Previous Page Next Page 
పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 23


    "మా డాడీ ఆర్మీలో కల్నల్, సర్వీస్ లో వుండగా ఆయన ఎన్నో బాంబులు పేల్చారు. ఎంతోమంది ఎనిమీస్ ని బాంబులతో ఆనవాల్లేకుండా ఎగరగొట్టేశారు. అందుకని బాంబులమీద ఇష్టం కొద్దీ బాంబ్ నిలయం అని పేరుపెట్టారు"
    సింహాద్రికి భయమేసింది.
    "ఇప్పుడు కూడా ఎవర్నయినా బాంబులతో పేలుస్తున్నారాండి?" డౌటుగా అడిగాడు.
    "అబ్బే ఇప్పుడసలు బాంబులు వాడడం లేదు. రివ్వాల్వరూ, పిస్టలూ, గన్స్- ఇవన్నీ ఉన్నాయిగా. ఒకరిద్దర్నయితే వాటితో కాల్చటమే ఎకనామికల్ అంటారు డాడీ. కనీసం పాతిక, యాభై మందయినా లేకపోతే బాంబులు వాడడం చాలా ఖర్చుతో కూడిన పనట"
    "అలాగాండీ..." దిగులుగా అన్నాడతను.
    "మీరు విశాఖపట్నంలో దిగి బాంబ్ నిలయం అంటే ఎవర్నడిగినా చెప్తారు. అంత ఫేమస్ మా డాడీ. ఇల్లు కనుక్కోవడం డెడ్ ఈజీ"
    "వస్తానండీ"
    ఆమె వెళ్ళిపోయింది.
    "హమ్మయ్య! అంతా అనుకున్నట్లుగానే సుఖంగా గడిచిపోయింది" అన్నాడు చిరంజీవి పరిస్థితిని సమీక్షిస్తూ.
    "ఒకటి తప్ప" అన్నాడు సింహాద్రి దిగులుగా.
    "ఏమిటది?"
    "మావయ్య ఎపిసోడ్"
    "ఓస్..అదా? అలాంటివి చాలా మైనర్ విషయాలు మనం చేసిన గొప్ప కార్యక్రమాల్తో పోలుస్తే"
    "దానివల్ల ఏ గొడవా రాదంటావ్!"
    "ఒక్క అంగుళం కూడా రాదు"
    "మావయ్య నా ఆస్తిని ఏ అనాథ శరణాలయానికో ఇచ్చెయడంటావ్?"
    "వాళ్ళ మావయ్య వల్ల కూడా కాదు"
    సింహాద్రికి సంతృప్తి కలిగింది. అయినా మరో ప్రశ్న వేయాలనిపించింది.
    "నువ్వు ఆ లాయరు ఇంటిపక్కన ఎన్ని రోజులన్నావ్?"
    "నూట ఆర్రోజులు. రాత్రింబగళ్ళు వున్నాను"
    "అయితే ఇప్పుడు మన ప్రోగ్రాం ఏమిటి?"
    "ఏముంది. ఆదివారం పొద్దునకల్లా మనం విశాఖపట్నం బాంబ్ నిలయంలో ఉంటాం! శ్రీదేవి బర్త్ డే పార్టీలో పాల్గొంటాం. మాంఛి ఏకాంత సమయం చూసుకొని నువ్వు శ్రీదేవితో నా ప్రేమను వెల్లడిస్తావ్. ఆమె ఓకే అంటుంది?"
    సింహాద్రి ఆనందంతో పొంగిపోయాడు.
    "నిజంగా ఓకే అంటుందంటావా?"
    "వట్టి ఆంధ్రప్రదేశ్ పౌరుడిలాగున్నావే" విసుక్కున్నాడు చిరంజీవి.
    ఆ వారం రోజులూ సింహాద్రికి నిద్రపట్టలేదు. హైద్రాబాద్ లోనే వుండిపోయినట్లూ శ్రీదేవి తనకోసం ఎదురుచూసి రామేశ్వర్ జఠానీ అనేవాడిని పెళ్ళి చేసుకున్నట్లు కల రావటం వెంటనే కెవ్వున అరచిలేచి కూర్చోవడం మామూలయిపోయింది.
    అసలు శ్రీదేవి పెళ్ళి చేసుకున్న రామేశ్వర్ జఠానీ ఎవడో ఎంత ఆలోచించానా అర్ధం కావటం లేదు.
    "అసలు ఆ పేరు కూడా విన్లేదింతవరకూ వాడెవడయి ఉంటాడంటావ్?" చిరంజీవినడిగాడతను.
    "వాడివల్ల మానవజాతి చాలా నష్టపోయిందని ఎప్పుడో ఎక్కడో చదివివుంటావ్" అన్నాడు చిరంజీవి.
    సింహాద్రి తను చదివిన పుస్తకాలన్నీ తిరిగేశాడు- అయిదు నిమిషాల్లో! కాని ఆ పేరు ఎక్కడా కనిపించలేదు.
    
                   * * * * *
    
    ఆదివారం ఉదయానికల్లా శ్రీదేవి  బర్త్ డే కోసమని సింహాద్రి కుట్టించుకున్న ఖరీదయిన సూటుతో వైజాగ్ లో దిగారిద్దరూ.
    టాక్సీవాడు 'బాంబ్ నిలయం' అనగానే మీటర్ మీద పది రూపాయలు ఎక్కువ ఇమ్మన్నాడు.
    "అదేమిటి? అంతెందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు సింహాద్రి.
    "బాంబ్ నిలయం కెళ్ళాలంటే రిస్క్ సార్! ఎవరయినా ఇంతే ఛార్జ్ చేస్తారు"
    "ఏమిటి రిస్క్?"
    "ఫలానా అని చెప్పలేమండీ! కాని రిస్కేనండీ"
    సింహాద్రీ, చిరంజీవీ మొఖాలు చూసుకున్నారు.
    "ఏమిటి రిస్కంటాడు వాడు?"
    "అదే నేనూ తీవ్రంగా ఆలోచిస్తున్నాను" అన్నాడు చిరంజీవి.
    "మరిప్పుడేం చేద్దామంటావ్?" అడిగాడు సింహాద్రి వణుకు కనపడనీయకుండా.
    "వాడికింకో పది ఇస్తే వాడే చెబుతాడ్లే" అన్నాడు చిరంజీవి. ఇద్దరూ టాక్సీ ఎక్కారు.
    కాస్తదూరం వెళ్ళాక చిరంజీవిని సంగతి కనుక్కోమని మోచేత్తో పొడిచాడు సింహాద్రి.
    "ఆ! చూడవోయ్ డ్రైవరూ.....ఇదిగో సిగరెట్ కాలుస్తావా?"
    "ఏం సిగిరెట్టండీ అది? ఇండియాదేనా?"
    "అవును- కాస్ట్ లీ సిగరెట్టేలే"
    "నేను ఫారిన్ సిగరెట్లే కాలుస్తానండీ! ఇండియావి క్లీనర్ కుర్రాళ్ళు కాలుస్తారు"
    "ఓ-ఐసీ" అన్నాడు చిరంజీవి.
    "గుడ్.... వెరీగుడ్...." అని కూడా అన్నాడు.
    "పోనీ ఇవి మీ క్లీనర్ కుర్రాళ్ళకిస్తావా?"
    "అక్కడ పడెయ్యండి - ఇస్తాను" అంటూ ఫారిన్ సిగరెట్ వెలిగించాడతను.
    ఇక సిగరెట్లతో మంచి చేసుకోవడం సాధ్యం కాదని సంభాషణ మళ్ళీ డబ్బు మీదకు మళ్లించాడతను.
    "వెధవ పెట్రోలు ధరలు తెగ పెరిగిపోతున్నాయ్! పాపం మీకు చాలా ఖర్చవుతుందనుకుంటాను"
    డ్రైవర్ మొఖం వెలిగిపోయింది.
    "అవున్సార్! అందుకే మీటర్ మీద పది ఎక్కువడుగుతాం. ఆ మాత్రానికే కొంపలు మునిగిపోయినట్లు గొడవచేస్తారు జనం" కోపంగా అన్నాడతను.
    "మేము అలాంటివాళ్ళం కాదు! అందుకే నీకు పది ఎక్కువివ్వడానికి వప్పుకున్నాం" అన్నాడు చిరంజీవి.
    "ఈ పది అందుక్కాదండీ నేనడిగింది?"
    "మరి?"
    "ఇది రిస్క్ కోసమని అడిగాను"
    "ఏమి రిస్క్?"
    "బాంబ్ నిలయానికెళ్ళే టాక్సీలు, ఆటోలవాళ్ళందరూ- ఇలా రిస్క్ అలవెన్స్ అడగాలని మేమంతా నిర్ణయించుకున్నామండీ!"
    "ఏమిటక్కడ రిస్క్?"
    "ఒకటని కాద్సార్ చాలా పేచీలున్నాయ్"
    "సరే- నీకు రిస్క్ అలివెన్స్ పది రూపాయలు కాక పెట్రోల్ కి మరో పది ఇస్తాంలే. సంగతేమిటో చెప్పు" అన్నాడు సింహాద్రి ఆత్రుతగా.
    డ్రైవర్ ఉత్సాహ్మగా వెనక్కు తిరిగి వాళ్ళిద్దరి మొఖాలవంకే చూశాడు.
    "మరేం లేదండీ! అందులో ఆర్మీ ఆఫీసరున్నాడండీ! ఆయన మహా డేంజరస్ మనిషి. వాళ్ళింటి దగ్గర ఓ సారి హారన్ మోగించాడని మా అప్పలస్వామి టాక్సీ ఎయిర్ గన్ తో కాల్చేశాడండీ! మరోసారి ఒక ఆటోరిక్షా డ్రైవర్ మీటర్ మీద రెండ్రూపాయలు ఎక్కువిమ్మని పేచీ పెట్టుకుంటే ఆ డ్రైవర్ కాలిమీద ఎయిర్ గన్ తో కాల్చాడండీ! మాకు తెలిసినంతవరకూ ఇప్పటికి ఆయన దగ్గర ఎనిమిది రకాల కాల్పుల ఆయుధాలున్నాయండీ! మరి అసలెన్ని రకాలున్నాయో ఎవరికీ తెలీదు"

 Previous Page Next Page