Previous Page Next Page 
నిశ్శబ్దసంగీతం పేజి 24

 

    మృత్యుదేవత సన్నిధికి అతి శీఘ్రంగా పయనిస్తూ అలసినట్లున్న కాత్యాయని ముఖంలోకి చూస్తూ "ఆయనకు టెలిగ్రాం ఇప్పిస్తున్నాను" అంది జానకి భయపడుతూ.
    అతి నీరసంగా ఉన్న కాత్యాయని ముఖం కఠినంగా మారిపోయింది.
    "వద్దు, వాడికి టెలిగ్రాం ఇయ్యోద్దు. ఉత్తరము రాయొద్దు. నామీద ఒట్టు" దృడస్వరంతో అంది.
    జానకి హృదయం అనిర్వచనీయమైన క్షోభతో మూలిగింది. కాత్యాయని మాధవల అనుబంధంలోని ప్రగాడత జానకికి బాగా తెలుసు. ప్రేమమయి కాత్యాయని హృదయంలోని అనురాగపు వెల్లువకు ఆశ్రయస్థానం మాధవ. మేనత్త ముఖంలోని స్వల్పతిస్వల్పమైన ఆవేదనచ్చాయలకు సైతం చలించి పోతాడు మాధవ.
    అలాంటి వ్యక్తుల మధ్య పట్టుదలలు గోడలు లేచాయి. అనురాగపు వెల్లువలకు ఆత్మాభిమానాలు ఆనకట్టలు కట్టగలుగుతున్నాయి. ఇంతకూ మూలం తను.
    పోనీ కాత్యాయానికి తెలియకుండా టెలిగ్రాం ఇచ్చేస్తే! ఈ ఆలోచన వచ్చినా అందుకు సాహసించలేకపోయింది జానకి.
    కాత్యాయని అతి శాంతస్వభావురాలు. ఆవిడ ఎన్నడూ పరుషంగా ఎవ్వరినీ ఒక్కమాట అనదు. నిందించడం, దూషించటం అసలు ఎరుగదు. కాని, ఒక్కొక్కసారి ఆవిడ అజ్ఞాపిస్తుంది. ఆ ఆజ్ఞాపించినప్పుడు ఆవిడ కంఠంలో ఒక విచిత్రమైన తీక్షణత ధ్వనిస్తుంది. అలా జరగటం చాలా అరుదు. కాని జరిగినప్పుడు మాత్రం ఆ ఆజ్ఞను తిరస్కరించే సాహసం ఎవరికీ ఉండదు. మాధవకు తన ఆరోగ్యం గురించి తెలియపరచవద్దన్నది కాత్యాయని అజ్ఞ.
    అందుకే మాధవకా విషయం తెలియ జెయ్యాలని జానకి ఎంత వాంచించినా దాన్ని కార్య రూపంలోకి తేలేకపోయింది.
    కాత్యాయనికి గుండె నొప్పి రెండు రోజులు నుండీ మరీ తీవ్రంగా వస్తోంది. జానకికి ఏం చెయ్యటానికీ తోచటం లేదు. బెంబేలుగా తన దగ్గర కూచున్న జానకిని ఇంకా దగ్గరికి రమ్మని , :రాధాపతిరావుగారికి కబురు చెయ్యి జానకీ! ఇంక నాకు ఆశ నిలవటం లేదు' అంది కాత్యాయని.
    జానకి గుండె గుభేలుమంది. రాధాపతిరావుగారు ప్రఖ్యాత న్యాయవాది. మొదటి నుండీ కాత్యాయనీ ఆస్తి పాస్తుల వ్యవహారాలన్నీ ఆయనే చూసి పెడుతున్నారు.
    జానకి యంత్రంలా లేచి వెళ్ళి నౌకరు చేత రాధాపతిరావుగారికి కబురు చేయించింది. కబురంపిన గంటలోనే అయన వచ్చారు.
    రాధాపతిరావుగారు వచ్చి కాత్యాయని దగ్గర కూర్చోగానే , అశాంతితో వేగిపోతున్న మనసు చిక్కబట్టుకుంటూ జానకి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. దాదాపు రెండు గంటలు కాత్యాయని దగ్గర కూచున్న తరువాత రాధాపతిగారు వెళ్ళిపోయారు. వెంటనే కాత్యాయని దగ్గర కొచ్చింది జానకి. కాత్యాయని ముఖం చూసి హడలిపోయింది. బొత్తిగా జీవకళ లేకుండా పాలిపోయింది. కళ్ళు బాగా ఎర్రబడ్డాయి. పెదవులు బెడ్డల్లా బిగుసుకుపోయి నల్లగా మారిపోతున్నాయి.
    కాత్యాయని ఆరోగ్యంగా ఉన్న రోజులలో ఆవిడ ముఖంలో ఏ భావమూ ప్రకటితమయ్యేది కాదు, కానీ ఇప్పుడు ఏదో దుర్భరావేదన అణచుకొంటున్న లక్షణాలు ఆవిడ ముఖంలో స్పష్టంగా ప్రతి ఫలిస్తున్నాయి.
    జానకి చెయ్యి పట్టుకుని దగ్గరగా లాక్కుని హీనస్వరంతో "కలకాలం మీ ఇద్దరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను జానకీ! ఇదే నా చివరి కోరిక. బ్రతికినంతకాలమూ ఎంతటి ఆవేదనైనా భరించాను. ఈ చివరి క్షణాలలో ఈ అశాంతి భరించరానిదై పోతుంది" అంది.
    జానకి ఇంక సహించలేకపోయింది. కాత్యాయని పాదాల మధ్య తన తల ఉంచి గుండెలు పగిలేలా ఏడ్చేసింది. "ఇంక నా గతేమిటి? నాకేవరున్నారు? ఈ లోకంలో ఇంకెలా బ్రతకగలను? ఏ క్షణం మీ నీడలోకి వచ్చానో ఆ క్షణం నుంచీ నా సర్వం మీరే అనుకున్నాను. మీరు నాకు లేకుండా పొతే ఎలా భరించగలను?"
    "జానకీ" పిలవలేక పిలవలేక పిలిచింది కాత్యాయని.
    జానకి తలెత్తి చూసింది. కాత్యాయని చేత్తో దగ్గరగా రమ్మన్నట్లు సైగ చేసింది. జానకి తన ముఖాన్ని కాత్యాయని ముఖానికి దగ్గరగా పెట్టింది.
    "బాధపడకు, నీకు జీవిత సౌఖ్యాన్ని సమకూర్చలేకపోయినా , జీవనాధారాన్ని చూపించగలను. నా ఆస్తంతా నీపేర రాశాను"
    కెవ్వుమని కేకవేసింది జానకి.
    "నా పేర రాశారా? ఎందుకు? మీ ఆస్తి నేను కోరానా? ఏం చేసుకోను ఈ ఆస్తిని? వద్దు....వద్దు.....అయన పేర రాసెయ్యండి."
    కాత్యాయని పెదవులపై చిరునవ్వు విరిసింది. "నాకు తెలుసు నువ్విలాంటిదానివని. అందుకే నీ పేర రాశాను. ఏనాటికైనా మాధవ తన ధర్మాన్ని గుర్తించి నిన్ను ఆదరించగలిగితే వాడికి అన్యాయం జరగదు. వాడి స్వార్ధం వాడు చూసుకుంటే నువ్వు కనీసం నీ బతుకు నువ్వు బతగ్గలవు."
    మాట్లాడుతూ ఉండగానే కాత్యాయనికి మళ్ళీ విపరీతమైన నొప్పి వచ్చేసింది. బాధతో మెలికలు తిరిగిపోతున్న కాత్యాయనికి నోట్లో అతి ప్రయత్నం మీద డాక్టర్ ఇచ్చిన మందు పోసి , నౌకరు చేత వెంటనే మాధవకు టెలిగ్రాం ఇప్పించింది జానకి.
    మాధవకు తెలియపరచటానికి కాత్యాయని అనుజ్ఞ తీసుకోవలసిన తరుణం మించిపోయిందని అర్ధమయిపోయింది జానకికి. ఇప్పుడు కూడా తను మాధవకు తెలియపరచకపొతే , ఇక మాధవ తనను ఏనాటికీ క్షమించడు.
    

                                                           7

    జానకి తనకు నిజంగా దూరం కావాలను కుంటుందనే భావనను సహించ లేకపోతున్నాడు మాధవ. ఏదో కారణంతో అలా చిరాకుపడింది. ఈపాటికి సర్దుకుని ఉంటుంది. క్షమాపణ కోరుతూ ఉత్తరం రాస్తుంది. తప్పకుండా రాస్తుంది. జానకి ఉత్తరం అందుకోగానే, తను రెక్కలు కట్టుకుని జానకి సన్నిధిలో వాల్తాడు. మొహమాటంతో, సిగ్గుతో ముడుచుకుపోతూ కళ్ళలో అనురాగం గుమ్మరించే జానకిని తనలో ఐక్యం చేసేసుకుంటాడు. ప్రతిరోజూ పోస్టుమాన్ కోసం ఆశగా ఎదురుచూసేవాడు . తనను చూసీ చూడకుండా పోస్టుమేన్ వెళ్ళి పోతుంటే ప్రాణం ఊసూరుమనేది. ఒకటి రెండుసార్లు పల్లెటూరి వాడిలా పోస్టుమాన్ ని "నాకుత్తరాలూ లేవూ?" సరిగా చూడు" అని అడిగేశాడు కూడా. పోస్టుమాన్ నవ్వాక మాత్రం సిగ్గుపడ్డాడు. ఆరోజు దూరం నుంచి పోస్టుమాన్ ని చూశాక మళ్ళీ కొంచెం ఆశ చిగిర్చింది మాధవలో. అంతలో "రోజూ రానిది ఇవాళ మాత్రం వస్తుందా?" అని మళ్ళీ నిరాశ ఆవరించుకుంది. ఇలా ఆశానిరాశల మధ్య ఊగిపోతున్న మాధవ దగ్గరగా వచ్చాడు పోస్టుమాన్.
    మాధవ హృదయం గంతులేసింది.
    "ఉత్తరం వచ్చిందా?" అన్నాడు సంభ్రమంగా.
    "ఉత్తరం కాదు సార్ టెలిగ్రాం...."
    మాధవ గుండె గతుక్కుమంది. మొన్నటివరకూ సరళ మంచం మీద పడటం తను అనుభవించిన వేదన స్మృతి లో మెదిలి "జానకికేమైనా......' అని మనసు మూలిగింది. వణికే చేతుల్తో టెలిగ్రాం అందుకున్నాడు.
    "పిన్ని మరణశయ్యమీద ఉంది. జానకి...."
    క్లాసు ముగించుకుని ఇంటికి పోతున్న మోహన్ శిలా ప్రతిమలా నించున్న మాధవను చూసి ఆశ్చర్యంగా దగ్గర కొచ్చి టెలిగ్రాం అందుకుని చదివాడు.
    "పిన్ని ఎవరు! జానకేవారు?' ఆశ్చర్యంగా అడిగాడు మోహన్. మాధవకు పెళ్ళయిన సంగతి అతనికి తెలీదు.
    'అత్తయ్య.....అత్తయ్యకి ....." మాట్లాడలేకపోయాడు మాధవ.
    మాధవకి వాళ్ళ అత్తయ్య అంటే ఎంత గౌరవమో , ఆవిడ పట్ల అతని మనసులో ఎంతటి ప్రేమాభిమానాలున్నాయి మోహన్ కు తెలుసు. పాలిపోయిన మాధవ ముఖం చూస్తుంటే మోహన్ హృదయం ద్రవించింది. అయోమయంగా చూస్తున్న మాధవ భుజం చుట్టూ చెయ్యేసి "పదండి వెళ్దాం" అన్నాడు.

 Previous Page Next Page