Previous Page Next Page 
భార్యా గుణవతి శత్రు పేజి 22

 

    నీ కెప్పుడూ సంతృప్తి నివ్వదు.
    ఎవరితో కలిసి వున్నప్పుడు-
    నీ మనసే ఒక ఇల్లవుతుందో-
    అది సంతృప్తినిస్తుంది.    
    సౌదామినీ - సౌదామినీ - సౌదామినీ ఈ నిచ్చెన మెట్లమీద నిలబడి నిన్ను చూస్తూంటే - నువ్వు నా భవిష్యత్తు కోసం వేస్తున్న నిచ్చెనలు కనబడుతున్నాయి.    
    నాలుగు గోడలమీద రాసేసరికి తెల్లవారుఝాము అయింది. మిల్క్ వ్యాన్ లు తిరగడం మొదలుపెట్టాయి. రోడ్లమీద మెల్లిమెల్లిగా జనసంచారం మొదలయింది.    
    'ఈ రోజుకి ఇంక చాలు' - అనుకుని ఇంటికి వచ్చేశారు.    
    ప్రొద్దునే అహమ్మద్ దగ్గరికి వెళ్ళాడు బాలు. కార్డుబోర్డ్ మీద కాయితాలు అంటించి రాసేపని అతనికి అప్పచెప్పాడు.    
    త్వరత్వరగా రోజులు గడిచిపోతున్నాయి. ప్రోగ్రాం కోసం ఏర్పాట్లు చేయడం, ప్రాక్టీసు చెయ్యటంతో క్షణం తీరిక ఉండటం లేదు. కట్టుబట్టలతో వచ్చేసిన సౌదామిని దగ్గర వీణ లేదు. తను ప్లే చేయవలసిన ఐటెమ్స్ మనసులోనే మననం చేసుకుంటోంది. ప్రోగ్రాం రోజుకి మాత్రం ఎవరిదన్నా వీణ తీసుకోవచ్చు అన్న భరోసాతో ఉన్నారు వాళ్ళు.
    
                                         *    *    *    
    ఎంతో ఎదురుచూస్తున్న ఆ "స్పెషల్ డే" రానే వచ్చేసింది. మూడు గంటల ముందరే ఆడిటోరియంకి తరలి వెళ్ళి పోయారు. గేటు దగ్గర ఒక బల్లా, కుర్చీ వేసుకుని కూర్చున్నాడు అహమ్మద్ టిక్కెట్లు అమ్మడానికి.    
    లోపల గ్రీన్ రూంలో చివరిగా ప్రాక్టీసు చేస్తున్నారు బాలూ, సౌదామిని. ప్రాక్టీసు పూర్తయిన తర్వాత డయాస్ మీదకి వచ్చాడు బాలూ.    
    తెర ఇంకా తెరవలేదు.    
    మైకు దగ్గర నిలబడి చెప్పడం మొదలెట్టాడు.    
    "సంగీత ప్రియులకు నా కైమోడ్పుగా సంగీత మహాసాగరాన్ని సంతోషంగా సాహసంగా ఈదుతూ, దారి లోతునీ, దరినీ తరచి చూడాలన్నంత ఉత్సాహంతో, ఉద్వేగంతో వున్న ఒక యువజంట తమ ప్రయత్నాలకు శుభాశీస్సులు కోరుతూ మీ ముందుకొస్తోంది. మా సంగీతాన్ని మీరు విని ఆనందిస్తారనీ, ఆదరిస్తారనీ ఆశిస్తూ ముందుగా "శుక్లాంబరధరం"తో మొదలెడతాను. తర్వాత శ్రీమతి సౌదామిని వీణ మిమ్మల్ని ఆనందాంబుధిలో ముంచేస్తుంది."    
    నెమ్మది నెమ్మదిగా తెర లేచింది....    
    నిశ్చేష్టుడైపోయాడు బాలూ.    
    శ్వాస, విషాదవాయులీన హిందోళమై - పెదవి అదురు నిస్సహాయ కదన కుతూహలమై - వణికే వేళ్ళ చివరలు భైరవీ రాగాంత ప్రకంపనాలై పోగా.....కంటిచివరి నీటిచుక్క శివరంజని నాశ్రయించింది.    
    ఎదురుగా ఆడిటోరియంలో ఖాళీ కుర్చీలు అతన్ని వెక్కిరిస్తూ చూశాయి.    
    నిస్తేజం, నిరుత్సాహం, నిస్పృహ ఒక్కసారిగా చుట్టుముట్టేయగా, నిశ్చేష్టుడై డయాస్ మీద అలాగే నిలబడి వుండి పోయాడు.    
    మెల్లిగా అతని పక్కకు వచ్చి నిలబడింది సౌదామిని.    
    హాలంతా నిశ్శబ్దం కాళ్ళమీద జారిపోయాడు బాలు.    
    చిన్నపిల్లాడిలా ఆమెని చుట్టేసి నిశ్శబ్దంగా రోదించసాగాడు.    
    ఆమె అతని చుట్టూ మౌనంగా చేతులేసింది.    
    ఈ లోకమనే రంగస్థలం మీద తమ పాత్రలేమిటో అవగాహన లేకుండా పోర్షన్ మర్చిపోయి, అయోమయమైపోయిన, అనుభవ శూన్యులైన నటీనటుల్లా వున్నారు వాళ్ళిద్దరూ.    
    తన చేతులమధ్య వున్న సౌదామినిలో కదలికని గమనించాడు బాలూ. ఆమె ఊపిరి భారంగా వస్తోంది. గొంతులోనుంచి అస్పష్టంగా మూలుగు..పెదవులు వణుకుతున్నాయి.    
    హఠాత్తుగా క్రిందకి జారిపోయింది. ఆమె చేతులు పొట్టమీదకి వెళ్ళిపోయాయి.    
    బాధతో కొంకర్లు తిరిగిపోతోంది.    
    అప్పుడే లోపలికి ప్రవేశించిన అహమ్మదూ, ఇంకో అయిదారుమంది స్నేహితులూ ఆదుర్దాగా డయాస్ మీదికి వచ్చేశారు.   
    బాగా మూలుగుతోంది సౌదామిని.    
    ఆమె పక్కనే చతికిలబడిపోయి ఆమె ముఖాన్ని రెండు చేతుల్తో పట్టుకుని "సౌదామినీ! సౌదామినీ! ఏమయింది? ఇటు చూడు ప్లీజ్! చూడు" అంటున్నాడు బాలూ అతని గొంతు వణుకుతోంది.    
    అతి ప్రయత్నంమీద ఒక్కసారి కళ్ళు తెరిచి అతన్ని చూసింది సౌదామిని. మళ్ళీ వెంటనే ఆమె కళ్ళు మూతలు పడిపోయాయి. ఆమె మొహానికి చెమట పట్టేస్తోంది.    
    "అహమ్మద్ ఏం చేద్దాం?" అన్నాడు నిస్సహాయంగా.    
    "డాక్టర్ ను పిలుచుకురానా?"    
    "ఎలా? నా దగ్గర నాలుగు రూపాయలో ఎంతో వుంది. అంతే!"    
    మిత్రులు అందరూ జేబులు వెతుక్కున్నారు అందరి దగ్గర కలిపి పదిహేను రూపాయలూ, కొంత చిల్లరా తేలింది. ఎవరికీ వాళ్ళు తమ దగ్గరున్న కొద్ది డబ్బునీ అప్పటికే ఆ ప్రోగ్రాం అరేంజిమెంట్స్ కి ఖర్చుచేసేసి వున్నారు. డాక్టర్ని అక్కడికి తీసుకువస్తే ఫీజు ఎంత తీసుకుంటాడో తెలియదు. సౌదామినిని డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళినా మందులకి ఎంత అవుతుందో తెలియదు.    
    "ప్రయివేట్ డాక్టర్స్ దగ్గర లాభంలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళి పోదాం" అన్నాడు బాలు.    
    ఎవరో పరుగెత్తికెళ్ళి ఆటో  పిల్చుకొచ్చారు. హాస్పిటల్ కి వెళ్ళే దారిలో మూడు నర్సింగ్ హోమ్ లు కనబడ్డాయి. అవి కనబడినప్పుడల్లా బాలూ గుండె పిండేసినట్లయింది వాటిలో సౌదామినిని చేర్చేయగలిగితే బాగుండును....తక్షణం ట్రీట్ మెంట్ మొదలెడతారు.....జాగ్రత్తగా చూసుకుంటారు.    
    గవర్నమెంటు హాస్పిటల్ అంటే ఎన్నో ఫార్మాలిటీసు! అవన్నీ పూర్తయ్యేసరికి ఎంత టైం పట్టొచ్చు? తన సౌదామినికి ఈలోగా ఏమన్నా అయిపోతే? దడ దడ కొట్టుకొంటోంది అతని గుండె. ఆటో హాస్పిటల్ చేరింది. సౌదామినిని దాదాపు రెండు చేతులమీదా మోస్తున్నట్లు లోపలికి తీసుకెళ్ళాడు.    
    "సిస్టర్! ఏమైందో తెలియదు, బాధతో మెలికలు తిరిగిపోతోంది. తనకు ఏడోనెల! దయచేసి...." ఆమెని పడుకోబెట్టి అన్నాడు.    
    నర్సు చాలా మామూలుగా చెప్పింది - "లోపల డాక్టర్స్ వున్నారు, వెళ్ళండి."    
    అతను లోపలికి తొంగి చూశాడు. లోపల నలుగురు డాక్టర్స్ వున్నారు. ప్రశ్నార్ధకంగా అతనివైపు చూశారు.    
    "నా భార్య.... ఎందుకో సఫర్ అవుతోంది"    
    "లోపలికి తీసుకురండి" అంది లేడీ డాక్టర్.    
    "పడిపోయినట్టు అరుగుమీద పడుకుండిపోయింది డాక్టర్! మీరు బయటికి వచ్చి..."    
    "ఇక్కడికి తీసుకురండి" అంది ఆమె.    
    ఆమె మొహంలో తొందరా, ఆదుర్దా ఏమీ కనబడటం లేదు. "ఇలాంటివి మాకు మామూలే" అన్నట్లు నిదానంగా మాట్లాడుతోంది....తక్కిన ముగ్గురు డాక్టర్సూ అతన్ని నిర్లిప్తంగా చూస్తున్నారు.    
    బయటికి వచ్చాడు బాలూ.    
    "సౌదామినీ! లే! లోపలికెళదాం!"    
    "నేను....రాలేను....కళ్ళు...తిరుగుతున్నాయ్".    
    "ఒక్కసారి ఓపిక తెచ్చుకో సౌదామినీ! లేవవా?" అన్నాడు.    
    అతికష్టంమీద లేచి కూర్చుంది.    
    "నాకు..నాకేం కనబడటంలేదు..బాలూ" అంది కళ్ళు చిట్లించి చూడటానికి ప్రయత్నిస్తూ.    
    అతను మాట్లాడలేదు. మాట్లాడితే ఏడుపొచ్చేస్తుందేమో అన్నంత ఇదిగా వుంది అతనికి.    
    సౌదామినిని లేవదీసి - లోపలికి నడిపించుకెళ్ళాడు.    
    "అక్కడ పడుకోబెట్టండి" అంది లేడీ డాక్టర్.    
    ఎత్తుగా వుంది బల్ల. దానిమీదకు ఎక్కడానికి రెండుమెట్లున్నాయి.    
    "సౌదామినీ! మెట్లున్నాయి! జాగ్రత్తగా ఎక్కు!"    
    "మెట్లా.... ఎక్కడ?"    
    వంగి, ఆమె పాదాన్ని పట్టుకుని ఒక మెట్టుమీద పెట్టాడు బాలూ రెండో మెట్టుమీద తనే కాలుపెట్టి, పైకి ఎక్కేసి వెంటనే సోలిపోయింది సౌదామిని.    
    లేడీ డాక్టర్ ఆమెని టెస్ట్ చెయ్యడం మొదలెట్టింది.    
    పక్కనే నిలబడి చూస్తున్నాడు బాలు.    
    "మీరు బయటికెళ్ళి వెయిట్ చెయ్యండి" అన్నాడు ఇంకో డాక్టర్ మందలిస్తున్నట్లు.    
    "సారీ!" అని చెప్పి బయటకొచ్చి కూర్చున్నాడు.    
    అతనికి హాస్పిటల్సూ, ఈ వాతావరణం ఇదంతా కొత్త అతను అనారోగ్యం అంటే ఏమిటో ఎరుగడు అసలు, చిన్నప్పటి నుంచి కూడా ఏమయి వుంటుంది సౌదామినికి? నెల తప్పిన తర్వాత ఈ ఏడు నెలల్లోనూ ఆమెకి సరైన మెడికల్ కేర్ లేదు సరైన ఆహారం లేదు సరైన విశ్రాంతి లేదు.    
    పైగా - రెండు మూడు వారాలనుంచీ తనతో సమానంగా రోడ్ల వెంబడి తిరిగి నలిగిపోయింది మనిషి తనో ఫూల్....తనో ఇడియట్.    
    ఏమయి వుంటుంది ఇప్పుడు? లోపల నుంచి ఒక మనిషి వచ్చాడు, చూస్తే వార్డుబోయ్ లాగా వున్నాడు.    
    తన పక్కన కూర్చున్న ఇంకో గుంపుని అడుగుతున్నాడు అతను.    
    "ఏమైంది మీ వాళ్ళని ఇన్ పేషెంట్ గా షెరీక్ చేసుకోవడం?"    
    వాళ్ళలో ఒకాయన లేచి నిలబడ్డాడు.    
    "పేషెంట్ మంచిగనే వున్నాడు. ఇన్ పేషెంట్ షెరీక్ అయ్యే అవసరం లేదు. ఇంటికి ఎల్లిపోండ్రి అని నాలుగు తెల్ల గోలీలు ఇచ్చిండ్రు ఈ పిల్లవాడి హాలత్ చూస్తుంటే ఇట్లుండె. ఏం చెయ్యమంటావ్?"    
    వార్డుబోయ్ సర్వాంతర్యామిలా చిరునవ్వు నవ్వాడు. తర్వాత వాళ్ళిద్దరూ మెల్లిగా ఏదో మాట్లాడుకుంటూ దూరంగా వెళ్ళిపోయారు. వార్డుబోయ్ చెప్పేది శ్రద్దగా వింటున్నాడు ఆ రోగి తాలూకు మనిషి.    
    ఊపిరి బిగపట్టి ఇదంతా చూస్తున్నాడు బాలూ.    
    ఈలోగా లోపలినుంచి డాక్టరమ్మ పిలిచింది.    
    త్వరత్వరగా లోపలికి వెళ్ళాడు.    
    "ఏమైందండి?" అన్నాడు ఆత్రంగా.    
    "ఏమీ కాలేదు. ప్రెగ్నెన్సీ కదా! పేషెంట్ మంచిగనే వుంది. ఇన్ పేషెంట్ గా షరీక్ అయ్యే అవసరం లేదు. ఈ మాత్రలు తీసుకొని, ఇంటికి తీసుకెళ్ళిపోండి. టాబ్లెట్లు వెయ్యండి. మార్నింగ్ కి తగ్గిపోతుంది. తగ్గకపోతే మార్నింగ్ ఓ.పీ.కి. రండి."    
    "ఈలోగా ఏమన్నా అయితే?"    
    "ఏమీకాదు, తీసుకెళ్ళండి."    
    "అమ్మా" అంటూ అటునుంచి ఇటు పొర్లింది సౌదామిని ఆమె చీర మోకాళ్ళ దాకా తొలగిపోయింది. ఆ మగతలోనే చెయ్యి జాచి చీరె పాదాల కిందకి లాక్కుని, మళ్ళీ మూలగటం మొదలు పెట్టింది.    
    "చాలా బాధపడుతున్నట్లుంది డాక్టర్" అన్నాడు బాలూ-జాలిగా.

 Previous Page Next Page