"ఎవరన్నా చూస్తారు" లేచాడు అలా ఒంటరిగా మాట్లాడటం ఇష్టంలేనట్లు రవి స్నేహితులెవరన్నా చూస్తారేమో అని భయపడుతున్నట్టుగా....
"అంటే...." ఈసారి సావేరి బోలెడంత సిగ్గుపడిపోతూ తామర తూడుల్లాంటి వేళ్ళను బెంచీపై రాస్తూ అంది "ఎవరన్నా చూడకపోతే నాతో మాట్లాడటం నీకిష్టమే అన్నమాట.....చూడూ....అందుకే మనం రహస్యంగా రోజూ ఏటి ఒడ్డున కలుసుకుందామంటున్నాను."
సావేరి ఎంత మొండి ఘటమో మొన్న విన్నాడు.... నిన్న ఆమె తన ఇంటికి సరాసరి రావటంతో ప్రాక్టికల్ గా తెలుసుకున్నాడు.
"సారీ...."
తల పైకెత్తి చూసింది సీరియస్ గా.
"నేనన్నది సావేరీ అని కాదూ....సారీ అంటున్నాను."
"అందుకే నేనూ సీరియస్ గా చూస్తున్నాను"
ఇప్పుడు సావేరి అన్నయ్య, బావలంటేనే కాదు సావేరి అన్నా భయంగా అనిపిస్తూంది. "మరేమో...." నూతిలోలా వినిపిస్తూంది శంకూ కంఠం! "రోజూ వద్దుగాని అప్పుడప్పుడూ....."
"నథింగ్ డూయింగ్...." రోషంగా అంది. "ప్రతిరోజూ కలవాలి. అది ఈ రోజుతో మొదలు కావాలి...."
"సావేరీ! అదెంత ప్రమాదమో....."
శంకూ వాక్యం యింకా పూర్తి కానేలేదు "కలవకపోతే ఎంత ప్రమాదమో నువ్వాలోచించటంలేదు...."
అర్ధం కానట్లు చూశాడు "కలవకపోతే ప్రమాదమేమిటి?"
"నువ్విందాక రాసిన స్లిప్ నా దగ్గరుంది...."
"అయితే...."
"అది మా అన్నయ్యకిచ్చాననుకో....."
"ఎందుకూ..." హడావుడిపడ్డాడు.
"నీ కాళ్ళు విరగ్గొట్టించడానికి...." తన ప్రేమనయినా శాసించి గెలవాలన్న ఉక్రోషం..... అబద్దమనుకోకు.....నువ్వు రాకపోతే అంత పనీ చేస్తాను...."
ఆ గదిలో హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది.
"అదికాదు సావేరీ! నాకూ రావాలనే వుంటుంది. కానీ.....వచ్చాననుకో....ఒకవేళ మీవాళ్ళెవరయినా చూస్తే...."
"చూస్తే...."
"నిన్ను కలుసుకుంటున్నందుకు నా కాళ్ళు విరగ్గొడతారు...." తనకు ఆమెను కలుసుకోవటం చాలా చాలా ఇష్టమైనా పర్యవసానాన్ని అంతకంటే స్పష్టంగా చెప్పలేకపోయాడు.
అప్పుడు చూశాడామె నేత్రాలనుంచి వర్షిస్తున్న కన్నీళ్ళని....
అతడి మాటల్ని ఖండించేదే....కానీ నిన్న మొన్నటి సంఘటనలు ఆమెనూ అంతర్లీనంగా కలవరపరుస్తున్నాయి. తమ మధ్య అంతరం రేపు అవాంతరం అవుతుంది. అది తననేమీ చేయలేదు. కానీ అనుకోనిది జరిగినప్పుడు శంకూ ప్రేమని సాంబ్రాణిగ అంటించి తనకది ధూపంగా మిగిల్చి తనవాళ్ళే తన కథకు ఉరితాడుగా మారతారు.
రెండు క్షణాల మౌనం....
సరిగ్గా అప్పుడు ఆమెలో అలవాటయిన అహం పురివిప్పింది.
పెదవులు హరివిల్లులా వంగి రోషం కెంపులై చెంపల్ని చేరుకుంది. "నేను మహా మొండిదాన్ని.... నీకేమన్నా అయితే...."
ఖండించలేదు శంకూ! కానీ ఏం చేయగలవన్నట్టు చూశాడు.
"నేనూ నీకన్నా ముందు...చచ్చి....పోతా...."
అతడి చేయి అసంకల్పితంగా ఆమె పెదవుల్ని చేరుకుంది.
"నువ్వూ రియాక్టవుతావన్నమాట.....!" కళ్ళు తుడుచుకుంటూ చూసింది నవ్వుతూన్న శంకూని.
పేరుకు తగ్గట్టు భోళాశంకరుడిలా వస్తానని వరమిచ్చాడు. "సాయంకాలం ఆరుగంటలకి సరేనా?"
బయటికి నడవబోతూ క్షణం ఆగింది. "వచ్చినప్పుడు చెప్పాలి."
"ఏమిటి?"
"అదే....పచ్చని పొదలో విచ్చుకుంటుంది. తెచ్చుకోబోతే గుచ్చుకుంటుంది.....దానికి జవాబు."
తల గోక్కుంటూ వుండిపోయాడు.
"గోడమీద బొమ్మ గొలుసుల బొమ్మ" లాంటివి తప్ప ఇలాంటి పొడుపుకథ తానెప్పుడూ వినలేదు.
అయినా ఓడిపోకూడదనుకున్నాడు.
వెళ్తున్న సావేరితో కలిసి బయటికి వెళ్ళలేదు శంకూ! అదెంత ప్రమాదమో ఊహించి ఆగిపోయాడు కాని__
అప్పటికే క్లాస్ రూంలో ఇద్దరి కబుర్లనీ దూరం నుంచి గమనించాడు సుధాకర్! తనను సావేరి చెప్పుతో ఎందుకు కొట్టిందీ అర్ధం కావటంతో వేగంగా ఆ వార్తని రవికి చేరవేశాడు.
రవి భ్రుకుటి ముడిపడింది. సరిగ్గా రూపం ఏర్పడని ఓ అనుమానం యిప్పుడు గుండెల్ని చీల్చుకువచ్చే అంకురమై అది క్రమంగా వటవృక్షమై పోతూంది.
సావేరి అతడికి ముద్దులచెల్లి.....పిలిచి మాట్లాడితే మొండికేస్తుంది.
కోపం తారాస్థాని చేరుకుంటుంటే దాన్ని బలంగా శంకూపైకి మళ్ళించాడు.
* * * *
చేతిలో టిఫిన్ బాక్స్ తో శంకూ కారిడార్ లో నడుస్తున్నాడు.
ఆ రోజు సురేంద్ర కాలేజీకి వచ్చుంటే అతడితో కలిసి కేంటీన్ లో భోంచేసే శంకూ ఇప్పుడు ఒంటరిగా వెళుతున్నాడు.
సావేరి మాటలను మననం చేసుకుంటూ ఓ ట్రాన్స్ లోలా నడుస్తున్నాడు శంకూ! కేంటీన్ మలుపు తిరుగుతుండగా సుధాకర్ ఢీ కొనటంతో చేయి పట్టుదప్పి టిఫిన్ బాక్స్ నేలపై పడిపోయింది.
తెరుచుకున్న టిఫిన్ బాక్స్ లోని పెరుగన్నం, ఆవకాయ పచ్చడి నేలపాలై చెల్లాచెదురుగా పడిపోయింది.
ఫకాలున నవ్వులు వినిపించాయి.
ఎదురుగా నిలబడ్డ రవి బృందాన్ని చూడగానే బోధపడిపోయింది. అది కావాలని జరిగింది తప్ప కాకతాళీయం కాదని!
తను వేటాడబడుతున్నానన్న విషయం శంకూకి తెలీనిది కాదు. కాని క్షణ క్షణం ఇంత దారుణంగా శిక్షించబడటం మనసుని మెలిపెట్టి మరింత గాయపరచింది.
తిరుగుబాటు అతడి తత్వం కాదు.
ఎగతాళిగా నవ్వులింకా వినిపిస్తూనే నెమ్మదిగా నేలకి ఒంగిన శంకూ నేలపడ్డ మెతుకుల్ని పూడ్చి గిన్నెలో నింపుతున్నాడు.
"ఎంగిలి విస్తరాకుల్ని నాకె కుక్కలా అది ఊడ్చుతున్నావేంట్రా బడుద్దాయీ!" సుధాకర్ అవహేళనగా అన్నాడు.
శంకూ తన పనిలో నిమగ్నమయ్యాడు. ఒంట్లో బాగోలేదని బామ్మ వంట చేయలేక రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు కలిపి నింపింది. అది కూడా దక్కకుండా పోయింది. నిజానికి అలా ఊడ్చుతున్నది తినాలని కాదు. మెతుకులు మనిషి పాదాలకిందపడితే మహాపాపం అంటూ చెబుతూంటుంది బామ్మ! అందుకే పారేయాలని ఏరుతున్నాడు.
"జవాబు చెప్పడు చూడు....పచ్చడి మెతుకులగాడికి పౌరుషం ఎక్కువని."
యాంత్రికంగా అంతా చేసుకుపోయిన శంకూ ఉలుకూ పలుకూ లేకుండా వెళ్ళిపోయాడు.
ఓ చెట్టు మొదట్న బాక్స్ లోని అన్నం విసిరి కొళాయి దగ్గర చేతుల్ని కడుక్కున్నాడు.
ఒంటరిగా ఓ మూల మోకాళ్ళపై చేతులు పెట్టుక్కూర్చున్నాడు.
ఆకలిగా వుంది. అంతకుమించి మానసికమైన నిస్త్రాణ!"
జేబులు చెక్ చేసుకుంటే రూపాయిన్నరదాకా వుంది.
ఓ మామూలు కలుపుమొక్కలా బ్రతికే తన కోపానికి అంత విలువ లేదని శంకూకి తెలుసు. అందుకే జరిగింది మరిచిపోయి కాలేజీకి ఎదురుగా వున్న ఓ హోటల్లోకి వెళ్ళి ఓ పూరీ తెప్పించుకున్నాడు.
మరో అయిదు నిమిషాలలో డబ్బులు చెల్లించి బయటికి వచ్చేవాడే సరిగ్గా అప్పుడు హోటల్లోకి వచ్చారు రవి బృందమంతా.