తంతు మొదలయింది మళ్ళీ.
అందరికీ అడ్డంగా తెరకట్టేశారు. అరగంటలో ఆ తతంగం పూర్తయింది.
బాసలు చేయిస్తున్నాడు పురోహితుడు.
"కష్టాలోనూ, సుఖాల్లోనూ, బాధల్లోనూ, సంతోషంలోనూ.....నీతోకలిసి ఉంటాను."
"కష్టాల్లోనూ సుఖాల్లోనూ, బాధల్లోనూ, సంతోషంలోనూ.....నీతోనూ మరికొంతమంది అమ్మాయిలతో కలిసి ఉంటాను."
మిగతా పెళ్ళికూతుళ్ళందరూ ఫక్కున నవ్వారు.
పురోహితుడికి మతిపోయింది.
"నీ పెళ్ళిచేయటం నావల్లకాదు."
"ఒక్కమ్మాయితో కాపురం చేయటం కూడా నావల్లకాదు."
తులసి పురోహితుడిని బ్రతిమాలింది.
"ఏం చేస్తాం! కానీండి! ఇక్కడెన్ని బాసలు చేసినా మగబుద్దిఅంతే!"
పురోహితుడు నవ్వేశాడు.
"మగబుద్దేమిటి ఆడబుద్దేమిటి? ఈ రోజుల్లో అంతా మాయే."
సురేష్ మాయవేపుచూశాడు ఆనందంగా.
"చూశారానేను చెప్పలేదూ! మీ అందాలు వేయికళ్ళతో చూడాలని పురోహితుడు కూడా మీమీద కన్నేశారు."
పురోహితుడు అదిరిపడ్డాడు.
"ఏమిటయ్యా! పెద్దా చిన్నా లేకుండా ఏమిటా మాటలు?" కోపంగా అన్నాడు.
"అదేంటండీ! మీరేగా మీకు అంతా 'మాయే' కనబడుతోందని అన్నారు ఆమె పేరు మాయ" పురోహితుడు నాలిక్కరచుకున్నాడు.
"గట్టిగా అరవకయ్యా బాబు! నా రెండో భార్య ఆ మూలేనిలబడి వుంది."
పెళ్ళితంతు ముగిసింది.
బోట్ లో తిరిగి బయల్దేరాయి జంటలన్నీ.
ఆ పెళ్ళికూతురు ఇంకా సురేష్ వేపే చూస్తోంది.
"ఇవ్వాళ్టినుంచీ మనం ఇంకా పబ్లిగ్గా ప్రేమించుకోవచ్చుకదూ!"
మాయ నవ్వింది.
"ఇంతకుముందు మహా భయపడిపోయినట్లు."
"ఇప్పుడు చూడండి! ఆ గంగాభవాని దుంప తెంచేస్తాను.
బోట్ ఒడ్డుకి చేరుకుంది. కారులో ఇంటికి చేరుకున్నారందరూ.
ఆ యువతులూ, యువకులూ చెట్లమధ్య కుర్చీలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
వాళ్ళను చూడగానే మాయముఖంలో బెదురుపూర్తిగా తొలగిపోయింది.
"అయిపోయిందా?" అడిగింది మహీధర్ ని.
"బ్రహ్మాండంగా" కొంటెగా ఆమెవేపు చూస్తూ అన్నాడు.
అందరికీ పెళ్ళి విందు ఏర్పాటు చేసింది మాయ. చాలా రకాల వంటకాలు తయారుచేసింది ప్రభ.
"ఆ అమెరికన్ ప్రభను ఎందుకు సొంతం చేసుకోవాలనుకున్నాడో ఇప్పుడర్దమయినది.
జీవితాంతం కోడికూర వండించుకోవటంకోసం" అన్నాడు సురేష్.
ప్రభ సిగ్గుపడిపోయింది.
తులసి అతని తొడమీద గిల్లింది మందలింపుగా.
"ఇవాళ మీకు మా బెడ్ రూమ్ ప్రెజెంట్ చేస్తున్నాను" అంది మాయ సురేష్ తో.
"థాంక్యూ! బెడ్ మీద మీరూ ఉంటారుకదా!"
మళ్ళీ గిల్లింది తులసి.
రాత్రిపదవుతోండగా ఇంగ్లీష్ మాగజైన్ తీసుకుని గదిలోకి వచ్చింది తులసి.
"హు!" అన్నాడు సురేష్.
"ఏమిటీహు?"
"పండగనాడుకూడా పాత పెళ్ళామేనా?"
"ఇవాళేంపండగ?"
"మనపెళ్ళి రోజు పండగేకదా!"
"కొంచెమయినా సిగ్గుండాలి! ఎప్పుడూ అదేయావ."
ఆమెను అమాంతంగా మీదకు లాక్కున్నాడతను.
"నేను కాసేపు చదువుకోవాలి!"
"నేను నిద్రపోయాక చదువుకో!"
"నువ్ రాత్రుళ్ళు నిద్రపోవనినాకు తెలుసు."
"అబద్దం! ఒక రోజు పావుగంట నిద్రపోయాను....."
ఆమె నవ్వేసింది.
ఆమె చేతిలో పుస్తకం జారి కింద పడిపోయింది. నిశ్శబ్దంగా ఆమెను తనలో ఐక్యం చేసుకుంటున్నాడు.
బాగా అలసిపోయాక అడిగాడు.
"ఏమిటి? ఏమి తేడా కనిపించటంలేదు?" నిరుత్సాహంనటిస్తూ అడిగాడు.
"ఏమిటి తేడా?"
"అదే! పెళ్ళికి ముందూ, తర్వాతా...."
ఆమె అతనిచేతులు తొలగించుకుని నిద్రలోకి జారిపోసాగింది. సురేష్ మాత్రం మేల్కొని ఎదురు చూడసాగాడు......
మాయ మహీధర్ మాటలేమయినా వినబడతాయేమోనని.
రాత్రి పన్నెండు గంటలకు వినిపించింది మాయగొంతు.
"ఈ డ్రస్ బాగుందా?"
"ఏ డ్రస్ అయినా బాగానే ఉంటుంది నీకు!"
"పొగడ్తలేమీ అక్కర్కేదులే....."
ఇంటిమేట్ సువాసన మత్తుగా వస్తోంది వెంటిలేటర్ లోనుంచి.
"పదండి!" ఇద్దరూ తలుపు తెరుచుకుని బయటకు నడుస్తున్నచప్పుడు.....సురేష్ కూడా నెమ్మదిగా లేచి కూర్చున్నాడు.
గది బయటికొచ్చేసరికి ప్రభ చటుక్కున మంచం మీదనుంచి లేచి కూర్చుంది.
మంచినీళ్ళేమయినా కావాలేటండి!" అడిగింది పైట నిండుగా కప్పుకుంటూ.
సురేష్ కి అబద్దమాడటం తప్ప గత్యంతరంలేకపోయింది.
"ఆ.....అవును....."
"మీ గదిలో టేబుల్ మీద పెట్టానండి! లేకపోతే ఈ టేబుల్ మీదకూడా ఉన్నాయండీ!" అంటూ ఓ గ్లాసునిండుగా పోసి అందించింది.