Previous Page Next Page 
విషవలయం పేజి 22

    ఓనాడు యిమకృష్ణయ్యగారు సత్యమూర్తి దగ్గరకు వచ్చి "ఓ పది వేలు యిట్లా తేరా" అన్నాడు మామూలుగా.

    సత్యమూర్తికి గుండె గుభేలుమంది. "ఎందుకు?" అన్నాడు భయపడుతూ.

    "ఎందు కేమిట్రా? పదివేలు లాభం తెచ్చినందుకు సంతోషించక. డెత్ డ్యూటీ యిరవై వేలల్లా నా పలుకుబడి ఉపయోగించి పదివేలు చేయించాను. అన్నట్లు పదివేలేమిటీ నా మొహం? పని జరగటానికి, ఓ రెండువేలు ఆశ చూపించాల్సి వచ్చింది. అయితే ఏంటే ఎనిమిదివేలు లాభం. కాని నువ్వొక్కడివే యిదంతా భరించాల్సిన అవసర మేముందీ? నీ తల్లిసగం, నువ్వుసగం. వెళ్ళి ఆవిడ్ని అడిగి రొక్కంపట్రా."

    "ఇస్తుందంటావా?" అనడిగాడు సత్యమూర్తి నసుగుతూ.

    ఈ మాటలకు రామకృష్ణయ్యగారు దహించుకు పోయినట్లయి, పెద్ద పెట్టున కేకలు పెడుతూ "యిస్తుందీ? ఎవడికోసం యిస్తుంది? ఇదేమన్నా దయాభిక్షా? ఇవ్వకపోతే కోర్టు నుంచి వారంటు వస్తుందని చెప్పు" అన్నాడు.

    సత్యమూర్తి యీ సన్నివేశం ఎలా తట్టుకోవాలో తెలీక సతమతమవుతూ "యిప్పుడే వెళ్ళమంటావా?" అన్నాడు.

    "ఆఁ తక్షణం. ఇవాలే గనుక ఆ డబ్బు కట్టకపోతే నేను చేసిన ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఊఁ కదులు మీనామేషాలు లెక్కపెడుతూ కూర్చోకు.

    "పోనీ...నువ్వు వెళ్ళి అడగకూడదా నాన్నా?"

    ఈ మాటకు తండ్రి కళ్ళు పెద్దవిచేసి, నోరు వికృతంగా కదుపుతూ "ఓరి చవట వాజమ్మా..."

    అంత పెద్ద దూషణ వాక్యం భరించటం సత్యమూర్తికి కష్టమైపోయింది. అతనికి పౌరుషం వచ్చింది. లేచి చరచర రాధమ్మగారి గదివైపు వెళ్ళాడు.

    ఆ సమయానికి రాధమ్మగారు మంచంమీద బాలీసుకు ఆనుకుని కూర్చుంది. ఆమెకు యిరువైపులా తమ్ముడు వీరభద్రం, మరదలు సుభద్రమ్మా పరివేష్టించి వున్నారు.

    "అసలు మాటేమిటంటే వదినా..." అంటూ ముప్పయియేళ్ళ మరదలు సత్యమూర్తిని చూసి అర్దోక్తిలో ఆగిపోయింది.

    దాన్నిబట్టి ఎవరో వచ్చినట్లు గ్రహించి రాధమ్మగారు తల త్రిప్పి, ఏ కళనున్నదోగాని ప్రసన్న వదనంతో "రా నాయనా సత్యం! ఏమిటి సంగతి?" అని అడిగింది ఆదరంగా. ఏదో విశేషం వుంటేనేగాని అతనక్కడకు రాకపోవటం పరిపాటయిపోయింది.

    వీరభద్రం లేచి ప్రక్కన నిల్చుని కోరమీసాలు దువ్వుకుంటున్నాడు.

    సత్యమూర్తికి ఆమెను చూడగానే ధైర్యం సన్నగిల్లిపోయినట్లయింది? తను అడగబోతున్న దాంట్లో తప్పేమీలేదు. కాని తను ఎందుకు కఠినంగా తయారౌతున్నాడు? తన చుట్టూ ఏవయినా విషవలయాలు ఏర్పడుతున్నాయా?

    అయినా తప్పదు. తడుముకుంటూ, తడబడుతూ వచ్చిన విషయం చెప్పాడు.

    ఆమె సావధానంగా ఆలకించి, ఒక క్షణం మెదలకుండా ఊరుకుని "మరి యీ విషయం ఇన్నాళ్ళూ చెప్పకుండా హఠాత్తుగా యిలా బయటపడితే ఎలా?" అంది.

    "నాన్న మనం కట్టవలసిన డబ్బు తగ్గించటానికి యిన్నాళ్ళూ ప్రయత్నం చేస్తున్నాడు. అంతా ఒక మార్గానికి వచ్చాక చెప్పుదాములే అని నేనూ ఊరుకున్నాను."

    ఆమె తమ్ముడివంక తిరిగి "ఈ డబ్బు కట్టడం అవసరమంటావా?" అని అడిగింది.

    వీరభద్రం భావయుక్తంగా ఓ భంగిమ ప్రదర్శించాడు. "నేనయితే ఇంత డబ్బు వృధాచెయ్యను" అన్నాడు.

    "ఏంచేస్తారు?" అని అడిగాడు సత్యమూర్తి కోపంవచ్చి.

    "బుద్ది అంటూ పనిచేస్తే లక్షాతొంభయి మార్గాలుంటాయి. ప్రపంచంలో లక్షాధికారులు ఎంతమంది చచ్చిపోవటంలేదు? వాళ్ళంతా ఇలాగే వేలకువేలుగుమ్మరిస్తున్నారా?"

    "మరి ఇప్పుడిలా జరిగింది. నాన్న కూడా లక్షాతొంభయికంటే ఎక్కువే మార్గాలు తెలిసినవాడు. ఆయన పూనుకున్నాడు గనుకనే యింతవరకైనా వచ్చింది"

    "సరే అయితే తప్పుతుందా? ఈ బచ్చా పెట్టుకోవల్సిందే అక్కయ్యా నువ్వు" అన్నాడు వీరభద్రం న్యాయం చెబుతూన్నట్లు.

    రాధమ్మగారు నిట్టూర్చి "అలాగే పంపిస్తానులే" అంది.

    సత్యమూర్తికి ఊపిరిపీల్చుకున్నట్లయి తిరిగి వెళ్ళబోతూ "నీ వంట్లో కులాసాగావుందా అమ్మా?" అని అడిగాడు.
   

 Previous Page Next Page