అందుకని స్లో అయిపోయి, ఏదో పనిమీద గది బయట కెళ్ళునట్లు నడిచి వెళ్ళిపోవాలి.
కుక్కల సంగతి తనకు బాగా తెలుసు.
పరుగెడితే కోపం ఎక్కువ వాటికీ!
పరిగెడుతూనే "దొంగ వెధవల్లారా! ఆ కుక్క మీది కాదన్నారు కదూ?" అన్నాడు విశ్వనాథం ఒగరుస్తూ.
"మాది కాదు" అన్నాడు సింహాద్రి కూడా ఒగరుస్తూనే.
"మరిప్పుడెందుకొచ్చింది మళ్ళీ అది?"
"అది దాని రొటీన్ ప్రోగ్రాం - అంతే"
"అవును అందరిళ్ళకూ వెళ్ళి పలుకరింపుగా కనబడి పోతూంటుంది"
"అబద్దం" అరచాడు విశ్వనాథం ఆగకుండానే.
"కాదు, నిజం" అన్నాడు సింహాద్రి.
"నేను నమ్మను"
"ఏం ఫరవాలేదు"
"నన్ను మళ్ళీ కరిపించాలనే దాన్ని పిలిచారిప్పుడు" అన్నాడు విశ్వనాథం కొంచెం స్లోగా పరిగెడుతూ.
"నెవర్" అన్నాడు చిరంజీవి. "అలాంటి ఆలోచనే లేదు! పైపెచ్చు అది మాదికాదు"
"మీది కాపోతే ఎందుకొచ్చింది ఇప్పుడు?"
"చెప్పాం కదా! దాని హాబీ- అంతే!"
"అయితే ముందు దాన్ని బయటకు గెంటండి"
"ఎందుకు?"
"లేపోతే మళ్ళీ కరుస్తుంది నన్ను"
"ఏమాత్రం కరవదు"
"నీకెలా తెలుసు?"
"కుక్కలూ - వాటి మనస్తత్వాలు పుస్తకంలో చదివాను"
"ఏమని?"
"ఎవరయినా సరే వాటిని ఏదోరకంగా ఇన్సల్ట్ చేస్తేనే తప్ప అవి కరవవు అని"
"మరి మొన్న నేనేం ఇన్సల్ట్ చేశానని నన్ను కరిచింది?" ఇంకొంచెం నెమ్మదిగా పరిగెడుతూ అడిగాడతను.
"అదే మనకు తెలీదన్నమాట! అది కనుక్కోవాలంతే కుక్కలూ - అసంకల్పిత ప్రతీకారచర్యలు' అని ఇంకో పుస్తకం వుంది అది చదవాలి"
"ఆ పుస్తకాలన్నీ హంబక్" అన్నాడు విశ్వనాథం.
"అందుకే మిమ్మల్ని కరిచిందది" అన్నాడు చిరంజీవి.
"ఇప్పుడు దాన్ని ఎవరయినా పట్టుకుంటే నేను బయటకు పరుగెడతాను" రాజీకొస్తూ అన్నాడతను.
"దానిని పట్టుకోవడం ఎందుకు?" అడిగాడు సింహాద్రి ఆశగా.
"లేకపోతే తప్పకుండా కరుస్తుంది నన్ను! ఇప్పటికింకా కిందటిసారి కరచిన కాటు తాలూకూ పధ్నాలుగు ఇంజెక్షన్లు పూర్తికానేలేదు"
"పధ్నాలుగు అనవసరం. ఎనిమిది చాలు."
"డాక్టరు పధ్నాలుగు చేయించుకోమన్నాడుగా?"
"అది పిచ్చికుక్కలకయితే"
"మరి ఇది మంచి కుక్క అన్న గారండీ ఏమిటి?"
"దాని చూపులు - అది మనవంక చూస్తున్నప్పుడు..."
చిరంజీవి ఇంకేం చెప్పేవాడోగాని సింహాద్రి ఆ కుక్కను ఆపి దాని మెడపట్టుకోవడం అదే అదననుకుని విశ్వనాథం గదిలో నుంచి బులెట్ లాగా బయటకు దూసుకుపోవడం క్షణంలో జరిగిపోయింది.
"అబ్బ! ఇంకా ఇదంతా కలలాగానే వుంది" అంది శ్రీదేవి ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ.
"హిప్నాటిజం అంటే ఇంతేనండీ! కలలాగానే ఉంటుంది" అన్నాడు సింహాద్రి.
"అతను ఆ దబ్బలంతో మిమ్మల్ని పొడిచేస్తాడని భలే భయం వేసింది నాకు" అందామె.
"ఏడ్చాడు. అందుకే గదా సింహాద్రి ఆ కుక్కను హిప్నటైజ్ చేసి లోపలకు పిలిపించాడు" అన్నాడు చిరంజీవి.
"ఏమిటి? ఈ కుక్కను హిప్నటైజ్ చేశారా?" ఆశ్చర్యంగా అడిగిందామె.
"అవును! తప్పలేదు మరి" అన్నాడు సింహాద్రి.
"అంటే జంతువుల్ని కూడా హిప్నటైజ్ చేయవచ్చా?" అడిగిందామె.
"ఓ! ప్రాణం వున్న వాటన్నిటినీ చేయవచ్చు! ఆఖరికి చెట్లను కూడా చేయవచ్చు. అయితే ఆ కోర్స్ నేనింకా కంప్లీట్ చేయలేదు."
"ఒండర్ ఫుల్" అందమె.
"అఫ్ కోర్స్"
తేలిగ్గా అన్నాడు సింహాద్రి.
శ్రీదేవి టైం చూసుకుంది.
"థాంక్యూ ధనుంజయ్ గారూ! మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా వుంది. మరి నే వెళ్తానికి - మా డాడీ హోటల్లో ఎదురుచూస్తుంటారు" అంది లేచి నిలబడుతూ.
సింహాద్రి మొఖంలో జీవకళ నశించిపోయింది.
"ఆ... వెళ్ళిపోతారా! మీతో బోలెడు విషయాలు మాట్లాడాలనుకున్నానండీ" దిగులుగా అన్నాడతను.
"మరోసారి మాట్లాడుకోవచ్చులెండి! ఆ... చెప్పడం మర్చిపోయాడు. వచ్చే ఆదివారం నా బర్త్ డే! మీరిద్దరూ తప్పకుండా విశాఖపట్నం రావాలి" అందామె ఉత్సాహంగా.
"విశాఖపట్నమా?"
"అవునండీ! కష్టమేముందీ? రాత్రి రైలెక్కితే పొద్దున్నకల్లా దిగుతారు. అక్కడ రెండు రోజులు మా ఇంట్లోనే గెస్ట్స్ గా వుండాలి. ఓకే?"
"ఓకే" అన్నాడు సింహాద్రి ఆనందంగా.
"రేపే మీకు ఇన్విటేషన్ పోస్ట్ చేస్తాను. ఒకవేళ అది అందకపోయినా ఇదే ఇన్విటేషన్ అనుకుని వచ్చేయండి"
"ఓ... తప్పకుండా వస్తామండీ"
"మర్చిపోరు కదూ?"
"మీరు మర్చిపోకుండా వుండాలి మాదేముంది ఇహిహి" అన్నాడు సింహాద్రి.
"మరి మా అడ్రస్ తెలుసామీకు?"
"తెలుసండీ! బాంబ్ నిలయం, రెడ్ బాంబ్, విశాఖ పట్నం, కరెక్ట్ కదండీ?"
"రెడ్ బాంబ్ కాదు, రెడ్ ఫీల్డ్"
"అవునూ బాంబు మీ ఇంట్లో వుందా అండీ? చుట్టుపక్కలుందా?"
"బాంబేమిటి?"
"అదేనండీ- బాంబ్ నిలయం అంటే అర్ధం బాంబులుండే ప్రదేశం అని కదా"
"అదా" ఆమె నవ్వేసింది. బాంబులు మా ఇంట్లోనూ లేవు. ఇంటి బయటా లేవు"
"మరా పేరెందుకు పెట్టినట్లు?"