"అయితే ఏం చెయ్యమంటారు? మందు వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పాం కదా? తీసుకెళ్ళండి పేషెంట్లు వస్తూనే వుంటారు" అంది ఆమె చిరాగ్గా ఇంక చేసేదేమీలేక, సౌదామినిని తీఉస్కుని బయటికి వచ్చేశాడు.
వచ్చేస్తుంటే ఎదురుగా వస్తున్న ఎర్రటి మారుతీ కారు ఒకటి వాళ్ళ ముందు సడెన్ గా ఆగింది. చటుక్కున తలుపు తెరిచి కిందికి దిగింది ఒకామె. కారు తలుపు బలంగా సౌదామినికి తగిలింది.
"అబ్బా" అంది సౌదామిని బాధగా.
"ఓహ్! అయామ్ సారీ! చూసుకోలేదు. క్షమించండి" అంది కారులోంచి దిగిన ఆమె. తర్వాత సౌదామినివైపు పరీక్షగా చూసి "ఏమిటి కంప్లైంట్" అంది విజ్ఞానం, అధికారం కనబడుతున్నాయి ఆమె కళ్ళలో బాలూ మొహంలోకి ఆశ వచ్చింది.
"ఏడో నెల ప్రెగ్నెన్సీ అండీ! గంటనుంచి ఎందుకో విలవిల్లాడిపోతోంది డాక్టర్స్ టెస్ట్ చేసి ఏమీలేదు. ఇంటికెళ్ళి పొమ్మంటున్నారు".
"అమ్మాయిని కార్లో కూర్చోమనండి. నేను చిన్న పని చూసుకుని అయిదు నిమిషాల్లో వచ్చేస్తాను. మా నర్సింగ్ హోమ్ లో ధరోగా చెక్ చేస్తాను. ఐ యామ్ డాక్టర్ మృదుల".
కళ్ళప్పగించి ఆమెని చూస్తూ వుండిపోయాడు బాలూ.
అయిదు నిముషాల్లోపలే తిరిగి వచ్చేసింది డాక్టర్ మృదుల. బాలూని కూడా కార్లో ఎక్కమని తను డ్రయివింగ్ సీట్లో కూర్చుంది.
మృదుల నర్సింగ్ హోం రెండు కిలోమీటర్ల దూరం వుంది అక్కడికి ఆ బిల్డింగు అక్కడి వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా వుంది.
అవన్నీ గమనించే స్థితిలో లేడు బాలూ. మూలుగుతున్న సౌదామినినే ఆదుర్దాగా చూస్తున్నాడు.
ఆమెని బెడ్ మీద పడుకోబెట్టి చెకప్ చేసింది మృదుల. ఆమె పెదిమలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి.
"కంగారేమీ లేదు. లేబర్ పెయిన్స్ వస్తున్నాయి. డెలివరీ టైము". ఒక్కసారిగా రిలీఫ్ కనబడింది బాలూ మొహంలో.
"నిజంగానా! థాంక్యూ డాక్టర్" అన్నాడు సంతోషం అందుకనే ప్రయత్నం చేస్తూ అంతలోనే అతనికి అనుమానం వచ్చింది.
"డాక్టర్! ఆమెకి ఇంకా ఏడో నెల కూడా పూర్తిగా నిండలేదు. అప్పుడే డెలివరీ అవుతుందా?"
"ఏదో నెలా! కరక్టేనా?" అంది సాలోచనగా అయినా "ఆశ్చర్యమేమీ లేదు. అరుదుగా అప్పుడప్పుడు యిలాంటి ప్రిమెచ్యూర్ డెలివరీస్ జరుగుతూనే ఉంటాయి".
"దానివల్ల భయమేమీ లేదంటారా?"
"భయమేమీ లేదు కానీ ప్రిమెచ్యూర్ బేబీస్ కొంచెం వీక్ గా వుంటారు. మొదట్లో కొద్ది వారాలపాటు జాగ్రత్తగా వుండాలి అంతే..."
వెంటనే లేబర్ రూంలోకి తీసుకెళ్ళిపోయారు సౌదామినిని.
అప్పటికి మిగతా ఫ్రెండ్సు కూడా అక్కడికి చేరుకున్నారు.
ఆందోళనగా వుంది అందరి మనసూ.
అర్ధరాత్రి అయ్యాక సౌదామినికి డెలివరీ అయింది.
చాలాసేపు మగ్తఃగా పడుకునే వుండిపోయింది. తర్వాత అతి ప్రయత్నం మీద కళ్ళు తెరిచి చూచింది.
ఎదురుగా డాక్టర్ మృదుల నిలబడి వుంది.
"లేచావా? నాలుగో నెంబరు రూమ్ లో చాలా స్వీట్ బేబీ ఒకడు పుట్టాడు. చూడండని నర్సింగ్ హోం అంతా చాటింపు వేసి వస్తున్నాను" అంది నవ్వుతూ.
మధురాతి మధురంగా వినపడ్డాయి ఆ మాటలు సౌదామినికి.
"స్వీట్ బేబీనా?... ఏడీ?" అంది తల పక్కకి తిప్పడానికి ప్రయత్నం చేస్తూ.
పక్కనే వున్న ఉయ్యాలలో మెత్తటి ఉన్ని రగ్గు మధ్య ముడుచుకు పడుకున్న ఊలు బంతిలాంటి పిల్లాణ్ణి ఎత్తుకుని చూపించింది డాక్టరు.
నీరసంగా చేతులు చాపబోయింది సౌదామిని.
నవ్వుతూ తల అడ్డంగా ఊపింది డాక్టరు. "ఊహు! యిప్పుడు కాదు, కొంచెం ఓపిక వచ్చాక! నీ కొడుకు ఎక్కడికీ పారిపోడులే! బాగా రెస్టు తీసుకో!"
మళ్ళీ కళ్ళు మూతలు పడిపోయాయి సౌదామినికి తృప్తితో కూడిన చిరునవ్వు ఆమె పెదవులమీద మెరుస్తోంది.
బాలూ దగ్గరికి వచ్చింది డాక్టర్.
"కంగ్రాట్స్! యూఆర్ ఏ ప్రౌడ్ ఫాదర్ నౌ!"
"తల్లీ బిడ్డా క్షేమం...." అని ధ్వనిస్తున్న ఆ మాటలు వినగానే గుండెమీద నుంచి కొండంత బరువు తీసేసినట్లయింది బాలూకి. గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు.
ఆ తర్వాత అడిగాడు కుతూహలంగా.
"అమ్మాయా? అబ్బాయా డాక్టర్?"
"అబ్బాయే!"
"బాగా బలహీనంగా వున్నాడా?"
"అబ్బే! బలహీనంగా లేకపోగా... బాగా బొద్దుగా వున్నాడు. బోనీ బేబీ. కాసేపయ్యాక చూడొచ్చు మీరు".
అప్పటిదాకా అతను అనుభవిస్తున్న భయాలూ, దిగుళ్ళు అన్నీ చేత్తో తీసేసినట్లు అయిపోయింది బాలూకి. తన కృతజ్ఞత అంతా గొంతులో పలికిస్తూ అన్నాడు.
"దేవదూతలు ప్రత్యక్షమై రక్షించడం అని కథల్లో చదువుతుంటామే, అది మీ విషయంలో నిజమయింది డాక్టరుగారూ! మీరు నిజంగా దేవదూతలే! మీకు ఎన్నిసార్లు థాంక్స్ చెబితే సరిపోతుంది". నవ్వి తల పంకించి ఊరుకుంది.
"ఇంకో విషయం డాక్టరుగారూ!"
ఏమిటన్నట్లు చూసింది మృదుల.
"మా దగ్గర బొత్తిగా డబ్బులేదు. చాలా ఇబ్బందుల్లో వున్నాం. మీ ఫీజు వెంటనే యిచ్చుకోలేను".
"దాన్ని గురించి వర్రీ అవకండి. అమ్మాయి పదిరోజుల పాటు మా దగ్గరే వుంటుంది, తర్వాత మీరు తీసుకెళ్ళవచ్చు. డబ్బులు ఉన్నప్పుడే బిల్లు పే చెయ్యండి".
రెండు చేతులూ ఎత్తి నమస్కారం చేసాడు బాలూ.
ఆ ఎత్తిన చేతులు దించుతుండగానే వాటిల్లో బాబుని వుంచింది నర్సు.
అతి సున్నితంగా అతి జాగ్రత్తగా ఆ పసిగుడ్డుని పట్టుకుని పరీక్షగా చూశాడు.
పూర్తిగా నెలలు నిండిన తర్వాత పుట్టే పిల్లలకంటే కూడా బలంగా వున్నాడు పిల్లాడు. ఇది కేవలం తన అదృష్టమే! నెలలు నిండకముందే పుట్టినా, వాడు బలహీనంగా లేడూ! ఎంత విచిత్రం!
అతని కళ్ళముందు గవర్నమెంటు హాస్పిటలూ, అక్కడి లేడీ డాక్టరూ మెదిలారు. కోపాన్ని ఆపుకోవడానికి పళ్ళు బిగబట్టి లేచి నిల్చున్నాడు అతను.
* * *
తలెత్తి చూసింది ఆ లేడీ డాక్టరు.
ఎర్రబడ్డ కళ్ళతో తీవ్రంగా చూస్తున్న బాలూ కనపడ్డాడు.
అతడెవరో ఆమెకు గుర్తులేదు.
"ఏమిటి కంప్లయింట్?" అంది మామూలుగా.
"నిర్లక్ష్యం, బద్ధకం, ఒళ్ళుపొగరూ..." అన్నాడతడు పౌరుషంగా.
డాక్టరు లేచి నిలబడింది కోపంగా.
"వాట్ నాన్సెన్స్ యూ ఆర్ టాకింగ్! తల తిరుగుతోందా?" అతనికి కోపంతో మాటలు రావడంలేదు.
"కడుపునొప్పికీ, డెలివరీ పెయిన్స్ కీ తేడా తెలియని నువ్వు డాక్టర్ వీ కాదు. ఆడదానివీ కాదు. ఛీ! ప్రసవవేదన పడుతున్న నా సౌదామినికి ఏ.సి.పీ. టాబ్లెట్సు యిచ్చి వెళ్ళగొట్టేస్తావా? ప్రాణాలతో ఆడుకుంటావా? ఆ డాక్టరు దేవతలా వచ్చి ఆదుకోకపోతే నా సౌదామినికి ఆటోలోనో, రిక్షాలోనో, ఫుట్ పాత్ మీదో డెలివరీ అయ్యేది. అలా నిజంగా అయి వుంటే నీ అంతుచూసి వుండేవాణ్ణి! నాకు బంతిలాంటి కొడుకుపుట్టాడు కాబట్టి నువ్వు బ్రతికిపోయావ్! జాగ్రత్త!"
అతను పెద్ద పెద్ద అంగలువేస్తూ వెళ్ళిపోయాడు. దిమ్మెరపోయి చూస్తున్న ఆ లేడీ డాక్టరు తేరుకున్న తర్వాత నెమ్మదిగా అనుకుంది.
"డెలివరీ అయిందా! హెల్దీబేబీ పుట్టాడా? 12 పౌండ్లా?? అసంభవం-మెడికల్ చరిత్రలో బిగ్ సర్ ప్రయిజ్! రియల్లీ ఈ వివరాలు వ్రాస్తే సంచలనం కలుగుతుంది!!"
ఆమె కూర్చున్న చోట పై కప్పుమీద ఒక సాలె పురుగు అప్పుడే గూడు కట్టడం ప్రారంభించింది.
9
ఒక దిగులు తగ్గగానే మరో గుబులు మనసుని ఆవరించుకోవడం మనుషులకి సహజం. "ఆ తర్వాత వాళ్ళిద్దరూ హాయిగా ఉన్నారు" అనేది ఫాంటసీ కథల్లోనే జరుగుతుంది. మనుషుల మనోవ్యధకి కారణం తప్ప ముగింపు వుండదు.
సౌదామిని ఆరోగ్యం గురించి బెంగ తీరగానే ఆహారం గురించి చింత మొదలయింది బాలూకి.
పచ్చి బాలింతరాలికి పథ్యపు మెతుకులతో కొన్నాళ్ళు గడిచిపోయినా, ఆ తర్వాత? తల్లికే కడుపునిండా తిండి లేకపోతే, పాపకి పాలు ఎలా వస్తాయి.
ప్రోగ్రాంలు చేసి డబ్బు సంపాదించెయ్యగలమన్న ఆశ చచ్చిపోయింది.
ఇంక తను మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవాలి. రేపట్నుంచీ బార్ లు అన్నీ తిరగాలి.
మర్నాడు మళ్ళీ అన్ని బార్లూ, క్లబ్ లూ తిరిగాడు బాలు.
వాళ్ళందరికీ కూడా ఈ లేటెస్టు డెవలప్ మెంట్స్ అన్నీ తెలిసిపోయి వున్నాయి. మరింతగా బిగుసుకుపోయినట్లు కనబడ్డారు. అతన్ని అంటురోగిలా ట్రీట్ చేస్తూ అందరానంత దూరంలో వుంచాలని ప్రయత్నించారు.
వీళ్ళే ఒకప్పుడు, తన వెస్టెండ్ హోటల్లో ప్లే చేసే రోజుల్లో, తనకి మరింత ఎక్కువ సేలరీ యిచ్చి తమవైపు లాగేసుకుందామని చూసినవాళ్ళే!
మహా కళాకారుడు మార్లిన్ బ్రాండో చెప్పిన సూక్తి ఒకటి గుర్తొచ్చింది బాలూకి. "ఈ కళావ్యాపారంలో పైనైతే ఫరవాలేదు గానీ ఫెయిలైతే మాత్రం అది చర్మరోగం కంటే దుర్భరం".
రెగ్యులర్ ఉద్యోగమైతే దొరకలేదుగానీ, అప్పుడప్పుడు చిన్న చిన్న ఛాన్సులు దొరుకుతూనే వున్నాయి బాలూకి. వెస్టెండ్ హోటల్లో సింథసైజర్ ప్లే చేసే గిరిధారి మారేజ్ ఫంక్షన్స్ కీ, తక్కిన ప్రయివేటు ఫంక్షన్స్ కీ, ఇండిపెండెన్సుడే సెలబ్రేషన్స్ కీ తన ఆర్కెస్ట్రా ని తీసుకుని వెళుతుంటాడు. అలాంటి అవకాశం వచ్చినప్పుడల్లా మరచిపోకుండా బాలూని పిలుస్తూనే వున్నాడు. పాతికో యాభయ్యో ఇస్తూనే వున్నాడు.
ఆ వచ్చే డబ్బులు పసిపిల్లాడి పాలడబ్బాల ఖర్చుకి కూడా సరిపోవు.
పిల్లవాడి దురదృష్టం ఏమిటంటే వాడు తాగటానికి సౌదామిని దగ్గర తల్లిపాలు దొరక్కపోవటం!
"కొంత మంది శరీరతత్వం అలాగే వుంటుంది. పాలు పడవు" అని చెప్పింది మృదుల.
ఆ రోజు-
అర్దరాత్రి నుంచి గుక్కపట్టి ఏడుస్తున్నాడు పిల్లవాడు. ఆ ఏడుపు ఆకలివల్లనే అని ఇద్దరికీ తెలుసు. కొద్దిగా చక్కెర కలిపిన నీళ్ళని పిల్లాడి నోట్లో చుక్కలుగా వేసింది సౌదామిని. అంతకంటే ఆ సమయంలో ఇంకేం చెయ్యాలో ఆమెకి తట్టలేదు.