Previous Page Next Page 
భారతి పేజి 22

    సరిగ్గా  ఈ ప్రశ్నే  ఆమె తండ్రి  దగ్గర్నుంచి  రాకూడదను కుంది. 'నువ్వంటే అతనికి అంత ఆరాధనా భావం కదా, ఏరికోరి నీ మెళ్ళో తాళికట్టాడు  కదా_నిన్ను కాపాడే బాధ్యత అతనికి  లేదా?' అన్న భావం కనబడుతూంది  ఆయన చూపుల్లో.

    లేదన్నట్లు  భారతి తల ఆడించింది.

    గౌరీపతిగారు నిరాశగా  "ఇంతేనా  అతని వ్యక్తిత్వం? అంత హీనమైనదా అతని సంస్కారం? నిన్ను ప్రేమించానని, తనంతటతాను  రాయబారం  పంపించి, ఇంత చేసినవాడు  ఇప్పుడు అసమర్ధుడిలా ప్రక్కకి తప్పుకుంటాడా?" అన్నాడు.

    ఆమె ఇక  ఊరుకోలేక  "నెపం వారిమీద  ఎందుకు వేస్తావు నాన్నా? వారు ప్రేమించింది  అందంగా, ఆరోగ్యంగా కనిపించిన అమ్మాయిని_చేరదియ్యటానికి  వీలుగాని కుష్టుపిల్లని కాదు" అనేసింది  విసురుగా.

    "అమ్మా భారతీ! ఆ మాట  పదేపదే  ఉచ్చరించకమ్మా. నాకింకా కొనవూపిరి వున్నదమ్మా! అని ఆక్రోశంగా  గౌరీపతిగారు, రెండు చేతుల్లో ముఖాన్ని కప్పుకుని.

    "నాన్నా! అని దీనంగా పిలిచి  ఆయన  ముఖం నుంచి  చేతులు రెండూ మృదువుగా విడదీసింది భారతి. "నిజమంటే  అంత భయమెందుకు నాన్నా?"

    గౌరీపతిగారి  ముఖం పాలిపోయింది. ఇది ఎవరుచేసిన తప్పు? ఇది ఎవరికి ఇచ్చిన శిక్ష? తన చిన్నతనంలో  ఆయనకు ఉజ్జ్వలమైన భవిష్యత్తు మీద  తీరని నమ్మకం ఉండేది. ముందు ముందు తన జీవితంలో ఎన్నో విపరీతాలు జరుగుతాయనీ, తాను ఈ పల్లెటూరిని  వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి విశిష్టవ్యక్తిగా  కాలం  గడుపగలననీ  కలలు కంటూ వుండేవాడు. కాని భార్య గతించడంతో  ఆ ఆశలన్నీ  క్షీణించి పోవటమేగాక. దుర్భరమైన ఏకాకితనంతో బాధపడి, తన మనుగడకే ముప్పు వాటిల్లిందని గ్రహించి, అప్పటి నుంచి  యింతవరకూ ఏదో రకంగా  రోజులు గడపటానికే అలవాటు పడ్డాడు.

    కూతురి తలమీద  చెయ్యి వేసి నిమురుతూ  "నిజమంటే నాకు భయమని కాదమ్మా, ఎవడో బుద్ధిలేనివాడు ధగధగా మెరిసే బంగారం మీద కాస్త మకిర పూశాడనుకో. అంత మాత్రం చేత  దాని విలువ  తరిగి పోతుందా? అసలీ విషయం  వాళ్ళకెలా  తెలిసిందమ్మా?" అని అడిగాడు.

      "తెలియదు నాన్నా!" ఈ మాట అంటూంటే  భారతికి తనకు సంస్కారం తనెదుట వికటనృత్యం  చేస్తున్నట్లు కనపడి, ఆమె తల భూమిలోకి  కుంగిపోయినట్లయింది.

    "నిజం చెప్పు. నువ్వే బయట  పెట్టలేదు కదా?"

    ఈ మాటలు ఆమెకు మరింత  అవమానపరిచినట్లయినాయి. "ఏమిటి నాన్నా?" రుద్దకంఠంతో  అని ముఖం ప్రక్కకి  తిప్పుకుంది.

    ఆమెది ఎంత  సుకుమారమైన హృదయమో  తెలుసు కాబట్టి. ఎందుకు వ్యాకులచిత్తురాలయిందో  అర్ధం చేసుకున్నాడు.

    దేవుడు  మేలు చేసి, అంతా  సవ్యంగా  జరిగితే  సమయం  చూసుకుని కొన్ని రోజుల్లో తనే అల్లుడితో  ఈ విషయం  ప్రస్తావించుదామనుకున్నాడు. ప్రస్తావించి, విషయం రచ్చకెక్కకుండా, ఆమెకు వైద్య సదుపాయం  జరిగే ఏర్పాటు ఆలోచిద్దామనుకున్నాడు. కాని ముందే అంతా  తారుమారయిపోయింది.

    "నువ్వు విచారించకమ్మా, నాలుగురోజులు  గడిచి, నాకు మళ్ళీ కాస్త సత్తువ రానియ్యి. నేను వెళ్ళి వియ్యంకుడితో మాట్లాడి వ్యవహారం  చక్కపరుస్తాను. ఆగ్రహావేశంతో  పుట్టింటికి పంపించేసినంత మాత్రాన ఈ వైరాలు శాస్వతాలా ఏమిటి? నీకెందుకూ? నేను వెళ్ళి అంతా  సరిచేస్తాగా తల్లీ!" అన్నారు  గౌరీపతిగారు సముదాయిస్తున్నట్లుగా.

    భారతి ఆయనవైపు  తిరిగి "అలాగేలే నాన్నా! నీకు ఒంట్లోకి జనసత్త్వాలు వచ్చాక  నీ కోరిక ప్రకారమే చేద్దువుగాని. కాని  అప్పటిదాకా  మాత్రం  నీ కాళ్ళు పట్టుకుంటాను, మనసులో  ఈ దిగులేమీ పెట్టుకోక  హాయిగా విశ్రాంతి తీసుకుందూ" అని తండ్రి  కప్పుకున్న దుప్పటిని  కంఠంవరకూ  సరిచేసింది.

    అప్పటికి  కనుచీకటి పడుతూంది. ఉదయం నుంచి  ఆకాశం  ముసురుపట్టి  ఉందేమో, చలిగాలులు వీస్తున్నాయి.

    విశ్రాంతి తీసుకొమ్మని  తండ్రిని  మరోసారి  హెచ్చరించి భారతి గది బయటకు వచ్చేసింది.

    అదే సమయానికి  "భారతీ!" అన్న పిలుపు  వినబడి, ఉలిక్కిపడి, తల ఎత్తి  చూసేసరికి  ఆ మసక చీకట్లో ఎదురుగా  మల్లిక.

    "మల్లికా!" భారతి నోట్లోంచి మాట పూర్తిగా  వెలువడక ముందే  మల్లిక తుఫానులా వచ్చి స్నేహితురాలిని అల్లుకుపోయింది.

    ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోగా మల్లిక జాలిగా ఏడుస్తూంది.

    "భారతీ! అన్యాయం  జరిగిపోయిందే నీకు. దారుణం  జరిగిపోయిందే!"

    భారతి కొంతసేపటికి  మౌనంగా  ఊరుకుని స్నేహితురాలి ముఖం తన నుంచి  విడదీసి, ఆమె కళ్ళను పమిటచెంగుతో  తుడిచి "మల్లికా! ఏమిటే నీకీ పిచ్చి" అని అనునయిస్తున్నట్లుగా  ఆమె చెంపలు రాసి "అన్నట్లు, అమ్మగారి కెలా వుంది? నువ్వెప్పుడు వచ్చావు ఊరినుంచి?" అని అడిగింది.

    మల్లిక  పెళ్ళివారింటి నుంచి  చందరాల  రాగానే, అప్పటికే  ఆమె తల్లికి ఒంట్లో అస్వస్థత ఎక్కువై, ఆ ఊళ్ళో వైద్యసౌకర్యం  లేనందుకు  ఆమెను బెజవాడ  తీసుకువెళ్ళటానికి  ప్రయత్నాలు  జరుగుతున్నాయి. మల్లిక వచ్చాక ఆ సాయంత్రమే ఆమె తలిదండ్రులతో  కలిసి బెజవాడ  వెళ్ళటం, అక్కడ  ఓ ప్రయివేటు  నర్సింగ్  హోమ్ లో శారదమ్మగారిని చేర్పించటం, తండ్రీ కూతుళ్ళు  బంధువుల యింట్లో  మకాం పెట్టటం జరిగింది.

    "కాస్త నెమ్మదిగా  వుంది భారతీ! అయితే  ఓ పదిరోజులపాటు  నర్సింగ్ హోమ్ లోనే  వుండాలన్నారు. మధ్యాహ్నం ఇక్కడి నుంచి  మనిషి  వచ్చినప్పుడు నీ గురించి  ప్రస్తావిస్తే జరిగిన విషయం చెప్పాడు. వెంటనే పరిగెత్తుకు వచ్చాను. అవునుగానీ, యింత దారుణం  జరుగుతూంటే మెదలకుండా ఊరుకున్నాడా  మీ ఆయన? అంత గాజులు తొడిగించుకు కూర్చున్నాడా?" అన్నది ఆవేశంగా.

    భారతి ఏమీ మాట్లాడలేదు.

    "నువ్వంటే  ఊరుకున్నావుగానీ, నేను చేతగానిదానిలా జరిగేది విధికి అప్పజెప్పి యింట్లో కూర్చోలేను భారతీ రేపీపాటికి  నూజివీడు వెళ్ళి  ఆ చేతకాని  దద్దమ్మనీ, ఆ గంగాధరాన్నీ  పట్టుకుని నాలుగూ  దులిపెయ్యకపోతే  నా పేరు...."

    భారతి ఆమె మాటలకు  మధ్యలో అడ్డువస్తూ "అంత ఆవేశం  పనికిరాదు మల్లికా దెబ్బలాడి  మనం ఏ కోరికనైనా  తీర్చుకోవచ్చు. వైవాహిక జీవితం తప్ప"అన్నది.

    మల్లిక  స్నేహితురాలి  ముఖంవంక  ఆశ్చర్యంగా చూసింది. ముంచుకువస్తూన్న  ఆ చీకటిలో ఆమె ముఖం  నిర్లిప్తంగా, నిస్తేజంగా కనబడి ఆమె ఓ యోగినిలా  గోచరించింది.

    "చూడూ!" అంది మల్లిక తాపీగా. "ఈ తప్పుడు  ధోరణిలో పడే  నీ జీవితాన్ని ఎప్పటికప్పుడు  చేజేతులా నాశనం చేసుకుంటున్నావు. నువ్వనుకున్నంత  తేలికగా, స్తబ్దంగా, అందర్నీ  క్షమిస్తూ ఎన్నో రోజులు గడపలేవు. ఎంతో తెలివైన దానివి. నీ చదువును మధ్యలోనే  విరమింపజేసుకున్నావు. వైవాహిక జీవితంలోకి  వింత అడుగువేసి  ప్రవేశించావు. మళ్ళీ  అదే వింత  కదలికతో బయటకురా. ప్రయత్నిస్తున్నావు  ఇదంతా  ఎవరి కోసం? నువ్వు  ఏమయిపోతున్నావో  ఒక్కసారి ఆత్మ విమర్శ  చేసుకుంటున్నావా?"

    భారతి స్నేహితురాలి వంక  ఆప్యాయంగా  చూసింది. "ఆత్మ విమర్శకు  లోటు లేదు మల్లికా! కాని మన జీవితపు ఒరవడిలో  మన ప్రమేయం  చాలా తక్కువ  వుందని గ్రహించాను. ఇంత బలహీనురాలివి అయిపోయా వేమిటని  నిందిస్తావు నువ్వు, ఆ నింద  శిరసావహిస్తావు మల్లికా, ప్లీజ్! నా మనస్సు ఆలోచించటం  మానేసింది. శక్తి కూడా ఎక్కువలేదు. నేనింతకంటే  వ్యాఖ్యానాలు చేయలేను....అవతల నాన్నగారి కేం బాగాలేదు. అదొక్కటే ప్రస్తుతం నా దిగులు, అంతకంటే  ఇంకేమీ  పట్టించుకోవటంలేదు"

    "అన్నట్లు, ఎలా  వుంది  బాబాయిగారికి?"

    "నా పరిస్థితి తెలియగానే విపరీతంగా  గుండెపోటు  వచ్చింది. కొద్దిగా కోలుకున్నా రిప్పుడు. నాకు మాత్రం  భయంగా వుంది. గుంటారుగాని, బెజవాడ గాని తీసుకుపోతే  బాగుండుననిపిస్తోంది. కాని నాన్న మాత్రం  ఇక్కడి నుంచి కదలనంటున్నాడు. అసలు కదిలే స్థితి కూడా కాదనుకో!"

 Previous Page Next Page