"అమ్మో! బలవంతంగానా?" భయంగా అంది శ్రీదేవి.
"అవును"
"అతను గొడవచేయడూ?"
"మరతను ఇవాళ్టిలోకి రాకపోతే మనమేం చేస్తాం" అన్నాడు సింహాద్రి చిరంజీవిని సమర్ధిస్తూ.
విశ్వనాథం ఇంక పట్టలేకపోయాడు.
"ఏంట్రా! నన్ను బయటకు గెంటుతారా?" మండిపడుతూ అరిచాడు.
"అవును" అన్నాడు సింహాద్రి.
"మీ అంతట మీరు వెళ్ళకపోతేనే లెండి! వెళ్ళిపోతే ఆ అవసరం ఉండదు" అన్నాడు చిరంజీవి.
"ఎగ్జాక్ట్ లీ" వప్పుకున్నాడు సింహాద్రి.
"ఒరేయ్ సింహాద్రీ! నీ పులుసు పిండేస్తాను చూడిప్పుడు" అంటూ చేతిలోని దబ్బలం పైకెత్తి పట్టుకున్నాడు విశ్వనాథం ఉక్రోషంగా.
"అదేంటి? మీ పేరు ధనుంజయ్ అయితే సింహాద్రి అంటాడేమిటి?" ఆశ్చర్యంగా అడిగింది శ్రీదేవి.
"అదా అదీ.. అది... అది... అవున్రా చిరంజీవీ! నన్ను సింహాద్రి అంటాడేమిటి?" ఆశ్చర్యంగా నటిస్తూ అడిగాడు సింహాద్రి.
"దటీజ్ సింపుల్" అన్నాడు చిరంజీవి.
"ఏమిటి సింపుల్"
"అదే! నీ పేరు. అందులో పెద్ద ఇదేముంది! అతని మేనల్లుడి పేరు సింహాద్రే అయ్యుంటుంది. అందుకని అతనితో మాట్లాడుతున్నట్లే నీతో మాట్లాడుతున్నాడు"
"అంటే ఈ గొడవంతా నిన్న అతనికీ, అతని మేనల్లుడికీ మధ్య జరిగిందన్నమాట" అంది శ్రీదేవి.
"అంతేకాదు! అతని మేనల్లుడి ఫ్రెండ్ కీ, మిమ్మల్ని పోలిన ఓ అమ్మాయికీ కూడా అతనితో లేచీ పడిందన్నమాట!" వివరించాడు చిరంజీవి.
"ఇలా అందరితోనూ పేచీపడ్డాడంటే వట్టి పేచీకోరు మనిషి లాగున్నాడు" అందామె.
"వట్టి ఏమిటి? మహా పేచీకోరన్నమాట!"
ఈ పరిస్థితి సహించడం ఇంక విశ్వనాథం వల్ల కాలేదు. వీళ్ళిద్దరి నాటకం వల్లే భావయ్య ఆస్తిలో బోలెడు భాగం కొట్టెయ్యవచ్చన్న తన ప్లానంతా సర్వనాశనం అయిపోయింది. పోనీ ఈ సింహాద్రిగాడు స్పష్టంగా భావయ్యతో "నీ కూతురిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు" అంటే భావయ్య ఇంతగా అప్సెట్ అయ్యేవాడు కాదు. అలా కాకుండా పిచ్చి ఎక్కినట్లు ప్రవర్తించడం వల్ల వాడికి సహజంగా పిచ్చి వుందని నమ్మాడతను. అంతేకాదు అలాంటి పిచ్చివాడిని తన కూతురికి అంటగట్టబోయినందుగ్గాను తను అతనికివ్వాల్సిన యాభయివేలూ అర్జంటుగా అప్పటికప్పుడు కక్కమనివార్నింగిచ్చాడు. అంచేత తనకింత అపారనష్టం కలిగించిన వీళ్ళిద్దర్నీ ఇలా తిట్లతో వదుల్తే లాభం లేదు. మరోసారి ఇలాంటి వెధవ్వేషాలు చేయకుండా చేసేయాలి.
ఇలా నిర్ణయించుకుని దబ్బలంతో వారి మీదకు ఎగిరి దూకాడతను. అతని వాలకం చూసిన సింహాద్రి మరుక్షణం గది మూలకు గెంతి రన్నింగ్ రేస్ లో పరుగెత్తబోతున్న వాడిలా పొజిషన్ తీసుకుని నిలబడ్డాడు.
అది చూసి చిరంజీవికూడా నాలుగు అడుగులు వెనక్కు వేసి తలుపు దగ్గరకు చేరుకున్నాడు.
మరుక్షణంలో రన్నింగ్ రేస్ ప్రారంభమయిపోయింది.
ముందు సింహాద్రి, అతని వెనుక దబ్బలంతో విశ్వనాథం, అతని వెనుక చిరంజీవీ ఆ గదిచుట్టూ గంటకు ముఫ్ఫయ్ కిలోమీటర్ల వేగంతో పరుగెత్తసాగారు.
శ్రీదేవి ఇంతకుముందు కొన్ని పరుగు పందాలు చూసి వుంది. అసలు తనే కాలేజ్ తరపున 400 మీటర్స్ రన్నింగ్ రేస్ లో పరుగెత్తింది కూడానూ. అయితే ఇంత థ్రిల్లింగ్ ఏ పందెం కూడా కనిపించలేదు. అదీగాకుండా హిప్నాటిజంలో ఇంత గొప్ప గేమ్స్ స్పోర్ట్స్ కూడా ఉంటాయన్న విషయం ఆమెకు తెలీదు.
సింహాద్రి, చిరంజీవి కొద్ది రౌండ్లు బాగానే కొట్టారు. అయితే విశ్వనాథం స్పీడ్ పెరుగుతున్న కొద్దీ వారికి ఆ గది చాలా ఇరుగ్గా కనిపించసాగింది. దానికితోడు మధ్యలో హార్డిల్స్ లాగా మంచం ఒకటీ, చిరంజీవి పక్కచుట్ట ఒకటీ, సింహాద్రి సూట్ కేస్ ఒకటీ-వీటన్నిటి మీదనుంచి టైమ్ లిమిట్ లేకుండా జంప్ చేయడం చాలా రిస్కీగా కనిపించింది.
అయితే పరిస్థితి ఇంతదూరం వచ్చాక చేయగలిగిందేమీ కనిపించలేదు. శ్రీదేవి తప్పట్లు కొడుతూ ఆనందంతో కేరింతలు కొడుతూ విశ్వనాథం చేతిలోని దబ్బలం సింహాద్రి వీపుకి ఎంత దూరంలో వున్నది రన్నింగ్ కామెంటరీ ఇస్తోంది.
"రెండడుగులు.....అమ్మో ఒక్క అడుగు ధనుంజయ్ గారూ పరుగెత్తండి! పరుగెత్తండి- పెద్ద స్టెప్స్ వేయండి. ఓకే... ఇప్పుడు దబ్బలం మూడడుగుల దూరంలో వుంది....'
ఇలా ఈ పరుగు పందెం కామెంటరీ ఎంతసేపు నడిచేదోగానీ ఈలోగా తలుపులు దభీమని తోసుకుని సింహాద్రి పేట్రనైజ్ చేసిన వీధికుక్క మళ్ళీ ఆ రోజు తాలూకు బిస్కెట్ల కోటాకోసం గదిలో జొరబడింది. అదింతముందు ఆకలి ఆపుకోలేక చాలా ఇళ్ళల్లో దొంగతనంగా జొరబడడం, వంటిళ్ళల్లో కెళ్ళి కనబడ్డదల్లా తినేయడం చేసింది. అయితే ఏ ఇంట్లో జొరపడ్డా ఆ ఇంటి తాలూకు వాళ్ళు పెరట్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉండడంగానీ, లేదా అందరూ కలిసి హాల్లో సినిమాల గురించి చర్చించుకోడంగానీ, లేదా ఇంకేదయినా వ్యవహారం మాట్లాడుకోడం గానీ చూసేది. కానీ ఎవ్వరూ ఇలా తలుపులు దగ్గర కేసుకుని ఇంట్లో రన్నింగ్ రేస్ లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించలేదు. స్వతహాగా దానికి ఆటలంటే ఎంతో యిష్టం! చిన్నప్పుడు ఏరోజూ కూడా గంటకు యాభయ్ కిలోమీటర్ల స్పీడుకి తక్కువ పరుగెత్తేదికాదు. ఎవరయినా కర్రలతోగానీ యింకే రకంగా గాని వెంబడిపడితే స్పీడ్ మరింత ఎక్కువుండేది. రాన్రాను యిప్పుడు అంతగా పరుగెత్తే అవసరమే కనిపించడంలేదు. ఏదయినా దొంగపని చేసినప్పుడు పట్టుబడినా ఎవరూ తన వెంటపడడం లేదు. తను ఆ యింటి కాంపౌండ్ దాటగానే ఊరుకుంటున్నారు. ఒకరిద్దరు ఛేజింగ్ మీద ఆసక్తి వున్నవాళ్ళు వెంబడించినా తను వెనక్కు తిరిగి 'గుర్' మంటూ పళ్ళు బయటిపెట్టేసరికి వెనక్కు తిరిగి అదే వేగంతో పారిపోతున్నారు. ఇంతకాలానికి యిప్పుడు ఆ రూమ్ లో సాగుతోన్న రన్నింగ్ రేస్ దానికి దాని చిన్నతనపు రోజుల్ని గుర్తుకు తెచ్చింది. తనూ ఆ రేస్ లో జాయినయి, ఆ ఆనందాన్ని పంచుకోవాలనిపించి విశ్వనాథం వెనుకే అదే స్పీడ్ లో పరుగెత్తటం ప్రారంభించింది. అయితే అలా ఒకరి వెనుక ఒకరు పరుగెత్తటం లో దానికి థ్రిల్ కనిపించలేదు. అదీ గాకుండా రాన్రాను విశ్వనాథం స్పీడ్ గంటకు పదికిలోమీటర్లకు పడిపోయింది. అంత తక్కువ స్పీడ్ లో పరుగెత్తటం తనకు చిన్నతనంగా భావించి అది అందరినీ ఓవర్ టేక్ చేస్తూ రన్నింగ్ ప్ర్రారంభించింది. వాళ్ళందరూ కలసి ఒక రౌండ్ కొట్టేసరికి అది నాలుగు రౌండ్లు పూర్తి చేయగలుగుతోంది. విశ్వనాథం మొదటిసారి ఆ కుక్క తనను ఓవర్ టేక్ చేయడం చూశాడుగానీ అది కేవలం తన భ్రమ అని మనస్ఫూర్తిగా నమ్మాడు. కానీ రెండోసారి ఓవర్ టేక్ చేసినప్పుడు మాత్రం అనుమానం కలిగింది. అనుమానం నిర్ధారణ అయేసరికి అది మరో పది రౌండ్లు కొట్టేసింది. దాంతో విశ్వనాథం పై ప్రాణం పైనే ఎగిరిపోయింది.
అది కిందటిసారి తనను కరచిన కుక్కే! ఏమాత్రం సందేహంలేదు. తను అన్ని కుక్కలనూ గుర్తుపెట్టుకోలేకపోవచ్చుగానీ, తనను కరచిన వాటిని మాత్రం మహా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలడు! వాటిని ఎన్ని సంవత్సరాల తర్వాత చూసినా ఎన్ని వేల కుక్కల్లో వున్నా ఠకీమని గుర్తుపట్టేస్తాడు.
దానిని గుర్తించగానే అతనికి అంతకుముందు తనను అదే రూమ్ లో కరచిన క్రూర జంతువు అన్న సంగతీ, ఆ కుక్క కాటు తాలూకు పధ్నాలుగు ఇంజెక్షన్లు ఇంకా పూర్తి కాలేదన్న విషయమూ కూడా గుర్తుకొచ్చాయ్. ఇప్పుడు తను అర్జంటుగా ఆ కుక్కబారినుండి తనను తను రక్షించుకోకపోతే మరో పధ్నాలుగు ఇంజెక్షన్లు ప్ర్రారంభించాల్సి రావచ్చు. అప్పటికప్పుడే బయటకు ఎలా పారిపోవాలా అని ఆలోచన ప్రారంభించాడతను. హఠాత్తుగా తలుపులో నుంచి బయటకు పారిపోతే దానికి కోపం వచ్చి వెంబడిపడి కరచే ప్రమాదం ఉంది.