12
శ్యామ్ మోహన్ దగ్గరికి వచ్చాడు. ఇటీవలి కాలంలో శ్యామ్ సాధ్యమయినంత వరకు మోహన్ ను తప్పుకు తిరగాలనే ప్రయత్నిస్తున్నాడు. అలాంటిది తనంతటతాను రావటం మోహన్ కు ఆశ్చర్యాన్నీ కలిగించింది. మళ్ళీ ఏ ఉపద్రవం తెచ్చాడోనని......తన ఎదురుగా కూర్చున్న శ్యామ్ ను పొమ్మని అరవాలనిపించింది. కానీ, అదే క్షణంలో ఒకనాడు శ్యామ్ తనను పొమ్మంటాడేమోనని పడిన భయమూ......ఆనాడు శ్యామ్ తన చుట్టూ చెయ్యివేసి "ఛ! నేను నిన్నెందుకు పొమ్మంటాను? ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టను." అని ఆప్యాయంగా అనటమూ గుర్తుకొచ్చింది.
శ్యామ్ తనను చేరదీసిన తరువాత కూడా ఆకలి మంటలకు తాళలేక తను పడిన ఆరాటం మోహన్ మరచి పోలేకపోయేవాడు.....ఒక్కపూటకు గుప్పెడు మెతుకులకోసం ఎంతమందిముందు ఎన్నెన్ని విధాలుగా తనను తను హీన పరుచుకున్నాడో ప్రతిక్షణమూ కళ్ళముందు దృశ్యాలుగా కదిలేది. చివరకు పాసిపోయిన అన్నాలు, బూజుపట్టిన పచ్చళ్ళూ తిని ఎలా అరాయించుకునేవాడో.....కంపుకొట్టే ఆ పదార్ధాలు తన పాలిటికి ఎలా దివ్యౌషధాలయ్యాయో.......అదంతా కడుపునిండా తినేటప్పుడు కూడా గుర్తుకొస్తుండేది. శ్యామ్ మంచం ప్రక్కన క్యాంప్ కాట్ మీధ పడుకుని కళ్ళుమూసుకోగానే తనొక్కడూ ఆకలితో అల్లాడుతూ దరీదాపులేని రోడ్డుమీద నడుస్తున్నట్లూ ..... జనమంతా తనను ఈసడింపులతో తరిమి తరిమి కొడుతున్నట్లు కలలొచ్చేవి. కెవ్వున కేకపెట్టేవాడు. శ్యామ్ లేచి "ఏమిటి?" అనేవాడు నిద్రమత్తులో, విసుగు బద్దకమూ కలిపి......
కలలో కనిపించిన కలవరంనుంచి తేరుకోలేక వణికి పోయేవాడు మోహన్......
"శ్యామ్! నన్ను మళ్ళీ వెళ్ళిపొమ్మన్నావుకదూ!" అనేవాడు జాలిగా......
మోహన్ ను అలా చూసేసరికి శ్యామ్ కరిగిపోయే వాడు. ధైర్యం చెపుతున్నట్లు మోహన్ చుట్టూ చేయివేసి "ఛ! నేను నిన్నెందుకు పొమ్మంటాను? నువ్వు లేకపోతే నాకు తోచదు....." అనేవాడు నిజాయితీ నిండిన స్నేహస్వరాన.......
శ్యామ్ ముఖం చూసినప్పుడల్లా.....ఎలాంటిపరిస్థితుల్లో నయినా ఇదంతా గుర్తురాకమానదు మోహన్ కి....."భగవాన్" అనుకున్నాడు. తన సమస్యను పరిష్కరించగలిగింది ఆ దేవుడే గనుక......
ఆ రోజు శ్యామ్ ముఖంలో ఉత్సాహం పొంగి పొర్లుతోంది. "మోహన్! ఆ రోజు నువ్వు ప్రసూన విషయంలొ ఏదో, ఏదో అన్నావుగా! ఈ రోజు మా యంగ్ ఫ్రెండ్స్ క్లబ్ కి రా! ఆవిడ ఎంత శీలనతో కళ్ళారా చూద్దువుగాని....." అన్నాడు....
ప్రసూన ప్రస్తావన వచ్చేసరికి.....అందులోనూ ఈ రకంగా వచ్చేసరికి మోహన్ ముఖం పాలిపోయింది.
"ఆ క్లబ్ కి ఆవిడ వస్తుందా?"
"పిలిపిస్తే వస్తుంది."
"పిలిపించావా?"
"అవును పిలిపించాను. కసికొద్దీ పిలిపించాను.
"నువ్వు ఆ క్లబ్ లొ మెంబరువా?"
చటుక్కున ముఖం తిప్పుకున్నాడు శ్యామ్.
"అవును." అన్నాడు గొణుగుతున్నట్లు...... ఆ క్లబ్ సామాన్యమైనదికాదు. ధనిక వర్గాలవారికి మాత్రమే అందుబాటులో వుంటుంది. అక్కడ గేంబ్లింగు మాత్రమే కాదు, ఎన్నెన్నో జరుగుతుంటాయి. ఎవరికీ దొరకదు. జనార్ధన్ తో శ్యామ్ కు డబ్బు అందనీయవద్దని తను చెప్పాడు. జనార్ధన్ తన మాట వింటాడని అనుకున్నాడు. ఏమి వ్యామోహం! అన్నీ తెలిసినవాళ్ళను కూడా సర్వనాశనం చేస్తుంది.
"సాయంత్రం వస్తావా మోహన్?" సవాల్ చేస్తున్నట్టు అడిగాడు శ్యామ్.
మోహన్ నవనాడులు కృంగిపోతున్నాయి. శ్యామ్ ధోరణినిబట్టి అతని మాటల్లో సందేహించటానికి ఏమీలేదనిపిస్తోంది. కానీ ఇదంతా అబద్దం కావచ్చుననే ఆశ అతనిని వదలటంలేదు.
"వస్తాను" అన్నాడు.
"మరిచిపోకు" అని మరోసారి హెచ్చరించి చిరు నవ్వుతో వెళ్ళిపోయాడు శ్యామ్.
ఆ సాయంత్రం శ్యామ్ తో కలిసి క్లబ్ లో కూర్చున్న మోహన్ కు క్షణాలు బరువుగా నడుస్తున్నాయి.
ప్రసూన రాదు. ఎందుకొస్తుంది? ఇంకొక్క గంట కూర్చుని వడలిపోయిన శ్యామ్ ముఖాన్నిచూసి నవ్వి, ఇంకెప్పుడూ ఇలాటి పిచ్చి ఆలోచనలు.........
మోహన్ ఆలోచనలు ఆగిపోయాయి. ప్రసూన గదిలోకి అడుగుపెట్టింది. ఆ వెనుకనే హరి ఉన్నాడు. హరిణి మోహన్ ఎన్నడూ చూడలేదు! అతనెవరో తెలియదు శ్యామ్ కు తెలుసు. హరినిచూసి చిరునవ్వు నవ్వాడు. ఇప్పుడే వస్తాను అంటూ ప్రసూన తలతిప్పి చూసేలోగా వెళ్ళిపోయాడు హరి.
మోహన్ ను చూడగానే వికసించిన ప్రసూన ముఖం అతని ముఖంలో మారుతున్న రంగులను గమనించి వెలవెల పోయింది. ఆ వెల్లబాటుకు మోహన్ మనసు మరో అర్ధం చెప్పుకుంది.