"ఏం తెప్పించను? కాఫీయా టీయా? లేక మరేదైనా హాట్ డ్రింక్ కావాలా?"
మోహన్ వంక గర్వంగాచూస్తూ వెకిలినవ్వుతో అడిగాడు శ్యామ్.
అంతవరకు మోహన్ ముఖంలోకే చూస్తోన్న ప్రసూన ఉలికిపడింది. శ్యామ్ చెపుతున్నదేమిటో అర్ధంకాక అతని ముఖంలోకి అయోమయంగా చూసింది.
మోహన్ చూపులు ప్రసూన అతి చిన్న కదలికనూ, నిశితంగా పరిశీలిస్తున్నాయి.
"ఏం తెప్పించమంటావ్ ప్రసూనా!"
చనువుగా మళ్ళీ అడిగాడు శ్యామ్.
ప్రసూనకు శరీరమంతా జలదరించింది. కళ్ళలో జుగుప్స కదం తొక్కుతోంది.
మోహన్ ని చూస్తూ "మీరు పక్కన కూచుని అతనిచేత ఇలా వాగిస్తున్నారా?" అంది రోషంగా.
మోహన్ మాట్లాడలేదు. శ్యామ్ పకపక నవ్వాడు. "మోహన్ నా పక్కన కూచున్నాడు. నీ ఎదురుగా కూచున్నాడు. నన్నూ చూస్తున్నాడు-నిన్నూ చూస్తున్నాడు. కొంచెంసేపట్లో వెళ్ళిపోతాడులే! అతనికిలాంటి వ్యవహారాలు గిట్టవు....."
ప్రసూన ఆడత్రాచులా బుసలుకొడుతూ లేచింది.
"నీచుడా! నువ్వసలు మనిషివి కావు. మోహన్! నన్ను కాస్త బయటికి తీసికెళ్ళండి....."
శ్యామ్ ఉక్కిరిబిక్కిరయిపోతూ విరగబడి నవ్వాడు ప్రసూన కంఠాన్ని వెటకారంగా అనుకరిస్తూ "మోహన్ ఈ పవిత్రురాలిని బయటకు తీసికెళ్ళండి. మీరు అండగా ఉండకపోతే మాకు లాభంలేదు" అన్నాడు.
ప్రసూనకు కోపంతో పాటు భయమూ పట్టుకుంది. చెమటలు పడుతోన్న నుదుటిని రుమాలుతో అడ్డుకుంటూ ఏం చెయ్యాలా అని క్షణకాలమాలోచించింది. లేచి బయటకు నడువబోయింది. శ్యామ్ మెరుపులా అడ్డు నిలుచున్నాడు. "ఎక్కడికి?" అన్నాడు కర్కశంగా.
వేటగాడినిచూసి బెదిరిన లేడిలా ప్రసూన మోహన్ ను చూసింది. ఆ చూపులు ఎంతో దయనీయంగా ఉన్నాయి. మోహన్ మనసులు ముక్కలు చేస్తున్నాయి. అయినా శిలలా అలానే కూచున్నాడు.
"అడ్డులే.....లేకపోతే అరచి అల్లరి చేస్తాను." బింకంగా అంది ప్రసూన. శ్యామ్ కసిగా చూశాడు.
"పాపం! అలాగేం! ఇక్కడ నువ్వు అరిచినా ఎవరూ వినిపించుకోరు-అసలు వినిపించదు. కావాలంటే అరు! నాకు కాస్త సరదాగా ఉంటుంది....."
ప్రసూన పిండిబొమ్మ అయిపోయింది. ప్రసూననే పరిశీలనగా చూస్తోన్న మోహన్ ఆ ముఖం చూడలేక తల తిప్పుకున్నాడు.
"మోహన్! మీకు పుణ్యముంటుంది! నన్ను రక్షించండి" బేలగా చేతులు జోడించింది ప్రసూన.
అప్పటికీ మోహన్ మాట్లాడలేదు. శ్యామ్ కు మండిపోతోంది.
"ప్రసూనా దేవీ! తమ నాటకాలు కట్టిపెట్టండి. మీ నాన్నకు అయిదువేలు ఇచ్చింది ఇలాటి ప్రహసనాలకోసం కాదు-మోహన్ ! యు కెన్ గో!"
మోహన్ లేచాడు.....ప్రసూన వణికిపోయింది.
"వద్దు! వద్దు! మోహన్! మీరు వెళ్ళకండి. మీరు మా నాన్నకు అయిదువేలిచ్చారా? ఆయనే నన్ను మీదగ్గిరికి తీసుకొచ్చాడా?
"ఆహా! ఈ వ్యాపారం నీకు కొత్త అయినట్లు మాట్లాడతావేం?"
"వ్యాపారం......" మాట్లాడలేకపోయింది ప్రసూన......వెక్కివెక్కి ఏడ్చేసింది. కోపమూ, అభిమానమూ అన్నీ కరిగిపోయి భయమే మిగిలింది.
"నన్ను నమ్మండి. నాకేం తెలియదు-సుశీల కబురు చేసిందన్నాడు-క్లబ్బులో ఉందని అన్నాడు. ఈ క్లబ్బు నాకు తెలియదు-కానీ సుశీల అప్పుడప్పుడు క్లబ్బులకు వెళ్తుందని తెలుసు-అందుకే నాన్నతో వచ్చాను-ఇంతకంటే నాకేం తెలియదు-నన్ను నమ్మండి......"
మోహన్ ఉద్దేసించి ఏడుస్తూ అంది.
"చాలు ఏడుపులు! మీ నాన్న నా దగ్గిర అయిదు వేలు గుంజాడు. ఈ ఏడుపులు వినిపించటానికా?"
"అయిదువేలా? అయిదువేల కోసమేనా? మీ అయిదువేలూ మీకిచ్చేస్తాను. నన్ను వదలండి....."
"అయిదువేలూ ఇస్తావా? ఎలా ఇస్తావు? సాంబశివాన్ని అడిగి ఇస్తావా!"
మళ్ళీ విరగబడి నవ్వాడు శ్యామ్.....
ప్రసూనకు తల తిరిగిపోతోంది.
"మేడమ్! నాకేమీ తెలియదని అనుకోకు! రేఖ అంతా చెప్పింది.....?
"రేఖ.....?" వణుకుతున్న ప్రసూన పెదవులు అస్పష్టంగా ఉచ్చరించాయి.
"అవును రేఖ-పాపం, తన పరువు కాపాడుకోవటానికి నీకున్నట్లు నాన్నాలేడు, సాంబశివమూ లేడు. అందుకే నీబోటివాళ్ళు చిన్నచూపుచూసి హేళన చెయ్యడానికి వీలు దొరికింది.....?
ప్రసూన మాట్లాడలేదు మాట్లాడగలిగే శక్తిలేదు.
"మోహన్! ఇంకా నువ్వు వెళ్ళు-"
మోహన్ లేచాడు. ప్రసూన తలెత్తి మోహన్ వంక చూసింది. ముందుకు వెయ్యబోయిన మోహన్ అడుగు ఆగిపోయింది.