Previous Page Next Page 
అనిత పేజి 22

   
    విసురుగా వెళ్ళిపోయాడు.
    జేమ్స్ ఉంటున్నది హోటల్ లో అయినా తరచు అనిత కోసం వచ్చేవాడు.
    జేమ్స్ రాగానే చిరాకు పడుతూ సంభాషణ తుంచేసి వెళ్ళిపోయేవాడు రాజారావు.
    మొదట్లో బిడియపడినా సుశీల రాను రాను జేమ్సుతో సరదాగా మాట్లాడటం నేర్చుకుంది. ముగ్గురికి కాలం సరదాగా గడిచిపోయేది.


                                                        19

    బంధు మిత్రుల నడుమ సుశీలకు రమణరావుతో పెళ్ళి నిశ్చయం అయింది. తాంబూలాలు తీసుకున్నారు. తరువాత చిన్న అల్పాహార విందు ఏర్పాటు చేశాడు రాజారావు.
    విందుకు వచ్చిన పెద్దలు తమ ఎదురుగా ప్లేట్లలో ఉన్న తిను బండారాలతో తృప్తిపడలేకపోయారు. అంతకన్న కమ్మని విందు జానకి విషయం - వాళ్ళ నోరూరించింది.
    రకరకాల నోళ్లు వికటంగా తెరుచుకుని వికృతంగా పలికాయి.
    "జానకి మీ చెల్లెలటోయ్!"
    "అయితే మీ నాన్నగారు మంచి కథానాయకూడన్నమాట!"
    " ఇంకాస్త ఓపిగ్గా కనుక్కోవోయ్! ఇంకా చెల్లెళ్ళూ, తమ్ముళ్ళూ దొరక్కపోరు."
    "మనలో మన మాట! ఈ రాజారావు జానకిని తన పంచన చేర్చుకోవటానికి మాతృ వాత్సల్యమే కారణమంటారా?"
    "ఏమోనండీ! ఏం చెప్పగలం! కలికాలం! మండిపోతోంది."
    ఈ విషలిప్త వాగ్భాణాలకు తట్టుకోలేకపోయాడు రాజారావు.
    విందుముగిసి అందరూ ఎవరి దారినవారు వెళ్ళిపోయాక రెండు చేతులలో పగిలిపోతున్న తన తల నదుముకొని కూర్చున్నాడు.
    ఆ మూర్తిని చూసేసరికి జాలితో అనిత హృదయం ద్రవించింది....
    "బావా!" అంది ఆప్యాయంగా.
    ఎఱ్రబడిన కళ్ళతో ఒకసారి అనితను చూసి "కాసేపు నన్ను వంటరిగా ఉండనీ!" అన్నాడు విసుగ్గా.
    "మనసు కలత పడినప్పుడే మమత పంచుకో గలిగిన వాళ్ళు దగ్గిరుండాలి బావా!"
    రాజారావు సమాధానం చెప్పలేదు. అనిత వంక ఆశ్చర్యంగా చూసి తల  తిప్పుకున్నాడు.
    "ఈ రోజు నిన్ను  వెక్కిరించినవాళ్ళందరూ వరమ చలామణి అవుతున్నారు."
    "ఈ సమాజపు తీరే విచిత్రమైనది. పబ్లిక్ సీక్రెట్స్ చక్కగా కడుపులో దాచుకుంటుంది. స్పష్టంగా తెలిసిపోతున్న విషయాలను కష్టపడి నమ్మకుండా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ధైర్యంగా తన కట్టుబాట్లను ఎదిరిస్తే మాత్రం సహించదు. ఇదంతా ముందు ఊహించిందేగా! ఇంత క్రుంగిపోతే ముందేం సాదించగలవు? జరగవలసిందంతా ముందుంది. జానకిని కోర్టులో నిర్దోషిగా రుజువుచెయ్యాలి. లే! ధైర్యంగా నిలబడు!"
    కర్తవ్యం గుర్తుకొచ్చిన రాజారావు ముఖంలో అలసట మాయమయింది. పట్టుదల ప్రతిఫలించింది.
    కన్న వచ్చి "అన్నయ్యా నీ కోసం చక్రపాణిగారువచ్చారు" అన్నాడు.
    చక్రపాణిగారు కేశవారావుగారికి దగ్గిర బంధువు. డబ్బు, పలుకుబడి రెండూ కలవాడు.
    చక్రపాణిగారికి నమస్కారం చేసికూర్చున్నాడు రాజారావు.
    "నిన్ను గురించి విన్నాను కాని చూడలేదోయ్! చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి సమర్థులయిన లాయర్లలో నువ్వొకడివి."
    "థేంక్స్."
    "నేను మీ నాన్నగారు మంచి స్నేహితులం. అభిమానం చంపుకోలేక వచ్చాను."
    రాజారావు అర్థం కానట్లు చూశాడు.
    "అదే! నువ్వా జానకి కేసు విషయంలో ఇర్కుకోవటం నాకు నచ్చలేదు. నీ శ్రేయస్సు కది మంచిది కాదు."
    "ఈ విషయంలో మీ జోక్యం దేనికి?"
    "చెప్పానుగా నీ మీద అభిమానమని?"
    నవ్వారు చక్రపాణిగారు ఆ నవ్వులో లోకంలో కౌటిల్యమంతా కనిపించింది రాజారావుకి.
    "జానకి నా చెల్లెలు. జానకి నిర్దోషిగా ఋజువుచేసి తీరుతాను."
    "జానకిని దోషిగా రుజువుచేసినా, నిర్దోషిగా రుజువుచేసినా ఒకటే! జానకిని నాశనం చేసిన వ్యక్తి జానకిని అంగీకరించేలా చెయ్యగలవా నువ్వు?
    "ప్రయత్నిస్తాను."
    "అసంభవం. కోర్టులకెక్కడం వల్ల వైషమ్యాలు పెరుగుతాయేకాని తగ్గవు. అదీగాక జానకి నిర్దోషి కాకపోతే......."
    "చక్రపాణిగారు!"
    తీక్షణంగా అన్నాడు రాజారావు.
    ఆయన నవ్వాడు.
    "నీ మనసు తెలుసుకోడానికన్నానోయి! నిజంగా చెల్లెలిమీద అభిమానముంటే అది చూపించుకునే మార్గం ఇది కాదు. ఎక్కడైనా మంచి సంబంధం చూసి పెళ్ళి చేసెయ్యి. కట్నం ఎర చూపావంటే ఎవడోవకడు దొరక్కపోడు. ఆ విషయంలో కావాలంటే నీకు నేను సహాయం చేస్తాను"
    రాజారావు అణువణువూ భగ్గుమంది.
    "థేంక్స్. మీ సహాయం నాకక్కర్లేదు. నేను చెయ్యగలిగింది నేను చేసుకుంటాను."
    "కేసు విత్ డ్రా చెయ్యవన్నమాట!"
    "ఒక్కనాటికీ చెయ్యను."
    "చివరి మాట! ఈ కేసు విత్ డ్రా చేసుకుంటే మరొక్క అయిదేళ్ళలో నిన్ను హైకోర్టు జడ్జీని చెయ్యగలను. నాకే పదవి లేకపోయినా, అన్ని పదవులూ నా జేబులో ఉన్న  పర్స్ లో ఉన్నాయి. ఈనాడు అధికారంలో ఉన్న అనేక మంది నా అనుగ్రహంవల్ల అధికారం సంపాదించుకున్న వారే! ఏమంటావ్?" క్రోధంతో జ్వలించిపోతూ వెంటనే సమాధానం చెప్పలేక పోయాడు రాజారావు.
    "నా మాటమీద నమ్మకంలేదా? ప్రస్తుతం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్న శంకర్రావు నడుగు అతనికా పదవి రావటానికి నేనే కారకుణ్ణి."
    శంకర్రావు జానకి కేసులో ఒకనాడు జానకి తరపున పని చేసిన లాయరు.
    రాజారావుకు విషయం అర్థమయింది.
    "చక్రపాణిగారూ! అంతటా అవినీతి దట్టంగా అల్లుకుంటోంది. అయినా అక్కడక్కడ నీతిచంద్రికలు విరుస్తోనే ఉన్నాయి? స్వార్థం అతిశయిస్తుంది. అయినా మమత పూర్తిగా మాసిపోలేదు. విషయ లాలస విచ్చలవిడిగా నృత్యం చేస్తోంది. అయినా కొన్ని కొన్ని అంతరంగాలు విలువలను మరువటంలేదు.   

 Previous Page Next Page