Previous Page Next Page 
అసావేరి పేజి 23

    "బతికిపోయాడు బాస్టర్డ్" సుధాకర్ తన స్నేహాన్ని మాటలతో ప్రకటిస్తూ రవితో అన్నాడు. "పద క్లాసులోకి పోదాం...."
   
    రెండు క్షణాలలో కాలేజీ ఆవరణ నిర్మానుష్యమైపోయింది.
   
    కారిడార్ లో ఓ స్థంభంవారనించి ఇదంతా చూస్తున్న సావేరి కళ్ళల్లో నీళ్ళు నిండాయి.
   
    సావేరి చాలా సేపటినించి నిలబడిందక్కడ.... తను ఎలా బాగుంటుందని నిన్న శంకూ అన్నాడో అలాగే తయారైంది. నీలంరంగు ఓణీతో పట్టుపావడా కట్టుకుని అతడికోసమే నిరీక్షిస్తుంది.
   
    "ఎప్పుడూ లేనిది ఇదేం విడ్డూరమే" అని అమ్మ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తుంటే 'ఆడపిల్లలు సంసారపక్షంలో వుంటేనే అందమమ్మా' అని తల్లి స్టేటుమెంటుని తల్లికే అప్పచెప్పి ఎంత ఉత్సాహంగా వచ్చిందని.
   
    ఇప్పుడు మూడ్ పాడైపోయింది.
   
    దానికి కారణం సుధాకర్....సుధాకర్ రెచ్చగొట్టి ఉండకపోతే అన్నయ్య అంత దారుణంగా ప్రవర్తించడు.
   
    మనసు మండిపోతూంది.
   
    క్లాసుకి వెళ్ళకుండా ఇంకా చెట్టునీడన నిలబడి షర్టు దులుపుకుంటున్న శంకూ దగ్గరకు వెళ్ళి ఓదార్చాలనుంది.
   
    అదిగో... ఆ సమయంలో చూసింది తన పక్కనుంచే ఏదో పనున్నట్లు నడిచి వెళుతున్న సుధాకర్ ని.
   
    "హాయ్" పలకరించింది అసంకల్పితంగా.
   
    ఉలిక్కిపడ్డాడు సుధాకర్.... పుట్టి బుద్దెరిగాక ఏ అమ్మాయి పరామర్సకీ నోచుకోని జాతకమేమో ఇప్పుడు సావేరిలాంటి కాలేజీ బ్యూటీ అలా పిలిచేసరికి ఉబ్బితబ్బిబ్బైపోయాడు.
   
    "పి.....లి...చా....రా?"
   
    "మరేం...."
   
    "కొంపదీసి మీ బ్రదర్ కి సపోర్టుగా ఇంకా నేను చూపించిన ప్రతాపంగాని చూశారేమిటి?" గర్వంగా అడిగాడు.
   
    "యూ ఆర్ రైట్...." కోపాన్ని నిభాయించుకుంటూ మొహానికి నవ్వు పులుముకుంది "యూ ఆర్ స్మార్డ్ గే....అరెస్ట్ యూ."
   
    "అఫ్ కోర్స్...."
   
    "మీరు సిగరెట్సు బాగా కాలుస్తారు కదూ?"
   
    ఆమెతో మాట్లాడుతుంటే చిత్రమైన పారవశ్యానికి లోనైపోతున్నాడు. "మరేం...."
   
    "పైగా అవన్నీ అరువు సిగరెట్లు అనుకుంటాను.....అంటే మా అన్నయ్యని కాకా పట్టి కొనుక్కునేవి..."
   
    "వ్వాట్?" ఏదో అపశృతి ధ్వనించడంతో నొసలు చిట్లించాడు.
   
    "అహ....నువ్వక్కడ అరువు సిగరెట్ తో అంటించావుగా....నేను సొంత చెప్పుతో నీ చెంప" వాక్యం పూర్తి కానేలేదు. కానీ ఆమె చేతిలోని చెప్పు సుధాకర్ చెంపని తాకింది.
   
    ఆ చప్పుడు ఎంత గట్టిగా వినిపించిందీ అంటే కారిడార్ కి ఆవలి ప్రక్కనున్న విద్యార్ధులు పరుగెత్తుకొచ్చారు. "బాస్టర్డ్...." కసి తీరినట్టు టాపిక్ మార్చేసింది. "నిమ్మాంజి అంగుళాంజీ అంటావా...." ఇందాక విన్న దాంట్లో అదొక్కటే గుర్తుంది సావేరికి.
   
    "మేడమ్....అమ్మతోడు నేను మిమ్మల్ని అలా అన్నానా...." సమీపంలో నిలబడ్డ సీనియర్ విద్యార్ధుల ముందు ఇలాంటి అపవాదు అతడు భరించలేకపోతున్నాడు. అంతకుమించి రవికి తెలిస్తే!
   
    "నో ప్రాబ్లమ్....మా అన్నయ్యలా నేను పక్కవాళ్ళ బలంపై ఆధారపడను. చెప్పనులే...." ఉక్రోషంగా తల విదిలించుకుని వెళ్ళిపోయింది.
   
                                          *    *    *    *
   
    "తెలుగు లెక్చరర్ చాలా ఉధృతంగా రుక్మిణీ కళ్యాణం పాఠం చెప్పుకుపోతున్నాడు.
   
    ఆయన పూర్వాశ్రమంలో బుర్రకథ దళంలో ఒక సభ్యుడిగా విరివిగా వూరూరూ తిరిగే అలవాటు వుండటంతో చెప్పే ప్రతిపాఠాన్ని ఆ స్థాయిలో వల్లిస్తూంటాడు....వాక్యాల్ని విరుస్తూ పదాల్ని కుదిస్తూ ఎంత తన్మయత్వంలోకి జారిపోతుంటాడంటే క్లాసులో విద్యార్ధులు 'భళాభళీ' "సై సై" అంటూ వంత పాడుతున్నా పట్టించుకోడు. పైగా ఇంకా రెచ్చిపోవడం ఆయనకున్న దుర్గుణాలలో ఒకటి.
   
    "అంతటా వార్త అందెను."
   
    "సై...."
   
    "కృష్ణుడు వెంటనే వచ్చెనూ."
   
    "సై...."
   
    "రుక్మిణీ దేవిని కలిసెను."
   
    "సై...."
   
    విద్యార్ధులు ఉత్సాహంగా 'సై' అంటుండగా ద్వారం దగ్గరకు వచ్చిన శంకూ క్షణం నిలబడ్డాడు. కానీ క్లాసు పరిస్థితి చూసే అనుమతి కోసం అడగాల్సిన ఆగత్యం లేదనిపించడంతో గేలరీలో ఖాళీగా వున్న వెనుక బెంచీ వేపు నడుస్తూ ఆగమన్నట్లు సంజ్ఞ చేసింది సావేరి.
   
    తొట్రుపడ్డాడు శంకూ.
   
    "నిన్న తీసుకున్నాగా" పక్కన కూర్చున్న అమ్మాయిలకి అనుమానం రాకుండా అనేసి ఓ టెక్స్ట్ బుక్ అందించింది.
   
    ముందు అర్ధంకాలేదు....వివరంగా అడుగుదామంటే సావేరి పక్కనే కూచున్న లావణ్య భీకర రూపానికి బెదిరి నిశ్శబ్దంగా నడిచి నాలుగో బెంచీలో సెటిలైపోయాడు శంకూ.
   
    పాఠం బుర్రకథలా కొనసాగుతూనే వుంది.
   
    టెక్స్ట్ బుక్ తెరిచాడు తనను ఎవరూ గమనించడం లేదన్న నిర్ధారణకు వచ్చాక!
   
    "బాగున్నావా?" ఓ తెల్లకాగితంపై ముత్యాల్లాంటి అక్షరాలు.
   
    సావేరి ఎదురుగా కూర్చుని పలకరిస్తున్నట్టుగా అనిపించి ఇందాకటి సంఘటన సైతం మరిచి కొన్ని క్షణాలు అలాగే వుండిపోయాడు.
   
    "బాగు....న్నా....వా?" నేలకీ, గాలికీ నోరొచ్చి అడుగుతున్నట్లు గుండె గోలపెడుతూంది ముందురవమై పిదప పరమై ఎంత పులకింతని-
   
    పెదవి విప్పే ధైర్యం సైతం చేయలేని శంకూ పెదవులు మృదువుగా విచ్చుకున్నాయి. మంచు మైదానంలా గడ్డ కట్టిన మనసు ఓ ముగ్ధ దరహాసంతో పురివిప్పిన మయూరిలా పరవశిస్తుందనే థియరీ తెలిసే వయసుకాదు శంకూది అయినా సాహసం చేశాడు.
   
    నోట్ బుక్ లో కాగితం చింపి ఏదో రాసి ఇందాకటి టెక్స్ట్ బుక్ లోనే వుంచి వెంటనే అందించాలని పైకి లేచాడు చప్పుడు చేయకుండా.
   
    ఇక్కడ శంకూ చేసిన తప్పు నడుస్తూ కంగారుగా మధ్యలో ఆగిపోవడం.
   
    అంతకు పూర్వం నుంచే లావణ్యని అదేపనిగా గమనిస్తున్న అప్పారావు పాఠం వినడం ఎప్పుడో మానేశాడు. ఇప్పుడు శంకూ ఆ 'బుక్' ఎవరికివ్వాలనుకుంటున్నదీ తెలిసినట్టు గభాలున లాక్కుని లావణ్యకి అందించాడు. అలా ఇవ్వటంలోనూ అప్పారావుకి దురుద్దేశం లేదు. అందులో ఓ 'స్లిప్' రాయబడి వుందని తెలీక ఆ 'బుక్' సావేరికి అందించమని చెబుతూ అలా లావణ్యతో ఓసారి మాట్లాడే అవకాశం తీసుకోవాలనుకున్నాడు.
   
    కానీ ఆ విషయం చెప్పకముందే అప్పారావు లెక్చరర్ దృష్టిలో పడిపోయాడు.
   
    ఆ గదిలో హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది.
   
    "పాఠం బుర్రకెక్కాలని బుర్రకథలా చెబుతున్న సదరు లెక్చరర్ గారు 'భళిభళీ' అన్నారు అక్కడో దారుణమైన సన్నివేశం చూసినట్టు.
   
    తన సీటులో కూర్చున్న శంకూ కంపించిపోతున్నాడు.
   
    అప్పటికే నోట్ బుక్ లోని రాసిన కాగితాన్ని చూసిన లావణ్య వెంటనే బావురుమంది.
   
    ఆ ఏడుపు బుర్రకథ చరణం చివరలో 'తందాణా దేవనందనానా' అనే పేధటిక్ టచ్ ని గుర్తు చేయగానే లెక్చరర్ ఒక అంగలో డయాస్ పైనుంచి క్రిందికి దూకి లావణ్యని చేరుకున్నాడు.
   
    "నిన్నరాత్రికన్నా ఇప్పుడే బాగున్నారు."
   
    కాగితాన్ని లాక్కుని ఒక్కసారికాదు పదిసార్లు గొంతుని ఆరోహణ అవరోహణల మధ్య నొక్కిపట్టి మరీ చదివారాయన.

 Previous Page Next Page