Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 22

   "అయితే నువ్వు చే సేది యాచనా? ప్రజాసేవా?" తక్కున అడిగాడు.

    "నేను ఎవరినీ ఏమీ అడగనే!"

    "అడగకుండానే వస్తూంటే ఎందుకడుగుతావు? వాళ్ళు ఏదో ఒక పూట భోజనానికి పిలువకుండా ఉంటే, నీ ఇంటికి కూరగాయలు, పాలు ఏ వస్తువూ పంపకుంటే ఏం చేస్తావు?"

    "ఇక బ్రతుకు తెరువుకు ఏదో ఒక పని చూచుకోవాలి! కాని, నా జీవితంలో కొంత సమయాన్ని ఇలా ఖర్చుపెట్టడం ఇష్టంలేదు!"

    "ఒక్క ప్రజాసేవ చెయ్యడం వల్లే నీ సమయం సార్ధక మౌతుందంటావు! ఇలా నీ జీవితానికి ఒక గొప్పదనం సంపాదించుకోవాలనుకొంటున్నావు. ఒకరి కోసం నువ్వు బాధపడటం, వాళ్ళ కోసం నువ్వేదో చెయ్యడం ఇదంతా ఎందుకు? కీర్తి కోసమా?"

    "కీర్తినాకక్కరలేదు. గొప్పధనమూ అక్కరలేదు!"

    "నువ్వు అక్కరలేదన్నంత మాత్రాన అవి రాకుండా ఉండవు! నువ్వు చేస్తున్న 'సేవ' నీకక్కరలేకపోయినా కీర్తినీ, గొప్పదనాన్నీ తెచ్చి నీ నెత్తిన పెడుతుంది కిరీటంలా! మహనీయులు తమకు తెలియకుండానే మహనీయులౌతారు! ఆ మహనీయత చూచుకొని గర్వపడతావేమోగాని నీ జీవితంలో ఎంత శూన్యం ప్రోగు చేసుకొంటే ఆ మహనీయత వస్తుందో నువ్వు ఎప్పుడూ ఆలోచించి ఉండవు! ప్రియురాలి కోసం పరిగెత్తాల్సిన వయసులో ఎవరి కన్నీళ్ళో తుడవడానికి కరుణతో గుండె నింపుకొంటున్నావంటే, నువ్వేం పోగొట్టుకొంటున్నావో నీకు తెలియడం లేదా?"

    "ఈ ప్రపంచంలో దీనులే నా ప్రియులు."

    "ఇది నిన్ను నువ్వు మోసం చేసుకొని ప్రపంచాన్ని మోసం చేసే మాట! ఇలా మాట్లాడుతున్నావంటే నువ్వు సింగినాదాని వన్నా కావాలి! లేదా..." అజయ్ నవ్వసాగాడు.

    అతడి నవ్వుతో తనూ శృతి కలిపి, "తిను! అనుభవించు! గుప్పిళ్ళ కొద్దీ ఆనందం జుర్రుకో! సుఖించు! ఇవీ నీ మాటలు! నీ ఆలోచనలకూ, నా ఆలోచనలకూ చాలా దూరం! అజయ్, నీతో నేను మరోసారి వాదిస్తాను. ఇప్పుడు నాకు టైం లేదు. బస్సుకు వెళ్ళిపోవాలి!" అని లేచాడు రామచంద్ర. "వెళ్ళొస్తాను, అమ్మా! వెడతాను అజయ్!" మెడ త్రిప్పేసరికి మెట్లమీద చిన్నబుచ్చుకొన్నట్టుగా నిలబడిన ప్రేమీ కనిపించింది. "ప్రేమిక ఇక్కడే ఉందే! ఇంటికి వెళ్ళి చెప్పేపని తప్పిపోయిందన్నమాట! వస్తాను. ప్రేమికా! ఉత్తరాలు రాస్తుండు!"

    రామచంద్ర వెడుతూంటే అజయ్ అన్నాడు. "అతడేదో గొప్ప పని చేస్తున్నాడన్నట్టు మీరంతా ప్రోత్సహించడం బాగాలేదు, మమ్మీ. దొరికిన పూటతిని, లేనిరోజు పస్తు పడుకొంటున్నత్తుగా మనిషి చిక్కిపోయి నల్లబడలేదూ?"

    "ప్రజాసేవకుల జీవితం పూలపాన్పుకాదుగా ఒళ్లొచ్చి తెల్లబడడానికి?"

    "ఎందుకో అర్ధంలేని ఈ త్యాగాలు!"

    తన వెనుక నిలబడిన ప్రేమీని తలపైకెత్తి చూస్తూ, "ఏం మాట్లాడవేం, పాపా?" అంది సువర్చల. "ఏమిటో ఈరోజు దిగులుగా, మౌనంగా కనిపిస్తున్నావు!"

    "తలనొప్పిగా ఉంది. నేను ఇంటికి వెడతాను, ఆంటీ!"

    "చెప్పవేం? టాబిలెట్ వేసుకొని కాఫీ తాగు! కూర్చో, పాపా! కాఫీ తెప్పిస్తాను" అంటూ లేచి లోపలికి వెళ్ళింది సువర్చల.

    "పాపా! ఒక ఆట వేద్దామా? తలనొప్పీ గిలనొప్పీ హాంఫట్!" పేక కలుపుతూ హుషారుగా అడిగాడు అజయ్.

    మూతి బిగించి ముఖం విసురుగా త్రిప్పుకొంది ప్రేమీ.

    "ఓ! నిన్ను పాపా అని పిలువకూడదు కదూ? ఏమిటో అలవాటు చొప్పున అలా వచ్చేస్తుంది! సారీ! ఇక ముందు అలా పిలువను! ఇదిగో, ఇప్పుడే నా నిర్ణయాన్ని అమలు పరుస్తున్నాను! ఒక ఆట వేద్దమ్మా, ప్రేమికారాణి?" కన్నుగీటుతూ కొంటెగా అడిగాడు.

    ప్రేమీ ఎత్తిన చేతిని పట్టుకొంది సువర్చల. "ఏమిటమ్మా మావాడి మీద అంత కోపం?" నవ్వుతూ అడిగింది. మరో చేతిలో ఉన్న కాఫీ కప్పును ప్రేమీ ముందుంచింది. "ఇదిగో! నువ్వు శాంతపడడానికి లంచం!" అన్న భావం ముఖంలో ప్రకటితంచేస్తూ.

    "కన్నకొడుకు మీద తల్లిగా మీకెంత ప్రేమున్నా తప్పులేదు, ఆంటీ! ఆ ప్రేమ గుడ్డిదిఅయితే అనుభవిస్తారు ఒకనాడు! నిజం! మీ ప్రేమ గుడ్డిది గనుకే అతడు చెడిపోవడం మీ కంటబడటం లేదు!" తీక్షణంగా అంది.

    "అజయ్ చెడిపోయినట్టుగా రుజువులున్నాయా?" ప్రేమీ మాటలను తమాషా క్రిందకట్టేస్తున్నట్టుగా అడిగింది.

    "ఆ రుజువులు నా చేతి కందిన రోజు అతడిని దోషిగా నేనే మీ ముందు నిలబెడతాను! కన్నకొడుకని మమకారం చూపుతారో, పెద్ద మనిషి తరహాగా ప్రవర్తిస్తారో చూస్తాను!"

    "మీ ఇద్దరికీ ఇంతపడకుండా ఎప్పుడయిందా అనిపిస్తుంది, పాము ముంగిసల్లా పోట్లాడుతారు! పాపా! అజయ్ నా కొడుకయితే నువ్వు నాకు కూతురు లాంటిదానివి! మీ ఇద్దరిమధ్య ఈ స్పర్ధ ఎలా రేగిందో, ఇది నా కెంత మనస్తాపాన్ని కలిగిస్తుందో ఎలా చెప్పను?" బాధగా అంది సువర్చల.

    "మీరు బాధపడాల్సింది ముందుంది, ఆంటీ!"

    "నన్ను శపిస్తున్నావా, పాపా?" సువర్చల ముఖంలో ఆవేదన, కొద్దిపాటి విస్మయం తొంగిచూశాయి!

    తన కాఠిన్యానికి తనే సిగ్గుపడిపోయింది ప్రేమీ. "నేను మిమ్మల్ని శపిస్తానా? నాకు శక్తి ఉంటే ఆ బాధ మిమ్మల్ని తాకకూడదని దీవించేదాన్ని!"

    "నేను అమ్మని బాధపెడుతానని నువ్వు ఎందుకు అనుకొంటున్నావు? ఆమెను ఎందుకు భయపెడుతున్నావు?" అజయ్ కోపంగా, నిలదీసినట్టుగా అడిగాడు.

    అజయ్ కేసి ఒక తిరస్కారమైన చూపు చూసి లేచింది ప్రేమీ.
   

 Previous Page Next Page