తరాన్ని ఏం చేయాలి" మతి చెడిందేమో గొణుగుతున్నట్లుగా అడిగారు.
   
    "వెంటనే అప్పారావ్ కి ఇచ్చేయండి. పట్టుమని పది మంచి వాక్యాలైనా పొయిటిక్ గా రాయటం చేతకానివాడి మొహానికి ప్రేమేమిటి అని మొహం వాచేట్టు చీవాట్లు పెట్టండి. ప్రపంచంలో మరే ప్రేమికుడూ ఇలాంటి పొరపాటు చేయకూడదని ఎలుగెత్తి చాటండి" తను విరివిగా చదివిన ప్రేమకథలలోని భాషని ఘోషగా చెప్పగానే ఉన్న కొద్దిపాటి జుట్టునీ పీక్కుంటూ స్వప్నంలోలా బయటికి నడిచాడాయన.
   
    ఇక్కడో లావుపాటి లావణ్య ప్రేమకోసం ఎంత తపించిపోయిందీ తెలుసుకున్న అప్పారావు ఓరగా వాలి వేడి నిట్టూర్పులు విడుస్తున్నాడు.
   
    అప్పటికి తేరుకున్న శంకూ ఆఖరి పిరియడ్ దాకా ఎలా గడిపాడో అతనికీ గుర్తులేదు.
   
    "శంకూ...."
   
    ఎవరో పిలిచినట్టయి చప్పున తల పైకెత్తాడు.
   
    సావేరి నవ్వుతూంది ఎదురుగా నిలబడి.
   
    అప్పటికే క్లాసంతా ఖాళీ అయిపోయింది లంచ్ అవర్ కావడంతో....
   
    "చె...చెప్పండి...." తొట్రుపడుతూ పైకి లేచాడు. ఇందాక ఆమె అనవసరంగా తన పేరు చెప్పేస్తుందేమో అన్న టెన్షన్ పూర్తిగా విడిచిపెట్టలేదు. "ఏం కావాలి?"
   
    "జవాబు"
   
    "దే....దేనికి?"
   
    "నేనో పజిల్ ఇస్తాను. దానికి సమాధానం చెప్పాలి."
   
    పజిల్స్ ద్వారా ప్రేమికులు దగ్గర కావడమన్న సత్యాన్ని ఈమధ్య మిక్స్ అండ్ బుక్స్ ఇంగ్లీషు నవలద్వారా గ్రహించడంతో అదే మార్గంలో తనూ ప్రయాణం చేయాలని గట్టిగా తీర్మానించుకున్నదై "పజిల్స్ టు సూపర్ ఇంటలిజెంట్స్" అన్న ఓ పుస్తకాన్ని కొని అది యిప్పుడు శంకూపై ప్రయోగించడానికి ఉద్యుక్తురాలైంది. "నువ్వు రడీయేనా?"
   
    "అహ...." వాటిని గురించి బొత్తిగా తెలీని శంకూ తల అడ్డంగా వూపాడు. "నాకస్సలు తెలీదు...."
   
    "వట్టి పప్పుముద్ద" అతను ఇంటెలిజెంట్ కాదని రూఢీ పడిపోవడంతో "మరేం వద్దు" అడిగింది విడీ విడని నవ్వుతో.
   
    "పొడుపు కథల్లాంటివైతే...." తను మరీ "వీక్" కావడం ఇష్టం లేక నెమ్మదిగా అన్నాడు.
   
    వెంటనే సావేరికి మంగ చెప్పిన ఓ పొడుపుకథ గుర్తుకొచ్చేసింది. "పచ్చని పొదలో విచ్చుకుంటుంది. తెచ్చుకోబోతే గుచ్చుకుంటుంది."
   
    సిగ్గుపడిపోతూ నవ్వేశాడు-అదో బూతువాక్యంలా అనిపించడంతో.
   
    "ఎందుకా నవ్వు....పెద్ద అర్ధమైపోయినట్లు."
   
    "పాడు పొడుపు కథ....అంటే చాలా చెడ్డదన్నమాట."
   
    "గాడిద గుడ్డేం కాదూ....మహామగాడిలా నవ్వొకటీ...." శంకూ చూపుల్లో ఏం అర్ధం స్పష్టమైందో అమాంతం తల వాల్చేసింది. "నువ్వనుకున్న జవాబు రాదులే. అదిగో అలా కిసుక్కున నవ్వితే చంపుతా....బాగా ఆలోచించి చెప్పాలి."
   
    "అయిదు నిమిషాలు టైం ఇవ్వు" దీర్ఘంగా ఆలోచించేస్తున్నాడు.

    "అయిదు గంటలు యిస్తున్నాను...."
   
    "అక్కర్లేదు...."
   
    "అబ్బా....ఇక్కడే చెప్పేద్దామానుకుంటున్నావా? అదేం కుదరదు అసలెందుకు అడిగాననుకుంటున్నావ్? ఆ జవాబు చెప్పడానికి సాయంకాలం నువ్వు ఏటి ఒడ్డుకు రావాలని..." అసంకల్పితంగా కక్కేసింది. అతడ్ని ఒంటరిగా కలుసుకుని తీరుబాటుగా మాట్లాడాలనుకున్న ఉత్సాహాన్ని యిలా బయటపెట్టేయడం ఆమెకీ నచ్చని విషయమే...."సాయంకాలం ఆరుగంటలకి ఏటి ఒడ్డుకు వస్తావుకదూ!"
   
    తల అడ్డంగా వూపాడు కంగారుగా. "రాను...."
   
    "అలా పిరిగ్గొద్దులా వుంటే అందరూ నిన్ను ఆట పట్టిస్తారు నేను వూరికినే పిలుస్తున్నాననుకున్నావా.... నిన్ను నాలాగా ధైర్యవంతుడ్ని చేసేయాలని..."
   
    "ఏటి ఒడ్డునైతే ధైర్యం వస్తుందా? ఊరికినే అంటున్నారు కాని...."
   
    "ఇదిగో" హెచ్చరిస్తున్నట్టుగా అంది "మీరూ...రూ" అంటూ ఎడ్రస్ చేస్తే నాకు మహతిక్క....ధైర్యంగా నువ్వు అనలేవూ" అదే తన తొలి పాఠంలా చెప్పింది.
   
    "నావల్ల కాదు....." బింకంగా అన్నాడు.
   
    "అవుతుంది రోజూ ఏటి ఒడ్డుకు వస్తే నేను నేర్పుతాను."
   
    ఉలికిపడుతూ చూశాడు. "ఏమిటి నేర్పుతావు?" మొన్న మంగ అంది. 'నేర్పుతా'నని...సావేరి అలా అనటం మంగ అన్నప్పటి కంటే ఇంపుగా అనిపించినా సూటిగా ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాడు. "నాకన్నీ తెలుసుగానీ బోలెడు భయం...." సావేరికి సైతం వినబడనంత నెమ్మదిగా గొణిగాడు....
   
    "బోడి ఏం తెలుసు....అసలు మగాడంటే ఎలా వుండాలి.....?"

 Previous Page Next Page