పావుగంట గడిచాక డాక్టరుగారు బయటకు వచ్చారు. నారాయణ ఆయన ముఖ కవళికలు చూచి, పలకరించటానికి ప్రయత్నిస్తూ అనుసరించి నడవసాగాడు.
"ప్రమాదం వుందంటారా డాక్టర్?"
ఆయన జాలిగా నారాయణ వంక చూసి "మీకో విచారకరమైన విషయం చెప్పాల్సివుంది మిష్టర్ నారాయణరావు" అన్నాడు.
"ఏమిటి?"
"కుడికాలు మోకాలు క్రిందనుంచి బాగా చితికిపోయింది. అది - - - తీసివేయాలి."
ఈ మాటలు యెక్కడో కలలో వింటున్నట్లుగా నారాయణ అనుభూతి పొందాడు. అతని కళ్ళు తిరుగుతున్నట్లుగా తోచింది.
కష్టంమీద తేరుకుని "అలా అయితే ప్రాణానికేం భయం లేదా డాక్టర్?" అనడిగాడు.
"ఉహు."
నారాయణ దీర్ఘంగా ఆయన వెనక కొంతదూరం నడిచి వెళ్ళాడు. ఆపరేషన్ ఎన్ని రోజుల్లో ప్రారంభించేదీ, దానికయ్యే ఖర్చులూ, కావలసిన ఏర్పాట్లూ డాక్టరుగారు అతన్తో మాట్లాడాడు. ఫరవాలేదని ధైర్యం చెప్పి తన పనిమీద వెళ్ళిపోయాడు.
నారాయణ నీరసంగా వెనక్కి తిరిగాడు. మూడువందల రూపాయలు! ఎలా వస్తాయి? అతనికేం చేయటానికి పాలుపోక అక్కడినుంచి వచ్చేశాడు.
శారదాంబని ఆ పూట చాలా కష్టంమీద ఇంటికి తీసుకొచ్చాడు. కాస్త ఎంగిలి పాడమని అత్తగారు బలవంతం చేసింది. ఒకమూల కొడుకు ప్రాణాప్రాయ స్థితిలో వుంటే ఎవరికీ మట్టుకు అన్నం వంటబడుతుంది? ఇంటికి వచ్చాక నారాయణను అడిగింది రాధ! డాక్టరుగారు ఏమని చెప్పారని. డాక్టరు చెప్పిందేదో నారాయణ చెల్లెలికి చెప్పాడు. "మూడు వందల రూపాయలు ఎలా వస్తాయి? అంది రాధ నిర్వేదంగా.
సాయంత్రంలోగా కావాలని డాక్టరు చెప్పాడు. బ్యాంకికి సెలవుపెట్టి నారాయణ డబ్బుకోసం ఊరిమీద తిరగటానికి పోయాడు. పన్నెండుగంటల వేళ రాధ ఇంట్లో వంటరిగా వుంది. తండ్రికూడా లేడు. మిగిలినవాళ్ళంతా హాస్పిటల్ కి పోయారు. రాధ ఏదో ఆలోచించుకుని యిల్లు తాళంపెట్టి, తాళంచెవి ప్రక్కయింట్లో ఇచ్చి ప్రమీల ఇంటికి బయలుదేరింది.
రాధ వెళ్ళేసరికి ప్రమీల దూరంనుంచే ఎదురుగా వస్తూ విచారంగా "ఇలా జరుగుతుందని అనుకోలేదు రాధా! నేనే వద్దామనుకుంటున్నాను" అంది.
ఇద్దరూ చాపమీద కూర్చున్నాక కొంతసేపు సానుభూతి వాక్యాలతో గడిచింది. రాధ ఆ ప్రసంగాన్ని అంతటితో ఆపుచేస్తూ, కళ్ళనీళ్ళను బలవంతంమీద ఆపుకొంటూ "నిన్నో సహాయం అడగనా?" అంది అతి కష్టం మీద.
"ఏమిటీ?" ఈ ధోరణికి ఆశ్చర్యపడి ప్రశ్నించింది.
"నాకు కొంత డబ్బు కావాలి."
"ఎంత?"
"మూడువందలు"
అడిగిన తర్వాత స్నేహితురాలి ముఖం చూడటానికి భయపడింది. వెనుకటిలాగా ఏ మాత్రం సంశయించకుండా డబ్బు అడుగుదామని ఇప్పుడు వచ్చింది. నారాయణ ఉన్నపాళంగా డబ్బు యెలా పుట్టించుకు వస్తాడని ఆమె సందేహం. కాని తీరా స్నేహితురాలిని అడిగాక సిగ్గుతో కూడిన ఒక విధమైన భయం ఆమెను ఆవరించింది.
ప్రమీల చాలా మామూలుగా "ఎందుకో?" అడిగింది.
రాధ ఒక్క మాటయినా దాచకుండా ఉన్నది వున్నట్టు చెప్పింది. కాని ప్రమీల దగ్గరకూడా అంత వుందని ఆమెకూ అపనమ్మకంగానే వుంది. అంది ; "నాకు జ్ఞానం వున్నంతవరకూ నిన్నింతవరకూ ఏ సహాయమూ అడగలేదు. ఈనాడు కడు దీనస్థితిలో యాచిస్తున్నాను. తర్వాత నీ యిష్టం"
ప్రాణ స్నేహితమైన వ్యక్తి ఇలా అడుగుతుంటే యెవరి హృదయం కరిగిపోదు. ప్రమీల పనీ అంతే అయింది. మారు మాట్లాడకుండా లేచి లోపలికి వెళ్ళింది. తిరిగి ఆమె వచ్చేసరికి పది పదిహేను నిముషాలు పట్టింది. ఇస్తున్న డబ్బు రాధ తీసుకొంటూ కృతజ్ఞతా పూర్వకంగా "ఎక్కడివి?" అనడిగింది.
"ఎక్కడివో చెప్పమంటావా?"
"నీ యిష్టం"
నిజానికి ఆ డబ్బు ఎక్కడిదో! ప్రమీల ఇంట్లో యెవరికీ చెప్పలేదు. ధనవంతుల ఇళ్ళలో చాలామంది స్త్రీలు చేసేపనే ఆమె చేసింది. అప్పుడప్పుడు డబ్బు చేతిలోకి వచ్చినప్పుడల్లా దాచుకుంటూ వచ్చింది. ఆ ప్రకాశం ఇప్పుడామెవద్ద అయిదారువందలదాకా వుంది. అందులోనే ఇప్పుడు మూడువందలు తీసి రాధ కిచ్చింది.
"నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియటం లేదు"
ప్రమీల చిన్నగా నవ్వుతూ "నాతో చిరకాలం స్నేహం చెయ్యి" అంది.
రాధ ఇంటికి వెళ్ళేటప్పటికన్నా అక్కడి నుంచి వచ్చేటప్పుడే తేలికగా వచ్చింది. ఆమె మనసులో నృత్యం చేస్తున్న ఉల్లాసం విశాలమైన ఆమె నేత్రాలద్వారా బయటకు విరజిమ్ముతోంది.
ఇంటికి వచ్చేసరికి నారాయణ ఎదురుగా వస్తున్నాడు. అంతకుముందే వచ్చినట్లున్నాడు. "ఎక్కడికి పోయావమ్మా?" అన్నాడు.
అతను అడిగినదానికి జవాబు చెప్పకుండా "నువ్వు వెళ్ళినపని ఏమయిందన్నాయ్?" అంది.
దీనికి జవాబు చెపుతున్నట్లుగా నారాయణ దైన్యంగా ఒకసారి చెల్లెలి ముఖంలోకి చూసి, దృక్కులు మార్చుకొని ఎటో చూశాడు.
"తప్పనిసరిగా వాడి కుడికాలు తీసివేయవలసిందేగదా అన్నాయ్" అంది రాధ ఖేదంగా.
"ఆహా!"
"అంటే మన తమ్ముడు కుంటివాడన్నమాట"
నారాయణ గుండెల్లో ఏదో ముల్లు గుచ్చుకుట్లయింది. భయంకరంగా ఒకసారి మూలిగాడు.
"అంగవైకల్యంతో జీవించడం చాలా కష్టం కదా అమ్మాయ్" అన్నాడు.
చెల్లెలు సమాధానం చెప్పేలోపలే "ఏదీ కష్టంకాదు. మనం అన్నీ కలిగివుండి ఏం సుఖం అనుభవిస్తున్నాం? నువ్వుచూడు! నీకు మూడు చీరెలకన్నా ఎక్కువగా లేవు. అవయినా యెంత హీనస్థితిలో వున్నాయో తెలుస్తూనే వుంది. నీ కంఠం బోసిగా ఎలా కనబడుతున్నదో చూడు. పుట్టినప్పటినుంచి నీ చేతులకు రబ్బరుగాజులు, వేళకింత భోజనం తప్పితే ప్రపంచంలో బ్రతుకుతూ అనుభవిస్తున్నది యేమీ లేదు"
రాధ తెల్లబోయి "అవన్నీ ఇప్పుడు అప్రస్తుతాలు కాదా? ఎందుకు చెబుతున్నావో అర్థం కాకుండా ఉందన్నాయ్" అంది.
నారాయణ ఖేదపడుతూ "నిజం. నేను చాలా అప్రస్తుతాలు మాట్లాడాను. కాని ఏమి చెయ్యను రాధా? మనసులో ఇవన్నీ నిత్యమూ ఆలోచించుకుంటూనే ఉంటాను. మనం ఈ బాధలన్నీ ఎందుకు పడాలో నాకు అర్థంకాదు. గంటల తరబడి దీన్ని గురించి ఆలోచించి సతమత మౌతుంటాను. గుండెలో ఏదోపెట్టి కెలికినట్లు అయేసరికి అందులోని కొన్ని మాటలు వెలుపలికి వచ్చాయి" అని కొంచెం ఆగి, "లేకపోతే ఏమిటి చెప్పు? మనం అంత ఇక్కడ పుట్టాం. మనకి సంఘంలో ఒక పరువూ, పరపతీ, ఓ ప్రతిష్ట, ఓ పలుకుబడి ఉన్నాయా? ఈ వేళమూడువందల రూపాయలు అప్పు పుట్టించలేక పోయానంటే చచ్చే సిగ్గుగా వుంది" అని రెండు చేతులతో జుట్ట పీక్కుంటూ "ఉట్టి అప్రయోజకులం. అసమర్థులం ఈ సాయంత్రంలోగా ఆ డబ్బు సంపాదించకపోతే ఏం గాను?" అని విద్యుత్ ప్రవాహాన్ని తాకిన వాడిలా భుజా లెగరజేశాడు.
ఈ ధోరణిని చూసి రాధ ఒక క్షణం సేపు నిర్ఘాంతపోయి, తర్వాత తెలివి తెచ్చుకుని "మన ఇంట్లో ఇంతమంది ఉన్నాం. నువ్వు తేలేకపోతే మిగతా వాళ్ళెవరూ తేగూడదా?"
ఈ పలుకులు వింతగా ధ్వనించగా నారాయణ గోడకి జారగిలబడి జ్ఞాన శూన్యంగా ఆమెవంక చూస్తూ "నీ మాటలన్నీ ఒక్కొక్కసారి అర్థం చేసుకోవటంగూడా చాలా కష్టం చెల్లాయ్" అన్నాడు.
రాధ అనవసరంగా మాటలు పెంచకుండా తను తెచ్చిన డబ్బు అన్నగారికి అందిస్తూ "నేను తెచ్చాను తీసుకో అన్నాయ్" అంది.
"ఎక్కడివి?"
"తరువాత చెబుతాను తీసుకో"
కలిగిన ఆశ్చర్యం క్రమంగా దైన్యంగా మారగా "ఎక్కడివో చెప్పవమ్మా?" అన్నాడు నారాయణ ఓపిక లేకుండా.
రాధ ఇక దాచి లాభంలేదని "ప్రమీల దగ్గర తెచ్చాను" అని చెప్పేసింది.
నారాయణ గుడ్లు మిటకరించి ఆమె వంక చూస్తూ కూర్చున్నాడు. అతని కళ్ళలోకి చూస్తున్న రాధ ఆ చూపుల్ని భరించతం కష్టంగా "ఏమిటన్నాయ్! నువ్వంత బాధపడుతున్నావు?" అంది.
"నువ్వు చేసిన పని అభినందనీయమైనదే. అయినా నాకు ఇది తగిన పనిగా కనిపించటంలేదు రాధా! ఏమీ చేతకాక ఒక ఆడదాని సహాయం మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడు మొగవాడెంత బాధపడతాడో నీకు తెలీదు"
"అయితే నేను అపసవ్యమైన పని చేశానంటావా?"
"అనను. కాని---"
"కాని, నీ ఇష్టం"
నారాయణ అయిష్టంగానే తలవూపాడు.
రాధ కోపంగా అంది, "ఈ స్థితిలో నువ్వంటున్న మాటలకి నిన్నేమనాలో అర్థం కావటంలేదు. నోటివెంట చెప్పకపోయినా నువ్వనుకుంటున్నది నాకు తెలియకపోలేదు. అర్హత, అనర్హతలు, అవసరావసరాలు, లింగభేదాలు, స్త్రీ పురుష అసమానత్వాలు వీటన్నింటినీ గురించి ఆలోచించవలసింది ఇప్పుడేనా? ఒక మూల తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అక్కయ్య అయివుండీ ఆదుకోటానికి ప్రయత్నిస్తే అన్నయ్యవై వుండి ఇలా అభ్యంతరం చెప్పటం నీకు న్యాయమేనా? నా పనిని హర్షించి నందువల్ల నీకు సిగ్గు కలుగుతోందా? హర్షించపోవటంవల్ల సిగ్గు కలుగుతోందా? కాస్త చెప్పు వింటాను"
దీనవదనంతో అర్థిస్తున్నట్లుగా అతనిముందు నిలబడింది రాధ.
నారాయణ ఇందాకటినుంచి గుడ్లు మిటకరించి స్థబ్దుడై చూస్తూ నిల్చున్నాడు. ఇప్పుడేదో చెబుదామని నోరు తెరవబోయేసరికి బరువుగా- వేగముగా బయట అడుగుల చప్పుడు వినిపించింది. చిదంబరం హడావుడిగా లోపలికివస్తూ "ఏమిటి మీరిక్కడ యేం చేస్తున్నారు?" అని గట్టిగా శ్వాస పీల్చుకున్నాడు. వాతావరణం చల్లగా వున్నా బాగా శ్రమపడినందువల్లనో కంగారు పడుతూండటంవల్లనో, ఆయన వళ్ళంతా స్వేద బిందువులతో తడిసిపపోయింది.
అన్నా చెల్లెల్లిద్దరూ సమాధానం చెప్పకుండా వూరుకొనేసరికి ఆయనింక వత్తిడిగా "ఎలాగయితేనేం, ఎలాగైతేనేం కష్టపడి డబ్బు తీసుకువచ్చాను" అన్నాడు చేతులతో ముఖాన్ని తుడుచుకుంటూ.
"డబ్బా? ఎందుకు?" నారాయణ ఆశ్చర్యంగా అడిగాడు.
"ఎందుకు? అవసరానికి డబ్బు తెస్తారు. నాతో ఈ విషయం చెప్పవలసిన అవసరం మీ కేవరికీ కలగలేదు. డబ్బు కావాలని మీలో ఒక్కరూ నోరువిప్పి అడగలేదు. కాని యెలాగో నేనే తెలుసుకున్నాను"
"ఎలాగ?"
"బావుంది. నువ్వు చెప్పకపోతే నాకు ఇంకెవరూ చెప్పేవాళ్ళు లేరనుకున్నావా? నీకే డాక్టరుగారైతే చెప్పారో నాకూ వారే చెప్పారు."
"డబ్బు ఎలా తెచ్చావు నాన్నా?" కలత చెందిన హృదయంతో రాధ అడిగింది.
"అటువంటి మాటలే అనవద్దని అనేది. మీ దృష్టిలో మీరంతా ప్రయోజకులు. నేనేకాదు నేను ఏమీ తీసుకురాలే ననేగా మీ ఉద్దేశం? కాని మీరనుకొన్నంత తెలివితక్కువ వాడిని మాత్రం కాదు ఊరంతా ఎడాపెడా తిరిగేశాను. ఈ ఊళ్ళో పుట్టాను. ఈ ఊళ్ళో పెరిగాను. వెధవది---ఆ మాత్రం సొమ్ము సంపాయించలేక పోతానా?" అని మెల్లగా "ఏమైతేనేం. నాకీ ఇంట్లో ఎవరిదగ్గరా చిల్లిగవ్వ విలువకూడా లేనిమాట నిజమే. "అని చేర్చాడు.