ఆవిణ్ణి చూడగానే, తన నల్లెసుకున్న సరళను విడదియ్యబోయాడు మాధవ. కాని సరళ వదలలేదు. ఆవిడ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. సరళ తల్లిదండ్రులు సహితం తమ బంధాన్ని ఇంత సహజంగా భావించటంతో మాధవకు కష్టమూ తోచింది. భయమూ వేసింది.
అయినా జ్వరంతో నీరసించి , మనోవేదనతో కళదప్పి, కాస్త వదిలితే ఎక్కడ తప్పిపోతాడో అన్నట్లు అతి గాడంగా తన నల్లుకున్న సరళ నేమనటానికీ మాధవకు నోరు రాలేదు.
"ఉంటావు కదూ?" ఇంచుమించు ఏడుస్తున్నట్లే అడిగింది.
"ఉంటాను" అనకుండా ఉండలేకపోయాడు మాధవ.
"మాధవా! ఒకవేళ ఎప్పుడైనా నేను తెలిసీ తెలియక నీ మనసుకేదైనా కష్టం కలిగిస్తే నీ యిష్ట మొచ్చిన శిక్ష విధించు. ఎంత పెద్ద శిక్ష నైనా ఫరవాలేదు. కాని నామీద కోపం మాత్రం తెచ్చుకోకు" బేలగా మాధవ ముఖంలోకి చూస్తూ అమాయకంగా అంది సరళ.
అప్రయత్నంగా ఒక దీర్ఘమైన నిట్టుర్పు విడిచాడు మాధవ.
* * *
కుసుమ ఠీవిగా ఆఫీస్ లోకి అడుగుపెట్టి ఎవరి వంకా చూడకుండా నేరుగా తన సీటులోకి పోయి కూచుంది.
ఈ మధ్య వారం రోజులుగా కుసుమ ఎదురు సీట్లో కూర్చున్న యువకుడు అదే పనిగా ఆమె వంక చూస్తున్నాడు. కుసుమ అది గమనించి కూడా గమనించనట్లు తన పని చేసుకుపోసాగింది.
ఆరోజు కుసుమ తన పని చెసుకుంటుండగా ఆ యువకుడు వెకిలి నవ్వుతో దగ్గరగా వచ్చి "హల్లో!" అన్నాడు.
కుసుమ తల పైకెత్తి "హలో" అని మళ్ళా తన పని చూసుకోసాగింది.
"రేపు మా చెల్లెలి కూతురు పుట్టినరోజు . మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. రానంటే ఒప్పుకోను. టాక్సీలో తీసుకెళ్ళి మళ్ళీ టాక్సీలో దిగాబెట్టేస్తాను. భోజనం మా ఇంట్లోనే. ఏమంటారు?"
కుసుమ విసుగ్గా తలెత్తింది.
"సారీ! మీరేం చెప్పారో నేను వినలేదు. మళ్ళీ చెప్పండి" అనేసి వెంటనే తలవంచుకుని మళ్ళీ తన పనిలో లీనమైపోయింది. ఆ యువకుడి ముఖం పాలిపోయింది. ఇంకేం మాట్లాడకుండా తన సీట్లోకి తనొచ్చి కూచున్నాడు. 'సంగతేమి' టని మళ్ళీ కుసుమ అడగలేదు సరికదా, అతని వైపన్నా చూడలేదు.
ఒక మూల కూచుని ఇదంతా గమనిస్తున్న శ్యామసుందర్ తనలో తను నవ్వుకున్నాడు.
శ్యామసుందర్ ది నిండైన విగ్రహం. కళ్ళు చిన్నవైనా కళగా ఉంటాయి. పొడువాటి కొనదేలిన ముక్కు వంపు దిరిగిన పెదవులు నవ్వుతున్నట్లే ఉంటాయి. అతను కుసుమను వచ్చినప్పటి నుండీ పరిశీలిస్తున్నాడు. కుసుమ నిర్లక్ష్యధోరణి, ఆమె ధైర్యమూ , తనను రాహువుల్లా చుట్టుముట్టే గ్రహాలకు కాల్చివాత పెట్టినట్లు బుద్ది చెప్పే సమయస్పూర్తి, ప్రత్యేకమైన ఆమె వ్యక్తిత్వము అతడిని విశేషంగా ఆకర్షించాయి. కుసుమను ఎలాగైనా ఎదుర్కొని జయించాలనే పట్టుదల బయలుదేరింది అతనిలో.
"మేడమ్! మీకు అభ్యంతరం లేకపోతే ఇవాళ నాతో సినిమాకి రాగలరా?" ఒకరోజు కుసుమ ఆఫీస్ నుండి బయటికోస్తుంటే అడిగాడు శ్యామ్.
కుసుమ తెల్లబోయి చూసింది. ఆఫీస్ లో ఇంచుమించు అందరూ ఏదో వంకతో తనను పలకరించి కబుర్లు చెప్పాలని ఆరాటపడుతుంటే అతనొక్కడే తన జోలికి రాకపోవటంతో , అతను చాలా మర్యాదస్తుడనుకుంది. "ఏమిటలా చుస్తున్నారూ? బుద్దిమంతుడనుకొంటున్న ఇతను కూడా రౌడీలా మాట్లాడుతున్నాడేమిటా అనా? నేను రౌడిని కాదండీ! నిజం మీకే తెలుస్తుంది . నిలకడ మీద" చిలిపినవ్వుతో అన్నాడు శ్యామ్.
తన మనసును పుస్తకంలా చదివేస్తున్నా అతని వంక మరోసారి తెల్లబోయి చూసి చటుక్కున చూపులు తిప్పుకుని "ఇవాళ కొంచెం పనుంది రేపు వస్తాను" అనేసి వెళ్ళిపోయింది.
ఆ రేపు కోసం గడియ ఒక యుగంగా ఎదురుచూశాడు శ్యామ్. ఆఫీసులో మరోసారి హెచ్చరించాడు కుసుమను.
"ఇవాళ వస్తూన్నారుగా!" అని.
"తప్పకుండా!" అని నవ్వింది కుసుమ. శ్యాం హృదయం ఝల్లనెలా.
ముందుగానే రెండు టికెట్లు కొని గేటు దగ్గర నిలబడి కుసుమ కోసం ఎదురుచూడసాగాడు శ్యామ్. అంతలోనే రిక్షా లోంచి దిగింది కుసుమ. తను అద్దె కుంటున్న ఇల్లు గల బామ్మగారితో సహా.
ఒక్క క్షణం అయోమయంగా చూసిన శ్యామ్ అంతలోనే అర్ధం చేసుకుని పెదిమలు బిగించుకున్నాడు.
"ఇప్పుడే వస్తాను" అంటూ వెళ్ళి మరో టికెట్ కొనుక్కుని వచ్చాడు.
"నమస్కారం బామ్మగారూ!" అంటూ చిరునవ్వుతో బామ్మగారికి నమస్కారం చేశాడు.
"మీరు కూడా వచ్చినందుకు నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. రండి రండి" అంటూ చెయ్యి పుచ్చుకుని నడిపించుకుంటూ తీసికెళ్ళాడు" తనతో కూడా బామ్మగారిని చూడగానే శ్యామసుందర్ ముఖం పాలిపోతుందని , తెగ ఉడుక్కుంటాడనీ, అప్పుడు అతణ్ణి చూసి అల్లరిగా హేళనగా నవ్వాలనీ కలలు గంటూ వచ్చిన కుసుమకు ఆశాభంగమే కలిగింది. చిరునవ్వుతో బామ్మగారి చెయ్యి పుచ్చుకుని నడిపించుకుంటూ వెళ్తూన్న శ్యామసుందర్ ను చూస్తూ ఆశ్చర్యంతో ఒక్క క్షణం అలా నిలుచుండిపోయింది కుసుమ.
వెనక్కి తిరిగి బొమ్మలా నిలబడిపోయిన కుసుమను చూసి చిరునవ్వుతో "రండి! అలా నిలబడిపోయారేం?" అన్నాడు.
కుసుమ తొట్రుపడి ముందుకు అడుగులు వేసింది. ఆమె ముఖంలోకి చూస్తూ చిలిపిగా నవ్వాడు శ్యామ్. చటుక్కున చూపులు తిప్పుకుంది కుసుమ.
ఆమె చిట్టచివరి సీట్లో కూచుంది. కుసుమ పక్కనే బామ్మగారు కూర్చున్నారు. బామ్మగారి పక్కన కూచున్నాడు శ్యామ్.
అది ఇంగ్లీష్ సినిమా.
"ఒక్క ముక్క అర్ధం కావటం లేదు" గొణుక్కున్నారు బామ్మగారు.
"ఇంగ్లీషోచ్చిన మాకే వాళ్ళ ఉచ్చారణ అంతుపట్టదండి! మీకేం అర్ధమవుతుంది? పాపం. తెలుగు సినిమా అయితే సుఖంగా చూసేవారు జాలిపడ్డాడు శ్యామ్.
'ఛ! ఛ! ఆ బట్టలేమిటి?" అసహ్యించుకున్నారు బామ్మగారు.
"వాళ్ళకు బొత్తిగా సిగ్గూ, లజ్జా ఉండవండీ!" మమ్మగారితో పూర్తిగా ఏకీభవించాడు శ్యామ్. తెర మీద శృంగార సన్నివేశం ప్రదర్శించబడుతుంది.
"రామచంద్రా! ఇదేం సినిమా" విలవిలలాడిపోయారు బామ్మగారూ. ఆవిడ బాధ చూడలేకపోయాడు శ్యామ్.
"ఈ పాడు సినిమా మీరు చూడలేరండీ . దీనికి పక్క హాల్లోనే మాంచి భక్తీ సినిమా ఆడుతోంది. శంకరుడు ప్రత్యక్షమై భక్తుడి కష్టాలన్నీ తీరుస్తాడు మీరు చూస్తానంటే తీసుకెళ్తాను."
బామ్మగారి బోసినోరు తెరుచుకుంది. శంకరుడు సాక్షాత్కరించినట్లే ఆవిడ హృదయం భక్తీ సపరిప్లుతమైంది.
"కాని, పాపం నీకు ఇబ్బంది.....నువ్వు సినిమా చూస్తున్నావు" సగం సంకోచం, సగం ఆశా. బెదురుగా కుసుమ వంకా, జాలిగా శ్యామ్ వంకా చూస్తూ అడిగారు బామ్మగారు.
"ఇబ్బందయితే అవుతుంది. మాలాంటి వాళ్ళం ఇలాంటి సినిమాలు ఇవాళ కాకపోతే రేపు చూస్తాం. పాపం, మీలాంటి పెద్దలు చీటికీ మాటికీ రాగలరా? ఎప్పుడో నూటికో కోటికో ఒక్కసారి చూసే సినిమా మంచి సినిమా చూడాలి. కాని ఈ వెధవ గోల మీలాంటి వాళ్ళెలా సహించగలరు? ఆ భక్తీ సినిమాలో ఆ భక్తుడు శంకరుణ్ణి ధ్యానిస్తూ పాడే పాటలు.....ఆహా!' పారవశ్యం అభినయిస్తున్న శ్యామ్ ను చూస్తోంటే నిజంగా మతిపోయింది బామ్మగారికి.