Previous Page Next Page 
భార్యా గుణవతి శత్రు పేజి 24

 

    తెల్లారేక కూడా పిల్లాడు ఏడుపు ఆపలేదు. వాడి ఏడుపు చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. సౌదామిని కళ్ళలో కూడా నీళ్ళు తిరుగుతున్నాయి.    
    "కన్నానుగానీ పాలుకూడా ఇవ్వలేని పాపిష్టిదాన్ని నాన్నా! ఏం తాగించను నీకు? నా కన్నీళ్ళు త్రాగితే నీ చిన్న బొజ్జ నిండుతుందా?" అంటోంది వివశురాలై.    
    ఇదంతా చూస్తున్న బాలూ నేరస్థుడిలా ఫీలౌతూ లేచి రోడ్డుమీదికి వెళ్ళిపోయాడు.    
    మోకాళ్ళలో తలపెట్టి వెక్కుతూ వుండిపోయింది సౌదామిని.    
    చాలాసేపటి తర్వాత తల పైకెత్తి, కళ్ళు పమిటచెంగుతో తుడుచుకుని చూస్తే ఎదురుగా పిల్లాడు కనబడలేదు.    
    కమ్చీతో కొట్టినట్లు లేచి నిలబడింది సౌదామిని. ఏమయ్యాడు వీడు? బాలూ ఎత్తుకెళ్ళాడా?    
    గబగబా బయటకి వచ్చి చూసింది బాలూ ఎక్కడా కనబడలేదు.    
    అయోమయంగా తిరుగుతూ వెదికింది.    
    ఒక పెద్ద ఇంటి కాంపౌండులో ఒకటిన్నర గదుల పోర్షన్ లో వుంటున్నారు వాళ్ళు. మరి నాలుగు పోర్షన్ లు కూడా వున్నాయి. అందులో ముందువైపు వున్న మెయిన్ హవుస్ లో ఇంటి ఓనర్లు వుంటున్నారు.    
    మొదటి రూమ్ లోకి వెళ్ళగానే మంత్ర ముగ్ధలా అయిపోయింది అక్కడ కనబడ్డ దృశ్యాన్ని చూస్తూ.    
    అక్కడ టీవీ ఆన్ చేసి వుండి, పెద్దగా వెస్టర్న్ మ్యూజిక్ వస్తోంది రాక్ ప్రోగ్రామ్ ఏదో.    
    అదికాదు సౌదామిని దృష్టిని ఆకర్షించింది.    
    టీ.వీ. ముందు గోడకి జేరగిలబడి వుంది నాగమ్మ.    
    ఆ ఇంటి పనిమనిషి!    
    ఆమె వళ్ళో -    
    తన కొడుకు!    
    తన కొడుకు మొహంమీద కొంగు కప్పి స్థన్యం యిస్తోంది ఆ పనిమనిషి.    
    పిడికిళ్ళు రెండూ బిగించి గాల్లో ఆడిస్తూ కాళ్ళు తపతప కొడుతూ, పాలు తాగుతున్నాడు పిల్లవాడు.    
    చేతులు వణికాయి సౌదామినికి.    
    అలికిడి విని ఉలిక్కిపడి తలెత్తి చూపింది పనిమనిషి ఆమె కళ్ళల్లో భయం కనబడింది. సౌదామినికి ఎంత అభిమానమో ఆమెకి తెలుసు.    
    అందుకని అపాలజిటిక్ గా అన్నది.    
    "పిల్లగాడు ఏడుస్తుంటే సూడలేక పోయినా! ఏమనుకోకుండ్రి అమ్మా! నా కొడుక్కి రెండేళ్ళు వచ్చినయ్! ఇంకా పాలు మానలా! వాడిచేత మాన్పించాలని కుంకుడుకాయ రసం పూసుకుంటున్నా అమ్మా! నా దగ్గర పాలున్నాయ్! నీ కొడుకు ఏడుస్తుంటే సూడలేక పోయినాను".    
    ట్రాన్సులో వున్నట్లు మాట్లాడకుండా చూస్తూ వుండిపోయింది సౌదామిని. మెదడు వేడెక్కి కరిగిపోయేటట్లు వుంది.    
    మామూలు పరిస్థితులలో అయితే మనిషి మెదడు తన కెపాసిటీలో ఏ నాలుగోవంతు మాత్రం పనిచేస్తుందని చెబుతారు. మెదడుచేత పూర్తి కెపాసిటీతో పని చేయించాలంటే అకుంఠిత దీక్ష అయినా కావాలి, లేదా అత్యంత ప్రాముఖ్యత వున్న సంఘటన ఏదన్నా జరిగి మెదడు కుండలినిలా మేల్కొని పూర్తి సామర్ధ్యంతో పని చెయ్యడం మొదలు పెట్టాలి.    
    ఆ రెండోదే జరిగింది సౌదామిని విషయంలో.    
    తన కొడుకు ఆకలితో అల్లాడిపోవటం, తన దగ్గర పాలు లేకపోవటం. ఈ పనిమనిషి స్థన్యమిచ్చి తన కొడుకు ఆకలి తీర్చటం ఆమె మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి.    
    'ఇంకెప్పుడూ నిన్ను ఆకలితో బాధపడనివ్వను తండ్రీ!' అనుకుంది స్థిరంగా. అప్పటిదాకా కంటికి కనబడుతున్నా చెవులకి వినబడుతున్నా మెదడుదాకా చేరని దృశ్యాలు, మాటలూ హఠాత్తుగా మెదడును మేల్కొలిపాయి.    
    టీ.వీ.లో రాక్ మ్యూజిక్!    
    విచిత్రమైన వేషాలంకరణతో వున్న కుర్రాళ్ళు కచేరి చేస్తున్నారు.    
    టీ.వీ.యే వూగిపోతుందేమో అన్నంతగా డాన్స్ చేస్తున్నారు.    
    పనిమనిషి ఒళ్ళో తన కొడుకు బాలకృష్ణుడిలా కాళ్ళు కదుపుతున్నాడు.    
    తకదై..... తకధై....    
    యూ ఆర్ ది థీమ్ ఫర్ మై డ్రీమ్ .. టీ.వీ.లో.    
    సరిగా.....గమపా..... పనిసా.... బాబు కాళ్ళలో.    
    రాక్ మ్యూజిక్....    
    శాస్త్రీయ సంగీతం....    
    ఫుల్ నోట్ .... ఇస్తబార్ - డిస్కో లయకి బ్రేక్ ల విన్యాసం.    
    త్వరితగతిని స్వరగతి చింతనం -సప్తస్వరం మహాన్వితం - రెండూ కలిపితే.....    
    -- అప్పుడు తట్టింది సౌదామినికి            
    అద్భుతమైన ఐడియా.    
                                           10    
    లోపలికి అడుగుపెట్టగానే ఇంటి వాతావరణంలో ఏదో మార్పున్నట్టు కనబడింది బాలూకి.    
    మంచినీళ్ళ గ్లాసుతో ఎదురొచ్చింది సౌదామిని.    
    "ఏమిటి విశేషం?" అడిగాడు.    
    "ఈస్ట్ వెస్ట్ ఎలక్ట్రిక్ ఎక్స్ ప్రెస్" అంది గ్లాసు అందించి నవ్వుతూ.    
    "అదేమిటి?"    
    "కూర్చోండి చెబుతాను."    
    ఇద్దరూ గోడకి ఆనుకొని కూర్చున్నారు.    
    కడుపునిండా పాలు తాగిన పిల్లాడు ఒక చిన్న కొయ్య ముక్కని నేలమీదికి తోస్తూ ఆడుకుంటున్నాడు.    
    "మళ్ళీ ప్రోగ్రామ్ ఇస్తాం మనం" అంది సౌదామిని.    
    "ఇదివరకు ప్రోగ్రామ్ యిచ్చి నేర్చుకున్న గుణపాఠం చాలదూ!"    
    "గుణపాఠం నేర్చుకున్నాం కాబట్టే ఇదివరకు చేసిన పొరపాటు చెయ్యం మనం."    
    "అంటే?"    
    "జనానికి కొత్తకావాలి. రోజుకో మోజు మారుతున్న కాలమిది. కళ విషయంలో కూడా అంతే. క్రితంసారి ఆర్ధోడాక్స్ గా అందరూ చేసేది మనమూ చెయ్యబోయాం. ఈసారి ఆ పొరపాటు చెయ్యం. ఎవరూ చెయ్యనిధి మనం చేస్తాం."    
    "ఏమిటది?"    
    "స్పీడు యుగం యిది. అక్షరమాల పూర్తిగా నేర్చుకోకుండానే నవలలు రాసెయ్యాలనే కోరిక, డాన్సులో అడుగులు వెయ్యడం సరిగా రాకుండానే అరంగేట్రం చెయ్యాలనే ఆరాటం, దేనిమీద అవగాహన లేకుండానే ప్రయోగాలు చేసెయ్యాలనే తపన.....    
    ... అది తప్పా కాదా అని ఆలోచించటంలేదు జనం. ఏది కొత్తగా కనబడితే దానివెంట వెర్రిగా పరుగులు తీస్తున్నారు.    
    ".... అందుకని వాళ్ళ దారిలోనే కొంతదూరం పోదాం మనం ఆ తర్వాత వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవడం కష్టం కాదు...."    
    క్రమంగా ఆమె చెబుతోంది అతని మనసు కెక్కుతోంది.    
    "వెస్టర్న్ రాక్ మ్యూజిక్కూ, ఈస్టర్న్ క్లాసికల్ రాగాలూ కలిపి కాక్ టెయిల్ చేద్దామంటావు నువ్వు రాక్ అండ్ రాగా... అవునా" అని అడిగాడు నవ్వుతూ.    
    "రాక్ నీ రాగాన్ని కలపడం కూడా పాతబడిపోయింది. ఆనంద్ శంకర్ ఎప్పుడో చేసేశాడా ఎక్స్ పెరిమెంట్! మనం ఇంకో స్టెప్ ముందు కెళుతున్నాం. అంటే స్టెప్స్ కూడా కలుపుతాం!! బ్రేక్ డాన్సూ కూచిపూడి డాన్సూ కలిపి - సై కెడెలిక్ లైట్ల హంగామాతో "షో" ఏర్పాటు చేస్తాం. "ఈస్ట్ వెస్ట్ ఎలక్ట్రిక్ ఎక్స్ ప్రెస్" అని పేరు పెడతాం. టూకీగా "త్రిబుల్ ఈ" అని పిలుస్తాం" అంది.    
    బాలూ తెల్లబోతూ- "నీ 'ఎలక్ట్రిక్ ఎక్స్ ప్రెస్' మరీ ఆటోమిక్ స్పీడులో పోతున్నట్లుంది డియర్" అన్నాడు.    
    నవ్వింది సౌదామిని.    
    "ఇంటర్నేషనల్ స్టార్ కేస్ట్ కోసం దేశదేశాలు గాలించనక్కరలేదు మనం. హైదరాబాద్ లోనే ఫారన్ స్టూడెంట్స్ ఎంతో మంది వున్నారు. ఆఫ్రికన్ దేశాలనుంచి వచ్చిన వాళ్ళు, అరేబియన్ దేశాలనుంచి వచ్చిన వాళ్ళు, ఇరాన్ స్టూడెంట్సూ, సో మెనీ.....సికింద్రాబాద్ లో చాలామంది ఆంగ్లో ఇండియన్స్, చైనీయులు కూడా వుంటారు. ఆకర్షణ కోసం వెళ్ళు చాలు మనకి. ఈ స్టూడెంట్స్ లో చాలామందికి రాక్ మ్యూజిక్, బ్రేక్ డాన్స్ అంటే కొద్దో గొప్పో తెలిసే వుంటుందనుకున్నాను. కూచిపూడి డాన్సర్ ని మాత్రం మంచి అమ్మాయిల్ని పెట్టుకుందాం."    
    ఆమె చెబుతున్నది అతి తెలివైన, అతి సులువైన ప్లాను అని అర్ధమైంది బాలూకి. సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే కాబోలు అన్పించింది. ఆమోదిస్తున్నట్టు తలూపాడు.    
    అరేంజ్ మెంట్స్ ఏమేమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఇద్దరూ కలిసి ఆలోచించటం మొదలుపెట్టారు.    
    "అంతా బాగానే వుంది కానీ ఒక సంగతి మర్చిపోతున్నాం" అన్నాడు బాలూ.    
    "నాకు తెలుసు. డబ్బు ఎలా అని అవునా?"    
    "అవును ఎలా?"    
    మళ్ళీ ఇద్దరూ కాసేపు ఆలోచనలో పడిపోయారు.    
    "నువ్వు వీణ పాఠాలు నేర్పిస్తున్నావుగా రెండు నెలల జీతం అడ్వాన్సుగా అడిగితే?"    
    చేతివేళ్ళ గోళ్ళవేపు కాసేపు చూసుకుంటూ వుండిపోయింది సౌదామిని. "అంతకంటే వేరే మార్గం ఏమీ లేదేమో!"    
    టెలిఫోన్స్ ఆఫీసర్ గారికీ, ఆయన భార్యకీ సౌదామిని అంటే చాలా వాత్సల్యం వుంది.    
    అయినా ఎంతో తటపటాయిస్తూనే అడిగింది సౌదామిని. వాళ్ళు సహాయం చెయ్యడానికి ఒప్పుకున్నారు.    
    డబ్బు దొరకగానే ప్రయత్నాలు మొదలెట్టారు.    
    తమకు చేతనైన విధంగా సహాయం చేస్తున్నారు ఫ్రెండ్స్  అందరూ కూడా.    
    అందరికీ తెలుసు - ఇది చిట్టచివరి అవకాశం అనీ, దీనితో ఆకాశాన్ని అందుకోవడమో, అధఃపాతాళానికి వెళ్ళిపోవడమో జరుగుతుందనీ.    
    చివరికి ప్రోగ్రాం జరిగేరోజు రానే వచ్చేసింది.    
                                              11    
    తన గుండెచప్పుడు డ్రమ్స్ శబ్దం కంటే పెద్దగా ప్రేక్షకులకు వినబడుతుందేమోనని భయం వేసింది బాలూకి! తెర నెమ్మదిగా పైకి లేస్తూంటే బెదిరిపోయాడు అతను. తెర లేవగానే ప్రేక్షకులు కాదు కనబడేది భవిష్యత్తే కనబడుతుంది అక్కడ.    
    హాలు సగమే నిండింది. వచ్చిన వాళ్ళంతా కూడా పాతికేళ్ళలోపు వాళ్ళే వాళ్ళలోనూ టీనేజర్స్ ఎక్కువ. "ఈస్ట్ వెస్ట్ ఎలక్ట్రిక్ ఎక్స్ ప్రెస్" అన్న పేరు ఆకర్షించింది వాళ్ళని.

 Previous Page Next Page