Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 22

  

     "దట్సాల్ రైట్! మీ హాప్సిటల్ లో.... ఘనత వహించిన మీ హాస్పిటల్ లో నా భార్య, నా సర్వస్వం అనుకున్న స్త్రీ నార్మల్ డెలివరీకని వచ్చి చనిపోయింది. మళ్ళీ యిప్పుడు అభం శుభం ఎరుగని చిన్నారిపాపకు డిసీజ్ ఐకి బదులు ఆరోగ్యంగా వున్న కంటికి ఆపరేషన్ చేసి ఆ పాప జీవితాన్ని అంధకార బంధురం చేసేశారు" అన్నాడు ప్రదీప్ అరుస్తున్నట్లుగా.
   
    "ఈ రెండు సంఘటనలూ నా దృష్టికి వచ్చాయి" అన్నాడు ఉపేంద్ర అదే నిశ్చలత్వాన్ని ప్రదర్శిస్తూ.
   
    "మరి...?"
   
    "మీతోబాటు, మీకంటే ఎక్కువగా నేనూ బాధపడ్డాను."
   
    "బాధపడ్డారు. బాధపడటంతో మీ బాధ్యత తీరిపోయింది. కాని జీవితంలో మిగిలిన కాలమంతా ప్రతిక్షణం నరకమనుభవిస్తూ బ్రతకడం ఎంత దుర్భరమో తెలుసా?"
   
    "తెలుసు. కాని...."
   
    "కాని మీరేమీ చెయ్యలేరు. మిస్టర్ ఉపేంద్రా! నాభార్య యీ హాస్పిటల్లో చనిపోయినా, ఆ అగ్నిజ్వాలలు నాలో నిరంతరం రగులుతున్నా....మీమీద, మీ హాస్పిటల్ మీద, మీ డాక్టర్లమీద నమ్మకంతో రాధనుకూడా యిక్కడ చేర్పించాను. మీరంతా కలసి నా నమ్మకాన్ని వమ్ము చేశారు. ప్రొఫెషన్ మీద, వృత్తి పవిత్రతమీద నాకున్న నమ్మకాన్ని చెదరగొట్టేశారు. మానవత్వపు విలువల మీద నాకున్న అపారమైన విశ్వాసాన్ని పెకళించి పారేశారు. మీరు.... మీరు.....నో.... మీమీద యాక్షన్ తీసుకుని లీగల్ గా ప్రొసీడై మిమ్మల్ని శిక్షార్హుల్ని చెయ్యటం ఓ పౌరుడిగా, లాయర్ గా నా విధి. మీ నెగ్లిజెన్స్, కొన్ని జీవితాలను తారుమారు చేసెయ్యగల మీ నెగ్లిజెన్స్ ప్రపంచానికి తెలియచెప్పాలి. సివిల్ సూట్ వేస్తే మీరు నష్టపరిహారంగా ఎంత డబ్బయినా చెల్లించి వెయ్యగలరు. అందుకని.... అందుకని మీమీద క్రిమినల్ కేసుపెట్టి ప్రొసీడ్ అవుతాను. మిమ్మల్ని సమాజం ముందు దోషులుగా నిలబెడతాను" అని ఉపేంద్ర జవాబుకోసం ఎదురుచూడకుండా ఎంత విసురుగా లోపలకు వచ్చాడో అంతే విసురుగా బయటకు వెళ్ళిపోయాడు.
   
    కారుదగ్గరకు వచ్చి డోర్ లాక్ తియ్యబోతుండగా, ప్రక్కనే యింకోకారు వచ్చి ఆగింది.
   
    అప్రయత్నంగా అటుకేసి చూసేసరికి డాక్టర్ అశోక్ ఆ కార్లోంచి దిగుతున్నాడు.
   
    అతన్ని చూడగానే ప్రదీప్ కు ఉద్రేకంతో శరీరం వొణికిపోయింది. "యూ" అంటూ మీదకు వెళ్ళి దులిపెయ్యాలనుకున్నాడు గాని, చుట్టూ వున్న మనుషులు, వాతావరణం తాను గదిలోకాకుండా బహిరంగ ప్రదేశంలో నిలబడివున్న సత్యం గుర్తువచ్చి సభ్యత వెన్నుతట్టి హెచ్చరించినట్లయింది.
   
    డాక్టర్ అశోక్ కూడా అతన్ని చూశాడు. ఒక్కక్షణం సంకోచించి ప్రదీప్ దగ్గరకు నడచి వచ్చాడు.
   
    "మీకోసం నేనే కబురు చేద్దామనుకుంటున్నాను" అన్నాడు.
   
    "నాకోసమా?"
   
    "అవును ఒక ముఖమైన విషయం చెప్పాలి."
   
    "ఏమిటది?" అన్నాడు ప్రదీప్ కటువుగా.
   
    రాధకు అసలు కన్ను వదిలేసి రెండోకన్నుకు ఆపరేషన్ జరిగింది. ఆ విషయాన్ని గురించిన రభసలో అసలు సమస్యను మరిచిపోతున్నాం. ఆమె ఎడమకంట్లో రెటీనోబ్లాస్టోమా వుంది. ఆ ట్యూమర్ అలాగే వుండిపోయింది. దటీజ్ హైలీ మేలిగ్నేంట్. సాధ్యమైనంత త్వరలో ఎడమకన్ను కూడా పూర్తిగా తీసివెయ్యకపోతే సెకండరీస్ వ్యాపించి పాప ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. ప్రాణానికి ముప్పు అని తేలిగ్గా అనుకోవటం కాదు. వెంటనే ఆ కన్ను తీసివెయ్యకపోతే సెకండరీస్ వచ్చి కేన్సర్ సెల్స్బ్రెయినంతా వ్యాపించి షి విల్ డై విత్ యిన్ ఏ షార్ట్ పీరియడ్. మిస్టర్ ప్రదీప్! మీకభ్యంతరం లేకపోతే.....ఆ ఆపరేషన్ చెయ్యటానికి నేను సిద్దంగా వున్నాను.

                                 10
   
    ప్పని, తప్పనిసరి విషయంకాబట్టి-యీ సంగతి హనుమంతరావుగారికి తెలియజెయ్యబడి, ఆ కుటుంబంలో మళ్ళీ కల్లోలం చెలరేగింది.
   
    "వీల్లేదు. రాధకు మళ్ళీ ఆపరేషన్ చెయ్యటానికి వీల్లేదు" అని అరిచాడు హనుమంతరావుగారు గట్టిగా.
   
    "మీరావేశపడకండి. జరగవల్సిన డామేజీ జరిగిపోయింది. రాధ ప్రాణానికి హాని కలగకుండా చూసుకోవాలి" అన్నాడు ప్రదీప్ శాంతంగా.
   
    "రాధ ప్రాణానికి హాని కలగటానికి వీల్లేదు. ఆ సంగతలావుంచి రెండో కన్ను పోయేందుకు వీల్లేదు. ఆరోగ్యంగా వున్న కన్ను పాడుచేసినవాళ్ళే ఆ కన్ను బాగుచేయిస్తారు. అది వాళ్ళ కర్తవ్యం" అన్నాడు హనుమంతరావుగారు యింకా అరుస్తున్నట్లుగానే.
   
    "ఆ కన్ను బాగుచేసే అవకాశమే వుంటే తీసివెయ్యటానికి మొదటే ఆపరేషన్ ఎందుకు నిర్ణయిస్తారు? నేను యిరవై ముఫ్ఫయిమంది పెద్ద పెద్ద ఐ స్పెషలిస్ట్ లను కన్ సల్ట్ చేశాను. ఢిల్లీలో మా ఫ్రెండ్స్ వుంటే అక్కడికికూడా ఫోన్ చేసి మాట్లాడాను. సాధ్యమైనంత తొందర్లో ఆ కనుగుడ్డు తీసివెయ్యకపోతే....సెకండరీస్ వ్యాపించి.... మరణం తప్పదని ధృవీకరించారు.
   
    "డాక్టర్లు అలాగే అంటారు. ఇక్కడ తగ్గవని ఆశలు వదిలేసుకున్న కేసులెన్నో అమెరికా, ఇంగ్లండు వంటి దేశాలకు వెళ్ళి క్యూర్ అయి రావటం చూశాను. వెళతాను. వెళ్ళి ఆ హాస్పిటల్ ప్రొప్రయిటర్నే దీనికి పరిష్కారమేమిటో అడుగుతాను" అని హనుమంతరావుగారు ప్రదీప్ వారిస్తున్నా వినిపించుకోకుండా విసురుగా వెళ్ళిపోయాడు.
   
    చేసేదిలేక ప్రదీప్ కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చాడు.
   
    ఇల్లంతా బావురుమంటుంది. అతని గుండె వెక్కివెక్కి ఏడ్చినట్లయింది. ఎన్నాళ్ళని, ఎన్నేళ్ళని యిలా యీ శూన్యంలో, క్షణాలు లెక్కపెట్టుకుంటూ గడపటం?
   
    ఒక్కో ఆవేశపుస్థితిలో.... యీ యింట్లో వుండలేడనీ, యిది ఖాళీ చేసి వేరే యింట్లోకి మారిపోవాలనీ అనిపించేది. కాని శ్వేతబిందుతో కలిసి కొన్ని సంవత్సరాలుగా కాపురం చేసిన యిల్లు.... ఈ ఇంట్లోని ప్రతి చిన్నభాగం ఆమె అమూల్య స్మృతి. ఈ విషాదంలోనే కొంత ఊరట, ఉపశాంతి....
   
    టేబిల్ మీద విస్కీ, సోడా, గ్లాసూ, ఐస్ క్యూబ్స్....అన్నీపెట్టుకుని, విస్కీ కొంచెం కొంచెం తీసుకోసాగాడు.
   
    మొదటి పెగ్గు పూర్తయింది.
   
    మాలతికి ఫోన్ చేసి చాలా రోజులయింది. ఏమయింది? ఆమెకూడా తనని మరిచిపోయిందా?
   
    రిసీవర్ చేతిలోకి తీసుకుని, ఆమెనంబర్ డయల్ చేశాడు. ఆమె రిసీవ్ చేసుకుంది.
   
    "మాలతీ!"
   
    "ప్రదీప్! అబ్బ! ఎన్నాళ్ళకి!"
   
    "కనబడటంలేదేం?"
   
    "హాస్పిటల్ వర్క్ చాలా బిజీగా వుంటోంది."
   
    "అయితే బాగా డబ్బు సంపాదిస్తున్నావన్న మాట. ఆ డబ్బంతా ఏం చేస్తావు మాలతీ?"
   
    "చెప్పనా?"
   
    "ఊ.'
   
    "అదంతా పెట్టి అంతఃపురంలాంటి పెద్ద మేడ కడతాను."
   
    "ఒక్కదానివి.... అంత పెద్ద మేడ దేనికి?"
   
    "సమయం దొరికినప్పుడల్లా పిచ్చిగా, విశాలంగా తిరగటానికి."
   
    "ఎందుకలా తిరగటం?"
   
    "వంటరిదాన్ని అంతకన్నా ఏంచేస్తాను?"
   
    "వంటరిగా వుండటం దేనికి, పెళ్ళి చేసుకోవచ్చుగా?"

 Previous Page Next Page