ఏడ్చి ఏడ్చి మండిపోతోన్న కళ్ళతోపాటు మనసు కూడా మరిగిపోతుంటే కన్నుమూతపడటంలేదు లలితకు........
ఎంతపెద్ద పోరాపాటుచేసింది తను! ఈ పెళ్ళితో నాశనమయింది. తన బ్రతుకు మాత్రమె కాదు! తన కారణంగా ఈ లోకంలోకి వచ్చిన మరొక అమాయిక జీవితం వక్రమార్గం పట్టబోతోంది! ఎలా అడ్డుకోగలదు తను? పసివయసులో అదుపూ, ఆజ్ఞా ఉండాలి కాని, అర్ధ రహితంగా ఆడిన ఆటల్లా అవునంటే ఇంకేమైనా ఉందా? ఎవరి క్షేమంకోరి ఈ నరకానికి తల ఒగ్గిందో.....ఆ, తన కూతురే తన అదుపు తప్పిపోతే ఇంకా తన బ్రతుకుకు అర్ధమేముందీ?
తన కాళ్ళ దగ్గిర ఎవరో కూచున్నట్లయి తలతిప్పింది. సుశీలని చూసి వెంటనే కళ్ళు మూసుకుంది. సుశీల లలిత పాదాలమీద చేతులు వేసింది. తన కాళ్ళను లాక్కోవాలనుకుంది లలిత. లాక్కోలేక పోయింది.
"అమ్మా!" అంది సుశీల.
లలిత మాట్లాడలేదు.
సుశీల ఏడుస్తూ లలిత పాదాలమీద వాలిపోయింది.
"నన్ను క్షమించమ్మా! ఇంకమీదట నీ మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పను!......."
లలిత ఇంకా కఠినంగా ఉండలేకపోయింది. చేతులు జాపింది-ఆ చేతుల్లో వాలిపోయింది సుశీల మండుతోన్న లలిత మనసు కొంత చల్లబడింది.
కానీ సుశీల తన మాటమీద నిలబడలేకపోయింది. తండ్రి ఇస్తూన్న డబ్బు చేతి నిండా ఉంది. విలాస జీవితం వెయ్యి నాలుకలతో ఆహ్వానిస్తోంది. స్నేహితులతో ఎక్కడి కైనా వెళ్ళినప్పుడు తండ్రిని బ్రతిమాలుకునేది.
"నాన్నా! నీతోనే ఉన్నానని చెప్పు......ఎవరో గొప్ప వాళ్ళ పార్టీ అని చెప్పు....." అనేది.
కూతురు ఇలా తనను కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవటం సాంబశివానికి సంతోషంగా ఉన్నా, లలితమీద కసితో ఎదురు తిరగాలనే అనిపించింది.
"ఎందుకు? మీ అమ్మతో సినిమాకు వెళ్ళాననే చెప్పు. ఏమైనా అంటే నేనున్నాను" అన్నాడు ఒకసారి.
సుశీల తండ్రివైపు విచిత్రంగా చూసింది.
లలిత వ్యక్తిత్వంలో కొంత సుశీలకు వచ్చింది. ఆ ఒక్క చూపుతో సాంబశివం ముడుచుకుపోయాడు.
"సరే! సరే! అలాగేలే!" అన్నాడు.
ఆలస్యంగా ఇంటికొచ్చి "పార్టీ" అంటోన్న తండ్రి కూతుళ్ళను చూస్తే లలిత మనసు ఎలాగో అయిపోయేది. కానీ "మీ నాన్నతో కలిసి వెళ్ళవద్దు" అనలేకపోయేది. సాంబశివానికి సుశీల అంటే ఎంత అపురూపమో, సుశీలను చూసుకుని చూసుకుని అతడు ఎంత గర్వపడతాడో లలితకు బాగా తెలుసు. అలాంటి తండ్రి ప్రేమకు దూరంగా ఉండమని కూతురుతో చెప్పలేక పోయింది.
ఇటీవల సుశీల ఆలస్యంగా రావటం మరీ ఎక్కువయిపోయింది. లలిత ఒకటి రెండు సార్లు చితాకు పడింది. సాంబశివం కూడా ఇదేమిటని అనుకున్నా లలిత చిరాకు చూసి సుశీలను మరింత ప్రోత్సహించాడు. లలితకు చికాకు కలిగించే పనులు చెయ్యటం కంటే అతనికి ఆనందం కలిగించేది మరొకటి లేదు.
కానీ ఇటీవల సుశీల ఆలస్యంగా రావటానికి కారణం ప్రసూన కాదు. శేఖర్. ఈ విషయం సాంబశివానికి కూడా తెలియదు.