"అమ్మతో తేలేదేమిటి నాన్నా మనకు పరాయిది కాదుగదా ఇద్దరం కలిసేవుంటాం, కలిసే చూసుకుంటే సారీ."
రామకృష్ణయ్యగారు కొడుకువంక ఆశ్చర్యంగా చూశాడు. అలాచూసి "నువ్వు అమాయకుడివిరా అబ్బాయ్" అన్నాడు.
సత్యమూర్తి తండ్రివంక భయపడుతూ చూశాడు.
"నీమీద ఆమె కేమయినా అభిమానం పొంగిపొర్లుతూందనుకున్నావా. ఆయన వున్నప్పుడేలేదు ఇంకా ఇప్పుడేక్కడ్నుంచి వస్తుందిరా? కలిసివుండటం అంటూ పెట్టుకుంటే ఇంక అడుగడుక్కి పేచీలే. జాగ్రత్తగా ఆలోచించు. అన్నట్లు మనం మీ నాన్న చచ్చినందుకుగాను డెత్ డ్యూటీ కట్టాలి. తెలుసా?"
"ఎంత?"
"ఇరవై వేలు."
సత్యమూర్తి ఉలికిపడి "అబ్బా! ఇరవై వేలే. అంత డబ్బు..."
"కంగారుపడకురా అబ్బాయ్. నేనంటూ ఒకడ్ని వున్నానుగా ఎవరైనాగాని చాతుర్యం అంతా ఉపయోగించి యిది సగానికి సంగ తగ్గేటట్లు చేస్తాను. కుర్రవెధవాయేవి. అందులోనూ అమాయకుడివి. ఈగోలంతా నువ్వు పడవు. అక్కడ మన వూళ్ళో నాకెన్ని పన్లున్నాసరే. ఆ పనులన్ని పాడయినాసరే నే నిక్కడే వుండి నీ వ్యవహారమంతా ఒక్కకొలిక్కి తెచ్చి చక్కదిద్దిగాని కదలన్లే. నువ్వేమీ భయపడకు. బెంబేలుపడకు. అన్నిటికి అండగా నేను వున్నాను. తెలిసిందా?" అని రామకృష్ణయ్యగారు కొడుక్కి భుజంతట్టి హామీయిచ్చాడు.
సత్యమూర్తి తండ్రివంక కృతజ్ఞతా పూరిత నేత్రాలతో చూశాడు.
"ఆఁ మరి నే నిఁకా భోజనంచేయలేదు. ఆకలవుతోంది. నువ్వు మనస్సు స్థిమితంగా వుంచుకో. లేనిపోని ఆలోచన్లతో కలత పెట్టుకోకు" అని ఆయన లేచి వెళ్ళిపోయాడు.
తర్వాత సత్యమూర్తి చాలాసేపు అలానే కుర్చీలో కూర్చుండి పోయాడు. ఎప్పుడో గేటుదగ్గర చప్పుడయింది. తన పెద్దఅన్న రామ్మూర్తి సినిమానుంచో ఎక్కడినుంచో వచ్చినట్లుగా వున్నాడు. నిట్టూర్పు విడిచి, యిహ నిద్రపోదామని లేచాడు.
మళ్ళీ అద్దంలో ముఖ- యిందాకటిలాగా అతనికి భయంవేసింది. గబగబ లైటు ఆర్పి పడుకున్నాడు.
9
సత్యమూర్తి మనిషి రోజు రోజుకూ మారసాగాడు. ప్రొద్దున్న లేస్తూనే స్నానాదికాలు ముగించుకొని ముందు గదిలోకి వెళ్ళి కూర్చుంటాడు. ఈ ఊరినుంచో రైతు వస్తాడు. తన సాధక బాధకాలు చెబుతూ కూర్చుంటాడు అతను అవన్ని వింటాడు. "చివరకు చూడబ్బాయి-అవన్నీ ఏం లాభంలేదు. ఇలా ఎంతకని దయతలుస్తూ కూర్చుంటాము? వచ్చే నెల అయిదో తారీఖులోపల ఇవ్వవలసిన పైకం పట్టుకు రాకపోతే బాగుండదు. ఆఁ" అంటాడు. బ్రతిమిలాడి, భంగపడి ఆ రైతు లబలబలాడుతూ వెళ్ళిపోతాడు. నేనేనా?ఇలా గద్దించింది? అని అతను తనలో తన ఆశ్చర్యపోతూ వుంటాడు. ఒక్కోసారి గర్వంగా వుంటుంది. గతించిన బలరామయ్యగారి వేదవాక్కులు మనసులో మెదుల్తుంటాయి.
"ఇంతే. ఇలాగే వుండాలి. నేనిన్నాళ్ళబట్టి అమాయకుడ్ని" అనుకుంటాడు.
బలరామయ్యగారికి వసూలు కావల్సిన పాత బాకీలు ఎన్నో మిగిలివున్నాయి. ఒక్క పైసకూడా వృధాపోకుండా వాటి నన్నిటినీ పోగుచెయ్యటానికి రామకృష్ణయ్యగారు దృఢ నిశ్చయుడైనాడు. పెద్దకొడుకు రామ్మూర్తి ఆయనకు విశేషంగా సాయపడుతున్నాడు. ఎప్పుడైనా సత్యమూర్తి కల్పించుకోపోతే "నీ మొహం. నువ్వు కుర్రవాడివి. నీకు తెలీదు. ఊరుకో" అని అన్నగారు లాలనగా కోప్పడతాడు. ఇలా సాయపడుతూండటంలో అతనికి అనేక ఖర్చులు తగుల్తుంటాయి. అందుకని హడావుడిగా ఎక్కడినుంచో వచ్చి "సత్యం, ఓపాతిక ఇవ్వరా. ఓ పదిహేను ఇవ్వరా" అని అడుగుతా. కిమ్మనకుండా ఆజ్ఞను పాటించటమే తమ్ముడి పని. అధవా ఎప్పుడైనా "ఎందుకురా అన్నయ్యా?" అని మొహమాట పడుతూ అడిగినా "నీ మొహం? నువ్వు కుర్రవాడివి నీకు తెలీదు." అని హుందాగా గద్దిస్తాడు.
అప్పుడప్పుడు అన్నగార్కి తమ ఊరు, అక్కడ నిర్వర్తించవల్సిన బాధ్యతలు, సంసారం అన్ని గుర్తుకు వచ్చి బాధ పెడతాయి. "అక్కడ పనులన్నీ అలానే వుండిపోయినాయి నాన్నా. మనఊరికి వెళ్ళిపోతాను" అంటాడు తండ్రితో వ్యధగా.
"అయ్యో, అయ్యో. నువ్వు వెళితే ఎలాగునురా అబ్బీ! ఎంతయినా నేను తండ్రిని నువ్వు అన్న గారివి. మంకు ఈ మాత్రం త్యాగం చేసుకోక తప్పదు నాయనా....పోనీ ఓ పని చెయ్యకూడదూ? కోడలి పిల్లను కూడా పిల్లల్తో ఇక్కడికే తీసుకు వచ్చెయ్యి. ఈ సంసారం ఓ కొలిక్కి వచ్చాక ఒకేసారి వెళ్ళవచ్చు" అని తండ్రి సలహా యిచ్చాడు.
ఆ పల్లెటూర్లో తన భార్యా, ఆ యిద్దరు దెయ్యపు పిల్లలూ గుర్తువచ్చేసరికి రామ్మూర్తికి వికారం, భయం, చికాకు ఇలాంటి లక్షణాలన్నీ ఆవహించాయి. "పోనీ వద్దులే నాన్నా! ఆ బెడదంతా యిక్కడెందుకు? తమ్ముడికోసం కొన్నాళ్ళు యిబ్బంది పడతాను" అని సర్దుకుని, అక్కడ్నుంచి నిష్క్రమించాడు.