Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 21

    "ప్రొద్దుమీరి తినడం కదా? ఆకలి అంతగా లేదు!"

    కంచాలు తీసేసి ఇవతలికి వ్కాహ్హి అతడికి పక్కవేసింది. రామచంద్ర మంచంమీద కూర్చొని "నాకు ఏదో ఒక సమాధానం చెప్పాలి!" అన్నాడు.

    "ఎవరో ముక్కూ మొహం తెలియని వాడితో తాళిగట్టించుకొని అతడితో కాపురం చేయడానికి వెళ్ళడమంటే ఆ ఊహే కంపరంగా ఉంటుంది. నా మనసూ, నన్నూ తెలిసినవాడు కావాలి. అతడు నా మనసుకు నచ్చాలి."

    "నీ మనసులో ఎవరైనా ఉన్నారా?"

    తన సర్వశక్తుల్నీ కూడదీసుకుని మెల్లని స్వరంతో చెప్పింది. "ఎవరూ లేరు."

    "వచ్చినవాదినే మనసుకు నచ్చినట్టుగా చేసుకోవడంలో సమస్య ఉండదు కదా? నచ్చినవాడె రావాలంటే కష్టం. అతడోచ్చేలోగా నీ జీవితం తెల్లారిపోవచ్చు."

    "ఈ దేశంలో ఆడవాళ్ళు మగవాళ్ళకి నచ్చినట్టుగా తయారవుతారు. ఆడదానికి నచ్చినట్టు మగవాడు తయారైన కథ ఒక్కటీ నేను వినలేదు."

    "అయినా నాన్న కోసం కొంచెం త్యాగం చెయ్యలేవూ?"

    "నా త్యాగాన్ని ఆయన భరించేట్టు అయితే చేస్తాను. కాని, తన కోసం నా మనసును చంపుకొంటానంటే ఆయన అంగీకరించడు."

    "నేను మాట్లాడదానికి వీల్లేకుండా దారులన్నీ నేర్పుగా మూసేస్తున్నావు."

    రామచంద్ర పడుకొన్నాడు. కాస్సేపటిలో నిద్రలోకి జారిపోయాడు.

    ప్రేమీకి మాత్రం నిద్రపట్టలేదు.

    'అతడోచ్చేలోగా నీ జీవితం తెల్లారిపోవచ్చు!' రామచంద్ర మాట మనసులో కలుక్కుమంటూంది 'అతడొచ్చాడు, రామూ! నన్ను చూడకుండానే వెళ్ళిపోయాడు. ఇహ ఈ వయసు ఇలా తెల్లవారి పోవాల్సిందేనేమో!' ప్రేమీ తలగడలో ముఖం దాచేసుకొంది.

    రామచంద్రకి సరిగా అయిదు గంటలకి నిద్రలేచే అలవాటు. రాత్రి ఎంత ప్రొద్దుపోయి పడుకొన్నా ఆ టైముకి మెలుకువవచ్చేస్తుంది. మెలుకువ వచ్చాక పక్కమీద పడుకోలేడు.

    గాలికోసం పెరటి తలుపు తెరిచి పడుకొంది ప్రేమీ. రామచంద్ర పక్కదిగి పెరట్లోకి వచ్చాడు.

    వెన్నెల స్నానాలు చేస్తున్నాయి పెరట్లో మొక్కలు. తులసికోటలో తులసి మొక్క శాఖోపశాఖలుగా పెరిగి పొట్టి వృక్షంలా ఉంది. రాజ్యం అత్త కొలిచే దేవత ఆమె. తులసికోట చుట్టూ వారం వారం అలికి ముగ్గులు పెట్టేది. కార్తీక ద్వాదశికి తులసి పూజచేసి పేరంటాళ్ళని పిలిచి సీతా ఫలాలు పంచేది. ప్రేమికకి పట్టులంగా, పట్టుజాకెట్ వేసి, జడగంటలువేసి, జడకు చేమంతి పూలుకుట్టి, ఇంటింటికీ పేరంటం పిలువడానికి పంపడం తనకి ఇప్పటికీ గుర్తే. ప్రేమిక అప్పుడే ఎంత పెద్దదైపోయింది అనుకొన్నాడు ఆశ్చర్యంగా.

    ఇప్పుడు తులసికోట సున్నం వెలసిపోయింది. తులసికోట చుట్టు ఆ ముగ్గులు లేవు! ఆ కళాకాంతులు లేవు.రాజ్యం అత్తపోయి అప్పుడే నాలుగు సంవత్సరాలైందా? చూస్తుండగానే రోజులెంత త్వరగా గడిచిపోతాయి అనుకొన్నాడు.

   
                                          6

    సువర్చల మంచంమీద పడుకొని ఏదో పుస్తకం చదువుకొంటున్నది.

    ప్రేమీ టేబిల్ దగ్గర నిలబడి సువర్చల పట్టుచీరకి ఇస్త్రీ పెడుతూంది, జరీ అంచు జాగ్రత్తగా సరిజేస్తూ హఠాత్తుగా జ్ఞాపకం వచ్చినట్టుగా, "నిన్న రామచంద్ర వచ్చాడు, ఆంటీ!" అని చెప్పింది.

    "రామచంద్ర వచ్చాడా? ఇక్కడికి రాలేదే? వెళ్ళిపోయాడా? ఉన్నాడా?"

    "తెలియదు, ఆంటీ! ప్రొద్దున టీ తాగివెళ్ళాడు."

    "సిటీవస్తే నన్ను కలుసుకోకుండా వెళ్ళడే."

    "అమ్మగారూ! రామచంద్రయ్య వచ్చాడు!" నౌకరు వచ్చి చెప్పాడు.

    "నిండుగా నూరేళ్ళు ఆయుష్యం!" అంటూ క్రిందికి దిగివచ్చింది సువర్చల.

    "నూరేళ్ళుకాదు, వెయ్యేళ్ళు దీవించండి!" అన్నాడు రామచంద్ర నవ్వుతూ.

    "బ్రతుకుమీద ఎంత తీపివున్నా మనిషి వృద్దాప్యం భరించలేడు. 'భగవాన్! ఈ జీవితం ఇక సమాప్తం చెయ్యి' అని ప్రార్ధించని మనిషి అరుదు. వృద్దాప్యంలో ఒకరికి బరువైన బ్రతుకు తనకు కూడా బరువేకదా?"

    "అయితే నా యవ్వనం వందేళ్ళుగా దీవించండి."

    "నీ ఆశ చూస్తుంటే నా కొక మహనీయుడి గాధ జ్ఞాపకం వస్తుంది! 'ఈ దీనుల కన్నీళ్ళు తుడవడానికి అల్పమైన ఈ మానవ జీవితం చాలదు. నా ఆయుర్దాయాన్ని వెయ్యేళ్ళుగా దీవించండి' అని భగవంతుడిని ప్రార్ధిస్తాడు. సజీవ సమాధిపొంది భక్తుల వ్యధలను తొలగిస్తూ, ఆర్తుల బాధలను పోగొడుతూ తన వెయ్యేళ్ళ ఆయుర్దాయాన్ని సఫలం చేసుకొంటున్నాడు."

    "ఆ పల్లెటూళ్ళో నీ జీవితం ఎలా గడుస్తూంది?" అజయ్ అడిగాడు రామచంద్రను.

    "ఎవరో ఒకరు భోజనానికి పిలుస్తుంటారు. లేకపోతే ఇంటికే కూరగాయలు, పాలూ పంపుతుంటారు. మనుషులు ఎంత చెడ్డవాళ్ళైనాఇంకా ఈ దానగుణం చనిపోలేదనిపిస్తుంది. అందుకే నా జీవితం నిశ్చింతగా గడిచిపోతూంది."

 Previous Page Next Page