అందరూ నవ్వారు.
"ఈ రోజున వస్తున్న చెత్త సినిమాల్లో మీరు నటించకుండా వుంటేనే బాగుంటుందేమో" అంది సీత.
"ఆఫ్ కోర్స్! ఆ మాటా నిజమేలెండి. సో.....నేనిక్కడ వుంటానికి మీరు ఒప్పుకుంటున్నారు. అంతేనా?"
"సంతోషంగా" అన్నాడు రామచంద్రమూర్తి."
"నెలకు నేను అన్నీ కలుపుకుని వెయ్యి రూపాయలిస్తాను, మీకు యిష్టమేనా?"
"మీకు ముందే చెప్పాం కదండీ మీ యిష్టమనీ......"
"అయితే దట్ సేటిల్స్ ఇట్! నేను వెంటనే వెళ్ళి నా లగేజ్ తెచ్చుకుంటాను. వెళ్ళిరానా?"
"ఒక్క విమిషం ! టీ తాగి వెళుదురుగానీ."
"నో నో ననో! మనకీ "టీ" కి బొత్తిగా పడదు. అన్నట్లు ఇంకొక్క విషయం చెప్పటం మర్చిపోయాను. నేను కొంచెం మనశాంతి కోసం రాత్రిళ్ళు కొంచెం మందు కొడతాను. ఆఫ్ కోర్స్ .........నా రూమ్ లోనేలెండి. బయటకు రాను. ఏం ఫర్వాలేదా?"
రామచంద్రమూర్తి నవ్వాడు.
"మా సర్దార్ పటేల్ రోడ్ లో తాగుబోతులకేం తక్కువ లేదు.........ప్రతివాడూ పొద్దుకూకేసరికి మందుకొట్టేవాడే. ఇంటి చుట్టూ వున్నప్పుడూ యింక ఇంట్లో వుంటే మాత్రం ఏమిటి? అదీగాక యీ రోజుల్లో తాగుడు అలవాటు లేనివాళ్ళు , ఎక్కడుంటారు? నూటికి , కోటికి ఒక్కడు."
అతను నవ్వేశాడు.
"ఆ మాట నిజమే! ఈ మాత్రం కామన్ సెన్స్ అందరికి వుంటే ప్రాబ్లమ్స్ వుండవు. వస్తామరి" వెళ్ళిపోయాడు.
* * * *
అతడు వెళ్ళగానే ఉమాదేవి, రజని, శాంతి, మస్తాన్రావ్, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు బిలబిలమంటూ లోపలి కొచ్చేశారు.
"అక్కా! అయన సినిమా యాక్టర్ శ్రీనాద్ గారు కదూ! ఆతృతగా అడిగింది ఉమాదేవి.
"అవును" గర్వంగా అంది సీత.
"మీ ఇంటికెలా వచ్చారక్కా? మీకు పరిచయమా?"
"పేయింగ్ గెస్ట్ గా వుండటానికి వచ్చాడు."
"అంతా అబద్దం" అంది శాంతి . "అంత పెద్ద సినిమా యాక్టర్ ఎక్కడయినా యిలాంటి కొంపలో వుంటారేమిటి? అదీ పేయింగ్ గెస్ట్ గా అయన మీ బంధువయి వుంటారు."
నటరాజ్ నవ్వేశాడు.
"సరే బంధువో, పేయింగ్ గెస్ట్ మీరే చూస్తారుగా! రేపట్నుంచి యిక్కడే వుంటారాయన."
అందరి ముఖాల్లోనూ అమితమైన అశ్చర్యం కనబడుతోంది.
"మైగాడ్" నమ్మలేనట్లు అడిగింది శాంతి.
"మైగాడ్" అన్నాడు నటరాజ్.
ఉమాదేవికి అతని మాటలమీద నమ్మకం కలుగలేదు.
"మీరు చెప్పండి బావగారూ! అక్క చెప్పింది నిజమేనా?"
"నూటికి నూరుపాళ్ళు నిజం."
"అబ్బ ! ఆయనిక్కడే వుంటున్నారంటే భలే సరదాగా వుంటుందిలే. రోజూ ఆయనతో మాట్లాడవచ్చుగా........" అందామె ఎగ్జయిట్ అయిపోతూ.
"నేను ముందాయన అటో గ్రాఫ్ తీసుకోవాలి" అంది రజని.
"ఆయనను మా ఇంటికి "టీ" కి పిలుస్తానక్కా! నువ్వు కొంచెం రికమెండ్ చేసి పంపిస్తావా?" ఎదురింటి సావిత్రి అడిగింది.
"అదేమంత భాగ్యమని, తప్పకుండా చెబుతాను........" పొంగిపోతూ అంది సీత.
ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్ళందరికీ 'సీత' చాలా గొప్ప వ్యక్తిలా కనిపించింది.
"ఆయనసలు ఇలాంటి లోకాలిటిలో వుండటానికి రావటం ఏమిటి?" అనుమానంగా అడిగాడు మస్తాన్రావ్.
నటరాజ్ ఆయనను ఎద్దేవా చేశాడు.
"సినిమా వాళ్ళ సంగతి తెలీనట్లు మాట్లాడతావేం? ఉన్నప్పుడు తాగి తందానలాడతారు. అంతా అయిపోయాక వీధినపడతారు. అయినా నువ్వు ఎంతసేపూ అరువు తెచ్చుకున్న న్యూస్ పేపర్ చదవడమే గానీ, ఏ సినిమా పత్రికయినా, ఎప్పుడయినా చదివావా? సితార, జ్యోతిచిత్రల్లో ఎప్పుడో శ్రీనాద్ గారి గురించి ఫుల్ పేజ్ ఆర్టికల్ ఇంటర్వ్యు చేశారు. అందులో ఏం రాశారు? ఆయన ఆర్ధిక పరిస్థితి బాగోలేదని తేల్చారు. అలాంటోడు పేయింగ్ గెస్ట్ గా వుండక , గెస్ట్ కు "పే" చేస్తాడా ఏమిటి?"
మస్తాన్రావ్ ఆశ్చర్యపోయాడు.
"అంత పెద్ద హీరో ఎలా దెబ్బతిన్నాడు?"
"స్టార్ రివర్సయితే సినిమా స్టారెంటి ఎవడయినా రివర్సవుతాడు."