Previous Page Next Page 
టు హెల్ విత్ లవ్ పేజి 21


    మొదటిహీరోయిన్ పాపాయితో నానా బాధలు పడుతూ హీరోని వెతుక్కుంటూ బయల్దేరింది, ఆడాళ్ళంతా భోరున ఏడ్చేయసాగారు.
    "హు! ఈ ఆడాళ్ళను చూస్తే నాకు వళ్ళు మండిపోతోంది! సినిమాలో హీరో ఇద్దర్ని చేసుకుంటే చూసి 'ఓకే' చేసి వందరోజులాడిస్తున్నారు. మరి బయట భర్తగాడిని ఇంకో అమ్మాయితో ఒక్క రోజు కూడా ఆడనీరేం?" ఉక్రోషంగా అన్నాడు సురేష్.
    సినిమానుంచి వస్తోంటే వెన్నెల విరగకాస్తోంది. పట్టపగల్లా ఉంది. మాయ యాడ్ ఫిలిమ్స్ గురించి చెపుతోంటే ఆనందంగా వింటున్నాడు సురేష్. ప్రభ తులసితో తన అమెరికన్ ప్రియుడి గురించి చెపుతోంది.
    ఇంటికొచ్చేసరికి మహీధర్ మరో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు యువకులతో కూర్చుని కబుర్లు చెప్తున్నాడు. మాయ ఆశ్చర్యపోయింది.
    "ఏమిటంత సడన్ గా?" అడిగింది మహీధర్ ని.
    "అనెక్స్ పెక్టెడ్ ఆఫర్ ఒకటొచ్చింది. ఆలస్యం ఎందుకని వచ్చేశాం!"
    మాయమొఖంలో రంగులుమారుతున్నాయ్.
    అందరినీ, తులసికీ, సురేష్ కీ పరిచయం చేసింది.
    అందరూ భోజనాలు చేశారు.
    అర్దరాత్రి మెలుకువ వచ్చింది సురేష్ కి. ఎందుకు మెలకువవచ్చిందో తెలీదు. ఆరుబయట వెన్నెల మరింత సమ్మోహనంగా వెలిగి పోతుంది. తన తలవెనుకే కిటికీలోంచి హఠాత్తుగామాయ గొంతు నెమ్మదిగా రహస్యంగా వినిపించసాగింది.
    "నీకు ముందే చెప్పాను......మా తులసికొద్దినెలలపాటు ఇక్కడే వుంటుందని? మళ్ళీ ఇక్కడ షూటింగ్ ఎందుకు పెట్టావ్?"
    "వైజాగ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయ్. అందుకని తప్పలేదు."
    "ష్! మెల్లగా..."
    కొద్దిక్షణాల్లో నిశ్శబ్దం.
    "అయితేగుర్తుంచుకో! మేముపెళ్ళికెళ్ళి వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటలవుతుంది. మీ వర్క్ అంతా ఈలోగా అయిపోవాలి!"
    "ఓ! కంప్లీట్ చేసేస్తాను....."
    మళ్ళీ నిశ్శబ్దం.
    "మరి మనసంగతేమిటి?" అడిగాడతను.
    ఆమె మాట్లాడలేదు.
    "మాయా!"
    "ఊ...!"
    "పావు గంట ఫిల్మ్ కావాలి నీది"
    "కిందటిసారి అదే ఆఖరుసారి అన్నావుగా" ఆమె గొంతులో కోపం కనబడుతోంది.
    "అయామ్ సారీ! చెప్పినమాట నిజమేగానీ...."
    మళ్ళీ కొద్ది నిమిషాల నిశ్శబ్దం.
    "మాయా! ప్లీజ్ ఇదే లాస్ట్! ఇంకా నిన్ను వుపయోగించుకొన్ని ప్రామిస్ చేస్తున్నాను."
    "సరే! కానీ రేపురాత్రికి పెట్టుకోండి షూటింగ్! వీళ్ళందరూ నిద్ర పోయాక మొదలుపెడదాం."
    "థాంక్యూ డియర్!"
    ఆ తరువాత మాటలు వినిపించలేదు.
    సురేష్ కి నిద్రపట్టలేదింకా! మాయ యాడ్ ఫిల్మ్ లో యాక్ట్ చేయడానికి ఎందుకు ఇష్టపడడం లేదు? యాడ్ ఫిలిమ్స్ జీవితంకూడా చాలా తమాషాగా, థ్రిల్లింగ్ గా ఉంటుంది. సినిమా ఫీల్డ్ తర్వాత ఆకర్షణీయమయిన ఫీల్డ్.
    తులసి లేపుతూంటే గానీ మెలకువరాలేదుమర్నాడు.
    "త్వరగా రడీ అవ్! నువ్వెక్కడి పెళ్ళి కొడుకువో అర్ధంకావటం లేదు. ముహూర్తం దగ్గరపడుతున్నా తలగడను కౌగలించుకుని పడుకున్నావ్?"
    "ప్రభ కిసుక్కుమని నవ్వింది కనకాంబరాల మొక్కపక్కన నిలబడి.
    అందరూ రడీ అయి కారులో బయలుదేరారు.
    బోట్ రైడింగ్ చాలా హుషారుగా వుంది.
    పెళ్ళికోసం వెళుతున్న నాలుగు జంటలు కనిపించాయి అందులో.
    పెళ్ళికూతుళ్ళందరూ సిగ్గుతో ఒదిగిపోయి కూర్చున్నారు.
    గుళ్ళో పెళ్ళి ఏర్పాట్లు అన్నీచేసే ఉన్నాయ్. అన్ని జంటలకూ కలిపి ఒకేసారి పెళ్ళి చేయటం మొదలుపెట్టాడు పురోహితుడు.
    "పెళ్ళికొడుకులందరూ ఇటురండి" పిలిచాడతను.
    నలుగురూ లైన్ గా నడిచారు.
    "మీ తరపు పెళ్ళికొడుకేడి?" సురేష్ నడిగాడతను.
    "నేనే మా తరపు పెళ్ళికొడుకుని"
    "మరి పంచె, ఉత్తరీయం వేసుకోవేం?"
    "అవన్నీ కట్టుకుంటే అందరం అభాసుపాలవుతాం" పురోహితుడికి అర్ధం కాలేదు.
    "నీ పెళ్ళికూతురెవరు?"
    "అట్నుంచీ రెండో పెళ్ళికూతురయితే బావుంటుంది."
    అతని పక్కనే నిలబడ్డ ఇంకో పెళ్ళికొడుకు అదిరిపడ్డాడు.
    "అయ్ బాబోయ్ అదేటండి! ఆ అమ్మాయి నా పెళ్ళికూతురు."
    "కాదండీ నా పెళ్ళికూతురు" ఉడికిస్తూ అన్నాడు సురేష్.
    పురోహితుడు అదిరిపడ్డాడు. పెళ్ళికూతురు తెల్లబోయి చూస్తోంది.
    "అదేంటయ్యా! ఇద్దరికీ ఓకే పెళ్ళికూతురెలా వుంటుంది?"
    "ఎలాగోలా ఎడ్జస్ట్ చేసుకుంటాంలెండి! త్వరగా కానీండి."
    పెళ్ళికూతురు చిరునవ్వుతో చూసింది సురేష్ వేపు.
    తులసి విరగబడి నవ్వుతోంది.
    పెళ్ళికూతురు తండ్రి కంగారుగా పరిగెత్తుకొచ్చాడు.
    "అది కాదండీ మా అమ్మాయిని...."
    "నాకిష్టమే" అందా పెళ్ళికూతురు పురోహితుడితో ఆమె తాలూకూ పెళ్ళికొడుకు ఉక్కిరి బిక్కిరయ్యాడు సురేష్ చప్పున కల్పించుకున్నాడు.
    "సరేనండి పురోహితుడుగారూ! ఆ చివరమ్మాయిని చేసుకుంటాను" అన్నాడు తులసిని చూపిస్తూ.
    తులసి విరగబడి నవ్వుతోంది.
    పురోహితుడు అనుమానంగా తులసివేపు చూశాడు.
    "ఏమ్మా? వప్పుకుంటున్నావా?"
    తులసినవ్వాపుకుంటూ తలూపింది.
    "ఎవడికోసం చేసుకోదు? ఆరోనెల" పురోహితుడు చెవిలో చెప్పాడు సురేష్.
    "శివశివా" అన్నాడు పురోహితుడు.

 Previous Page Next Page