Previous Page Next Page 
భారతి పేజి 21

    చివరకు కారు కరణంగారి ఇంటి ముందు ఆగింది. గౌరీపతిగారు గానీ, రాధమ్మకానీ బయటెక్కడా కనిపించలేదు. భారతి కారు దిగింది.

    రాజయ్య డిక్కీ  తెరిచి, ఆమె సూట్ కేసు బయటకు తీసి పట్టుకుని "మీరు పదండమ్మా, నేను లోపలకు తీసుకువస్తాను" అన్నాడు.

    "అక్కర్లేదు, రాజయ్యా  ఇలా ఇవ్వు. నేపట్టుకుంటాను." ఆమె అతని చేతిలోంచి  సూట్ కేసు అందుకుంది.

    "భారతమ్మా" గాద్గద్యంతో కూడిన  ఈ సంబోధన విని, చకితురాలై ఆమె డ్రైవరు వంక చూసింది, చొక్కా అంచుతో కళ్ళు ఒత్తుకుంటున్నాడు. "భారతమ్మా! నీ కథలో  మొదట్నుంచీ నా జోక్యం కూడా వుంది. మొదట అబ్బాయిగారు కారు తీసుకువచ్చినప్పుడూ ఆయనతో  వున్నాను. మీ తబిసీళ్ళు  కనుక్కోటానికి  తరువాత నేనే వచ్చి, వాకబు చేసి అవన్నీ అబ్బాయిగారికి చేరవేశాను. ఇప్పుడు  కాపరం విడిచి వెళ్ళిపొమ్మంటే  మిమ్మల్ని పుట్టింట్లో  దిగబెట్టటానిక్కూడా నేనే వచ్చాను, భారతమ్మా!" అన్నాడు దుఃఖంలో  అతని కంఠం  బొంగురుపోయింది?

    "అంతా మరిచిపో, రాజయ్యా! అసలు నువ్వు  ఈ ఊళ్లోకి అడుగు పెట్టలేదనుకో."

    "సెలవు, భారతమ్మా!" అతను రెండు చేతులూ ఎత్తి  దణ్ణం పెట్టి కారువైపు కదిలాడు.

    కారు అక్కడ నుంచి  వెళ్ళిపోయేదాకా, బయటే నిలబడి, తరువాత చేతిలోని సూటుకేసుతో గుమ్మంలో  అడుగు పెట్టింది.

    ఆమెకు మొదట కనబడిన వ్యక్తి రాధమ్మ. విసనకర్ర పట్టుకుని, ఏదో పనిమీద  హాల్లోకి వచ్చి ఎదురుగా భారతిని చూసి  చాకితురాలయి పోయింది.

    "పిన్నీ!" అని పిలిచింది భారతి. ఒక అడుగు ముందుకు వేసి.

    రాధమ్మ ఆమె వంక చూసింది. ఆమె రూపం, ఆమె ముఖంలోని కళావిహీనత, ఆమె వైఖరి, ఆమె లోపలికి వచ్చి నిలబడిన పద్ధతి__రాధమ్మ మనసుకేదో  స్పురించినట్లయింది. కీడుని శంకించిందామె.

    భారతివైపు త్వరగా నడిచి  చేతిలోని విసనకర్ర  క్రిందికి జారవిడిచి గభాలున తన అక్కున చేర్చుకుంది ఆమెను. పిన్ని కౌగిలిలో  భారతి మౌనంగా, విగ్రహంగా  ఒదిగివుంది.

    రాధమ్మ అంతలోనే భారతిని తన నుంచి విడదీసి  ఆమె ముఖాన్ని రెండు చేతుల్లో వుంచుకుని "చెప్పు" అన్నట్లు ప్రశ్నార్ధకంగా చూసింది.

    "నేను చెబితే ఆనాడు  విన్నారా పిన్నీ? నాన్న తన జాలిగొలిపే మాటలతో, నీవు మాట్లాడే హృదయంతో నన్ను కట్టివేసి  నాతో ఊఁ అనిపించారు. ఇప్పుడేం జరిగిందో చూడు. వాళ్ళు శాశ్వతంగా నా పీడ వదిలించుకున్నారు. మరి కుష్ఠుపిల్లని ఎవరేలుకుంటారు  పిన్నీ? నన్ను....నన్నక్కడి నుంచి బహిష్కరించారు."

    దభీమని చప్పుడు వినిపించింది  వెనక నుండి. ఉలికిపడి  ఇద్దరూ తలలు త్రిప్ప చూసేసరికి  గౌరీపతిగారు ఒక చేత్తో గుండె పట్టుకుని  కిందపడిపోయి వున్నారు.

    "నాన్నా!" అని భారతి  ముందుకు పరుగెత్తింది. రాధమ్మ ఆమెను వెన్నంటే వుంది.

    గౌరీపతిగారు అప్పుడే స్నానం చేసి పూజ ముగించుకుని వచ్చినట్టున్నారు. పట్టుపంచ, భుజాలమీద పట్టు ఉత్తరీయం, ముఖాన కుంకుమబొట్టూ....క్రిందపడి ఒకచేత్తో గుండె మీద బలంగా చెయ్యి వేసుకుని నొక్కుకుంటూ రక్తంలేని  ముఖంతో  భారతి వంక చూస్తున్నారు.

    "నాన్నా! ఏమయింది, నాన్నా?" అంది భారతి  ఆత్రుతగా కింద కూర్చుని, తండ్రి భుజాలమీద చేతులు వేసి  గట్టిగా పట్టుకుని. 

    గౌరీపతిగారి శరీరం  చిన్నగా  వణుకుతూంది. ఒళ్లంతా  స్వేద బిందువులు అములుకుంటున్నాయి.
    "నువ్వు....నువ్వు....తిరిగి వచ్చేశావా అమ్మా?" అన్నాడు అతికష్టంమీద కళ్ళలో నీళ్ళు చిమ్ముతూండగా.

    భారతి పరిస్థితి అర్ధం  చేసుకుంది. ఆయన పూజ  ముగించుకుని యివతలకు వస్తూ పిన్నితో తాను చెబుతూన్న పాపిష్టి పలుకులు ఆలకించాడు. ఆశనిపాతం లాంటి ఈ వార్త వినేసరికి  ఆ వుద్రేకపడటంలో హఠాత్తుగా గుండెపోటు వచ్చేసింది. 

    "అవన్నీ తరువాత  చెబుతాలే, నాన్నా   నువ్వు మాట్లాడకు" అంటూ రాధమ్మ వంక తిరిగి, "పిన్నీ! ఒక మంచం తీసుకువచ్చి  త్వరగా  వాల్చు. నాన్నని అందులో పడుకోపెడదాం" అంది తొందరగా.

    రాధమ్మ గబగబ లోపలకు  వెళ్ళి ఓ మంచం  తీసుకువచ్చి గోడవార వాల్చింది.

    "నాన్న తనంతట తాను లేవలేడు. నేను ఒకవైపు  పట్టుకుంటాను_నువ్వు రెండో వైపు పట్టుకో. ఇద్దరం ఎలానో సాయంపట్టి  మంచంమీదకు  తీసుకువెడదాం" అంది భారతి ఏడుపు నాపుకుంటూ.

    రాధమ్మ  తల ఊపి  గౌరీపతిగారి పక్కగా  మోకాళ్ళమీద  కూర్చుని ఆయన భుజంమీద చేయి వేసింది. భారతి రెండో భుజం గట్టిగా  పట్టుకుంది. ఇద్దరూ కలిసి అతి ప్రయత్నం మీద  ఆయన్ని  పైకి లేవదీసి అమిత ప్రయాసతో మంచం మీదకు చేర్చారు.

    గౌరీపతిగారు  ఏమీ మాట్లాడే స్థితిలోలేడు. ఆయన ముఖంలో  దుర్భరమైన బాధ అనుభవిస్తూన్న లక్షణాలు  గోచరిస్తున్నాయి. గుడ్లు తేలవేసి  చూస్తున్నాడు. ఆయన పరిస్థితి రానురాను క్షీణిస్తున్నట్లు తోచింది.

    భారతికి భయం పుట్టింది. దడదడమని  కొట్టుకుంటూంది. ఆమె గుండె, ఇన్ని సంఘటనలు సహించే శక్తి ఆమెకెలా  వచ్చిందో  ఆమెకే తెలియదు. "నువ్విక్కడే ఉండు, పిన్నీ! నేనుపోయి  ఆచార్యులుగారిని పిలుచుకువస్తాను" అని బయటకు  పరుగెత్తింది. 

    ఆమె తిరిగి ఆచార్యులుగారిని  వెంట బెట్టుకుని  వచ్చేసరికి  మరో పదిహేను నిమిషాలు గడిచింది. ఈలోగా అప్పటికే ఇరుగూ పొరుగూ పదిమంది వరకూ చేరారు. ఎవరికి తోచిన సహాయం వారు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. కాని అప్పటికి గౌరీపతిగారి  స్థితి కొంచెం  మెరుగైనట్లు  కనిపించింది. కొంచెం "ఊఁ, ఆఁ" అనగలుగుతున్నారు.

    ఆచార్యులుగారు అందర్నీ  పక్కకి తొలగమని మంచం  దగ్గరకు కుర్చీ లాక్కుని  కూర్చుని, గౌరీపతిగారి చెయ్యి పట్టుకుని కాసేపు  నాడి చూశారు  తరువాత  ఇంకేవేవో పరీక్షలు చేసి  అది రక్తపుపోటూ, గుండె జబ్బూ  మితిమీరటం వలన వచ్చిన అనర్ధకమని  తేల్చి  తనవెంట ఎవర్నయినా  పంపిస్తే  మందు పంపిస్తానన్నారు. అనుపానమూ, పథ్యమూ  అన్నీ సెలవిచ్చి చూడవచ్చిన వారిలో మందు తీసుకురావటానికి  ఒకరు వెంటరాగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.


                                *    *    *


    తరువాత  రెండురోజులు గౌరీపతిగారికి  కాస్త నెమ్మదించినట్లయింది. నొప్పి అప్పుడప్పుడూ వస్తూన్నా ఆయన బాగా మాట్లాడగలుగుతున్నారు. తెలివిగా  వుంటున్నాడు.

    తన అత్తవారింటి కబుర్లు  ఆయన ఎప్పుడు ఎత్తుదామని  ప్రయత్నించినా భారతి సమాధాన మివ్వకుండా  ఎలాగో తప్పించుకుంటూ  వచ్చింది. కాని ఒకనాడు  ఆమెకు తప్పలేదు.

    "భారతీ! పర్యవసానం ముందే తెలిసిపోయింది కాబట్టి. వివరణ ఎంత వున్నా నా కింతకన్నా జరిగే అనర్ధం ఏదీలేదు తల్లీ! తోడు ఇంకెవరూ  లేకుండా  ఒక్క కారు డ్రైవరుని మాత్రం యిచ్చి ఇక్కడికి పంపేశారా? ఏం?" అన్నాడు ఒకరోజు కూతురిచ్చిన  మందు త్రాగాక.

    భారతికి తప్పలేదు. అవునన్నట్లు  తల ఊపింది.

    గౌరీపతిగారామెను  చెయ్యి పట్టుకుని తన మంచంమీద కూర్చోపెట్టుకున్నాడు, ఆమె ముఖం వంక చూస్తూ ఒక్క క్షణం ఊరుకుని మళ్ళీ  అడిగాడు నెమ్మదిగా: "అయితే నీ భర్త కూడా నిన్ను వెనకేసుకు రావటానికి ప్రయత్నించలేదామ్మా?"

 Previous Page Next Page