Previous Page Next Page 
నిశ్శబ్దసంగీతం పేజి 23

 

    "బాబ్బాబు! నన్నాసినిమాకు తీసికేళుదు" అనేశారు.
    వెంటనే లేచి నుంచున్నాడు శ్యామ్.
    "పెద్దలు . మీ మాట కాదనగలనా? వెళ్దాం పదండి"
    "అమ్మాయి! నేను భక్తీ సినిమా చూస్తాను. మీరీ సినిమా చూడండి. అనక అందరం కలిసి వెడదాం. మరేం భయం లేదు" అంటూనే , కుసుమ ఏం జరిగిందో గ్రహించేలోపల శ్యామ్ తో కలిసి బయటికి నడిచారు బామ్మగారు. నిర్ఘాంతపోయి నోటిమాట రాక కూచుండిపోయింది కుసుమ.
    బామ్మగారిని పక్క సినిమాలో దిగబెట్టి వచ్చి కుసుమ పక్కన కూచున్నాడు శ్యామ్ చిరునవ్వుతో. కాలు మీద కాలు వేసుకుని కుర్చీలో వెనక్కు జార్లగిలబడి "మేడమ్ ! మీ బామ్మగారి కారణంగా కొంత సినిమా మిస్సయ్యాను. కాస్త కనెక్షన్ చెపుతారా?" కుసుమ అతని వంక ఒకసారి చూసి తల తిప్పుకుంది.
    'అన్యాయం . మీ బామ్మగారికి నేను సినిమా కూడా మిస్సయి అంత సాయం చేస్తే థాంక్స్  చెప్పకపోగా రుసరుసలాడ్తారా?"
    "ఇది సినిమా హాలు, మనం మాట్లాడుకొంటుంటే మిగిలినవాళ్ళకి ఇబ్బంది నోరు మూసుకుని చూడండి" కటువుగా అంది కుసుమ.
    "సినిమా అయిపోయాక మాట్లాడుకుందాం అంటారా? అలాగే. యాజ్ యూ ప్లీజ్! మీరెప్పుడూ ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తాను"
    కుసుమ కళ్ళల్లోంచి నిప్పులు రాలుస్తూ శ్యామ్ వంక చూసింది. శ్యామ్ నిర్లక్ష్యంగా నవ్వాడు.
    సినిమా పూర్తీ కాగానే విసురుగా ఇవతలికి వచ్చింది కుసుమ.
    "మీరెంత తొందరపడ్డా ప్రయోజనం లేదు. బామ్మగారి సినిమా ఇంకో అరగంటకి కాని పూర్తీ కాదు. ఈ అరగంటా ఏం చేస్తారో మీ ఇష్టం. నన్ను ఉండమంటారా? వెళ్ళి పొమ్మంటారా?" అల్లరిగా చూస్తూ అడిగాడు శ్యామ్.
    కుసుమ హడలిపోయింది.
    ఇంత రాత్రి వేళ వచ్చే పోయే జనల మధ్య ఒంటరిగా నిలబడగలదా?
    "మాట్లాడరేం? ఉండనా ? వెళ్ళనా?"
    "ఉండండి" నీరసంగా గొణిగింది కుసుమ.
    "ఇలా పదిమంది మధ్యా జంటగా రోడ్డు మీద నించుందామా? కాసేపు అలా కేంటిన్ లో కూచుందామా?" ఇంకా అల్లరిగా నవ్వుతూనే అన్నాడు శ్యామ్. అప్పటికే చుట్టుపక్కల జనమంతా తమవంక నిదానించి చూడటం గమనించింది కుసుమ. "కాంటీన్ లో కూచుందాం" అంది విసుగ్గా. ఇద్దరూ కాంటీన్ లో కూచున్నాక రెండు కాఫీలు ఆర్డరిచ్చాడు శ్యామ్.
    "ఈసారి నేను సినిమాకు తీసుకొచ్చాను. మరోసారి మీరు తీసికెళ్ళాలి అది న్యాయం" అన్నాడు కుసుమ ముఖంలోకి చూస్తూ. కుసుమ క్షణం తెల్లబోయింది. అతనితో వాదించడం ఇష్టం లేక "అలాగే" అంది పొడిగా.
    "వచ్చేటప్పుడు బామ్మగారిని కూడా తీసుకురావటం మరిచిపోవద్దు. చాలా మంచావిడ" ఫకాలున నవ్వాడు శ్యామ్.
    ఎంత కోపంగా ఉండాలని ప్రయత్నించినా కుసుమకు కూడా నవ్వొచ్చేసింది.
    "అదీ అలా నవ్వాలి కాని సినిమా కొచ్చి చిచ్చుబుడ్డి ముఖంతో కూచుంటే ఏం బాగుంటుంది?"
    కుసుమ విసురుగా ఏదో సమాధానం చెప్పబోయేలోగానే శ్యామ్ లేచి, "లేవండి, బామ్మగారి సినిమా కూడా వదిలేస్తారు" అంటూ తొందర చేశాడు. కుసుమా, శ్యాం లిద్దరూ కొంచెం దూరంలో ఉన్న మరో హాలు దగ్గరకు చేరుకునేసరికి ఆ సినిమా కూడా వదిలేశారు. బామ్మగారు సంతోషంతో ముఖం ఇంత చేసుకుని వాళ్ళను సమీపించారు.
    "చాలా మంచివాడివి నాయనా! సుఖంగా చూశాను. ఆహా! ఏం భక్తీ! భక్తులకే కష్టాలు!" తలమీంచి భుజం మీద కప్పుకున్న సైనుపంచతో కళ్ళు వత్తుకున్నారు బామ్మగారు.
    "నాదేముందండీ! మిమ్మల్ని తీసుకొచ్చింది ఇదిగో ఇవిడ. ఈవిడను పొగడండి."
    "అవునమ్మా కుసుమ తల్లీ! నువ్వు బతిమాలి బలవంత పెట్టి తీసుకురాబట్టి ఇంత మంచి సినిమా చూడగలిగాను"
    "సరేలెండి . ఇంక వెళదాం పదండి" విసుగ్గా బామ్మా ధోరణికి ఆనకట్ట వేసి రిక్షా మాట్లాడింది కుసుమ. బామ్మగారితో సహా రిక్షాలో కూచుంది.
    "గుడ్ నైట్" హుషారుగా అన్నాడు శ్యామ్.
    అప్రయత్నంగా తనూ "గుడ్ నైట్" అనేసింది కుసుమ. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా కుసుమకు శ్యాం అల్లరి చిరునవ్వు మరుపుకు రాలేదు.


                                                       *    *    *

    కాత్యాయనికి గుండె నొప్పి ఇంకా ఎక్కువయిపోయింది. ఆ ఊళ్ళో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ రోజూ వచ్చి మందు పోస్తూనే ఉన్నాడు కాని, మందు దారి మందుదీ, రోగం దారి రోగానిదే అయిపొయింది.
    రాత్రి తెల్లవార్లూ నిద్రలేక కాత్యాయని బాధపడుతుంటే జానకి నిస్సహాయంగా విలవిలలాడిపోతూ పక్కన కూచునేది. ఆరోజు తెరలా వచ్చిన ఉదృతమైన నొప్పితో బాధపడి ఎంతో సేపటికి గాని తెరిపిన పడలేకపోయింది కాత్యాయని.
    తన ప్రక్కనే కూచుని బేలగా చూస్తున్న జానకిని చూడగానే కాత్యాయని హృదయం ద్రవించిపోయింది.
    "ఎంత సేపని ఇలా కూచుంటావు? వెళ్ళి పడుకో!" ఆర్ద్రంగా అంది కాత్యాయని.
    జానకి కళ్ళల్లో నీళ్ళు నిండాయి.
    "మీరింత బాధపడుతుంటే నాకు నిద్రెలా వస్తుందీ? నా నిద్ర కేం, మీరు కాస్త స్థిమితపడండి."
    "నా ఆరోగ్యం ఇంక బాగుపడేది లేదు. నా కారణంగా నిద్ర మేలుకుని నువ్వు కూడా రోగం తెచ్చుకుంటావా?"
    "ఆ భయం అక్కర్లేదు. ఆ రోగాలకు కూడా నేనేంటే అసహ్యమే!" విరక్తిగా కసిగా అంది జానకి.
    "నీకు చాలా అన్యాయం చేశాను జానకీ!' అంది.
    "లేదు...లేదు.... మీరు నాకే అన్యాయమూ చెయ్యలేదు. అలాంటి ఆలోచన రానియ్యకండి" కాతరాస్వరంతో అంది జానకి.
    కాత్యాయని జానకి చేతిని బలహీనంగా ఉన్న తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కింది. "నీకు తెలీదు జానకీ! నీకు అన్యాయం జరగటానికి కారణం నేనే! నేను బలవంత పెట్టబట్టే పెళ్ళిచూపులకు వచ్చాడు మాధవ. మొదట నిన్ను చూసిన తరువాత పెళ్ళి వద్దనే అన్నాడు. అదీ నీకూ తెలుసు. అప్పుడు నా మనసుకు కొంచెం కష్టం తోచింది. అది నా ముఖంలో వాడికి కనిపించి ఉంటుంది. అందుకే ఆ తర్వాత చేసుకుంటానన్నాడు. అది నేను అర్ధం చేసుకోలేకపోయాను. నిన్ను చేసుకుంటానని అన్నందుకు పొంగిపోయానే కాని వాడు నాకోసం తనను తాను అన్యాయం చేసుకుంటున్నాడని అర్ధం చేసుకోలేకపోయాను. వాడి మనసులో మరొకరున్నారని ఏ మాత్రం ఊహించగలిగినా, ఈ పెళ్ళి జరగనిచ్చేదాన్ని కాదు. నీకీ అన్యాయం జరిగేది కాదు....." ఆయాసంతో ఆగింది కాత్యాయని.
    "మీరు కాదు . ఈ అనర్ధానికంతకూ కారణం నేను. మీరు నాకు అన్యాయం చెయ్యలేదు. నేనే ఆయనకు భార్యనై ఆయనను మీకు దూరం చేశాను" ఆవేదనతో అంది జానకి.
    "ఎంత మంచిదానివి జానకీ! ఇంత క్షోభను సహిస్తూ కూడా ఇంకా నింద కూడా నీ నెత్తినే వేసుకోవటానికి తయారయ్యావా? ఎల్లకాలం ఇంత మంచిగానూ ఉండు. నీ మంచితనం వల్ల నీ కష్టాలు రావచ్చు, సుఖాలు రావచ్చు. కాని నీ మంచితనం నిన్ను కోటలా చుట్టి ఎన్ని చికాకుల మధ్యనైనా నిన్ను మనిషిగా నిలబెడుతుంది."
    గుండె నొప్పి మరింత ఎక్కువయింది. బాధతో మెలికలు తిరిగిపోసాగింది కాత్యాయని. వెక్కి వెక్కి ఏడ్చేసింది జానకి. రెండు గంటల తరవాత కాని తేరుకోలేక పోయింది కాత్యాయని.

 Previous Page Next Page